‘మిక్స్ అప్’ Aha సెన్సేషనల్ మూవీ రివ్యూ
ఓ మాస్ మసాలా శృంగార వంటకం లాంటి వెబ్‌సిరీస్ ‘మిక్స్ అప్’. ఈ సిరీస్ ఎలా ఉందంటే..
అభి (కమల్ కామరాజు), నిక్కీ (అక్షర గౌడ) భార్యా భర్తలు. అభి వ్యక్తిగతంగా కాస్త సెన్సిటివ్.. భార్య నిక్కీ అంటే ప్రాణం. కేవలం మాటల్లోనే కాదు.. శృంగారం విషయంలోను సున్నితంగా డీల్ చేస్తూంటాడు. కానీ నిక్కీ అందుకు ఫుల్ ఆపోజిట్. పడగ్గదిలో మోటుగా రెచ్చిపోవాలనుకుంటుంది. అభి దానికి అవకాశమివ్వడు. దాంతో ఆమెకు కోపంగా ఉంటుంది. దాంతో మనవాడిని కాస్తంత తేడా వాడిలా ట్రీట్ చేస్తూ, నలుగురిలో అవమానకరంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అదే సిటీలో ఉన్న మరో జంట సాహూ (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజ జవేరి). వీళ్లకు పూర్తి రివర్స్‌గా ఉండే భార్యాభర్తలు. ఇక్కడ భార్య కాస్త సరసం, శృంగారం, సున్నితం అంటూంటే.. భర్త మాత్రం మోటుగా రెచ్చిపోతూంటాడు.
ఇక్కడా ఇద్దరికీ పడదు. ఈ రెండు జంటలు విడాకులు తీసుకోవాలనకుంటే... ఫ్యామిలీ కౌన్సిలింగ్‌కు పంపుతారు. అక్కడ సైకాలజిస్ట్... మీరు ఇంటిని వదిలి వేరే ప్రదేశానికి వెళ్లి కొద్ది రోజులు గడిపితే మీలో మార్పు రావచ్చు అని సూచిస్తారు. ఆ క్రమంలో రెండు ఫ్యామిలీలు గోవా వెళ్తాయి. అక్కడ మొదటి రోజునే సున్నితత్వం ఇష్టపడే ఇద్దరూ, మోటు తనం ఇష్టపడే ఇద్దరూ పరిచయం అవుతారు. సాహూతో నిక్కీకి, అభితో మైథిలికి ఎట్రాక్షన్ లాంటి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆ సాన్నిహిత్యం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? గోవా ప్రయాణం వారి జీవితాలను ఎలా మార్చేసింది? అనేది ‘మిక్స్ అప్’ కథ.
దాదాపు ఇరవై మూడేళ్ల క్రితమే ఈవీవీ.. ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’ (2001)అంటూ ఓ కథను కొంచెం అటూ ఇటూలో ఇలాంటి నేరేషన్‌లోనే చెప్పారు. అయితే అప్పట్లో సెంటిమెంట్, కామెడీ ప్రధానంగా చెప్తే.. ఇప్పుడు శృంగారం ప్రధానంగా ఈ కథను డీల్ చేశారు. ఈ కాలంలో ఇలాంటి జంటలు లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య అనేక విషయాల్లో అభిప్రాయభేదాలు, అభిరుచుల విషయంలోను మనస్పర్థలు ఉంటాయి. అయితే వాళ్లెవరూ అర్జెంటుగా విడాకులు తీసుకుందామనే ప్రయత్నం చేయరు. చేసిన కేసులు మనకు కనపడుతూనే ఉంటాయి. చాలా మంది కొంతలో ఎంతో కొంత ఎడ్జెస్ట్ అవుతూ అవతలివాళ్లను అర్దం చేసుకుంటూ బ్రతుకు బండి లాగేస్తారు.ఇక వెబ్‌ఫిల్మ్‌ని నేరేట్ చేసిన విధానం నెట్‌ప్లిక్స్‌లో వచ్చే ‘లస్ట్ స్టోరీస్’ని గుర్తుకు తెస్తుంది. చివర్లో మన తృప్తి కోసం చిన్న మెసేజ్ వదిలారు. తాత్కాలిక ఆనందాల కోసం వెంపర్లాడితే… జీవితంలో చాలా కోల్పోతామని, సంయమనం పాటిస్తూ, పార్టనర్‌కి తగిన గౌరవం ఇస్తే.. జీవితంలో అన్నీ అందుతాయని చివర్లో ఓ నీతి పాఠాన్ని చొప్పించారు. 'పెళ్లి అంటే అర్థం చేసుకోవడమే కాదు.. అర్థం చేసుకోబడటం కూడా' అని చెప్పారన్నమాట.
1980, 1990లలో మలయాళం నుంచి బోలెడు బోల్డ్‌ఫిల్మ్‌లు వచ్చేవి. వాటిని బూతు సినిమాలు, షకీలా బొమ్మలు ఇలా అంటూ కాస్త సీక్రెట్‌గా వెళ్లి చూసొచ్చే వాళ్లు. అవి చూశాము అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేవాళ్లు. కానీ ఓటీటి పుణ్యమా అని ఇప్పుడు మాత్రం దాన్ని అఫీషియల్ చేసేశారు. సెన్సార్ లేని ఓటీటీలలో ఈ అడల్ట్ సినిమాల జోరు పెంచేశారు. మామూలు కథల్లో కూడా కాస్తంత అడల్డ్ డోస్ వేసి వెబ్ సీరిస్‌లు, సినిమాలు ఫ్యామిలీలలో చిన్నా,పెద్దా అందరికీ ఆ సినిమాలను కూడా చేరువ చేస్తున్నారు. రెండు మూడేళ్ల కిందటి వరకు కేవలం బాలీవుడ్‌లో మాత్రమే ఈ అడల్ట్ సినిమాల, సీరిస్‌ల జోరు ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు అది తెలుగులో కూడా మొదలైంది. బోల్డ్ అనే ముసుగులో బూతుని యథేఛ్చగా పంచేస్తున్నారు. అలాగే అప్పటి సినిమాల్లో సెన్సార్ నుంచి బయిటపడటానికి ఒక వ్యూహం ఉండేది.
సినిమా అంతా కావాల్సిన మెటీరియల్ చొప్పించి, చివర్లో అక్రమ సంభందాలు తప్పు, లేదా పర స్త్రీ వ్యామోహం ప్రాణాంతకం అంటూ నీతి పాఠం ఒకటి చెప్పి ముగించేవారు. ఇప్పుడు ఓటీటీల్లో కూడా ఈ ట్రెండ్ మొదలైంది. ఇన్నాళ్లూ కాస్తంత పవిత్రంగా అనిపిస్తూ ప్యామీలీలకు దగ్గరగా అనిపించే ఆహా కూడా వ్యూయర్‌షిప్ కోసం ఈ దోవలోకి వచ్చేసింది. ‘మిక్స్ అప్’ అంటూ ఓ మాస్ మసాలా శృంగార వంటకాన్ని వండి వడ్డించేసింది. ఇంగ్లీష్‌లో ఇలాంటివి బోలెడు.. కానీ తెలుగులో మాత్రం ఇలాంటివి అరుదే. అందుకే తామే మొదట ఉండి ట్రెండ్ సెట్ చేయాలని దర్శక, నిర్మాతలు నడుం బిగించారు. ఇప్పటికే బాలీవుడ్‌లో లస్ట్ స్టోరీస్.. సేక్రేడ్ గేమ్స్.. రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్, ట్రిపుల్ ఎక్స్‌లో ఎలాంటి దాపరికాలు లేకుండా న్యూడ్ సీన్స్‌ను కూడా చూపించేశారు. వాటిని ఆదర్శంగా చేసుకుని ఇలాంటివి దింపుతున్నారు మన దర్శక నిర్మాతలు. మరి ఈ ట్రెండ్ ఎక్కడ ఆగుతుందో.
టెక్నికల్‌గా చూస్తే .. పెద్ద గొప్పగా ఏమీ ఉండదు. ఇలాంటి వెబ్ మూవీ ఇదే ఎక్కువ అనుకున్నట్లు మేకింగ్ చుట్టేసినట్లు అనిపిస్తుంది. ఉన్న రెండు పాటలు గొప్పగా లేవు. కౌశిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. దినేశ్ బాబు ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. ఇలాంటి సబ్జెక్టు కావాల్సిన కొన్ని బోల్డ్ సీన్స్ మాత్రం రెడీ చేసి అందించారు. అలాగే ఫక్ అనే పదం కంటిన్యూగా వినపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. లెంత్ ఎక్కువ లేదు. గంటన్నర లోపే. కథకి తగిన నిర్మాణ విలువలు కనిపిస్తాయి. నటీనటులు అలా చేసుకుంటూ పోయారు. త్వరగా ముగిసేలా ట్రిమ్ చేసిన ఎడిటర్‌కే థాంక్స్ చెప్పాలి.
చూడచ్చా
కాన్సెప్టు బోల్డ్ ది కదా ఏదో ఉంటుందని ఉత్సాహపడితే అంత లేదని చివర్లో నిట్టూర్చాల్సి వస్తుంది. కాసేపు కాలక్షేపం అంతే.
ఎక్కడ చూడొచ్చు:
'ఆహా' లో తెలుగులో