జైల్‌బ్రేక్ కాన్సెప్ట్ : ఆజాది ఓటిటి మూవీ రివ్యూ
x

జైల్‌బ్రేక్ కాన్సెప్ట్ : 'ఆజాది' ఓటిటి మూవీ రివ్యూ

ట్విస్ట్ ఎందుకు వర్క్ కాలేదు?

తన చెల్లెలి ఆత్మహత్యకు కారణమైన ఒక అహంకారిని, రాజకీయ నాయకుడి కొడుకు అని కూడా చూడకుండా అతని ఇంటికి వెళ్లి మరీ అంతం చేస్తుంది గంగ (రవీనా రవి). ఆ హత్య చేసే సమయానికే ఆమె గర్భవతి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.. గంగ జైలు పాలవుతుంది. కానీ, తన కొడుకును చంపిన గంగను, ఆమె కుటుంబాన్ని నాశనం చేయాలని ఆ రాజకీయ నాయకుడు కసిగా ఎదురుచూస్తుంటాడు.

డెలివరీ డేట్.. మృత్యువుతో ఆట!

గంగకు డెలివరీ సమయం దగ్గరపడటంతో ఆమెను ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలిస్తారు. అప్పటికే అక్కడ ఆమె తండ్రి శివ (లాల్), భర్త రఘు (శ్రీనాథ్ భాసి) సిద్ధంగా ఉంటారు. ఒకవైపు చంపాలని చూస్తున్న రాజకీయ నాయకుడి రౌడీ బ్యాచ్.. మరోవైపు అనుమానంతో నిఘా పెట్టిన పోలీసులు. ఈ పరిస్థితుల్లో గంగను, పుట్టబోయే బిడ్డను కాపాడటం అసాధ్యమని రఘుకు అర్థమవుతుంది.

ఒక పక్కా మాస్టర్ ప్లాన్.. మధ్యలో 'రాణి' ఎంట్రీ!

రఘు ఒక సాహసోపేతమైన ప్లాన్ గీస్తాడు. ఆ హాస్పిటల్‌లో నర్సుగా చేసే మినీ, అంబులెన్స్ డ్రైవర్ బాబు, సత్య, జినూలను కలుపుకుని ఒక టీమ్‌గా ఏర్పడతాడు. పోలీసుల కళ్లు కప్పి, రౌడీల వెన్నులో వణుకు పుట్టిస్తూ హాస్పిటల్ నుంచే గంగను మాయం చేయాలి.

కానీ, ట్విస్ట్ ఏంటంటే.. గంగ రక్షణ కోసం (లేదా ఆమెను మళ్ళీ బంధించడం కోసం) పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రాణి (వాణి విశ్వనాథ్) రంగంలోకి దిగుతుంది. రాణి ఎంట్రీతో రఘు వేసిన ప్లాన్ మొత్తం తలకిందులవుతుంది. అడుగు బయటపెడితే బుల్లెట్ దింపే పోలీస్ ఫోర్స్ మధ్యలో, పసిబిడ్డతో ఉన్న గంగను రఘు ఎలా బయటకు తీసుకువచ్చాడు? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

ఎలా ఉంది

రిస్క్ ఉన్న జానర్‌లో సినిమా తీయడం ఒక సాహసం. కానీ ఆ సాహసాన్ని నిలబెట్టేది స్క్రిప్ట్ మాత్రమే. సాగర్ రచన, జో జార్జ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ జైల్‌బ్రేక్ థ్రిల్లర్ ‘అజాదీ’ లో ఒక బలమైన ఎండ్ ట్విస్ట్ ఉంది. నిజానికి, అదే సినిమా మొత్తాన్ని కాపాడే అవకాశం. కానీ ఆ ట్విస్ట్ వరకు తీసుకెళ్లే రాతే బలహీనంగా ఉంది. స్క్రీన్‌ప్లే స్థాయిలో – ఆసక్తిని నిలబెట్టలేకపోయింది.” మంచి ఐడియా + మధ్యమ స్థాయి రచన = థ్రిల్ లేని థ్రిల్లర్ అన్నట్టు ఫలితం వస్తుంది.

“టెంప్లేట్ జైల్‌బ్రేక్: ఇరవై ఏళ్ల పాత ఫార్ములా”

జైల్‌బ్రేక్ సినిమాలు సహజంగానే థ్రిల్లింగ్. కానీ ఇక్కడ కనిపించే నిర్మాణం పూర్తిగా టెంప్లేట్. ప్లాన్, టీమ్, అడ్డంకులు, క్యాట్-అండ్-మౌస్—అన్నీ మనం రెండు దశాబ్దాల క్రితం చూసిన ప్యాటర్న్లే. టెంప్లేట్‌ని క్షమించవచ్చు. కానీ అదే పాతదనాన్ని డైలాగ్‌లతో, సీన్ డిజైన్‌తో మరింత బట్టబయలు చేయడం మాత్రం పెద్ద లోపం.

“డైలాగ్‌లు: ప్రేక్షకుడిని అండర్‌ఎస్టిమేట్ చేసిన రాత”

ఈ సినిమాను ఎక్కువగా దెబ్బతీసింది డైలాగ్‌లు. పాత్రలు మాట్లాడే మాటల్లో సబ్టిలిటీ లేదు. సబ్టెక్స్ట్ బదులు ఎక్స్‌ప్లనేషన్, సస్పెన్స్ బదులు ప్రిడిక్టబిలిటీ. ప్రేక్షకుడు ఆలోచించాలనే అవకాశం ఇవ్వకుండా, ప్రతిదీ నేరుగా చెప్పేస్తే థ్రిల్లర్ ఎలా నిలబడుతుంది?

“వని విశ్వనాథ్ పాత్ర: ట్రబుల్‌కు ఆహ్వానం అని ముందే తెలిసేలా…”

వాణి విశ్వనాథ్ పోషించిన పాత్రలో కొన్ని సీన్లలో ఆమె చూపించే అతివిశ్వాసం—సినిమాలు రెగ్యులర్ గా చూసే ఎవరికైనా ‘ఇక్కడే సమస్య వస్తుంది’ అని ముందే అర్థమయ్యేలా ఉంటుంది. ఇది పాత్ర నిర్మాణ లోపమా? లేక డైలాగ్-స్టేజింగ్ తప్పిదమా? ఏదైనా సరే, సస్పెన్స్‌ని ముందే చంపేస్తుంది.

“సాగర్ రైటింగ్ ట్రాక్ రికార్డ్: రీహాష్ సమస్య”

రచయిత సాగర్ గతంలో రాసి, దర్శకత్వం వహించిన Veekam, Sathyam Mathrame Bodhippikku, Kanakarajyam వంటి చిత్రాల్లోనూ ఇదే సమస్య. కొత్త ప్రపంచాన్ని సృష్టించడం బదులు, పాత సినిమాల షాడోలో కథలు. అజాదీలోనూ అదే ఫీల్—ఐడియా ఉన్నా, దాన్ని ఆధునిక థ్రిల్లర్‌గా తీర్చిదిద్దే క్రాఫ్ట్ లోపిస్తుంది.

చూడచ్చా?

కాలక్షేపానికి ఓ లుక్కేయచ్చు. కానీ ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంటే నిరాశే.

ఎక్కడ చూడచ్చు?

ఆహా ఓటిటిలో తెలుగులో ఈ సినిమా ఉంది.

Read More
Next Story