
Tollywood 2025: 2025 తెలుగు పరిశ్రమకు చెప్పిన గొప్ప పాఠం ఏమిటి?
హైప్ కాదు, హృదయం పని చేసింది
2025 మరికొద్ది రోజుల్లో ముగియబోతోంది. కానీ ఈ ఏడాది టాలీవుడ్‌కు మిగిల్చి వెళ్తున్న ప్రశ్నలు మాత్రం ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. 240కి పైగా సినిమాలు విడుదలైన సంవత్సరం ఇది. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు… థియేటర్లు, ఓటిటిలు…అన్ని కలిపితే ఇది కంటెంట్ ఓవర్‌డోస్ వచ్చిన సంవత్సరం. అయితే ఆ హడావుడి అంతా పక్కన పెట్టి, లెక్కలు వేసి చూస్తే ఒక స్పష్టత కనిపిస్తుంది. ఇది ఆనందంగా సంబరపడాల్సిన సంవత్సరం కాదు. అలాగని పూర్తిగా నిరాశ పడాల్సిన ఏడాదీ కాదు.
ఒకప్పుడు “ఒక స్టార్ సినిమా వచ్చిందంటే ఏడాది సేఫ్” అనుకునే పరిశ్రమ, ఇప్పుడు “స్టార్ ఉన్నా సరే… కథ, కథనం కలిసి పని చేయకపోతే సినిమా నిలబడదు” అనే దశకు వచ్చేసింది. 500 కోట్ల కలలు కన్న కాలంలో, టాలీవుడ్ ఈ ఏడాది 300 కోట్ల దగ్గరే ఆగిపోయింది. కానీ అదే సమయంలో — చిన్న, మధ్యస్థాయి సినిమాలు సైలెంట్‌గా బాక్సాఫీస్‌ని నిలబెట్టాయి. లాభాలు, నష్టాలు, సేఫ్ ప్రాజెక్టులు, ముఖ్యంగా పరిశ్రమ దిశనే ప్రశ్నించిన ఫలితాలు, సంకేతాలు ఈ ఏడాదిలో స్పష్టంగా కనిపించాయి.
అందుకే ఇక్కడ మాట్లాడాల్సింది కేవలం హిట్స్ గురించో, ఫ్లాప్స్ గురించో కాదు. అలాగే సక్సెస్ శాతం ఎంత అన్నదాని గురించి అసలు కాదు. అది స్టార్ల భవిష్యత్తుపై,
బడ్జెట్ ప్లానింగ్‌పై, పాన్ ఇండియా వ్యూహాలపై, ముఖ్యంగా — టాలీవుడ్ ఎటు వెళ్తోంది? అనే ప్రశ్నపై వేసే తీర్పు. అందుకే… 2025కి వీడ్కోలు చెప్పే ముందు, ఒకసారి వెనక్కి తిరిగి చూసేద్దాం.
OG: 2025లో టాలీవుడ్‌ని నిలబెట్టిన ఏకైక 300 కోట్ల ఆశ
పవన్ కల్యాణ్ నటించిన “OG” 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా సుమారు 295 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలు, నార్త్ అమెరికాలో ఈ సినిమా సృష్టించిన హైప్ అసాధారణం. అధిక రేట్లకు ఏరియాలు తీసుకోవడం వల్ల కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రాకపోయినా, ఇది పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమాగా నిలిచింది.
సంక్రాంతికి వస్తున్నాం: పాన్ ఇండియా లేకుండానే 255 కోట్ల ఆశ్చర్యం!
వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సంక్రాంతి 2025కి అన్‌డిస్ప్యూటెడ్ విన్నర్. పాన్ ఇండియా రిలీజ్ లేకపోయినా, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 255 కోట్ల గ్రాస్ సాధించి 2025లో రెండో పెద్ద హిట్‌గా నిలిచింది. ఇది వెంకటేష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ కావడంతో పాటు దిల్ రాజు బ్యానర్‌కి గట్టి కంబ్యాక్ ఇచ్చింది.
మిరాయి: హనుమాన్ తర్వాత తేజ సజ్జా కి పెద్ద హిట్ !
“హనుమాన్” తర్వాత తేజ సజ్జా ఫాలోఅప్ ఎలా ఉంటుందన్న అనుమానాలకు “మిరాయ్” ఫుల్ స్టాప్ పెట్టింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్ + సనాతన ధర్మం థీమ్‌తో ఆడియెన్స్‌ని బలంగా కనెక్ట్ చేసింది. 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 140 కోట్లకు పైగా వసూలు చేసి, 2025లో మూడో పెద్ద హిట్‌గా నిలిచింది.
Tollywood Hits 2025: సైలెంట్‌గా సక్సెస్ కొట్టేసిన విజేతలు (రిలీజ్ ఆర్డర్‌లో)
డాకూ మహారాజ్– హిట్
కోర్టు – సూపర్ హిట్
మ్యాడ్ స్వేర్ – హిట్
హిట్ 3 – హిట్
సింగిల్ – హిట్
లిటిల్ హార్ట్స్ – సూపర్ హిట్
K- ర్యాంప్ – హిట్
యావరేజ్ కేటగిరీ: గట్టెక్కినవి… కానీ గెలవలేకపోయినవి (రిలీజ్ ఆర్డర్‌లో)
తండేల్ – కొన్ని ఏరియాల్లో నష్టాలు
కుబేర
ది గర్ల్ ప్రెండ్
రాజు వెడ్స్ రాంబాయి
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో – కలెక్షన్లు చాలా తక్కువ
ఫైనల్ గా : 240 సినిమాలు… కానీ గెలిచింది మాత్రం 15 మాత్రమే!
2025లో టాలీవుడ్ నుంచి 240కి పైగా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో కేవలం 15 సినిమాలే సక్సెస్ జాబితాలోకి వచ్చాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే — ఈ 15లో ఎక్కువగా చిన్న, మిడ్ బడ్జెట్ సినిమాలే ఉన్నాయి. స్టార్ పవర్ కంటే కంటెంట్ పవర్‌నే 2025లో టాలీవుడ్‌ని నిలబెట్టింది. పాన్ ఇండియా కలలు కొద్దిగా బ్రేక్ తీసుకున్నా, చిన్న, మధ్యస్థాయి సినిమాల విజయం టాలీవుడ్ అసలైన బలాన్ని మళ్లీ చూపించింది.
2025 ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది: పాన్ ఇండియా అనేది లక్ష్యం కావచ్చు, కానీ పునాది మాత్రం లోకల్ కనెక్ట్‌నే. ఈ ఏడాది టాలీవుడ్‌ను ముందుకు నడిపించింది . "భారీ హైప్ కాదు — నమ్మకమైన కంటెంట్". అందుకే 2025 విజయాల సంవత్సరం కంటే ఎక్కువగా, దిశ మార్చుకున్న సంవత్సరం గా గుర్తుండిపోతుంది.

