LIVE యుద్ధ వార్తలు: లొంగితేనే ఇరాన్ మాటామంతి-తేల్చిచెప్పిన ట్రంప్
x

యుద్ధ వార్తలు: లొంగితేనే ఇరాన్ మాటామంతి-తేల్చిచెప్పిన ట్రంప్

బాంబు దాడులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్, ఇరాన్ ను ఎవ్వరూ లొంగదీసుకోలేరన్న పాలకులు,


అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం 8 వ రోజుకు చేరింది. క్షిపణుల దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ లొంగేంత వరకు మాట, ముచ్చట ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది.
యుద్ధమేఘాలు మరిన్ని అరబ్ దేశాలను ఆవరించాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌పై కొత్త మిసైళ్లను ప్రయోగించగా, ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేసింది. మరణాలు పెరుగుతున్నాయి. ఇరాన్‌లో 1,374 మందికి పైగా మృతి చెందగా, లెబనాన్, ఇజ్రాయెల్‌లో అనేకమంది మరణించారు. టెహ్రాన్ లో బాంబుల దాడి మోత మోగుతోంది. ఐక్యరాజ్యసమితి లెక్క ప్రకారం, వేల మంది ఇరాన్ రాజధాని టెహ్రాన్ విడిచి చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివెళుతున్నారు.

కొనసాగుతున్న దాడులు: అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై సైనిక దాడులను 8వ రోజు కూడా కొనసాగిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఇరాన్‌లో కనీసం 1,332 మంది మరణించారని ఇరాన్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
గగనతలంపై ఇజ్రాయెల్ ఆధిపత్యం: ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థల్లో (Air Defence Systems) దాదాపు 80 శాతం ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు సుమారు 2,500 దాడులు నిర్వహించి, గగనతలంపై పూర్తి స్థాయి పట్టు సాధించినట్లు వారు పేర్కొన్నారు.
పశ్చిమ ఇరాన్‌పై గురి: కేవలం శుక్రవారం ఒక్కరోజే పశ్చిమ ఇరాన్‌లోని 400 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇందులో బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
ఇరాన్ ప్రతిదాడి: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తమ 23వ విడత దాడులను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇరాన్ నుండి ప్రయోగించిన క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని ఇజ్రాయెల్ ధృవీకరించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ ని మేమే ఎంపిక చేస్తాం- ట్రంప్: గత శనివారం టెహ్రాన్‌పై జరిగిన దాడిలో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో, ఆయన వారసుడిగా కుమారుడు మొజ్తబా ఖమేనీ పేరు వినిపిస్తోంది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందిస్తూ, ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో తానే కీలక పాత్ర పోషిస్తానని, మొజ్తబా ఖమేనీ నాయకత్వం తమకు "అంగీకారం కాదు" అని స్పష్టం చేశారు.
భూతల దాడుల హెచ్చరిక: అమెరికా ఒకవేళ భూతల దాడికి (Ground Invasion) దిగితే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ హెచ్చరించారు. వేలమంది అమెరికా సైనికులను చంపడమో లేదా బందీలుగా పట్టుకోవడమో చేస్తామని ఆయన బెదిరించారు.
క్షీణించిన ఇరాన్ బలం: యుద్ధం మొదలైన మొదటి రోజుతో పోలిస్తే, ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల సంఖ్య 90 శాతం, డ్రోన్ దాడుల సంఖ్య 83 శాతం తగ్గిందని అమెరికా వెల్లడించింది.
ఈ యుద్ధం ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై కూడా అవరోధం సృష్టిస్తోంది. హార్ముజ్ జలసంధి వద్ద రెండు దేశాల మధ్య మిసైల్ దాడులు జరుగుతున్నాయి. భద్రతా ప్రమాదాలు పెరగడంతో నౌకలు అనేకం నిలిచిపోయాయి.
సౌదీ అరేబియా ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై దాడి చేసిన బాలిస్టిక్ మిసైల్‌ను ధ్వంసం చేసినట్టు ఆ దేశం ప్రకటించింది. సౌదీ అరేబియా వాయు రక్షణ దళాలు మిసైల్‌ను అడ్డుకున్నాయని, మిసైల్ లక్ష్యాన్ని చేరక ముందే నిరోధించామని తెలిపింది.

Live Updates

  • 7 March 2026 9:39 AM IST

    ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం!

    ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలక యంత్రాంగం ఎటువంటి షరతులు లేకుండా "బేషరతుగా లొంగిపోవడం" (Unconditional Surrender) తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం వైట్‌హౌస్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్ తన ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

    ఇరాన్ ప్రతిపాదించిన చర్చల అవకాశాన్ని ట్రంప్ పూర్తిగా తిరస్కరించారు. "ఇక మాట్లాడే సమయం ముగిసింది, ఇప్పుడు కేవలం చర్యలే ఉంటాయి" అని ఆయన పేర్కొన్నారు.

  • 7 March 2026 8:49 AM IST

    భేషరతుగా లొంగితేనే చర్చలు- ట్రంప్

    ఇరాన్ యుద్ధం ప్రాంతీయంగా విస్తరిస్తోంది. తీవ్ర ప్రభావమూ చూపుతోంది. మధ్యప్రాచ్యంలోని దాదాపు ప్రతి దేశం క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు లేదా పేలుడు శకలాల వల్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. అనేక దేశాలలో ప్రాణనష్టం జరుగుతోంది. కీలక దౌత్య కార్యాలయాలు (Embassies), ఆర్థిక కేంద్రాలు, రవాణా మార్గాలు మూతపడ్డాయి.


    యుద్ధం ప్రారంభమైన ఏడవ రోజైన శుక్రవారం నాడు, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బీరుట్, టెహ్రాన్‌లపై దాడులు చేశాయి. 'ఏపీ న్యూస్' వార్తా కథనం ప్రకారం అదే సమయంలో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ మరో విడత ప్రతీకార దాడులను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలను తోసిపుచ్చారు. "బేషరతుగా లొంగిపోవాలని" పిలుపునివ్వడంతో యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు.

    అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన ఈ యుద్ధం కారణంగా, విదేశీ ప్రభుత్వాలు తమ పౌరులను అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల్లో మధ్యప్రాచ్య దేశాల నుండి వెంటనే వచ్చేయాలని కోరుతున్నాయి. విమాన మార్గాలు (Airspaces) మూతపడ్డాయి, క్రూయిజ్ నౌకలు, ట్యాంకర్లు హార్మూజ్ జలసంధి గుండా వెళ్లలేకపోతున్నాయి. ప్రధాన విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ పౌరులను ఈ ప్రాంతం నుండి తరలించడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి.

Read More
Next Story