
‘అలప్పుజ జింఖానా’ ఓటీటీ రివ్యూ
ఈ సినిమా కథేంటి , ఎలా ఉంది, చూడదగిన సినిమానేనా...
ఈ మధ్య కాలంలో మలయాళ కామెడీ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి ఓటిటిలలో బాగా వర్కవుట్ అవుతున్నాయి. సింపుల్ బడ్జెట్ లో బాగా రాసిన పాత్రలు, సున్నితమైన హాస్యం, హార్ట్ టచ్ చేసే ఎమోషన్లు – ఇవే మలయాళ కామెడీల USP. "జయ జయ జయ హే".... "రోమాంచమ్"… మొదైలైన ఈ ప్రవాహం ... ఇప్పటి ‘అలప్పుజ జింఖానా’ తో కొనసాగుతోంది. కేరళలలో వచ్చి హిట్ అయిన ఈ సినిమా తెలుగులోనూ థియేటర్స్ లో రిలీజైంది. ఇప్పుడు ఓటిటిలోకి వచ్చింది. ఈ సినిమా కథేంటి , ఎలా ఉంది, చూడదగిన సినిమానేనా
స్టోరీ లైన్
అలప్పుజకు చెందిన ఆకతాయి కుర్రాళ్లు అనుకోకుండా భాక్సింగ్ రింగ్ లో ప్రవేశించి ఏం సాధించారు,ఏమయ్యారు అనేదే ఈ సినిమా కాన్సెప్టు. జోజో జాన్సన్ (నస్లేన్), డీజే జాన్ (బేబీ జీన్), షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్), షణవాస్ (శివ హరిచరణ్), దీపక్ ఫణిక్కర్ (గణపతి). వీరిలో షణవాస్ మినహా మిగతా వాళ్లంతా పరీక్షల్లో ఫెయిలవడంతో డిగ్రీలో అడుగు పెట్టే అవకాశం పోగొట్టుకుంటారు.
చదువు పోయినా... అమ్మాయిల మీద మాత్రం ఫుల్ ఫోకస్! అనుపమ, షెర్లిన్, నటాషా అనే ముగ్గురు అమ్మాయిలకు లైన్ వేయడమే జోజో బ్యాచ్ డైలీ మిషన్. ఒక రోజు – అమ్మాయిల ముందు జోజో గ్యాంగ్ ఓ బాక్సర్ చేతిలో ఘోరంగా ఓడిపోతుంది. "వాడు బాక్సర్ కాబట్టి మమ్మల్ని అలా ఢీకొట్టాడు!" అని జోజో భాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటారు. స్పోర్ట్స్ కోటాలో కాలేజ్ సీట్లు సంపాదించవచ్చని తన ఫ్రెండ్స్ అందరినీ ఒప్పించి లోకల్ గా ఉండే 'అలప్పుజ జింఖానా' అనే అకాడమీలో చేరతాడు.
ఇప్పటివరకూ స్నాక్స్ తింటూ, ఫ్రెండ్షిప్ ట్రాక్‌లో ఉన్న వాళ్లకి… బాక్సర్ లైఫ్ అంటే పగలే చుక్కలు కనిపిస్తాయి. కానీ రాత్రింబవళ్లూ కసరత్తు చేయాలనేది అక్కడ రూల్ . ఏం చేయాలో అర్దం కాదు. వీళ్లలా సతమతం అవుతున్నప్పుడే ఎంటర్ అవుతాడు కోచ్ ఆంటోని (లక్మన్ అవరన్). అతను కేవలం వీళ్ల బాడీ మెత్తపరచడమే కాదు – బ్రెయిన్ & స్ఫూర్తి రెండూ షేప్ చేస్తాడు. అతని గైడెన్స్ తో జోజో గ్యాంగ్ రాష్ట్ర స్థాయి పోటీల వరకూ వెళుతుంది.
అయితే, ఎంతో ప్రొఫెషనల్ ఆటగాళ్లు పోటీపడే ఆ బాక్సింగ్‌లో ఈ ఆకతాయి గ్యాంగ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఆ ప్రయాణంలో వాళ్లు ఏం నేర్చుకున్నారు?స్టేట్ బాక్సింగ్ పోటీల్లో గెలిచారా?
ఈ అల్లరి గ్యాంగ్ నిజంగా “బాక్సింగ్ లెజెండ్ గ్యాంగ్” అవుతుందా?
…అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ
ఈ సినిమా తక్కువ బడ్జెట్లో తీసినా, ‘నరేశ్ కూకునూర్' స్టైల్ లో, రియలిజం & హాస్యాన్ని మిళితం చేసారు. “ఇది ఒక చిన్న పట్టణం కథ కాదు… ఇది అల్లరి నుంచి ఆత్మగౌరవం దాకా నడిచిన కథ.”
"బాక్సింగ్ లో రింగ్ ఉండొచ్చు… కాని నిజంగా మనం పోరాడేది మనలో మనం. ఈ సినిమా అసలు పాయింట్ ఇదే. సాధారణంగా స్పోర్ట్స్ సినిమాల్లో హీరో గెలుపు కోసం పుట్టాడు అన్నట్టుగా ఉంటాయి. కానీ అలప్పుజ జింఖానా కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. అవును, జోజో జాన్సన్ (నస్లేన్) గ్యాంగ్ బాక్సింగ్ ఎంచుకుంది కారణంతో కాదు – కోపంతో. ఆ కోపం మెల్లిమెల్లిగా భాక్సింక్ క్రీడలో ఎలాగైనా గెలివాలని, మనుగడ సాధించాలన్న క్లాస్ రివెంజ్ లా మారి మన్ననలు పొందుతుంది.
ఈ సినిమా స్క్రీన్‌ప్లే మూడు స్టేజ్‌లు Initiation,Struggle, Payoff లను స్పష్టంగా చూపెడుతుంది. సినిమా మొదట్లో వచ్చే ఎపిసోడ్స్ లో – ఫుల్ కామెడీ, అమ్మాయిల కోసం ఆరాటం తో సరదాసరదాగా ఉంటుంది. ఆ తర్వాత – భాక్సింగ్ క్రీడ కోసం ట్రైనింగ్, తర్వాత పోటీలో ప్రవేశించటం ఇవన్నీ వరసగా జరుగుతాయి. క్లైమాక్స్ ఫైట్ – పూర్తి ఊహించదగినదే అయినా, ఎమోషనల్ గా వర్కౌట్ అవుతుంది.
"బాక్సింగ్ పంచ్ కాదు… దానికి ముందు ఉన్న ఆలోచనే నిజమైన యుద్ధం." అన్న పాయింట్ తో ముగుస్తాడు దర్శకుడు. లైఫ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా నడిచిన ఈ సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా చాలా వరకూ హాయిగా సాగుతుంది.
సినిమాటిక్ టోన్ & టెక్నికల్ షేడ్స్:
ఫోటోగ్రఫీ: జిన్షీ ఖాలిద్ – రియలిస్టిక్ గా చూపించాడు. కెమెరా వర్క్ తో ఇది చిన్న సినిమా అనే ఫీలింగ్ పోతుంది. అలాగే సంగీతం ఆహ్లాదకరంగా కుదిరిపోయింది. నిర్మాతలు అవసరానికి మించి ఎక్కువగానే ఖర్చు పెట్టారు. ఎడిటింగ్ – నిషాద్ యూసఫ్: ఫ్లో చాలా స్మూత్. కామెడీ టైమింగ్ తడబడదు. మాంటేజ్‌లు మెల్లగా నడుస్తాయి కానీ అసలు బోర్ అనిపించవు.
ఫైనల్ థాట్
ఇది "లవ్ ట్రాప్" తో మొదలై "లైఫ్ ట్రాక్" లో ముగిసే యూత్ జర్నీ. కామెడీ కోసం మొదలైన స్టోరీ, కంటతడి తెప్పించేలా మారుతుంది.
ఎమోషన్ అనుకోకుండా వస్తుంది – అదే దీని USP.
చూడచ్చా
సరదాగా ఓ లుక్కేయచ్చు. స్పోర్ట్స్ డ్రామా లు నచ్చేవారికి ఇంకా బాగా నచ్చుతుంది. అయితే మళయాళ నటులు పెద్దగా పరిచయం లేని వారు అవటంతో ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఎక్కడ ఉంది
ఇప్పుడు ‘ఆహా’ లో తెలుగులో స్ట్రీమింగ్ లో ఉంది!
ఫ్రెండ్స్‌తో చూడండి, నవ్వండి, అర్థం చేసుకోండి… చివరకు మోటివేట్ అవండి!