1990 నాటి 'మట్టి మనుషులు' చిత్రం మళ్ళీ చూశాను..
ఎందరో పోచమ్మల కన్నీటి గాధ "మట్టి మనుషులు"
(ఆవునూరి సమ్మయ్య)
సామాజిక మార్పు కోసం సినిమాను శక్తివంతమైన మాధ్యమంగా ఎంపిక చేసుకుని వ్యాపార సినిమాలకు సమాంతరంగా కళాత్మక, ప్రయోగాత్మక, వాస్తవిక పేరుతో సినిమాలను నిర్మించి, ప్రపంచ చలన చిత్రరంగంలో మనదేశానికి గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటి భారత దర్శకుల్లో సత్యజిత్ రే, మృణాల్ సేన్, శ్యామ్ బెనెగల్, బి.నరసింగరావు, గౌతంఘోష్, ఆదూరి గోపాల కృష్ణన్, గిరీష్ కర్నాడ్, గోవింద్ నిహలాని లాంటి వారు ముఖ్యలు. తెలుగులో వాస్తవిక సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించి ప్రపంచ చలన చిత్ర వేదికపై తెలంగాణ మట్టివాసనాలను వెదజల్లిన దర్శకునిగా బి.నరసింగరావు నిలుస్తారు.
సినిమా రంగానికి రాక ముందు ఆర్ట్ లవర్స్, జననాట్య మండలి లాంటి సంస్థల వ్యవస్థాపకునిగా ప్రజా సాహిత్య, ప్రజా సాంస్కృతిక రంగాలకు మార్గదర్శనం చేసిన వారిలో నర్సింగరావు ప్రముఖులు. 1979 "మాభూమి'సినిమా ద్వారా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి ఆ రంగంలో అనేక సంచలనాలకు కేంద్ర బిందువైనాడు. బి.నర్సింగరావు దర్శకత్వంలో నిర్మించిన "రంగులకల(1983), దాసి(1988), మట్టి మనుషులు(1990)" చిత్రాలు వరసగా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలుగా అవార్డులు పొందడం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. అంతేగాదు దేశంలో వరసగా మూడు సార్లు ఉత్తమ చిత్రాల దర్శకునిగా హాట్రిక్ సాధించి జాతీయ, అంతర్జాతీయ చలనచిత్ర రంగం దృష్టిని తెలుగు చిత్రాలవైపు మళ్లించిన దర్శకునిగా ఆయన తెలుగు సినిమా చరిత్రపుటలను తిరగరాశారు.
1990 లో బి.నరసింగరావు దర్శకత్వం వహించిన" మట్టి మనుషులు"సినిమా గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. మణికొండ వేద కుమార్,ముఖర్జీ ల నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి బి.నరసింగరావు దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి దొరక్క వేలాది మంది నిరుపేద వ్యవసాయ కూలీలు,పేద రైతులు హైదరాబాద్ లాంటి మహానగరానికి వలస వచ్చిన భవన నిర్మాణ కార్మికుల జీవితాలు ముఖ్యంగా ఆ రంగంలో అనేక రకాలుగా దోపిడీకి గురయ్యే మహిళాకార్మికుల వ్యధాభరిత జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని అధివాస్తవిక సంఘటనలను ఆధారంచేసుకునికి బి.నరసింగరావు "మట్టి మనుషులు" చిత్రాన్ని రూపొందించారు.
బి.నర్సింగరావు తన సినిమాలకు ఎంచుకునే కథలు కథలు కావు.. అవి సమాజంలోని వివిధ వర్గాల ప్రజల జీవితాలు. అనేక అధ్యయనాల ద్వారా కథ రాసుకుని, దానికి అనుగుణంగా పాత్రధారులను ఎంపిక చేసుకోవడం ఆయన ప్రత్యేకత. అంతేకాదు గ్రామీణ తెలంగాణ వ్యావహారిక భాషలో గుండెల్లోకి నేరుగా గుచ్ఛుకుపోయే పదునైన మాటలు,మోతాదుకు మించని సంగీతం, సినిమాలోని పాత్రలతో పాటు మనమే సంచరిస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు లీనమై పోయినట్టు కనిపించే ఫొటోగ్రఫీ, మనచుట్టు కనిపించే కార్మికుల కట్టు, బొట్టు ఇలా సినిమా అన్ని పార్శ్వాల్లోను మనకు నరసింగరావు దర్శకత్వ ప్రతిభ అడుగడుగునా కన్పిస్తుంది.
"మట్టి మనుషులు" చిత్రంలోని ప్రధానపాత్ర పోచమ్మ. ఈ పాత్రలో ద్వారా ఎందరో పోచమ్మల వ్యధాభరిత జీవితాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి, ఆవేదన తోపాటు ఆవేశాన్ని కలిగిస్తాయి. పోచమ్మ పాత్రను చిత్రంలో సహజనటిగా పేరుగాంచిన అర్చన పోషించింది. నరసింగరావు చిత్రాల ద్వారా అర్చన జాతీయ,అంతర్జాతీయ అవార్డులను అందుకుంది.
దర్శకులు నరసింగరావు సూచన మేరకు ఈ చిత్రంలో నటించిన అర్చన, నీనాగుప్తా, మోయిన్ అలీ బేగ్‌లను షూటింగ్‌కు ముందు కొన్ని వారాల పాటు హైదరాబాద్‌లోని భవన నిర్మాణ ప్రాంతాల్లో పనిచేసే మహిళాకార్మికులతో కలిసి పనిచేశారు. అంతేకాదు పోచమ్మకు కుమారుడిగా నటించిన ఒక మూడేళ్ళ బాబును అర్చన వద్ద ఉంచి, తల్లి కూతుళ్ళ అనుబంధాన్ని పెంచిన తర్వాతనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారంటే నరసింగరావు దర్శకత్వంలోని సహజత్వాన్ని స్పష్టం చేస్తోంది. భవన నిర్మాణ కార్మికునిగా నటించిన మొయిన్ అలీ బేగ్ నిజాం రాజ కుటుంబానికి చెందినవాడు. ఆయన కూలీ పాత్రలో అడ్డ కార్మికులతో కూర్చుంటే భవన నిర్మాణ యజమానులు కూలీకి వస్తావా అని అడిగారట. అంటే కూలీ పాత్రలో ఆయన అంతగా ఇమిడిపోయారన్న మాట.
"మట్టి మనుషులు" సినిమా నిర్మాణాన్ని 17 రోజుల్లో పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ఎర్రంమంజిల్ లోగల అప్పటి చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి ఎదురుగా బహుళ అంతస్తులో నిర్మించబడుతున్న నవభారత్ ప్లాజా వద్దనే మొత్తం షూటింగ్ జరిగింది. ప్రధాన పాత్రధారులు మినహా అక్కడ పనిచేసే భవన నిర్మాణ కార్మికులందరు ఈ సినిమాలోని పాత్రధారులే కావడం విశేషం. క్లైమాక్స్ దృశ్యాలను మాత్రం నయపూల్ వద్ద చిత్రీకరించారు. మట్టి మనుషులు చిత్రం 1990లో జాతీయ ఉత్తమ చలన చిత్రంగా అవార్డు అందుకుంది. జాతీయ ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్‌ను కూడా పొందింది.
1990 లో మద్రాస్‌లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి జాతీయ సినీ విమర్శకులే కాదు హాలీవుడ్, న్యూయార్క్, జపాన్, ఇంగ్లాండ్, ఆస్టేలియా లాంటి అనేక దేశాల సినీ ప్రముఖులు "మట్టి మనుషులు" సినిమాను, సినిమా దర్శకులు బి.నరసింగరావు దర్శకత్వ ప్రతిభను ప్రశంసించారు. మట్టి మనుషులు సినిమాను ప్రపంచ స్థాయి సినిమాగా గుర్తించి కొనియాడటం మన దేశానికి దక్కిన గౌరవం. అలాగే 1991 లో మాస్కో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం డిప్లొమా ఆఫ్ మెరిట్ అవార్డును పొందడమేగాకుండా మట్టిమనుషులు చిత్ర విశిష్టతను,దర్శకులు నరసింగరావు దర్శకత్వ ప్రతిభను గురించి రష్యాలోని ప్రధాన స్రవంతిలోని పత్రికలన్నీ పతాకాశీర్షికల్లో వార్తలు రాశాయి.
కొమురం భీం నవలా రచయిత సాహు(శనిగరం వెంకటేశ్వర్లు) ప్రముఖ కథా రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డితో కలిసి కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ తిరందాజ్ థియేటర్లో ప్రదర్శించిన "మట్టి మనుషులు" సినిమాను చూసి బరువైన గుండెతో మౌనంగా కరీంనగర్ ప్రధాన వీధుల్లో రెండు గంటలపాటు తిరిగారట. అంటే ఈ సినిమా ఆ రోజుల్లో ప్రజలపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో గమనిచవచ్చూ... దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం తెలంగాణ ఆత్మను కథా వస్తువుగా స్వీకరించి సృజనాత్మక సినిమాల దర్శకులు బి.నరసింగరావు నిర్మించిన"మట్టి మనుషులు" కథా వస్తువు ఇప్పటికి కూడా సజీవమే.