
తెలంగాణా లోకల్ కామెడీ
కోతులగూడెంలో ట్రైలర్ తిరుపతి (మహేష్ చింతల) బార్బర్ ముత్యాలు (విద్యాసాగర్ కారంపురి) ఇద్దరు మంచి స్నేహితులు, ఓ రేంజి బద్మాషుగాళ్లు . వీళ్లకు నిత్యం ఒకటే పని ..తాగుడు. వీళ్లకు మిగతా ప్రపంచం సంగతి ఏమీ పట్టదు. తమ తాగుడు కోసం ఎలాగోలా డబ్బులు సంపాదించుకోవటంలో బిజీగా ఉంటూంటారు. అందుకోసం చివరకి దొంగతనం చేయటానికి కూడా వెనకాడరు.
ఒకసారి తాగడానికి డబ్బులు లేక పోయి స్కూల్లో పెన్షన్ వైర్ కొంచెం దొంగతనం చేసి , పోలీసులుకు దొరికిపోతారు. స్టేషన్ లో పెడితే అక్కడ కూడా వాళ్లకి బుద్ది మారదు, పోలీసుల పేరు చెప్పి అక్కడకి వచ్చిన వారి దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ తాగుతుంటారు. సర్లే చిన్న దొంగతనమే కదా అని నాలుగు రోజుల తర్వాత వదిలేస్తారు.
కొద్ది రోజులుకు అదే స్కూల్లో కంప్యూటర్ మిస్సవుతుంది. ఆ కంప్యూటర్ లో పాత విద్యార్థుల డేటా అంతా ఉంది. దాంతో యాజ్ యూజవల్ గా ఆ దొంగతనం కేసు తిరుపతి, ముత్యాలు మీద పడుతుంది. అసలు నిజంగా ఆ కంప్యూటర్ ఎవరు దొంగిలించారు? ఆ దొంగ ఎక్కడున్నాడు? ఆ కేసు ఎలా పరిష్కారం అవుతుంది? దొంగను పట్టుకోవడానికి కానిస్టేబుల్ రామచందర్ (మురళీధర్ గౌడ్)కి వీరు ఎలా సహాయం చేశారు? వీరు అసలు ఎందుకు ఇంత తాగుబోతులయ్యారు? చివరికి వాళ్లలో మార్పు వచ్చిందా? లేదా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
అల్లరి చిల్లరిగా తిరగే ప్రధాన పాత్రలు ఓ క్రైమ్ లో ఇరుక్కుని దాన్నుంచి బయిటపడటం అనే ఎలిమెంట్ తో వచ్చిన ‘జాతి రత్నాలు’ పెద్ద హిట్. దాని ప్రేరణతో తీసినట్లు అనిపిస్తుంది. అయితే ఇది పక్కా తెలంగాణా గ్రామీణ నేపధ్యంలో సాగే కథ కావటంతో అక్కడ లోకల్ కామెడీ ప్లస్ అయ్యింది. ఇలాంటి కథలకు ఎన్ని జోక్స్ పేలాయి అనేదే ప్రధానమే అయినా అందులో కథ అనేది కొద్దో గొప్పో నడుస్తూంటే ఎంగేజింగ్ గా ఉంటుంది. లేకపోతే సాగతీసిన ఫీల్ వస్తుంది.
ఈ సినిమా ఫస్టాఫ్ మెయిన్ క్యారక్టర్స్ ఇంట్రడక్షన్స్ , ఊళ్లో మిగతా పాత్రల ఫన్ తో బాగానే నడిచిపోయినా సెకండాఫ్ లో లాగినట్లు అనిపిస్తుంది. అలాగే కామెడీలో ఉన్న సమస్య ఏమిటంటే..ప్రతీ జోక్ పేలదు. ఎంతో గొప్పగా తెరపై పేలుతుంది అన్న వన్ లైనర్ తేలిపోవచ్చు. అనుకోనవి జనాలకు నవ్వు తెప్పిస్తాయి. అలాగ ఈ సినిమాలో కొన్ని చోట్ల జోక్స్ నవ్వించలేక ప్లాట్ గా మారాయి. అవి జోక్ అని తెలిసినా నవ్వు రాదు. అలాగే రొటీన్ సీన్స్ ని ఎవాయిడ్ చేయాల్సింది. దొంగను పట్టుకునే సీన్స్ బాగా రాసుకోలేదు. క్లైమాక్స్ మాత్రం ఎంగేజింగ్ గా ఉంది. ఏదైమైనా నవ్వించే సినిమా అయినా వాటికి కథ,కథనం అవసరం.
నటీనటుల్లో ...
బలగం, భీమదేవరపల్లి, రామన్న యూత్ ఫేమ్ విద్యా సాగర్ ఈ చిత్రంలో బార్బర్ ముత్యాలు మెయిన్ క్యారక్టర్ చేసారు. బాగానే నవ్వించాడు పాత్రలో ఒదిగిపోయాడు. టైలర్ తిరుపతిగా మహేష్ చింతల కూడా సహజంగా చేసుకుంటూ పోయారు. కొన్ని సీన్స్ లో నిజమైన తాగుబోతులా , తాగి చేసారా అనిపించేలా చేసారు. ఇక ముత్యాలు భార్యగా దీక్ష కోటేశ్వర్, తిరుపతి భార్యగా కవిత, మురళీ ధర్, బలగం సుధాకర్ రెడ్డి తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ గా... చిన్న సినిమా స్టాండర్డ్స్ కు తగినట్లే ఉంది. తేజ కూనూరు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు జస్ట్ ఓకే. వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ, గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ నడిచిపోతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సోసోగా ఉన్నాయి.
చూడచ్చా
జోకులు ఫుల్ ఫన్నీగా లేకపోయినా, కొంత మేరకు సరదాగానే ఉంటాయి. ప్రత్యేకంగా మరిచిపోలేని సీన్స్ లేకపోయినా అక్కడక్కడ కొన్ని చోట్ల నవ్విస్తాయి. పడి పడి నవ్వించేయదు కానీ పూర్తిగా నిరాశ అయితే పరచదు. వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఫ్యామిలీ అంతా చూసేలా ఉంది.
ఎక్కడ చూడచ్చు
ఈటీవీ విన్ ఓటిటిలో తెలుగులో ఉంది