బడ్డీ...  టిక్కెట్ రేట్లు తగ్గిస్తే జనం థియేటర్ కు వచ్చేస్తారా? అసలు వాళ్లకేం కావాలి?
x

బడ్డీ... టిక్కెట్ రేట్లు తగ్గిస్తే జనం థియేటర్ కు వచ్చేస్తారా? అసలు వాళ్లకేం కావాలి?

టిక్కెట్ రేట్లు ఇష్యూ మరోసారి అందరికి గుర్తు వచ్చింది. అందుకు కారణం అల్లు శిరీష్ తాజా చిత్రం బ‌డ్డీ కి టిక్కెట్ రేట్లు తగ్గించటమే. సింగిల్ స్క్రీన్ల‌లో రూ.99, మ‌ల్టీప్లెక్సుల్లో 125 రేటు పెట్టారు.

టిక్కెట్ రేట్లు ఇష్యూ మరోసారి అందరికి గుర్తు వచ్చింది. అందుకు కారణం అల్లు శిరీష్ తాజా చిత్రం బ‌డ్డీ కి టిక్కెట్ రేట్లు తగ్గించటమే. సింగిల్ స్క్రీన్ల‌లో రూ.99, మ‌ల్టీప్లెక్సుల్లో 125 రేటు పెట్టారు. కొన్ని థియేట‌ర్లు మిన‌హా చాలా వ‌ర‌కు ఈ రేటును అమ‌లు చేస్తాయి. తాము ఇలా రేట్లు త‌గ్గించ‌డం గురించి శిరీష్ మాట్లాడుతూ.. రేట్లు పెంచితే బంగారు బాతును కోసేసిన‌ట్లే అవుతుంద‌ని.. అందుబాటులో టికెట్ల ధ‌ర‌లు ఉంటే ఎక్కువ మంది థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని.. ఈ ఆలోచ‌న‌తోనే తాము రేట్లు త‌గ్గించామ‌ని.. ఇండ‌స్ట్రీలో మిగ‌తా వాళ్లు కూడా దీన్ని అనుస‌రిస్తార‌ని ఆశిస్తున్నాన‌ని శిరీష్ చెప్పాడు. అయితే ఇప్పుడు ప్రశ్న...మిగతా ఇండస్ట్రీ జనం ఇదే దారిలో వెళ్తారా లేదా అనేది కాదు... సినిమాకు రేట్లు తగ్గించారు కదా అని జనం ఎక్కువ మంది వస్తారా..హౌస్ ఫుల్స్ చేస్తారా అని?

థియేటర్స్ లో ఆక్యుపెన్సీ ఉండటం లేదండీ....మినిమం థర్టీ పర్శంట్ కూడా జనం థియేటర్ లో రిలీజ్ రోజు మార్నింగ్ షోకు కూడా ఉండటం లేదు. థియేటర్ మెయింటినెన్స్ కూడా రావటం లేదు. ఎందుకండీ ఇలాంటి సినిమాలను థియేటర్ లో వేయమని మాపై ప్రెజర్ పెడతారు... ఓ ఎగ్జిబిటర్ విసుగ్గా. చిన్న సినిమాలు మినిమం షోలు కూడా పడటం లేదు. పదిమందైనా లేకపోతే షో వేయలేరు .దాంతో ప్రతీ పూటా ఆ పది మందైనా వస్తారేమో అని షో టైమ్ అయిన ఓ అరగంట దాకా వెయిట్ చేసి ఆ తర్వాత క్లోజ్ చేసుకుని , ఈ పూట షో లేదని బోర్డ్ పెట్టేసి వెళ్లిపోతున్నారు. చిన్న చిన్న టౌన్ లలో చాలా సింగిల్ థియేటర్స్ లో ఇదే పరిస్దితి.

ఎప్పుడో పెద్ద సినిమాలు వచ్చి హిట్టైతే వాటి మీద వచ్చే ఆదాయం తో ఏడాది అంతా మెయింటైన్ చేయాలి. ఇంతకు ముందు సీజన్, అన్ సీజన్ అని ఉండేది. ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చినప్పుడే సీజన్. మిగతా రోజులున్నీ అన్ సీజన్. ఈ మధ్యలో చిన్న సినిమా పరిస్దితి ఏమిటి.. జనం చిన్న సినిమాకు రావాలంటే ఏం చేయాలి. టిక్కెట్ రేట్లు తగ్గిస్తే జనం వస్తారా...రేట్లు అందుబాటులో ఉంటే థియేట‌ర్ల‌కు జ‌నం పెద్ద ఎత్తున వ‌స్తారా... అంటే టిక్కెట్ రేటు తగ్గిస్తే ఉన్నంతలో కొంతలో కొంత ఆక్యుపెన్సీ రేటు పెరుగుతుంది. కానీ టిక్కెట్ రేట్లు తక్కువ కదా అని హిట్ టాక్ లేకుండా చిన్న సినిమా చూడటానికి థియేటర్లకు వచ్చేస్తారా అనేది పెద్ద ప్రశ్న.

అసలు మనం ఇక్కడ ఒకటి ప్రశ్నించుకోవాలి. జనాలు సినిమా టిక్కెట్ రేట్లకు భయపడే థియేటర్స్ కు రావటం లేదా...మరి కల్కి సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచినా అంత హౌస్ ఫుల్స్ ఎలా అయ్యాయి? టిక్కెట్ రేట్లు జనం పెట్టలేని సిట్యువేషన్ లో ఉంటే కల్కి లాంటి పెద్ద సినిమాకు రేట్లు పెంచినా హౌస్ ఫుల్స్ , బీభత్సమైన ఓపినంగ్స్, కలెక్షన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి. అంటే జనాలు థియేటర్ కు జనాలు ఎగబడి రాకపోవటంలో ఉన్న కారణాలలో టిక్కెట్ రేటు అనేది ఒకటి మాత్రమే. వారిని అంత రేటు పెట్టి టిక్కెట్ కొనుక్కుని మరీ థియేటర్ కు రప్పించగల కంటెంట్, కటౌట్( హీరో) ఉన్నప్పుడే వాళ్ళు ఇంటినుండి కదులుతారు. తాము పెట్టే టిక్కెట్ డబ్బుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. టికెట్ ధరల పెంపు కారణంగా సామాన్యుడికి వినోదం ఖరీదుగా మారిందని నాటి వైసీపీ సర్కార్ అభిప్రాయపడి టిక్కెట్ రేట్లు తగ్గించింది. టికెట్ రేట్లు తగ్గించాలని సినీ పరిశ్రమను , థియేటర్ల యాజమాన్యాలకు జీవో జారీ చేసింది. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై సహజంగానే విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు 60 శాతం ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఏపీలో .. అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే అక్కడ టిక్కెట్ రేట్లు తగ్గాయి కదా అని జనం థియేటర్స్ వెళ్లటంలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే లేదనే చెప్పాలి. రేట్లు తక్కువ అని జనం పరుగెత్తుకుంటూ థియేటర్స్ వెళ్లలేదు. చిన్న సినిమాలను అప్పుడు కూడా అసలు పట్టించుకోలేదు.

అంటే చాలా చిన్న సినిమాల్లో చూపిస్తున్న కంటెంట్ వారు పెట్టే టిక్కెట్ రేటుకు, తాము ఖర్చు పెడుతున్న సమయానికి బాలెన్స్ కావటంలేదు. టిక్కెట్ రేటు ఎక్కువా, , తక్కువా అని కాకుండా అందుకు తగ్గట్లుగా తమని ఎంటర్టైన్ చేసే సినిమానా కాదా అనే ది చూసుకుంటున్నాడు. అందుకే చిన్న సినిమాలు టిక్కెట్ తగ్గింపుతో సంభందం లేకుండా కొన్ని బాగా ఆడినవి ఉన్నాయి. వాటిలో ఉన్న కంటెంట్ వాళ్లకు నచ్చింది. థియేటర్స్ వైపు నడిపించింది. అప్పుడు టిక్కెట్ రేట్ తగ్గించకపోయినా వర్కవుట్ అయ్యాయి. అయితే ఇదంతా సింగిల్ స్క్రీన్స్ా కి సంభందించిన వ్యవహారమే.


టిక్కెట్ రేటు అసలైన ఇబ్బంది ఎక్కడా అంటే..సామాన్య, మధ్యతరగతి ప్రజలు కుటుంబంతో కలిసి ఏదైనా మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళ్లాలంటే టికెట్లకు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు. బండికి పెట్రోల్, పార్కింగ్ ఫీజులు, పాప్‌కార్న్ కూల్‌డ్రింక్స్‌కు మరో రూ.1500 వరకు చేతి చమురు వదిలించుకున్నప్పుడే. వీటన్నింటికీ భయపడిన వాళ్లు ఓటీటీలలో వచ్చే దాకా ఆగి చూద్దాంలే అని ఫిక్స్ అవుతున్నాడు. ప్రతీ వారం ఓటిటిలో రిలీజ్ అయ్యే ఇతర భాషా డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టుకుంటున్నాడు. ఎందుకంటే మల్టిప్లెక్స్ కు వెళ్లి పెట్టే ఖర్చులో సగం తోనే ఏడాది మొత్తం హాయిగా ఇంట్లోనే సినిమాలు చూడొచ్చు అని అర్దం చేసుకున్నారు.

కాబట్టి టిక్కెట్ తగ్గింపు కొంతవరకూ జనాలను ఎట్రాక్ట్ చేస్తుంది కానీ ఆక్యుపెన్సీ పెంచటానికి అదొక్కటే చాలదు అని దర్శక,నిర్మాతలు అర్దం చేసుకోవాలి. ఫర్ సపోజ్ బడ్డీ సినిమా అద్బుతంగా ఉంటే ..టిక్కెట్ తో సంభందం లేకుండా మాట్నీ నుంచే మౌత్ టాక్ , సోషల్ మీడియా టాక్ స్ప్రెడ్ అయ్యి హౌస్ ఫుల్స్ బోర్డ్ లు పడిపోతాయి. అలా కాకుండా చెత్త కంటెంట్ తో వస్తే... ఎవరి సినిమా అయినా ఫ్రీగా చూపించినా సరే... థియేటర్స్ లో ఈగలు తోలుకోవాల్సిందే. జనం డబ్బులు కన్నా తమ టైమ్ కు ఎక్కువ విలువ ఇస్తున్నాడు..ఇప్పుడు ఆప్షన్స్ పెరిగిపోయాయి బడ్డీ...

Read More
Next Story