ఆమీర్ ఖాన్ ను చూసి OTT తోకు ముడుస్తుందా?
x

ఆమీర్ ఖాన్ ను చూసి OTT తోకు ముడుస్తుందా?

బాలీవుడ్ యొక్క పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ఆలోచనలు మొదటి నుంచీ కాస్త విభిన్నంగా, బోల్డ్ గానే ఉంటూ వస్తున్నాయి. అందుకే చాలా సార్లు ఆమీర్ ఖాన్ ని హిందీ పరిశ్రమ అనుసరించింది..


బాలీవుడ్ యొక్క పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ఆలోచనలు మొదటి నుంచీ కాస్త విభిన్నంగా, బోల్డ్ గానే ఉంటూ వస్తున్నాయి. అందుకే చాలా సార్లు ఆమీర్ ఖాన్ ని హిందీ పరిశ్రమ అనుసరించింది..అనుకరించింది. ఈ సారి కూడా ఆమీర్ ఖాన్ ఓటిటిల విషయంలో తనదైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ పద్దతిలో అంటే OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటే థియేట్రికల్ రిలీజ్ లకు ప్రాధాన్యత ఇవ్వడానికి బోల్డ్ ప్లాన్‌తో పరిశ్రమను కదిలించాలని చూస్తున్నాడు. అందుకు తనదైన ఆలోచనలను అప్లై చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడిదే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆమీర్ ఖాన్ ఆలోచన ఏమిటి.. వర్కవుట్ అయ్యేదేనా?

ఆమీర్ ఖాన్ రెండేళ్లుగా సైలెంట్ గా ఉన్నారు. రెండేళ్ల క్రితం విడుదలైన లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆస్కార్ పుర‌స్కారం సొంతం చేసుకున్న ‘ఫారెస్ట్ గంప్‌’కి (Forrest Gump) రీమేక్‌గా ఇది రూపుదిద్దుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా పరాజయాన్ని అందుకుంది. దాంతో ఆలోచనలో పడిపోయారు ఆమీర్ ఖాన్. తన ఐడియాలకు, ప్రేక్షకులకు మధ్య గ్యాప్ వచ్చిందని భావించి, దాన్ని ఎలా పూడ్చాలా అనే ఆలోచనలో ఉన్నారు.

దానికి తోడు బాలీవుడ్ లో సక్సెస్ రేటు కూడా పూర్తిగా పడిపోయింది. వచ్చిన సినిమా వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోతోంది. ఎలాంటి సినిమా నచ్చుతుంది..ఏ సినిమాతో మళ్లీ హిట్ కొట్టాలి ఇదీ ఆమీర్ ముందున్న ప్రశ్న. అదే సమయంలో సినిమా సక్సెస్ ని దూరం చేస్తున్న ఎలిమెంట్స్ ఏమిటి అనేది అధ్యయనం చేస్తున్నారు. ఆ క్రమంలో ఆయనకు అర్దమైంది ఓటిటిలు వచ్చాక సినిమాలను థియేటర్ లో చూడటానికి జనం ఆసక్తి చూపటం లేదని.

చాలా మంది నిర్మాతలు, నటీనటులు బాక్సాఫీస్ తో సంబంధం లేకుండా లాభాలు పొందటానికి డిజిటల్ హక్కులను ముందే అమ్మేస్తున్నారు. దాంతో OTT ప్లాట్‌ఫారమ్‌లు మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. వాళ్లు ఎలా చెప్తే అలా అన్నట్లుగా నిర్మాతలు తమ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఆమీర్ ఈ ఎగ్రిమెంట్ లను నిలిపివేయడం ద్వారా ఓటిటి గేమ్‌ను మార్చాలనుకుంటున్నాడు. అందుకోసం ఓ బోల్డ్ డెసిషన్ తీసుకుని అమలు పరుస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ వర్గాల అంతర్గత సమాచారం ప్రకారం, ఆమీర్ తన చిత్రాలను కనీసం 12 వారాల పాటు థియేటర్లలో ఉంచాలని భావిస్తున్నాడు. ఆ తర్వాతే ఓటిటికు ఇస్తాడు.

అమీర్ ఖాన్ చేతిలో ఇప్పుడు ఓ సినిమా ఉంది. అదే సితారే జమీన్ పర్ . తారే జమీన్ పర్ 2007లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఏడేళ్ల గ్యాప్ తర్వాత దానికి సీక్వెల్ గా సితారే జమీన్ పర్ మూవీ విడుదల కానుంది. ఈ మూవీ కూడా చిన్నపిల్లల నేపథ్యమే కావడం విశేషం. ఈ మూవీలో జెనీలియా కూడా నటిస్తోంది. 2023 క్రిస్మస్ కానుకగా సితారే జమీన్ పర్ విడుదల కావలసి ఉంది. కానీ ఈ మూవీ ప్రొడక్షన్ పనులలో జాప్యం తో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే ఈ మూవీ విషయంలో అమీర్ ఖాన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని తాను ఏ ఒక్కరికీ అమ్మదల్చుకోలేదని తేల్చారు.

ప్రస్తుతం అందరూ కమర్షియల్ గా తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తూ మరో పక్క డిజిటల్ రైట్స్ కు కూడా అమ్ముకుని రెండు రకాలుగా లబ్ది పొందుతున్నారు. ఒక పక్క థియేటర్లలో మూవీ ఆడుతుండగానే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూసేస్తున్నారు ప్రేక్షకులు. దీనితో బయర్స్ నష్టపోతున్నారు. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి నానా తంటాలు పడుతుంటే ఓటీటీ లో విడుదలై తమకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయని వాపోతున్నారు. కాబట్టి ఎప్పటిలా థియేటర్-గోయింగ్ ఎక్సపీరియన్స్ ని తిరిగి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. ఓటిటి ఆధిపత్య యుగంలో ప్రాబల్యాన్ని కోల్పోతున్న సోషల్ కామెడీ వంటి జానర్స్ ని తిరిగి పునరుద్ధరించడం తన లక్ష్యం గా చెప్తున్నారు.

అలాగే ప్రస్తుతానికి తాను సినిమాల్లో నటించాలనుకోవడం లేదని బాలీవుడ్‌ స్టార్‌హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) వెల్లడించారు. అందుకే, కొంతకాలం నుంచి వర్క్‌ లైఫ్‌కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. రీసెంట్ గా ‘క్యారీ ఆన్‌ జట్టా 3’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) తర్వాత నేను ఏ సినిమాలో నటిస్తున్నానో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే.. తదుపరి ప్రాజెక్ట్‌ విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి కుటుంబంతో సరదాగా సమయాన్ని గడపాలనుకుంటున్నా. ఆ విషయంలో నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఎమోషనల్‌గా సిద్ధమైన తర్వాత తప్పకుండా సినిమా చేస్తాను’’ అని ఆమీర్‌ వివరించారు.

Read More
Next Story