
ఇరాన్-అమెరికా యుద్ధం- 6వ రోజు: ట్రంప్ కు పట్టపగ్గాల్లేవ్! సెనేట్ ఓకే
ఈ యుద్ధంలో మృతుల సంఖ్య 1045కి చేరింది. యుద్ధం తీవ్రంగానే కొనసాగుతోంది
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 6వ రోజుకు చేరింది. పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటికి మరణించిన వారి సంఖ్య 1045కి చేరినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. యుద్ధం మరింత తీవ్రం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ లోని మరికొన్ని దేశాలకు యుద్ధం పాకినట్టు తెలుస్తోంది..
మరోపక్క, ఈ యుద్ధానికి సంబంధించి అమెరికా సెనేట్ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి సర్వాధికారాలు అప్పగిస్తూ తీర్మానించింది..
వార్ అప్ డేట్స్ ఇలా ఉన్నాయి..
అమెరికా సెనెట్ నిర్ణయం: ఇరాన్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన సైనిక చర్యలను అడ్డుకోవడానికి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా సెనెట్ తోసిపుచ్చింది. ఈ విధానపరమైన తీర్మానానికి వ్యతిరేకంగా 53 ఓట్లు, అనుకూలంగా 47 ఓట్లు రావడంతో ఆ తీర్మానం వీగిపోయింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ఇరాక్ సరిహద్దుల్లో "ఉగ్రవాద కదలికలు" పెరుగుతున్నాయని హెచ్చరించారు. టెహ్రాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రేరేపించడానికి అమెరికా కుర్దిష్ దళాలతో చర్చలు జరుపుతోందని, వారికి ఆయుధాలు సరఫరా చేసే ప్రయత్నంలో ఉందన్న నివేదికల నేపథ్యంలో.. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
చమురు సరఫరాకు ఆటంకం: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో, గ్లోబల్ ఆయిల్ మరియు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ముప్పు పొంచి ఉందన్న భయంతో సరుకు రవాణా నౌకలు (Cargo Vessels) ఈ మార్గంలో ప్రయాణించకుండా నిలిపివేశాయి.
Live Updates
- 5 March 2026 10:15 AM IST
బాంబు మోతలతో దద్దరిల్లుతున్న టెహ్రాన్
ఇరాన్‌లో అర్ధరాత్రి నుండి కొత్తగా దాడులు ప్రారంభమయ్యాయని సమాచారం అందింది. తూర్పు టెహ్రాన్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి, దీనివల్ల రాజధాని అంతటా ప్రకంపనలు వచ్చాయి. అయితే ఖచ్చితమైన లక్ష్యాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. సనందాజ్, సాక్వెజ్, బుకాన్ వంటి కుర్దిష్ నగరాల్లో కూడా రాత్రిపూట దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. శనివారం నుండి దేశవ్యాప్తంగా 150కి పైగా నగరాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు.
అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
మరోవైపు, ఈ ప్రాంతంలోని ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 19వ విడత ప్రతీకార దాడులను ప్రారంభించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపినట్లు అల్ జజీరా పేర్కొంది. గురువారం ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్‌పైకి క్షిపణులను ప్రయోగించింది. దీనివల్ల టెల్ అవీవ్‌తో సహా పలు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ అలర్ట్‌లు జారీ అయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఏడు గంటల విరామం తర్వాత ఈ దాడులు మళ్లీ మొదలయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ నుండి వస్తున్న క్షిపణులను అడ్డుకోవడానికి తమ వైమానిక రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది.
అదో అడ్డూఅదుపూ లేని దేశం- ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను "నియంత్రణ లేని దేశం" (out of control) గా అభివర్ణించారు. ఇరాన్ ముందుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయకుండా నిరోధించడానికే తాము ఈ ముందస్తు దాడులు (pre-emptive strikes) చేశామని ఆయన చెప్పారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్‌పై పటిష్టమైన స్థితిలో ఉందని, ఆ దేశంలో నాయకులు కావాలని ప్రయత్నించే వారు "చనిపోతారని" ఆయన హెచ్చరించారు. అలాగే, ఇరాన్‌కు చెందిన టాప్ సబ్‌మెరైన్‌తో సహా 20కి పైగా నౌకలను అమెరికా ధ్వంసం చేసినట్లు వైట్ హౌస్ ప్రతినిధి ధృవీకరించారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాటల్లో:
"మేము యుద్ధాన్ని నివారించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు చేశాంం, కానీ అమెరికా-జియోనిస్ట్ దురాక్రమణ వల్ల మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల సార్వభౌమాధికారాన్ని తాము గౌరవిస్తామని, ప్రాంతీయ భద్రత సామూహిక ప్రయత్నాల ద్వారానే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
- 5 March 2026 8:42 AM IST
అమెరికాను గంగవెర్రులెత్తిస్తున్న షహీద్ డ్రోన్లు
ఇరాన్ వద్ద ఉన్న వందలాది షహీద్ డ్రోన్లు ఇప్పుడు అమెరికాను కలవరపెడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఈ డ్రోన్లతో దాడులు చేస్తోంది. వాటిని అడ్డుకునేందుకు అమెరికా, మిత్రదేశాలు ఖరీదైన ఇంటర్‌సెప్టర్ క్షిపణులను వినియోగించాల్సి వస్తోంది. ఇదే సమయంలో అమెరికాకు ఆర్థికంగా ఎక్కువ నష్టం కలిగేలా.. రూ.వేల కోట్ల విలువైన కీలక రాడార్లు, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడంపై ఇరాన్ దృష్టిపెట్టింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా టెక్ సంస్థల డేటా సెంటర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
యుద్ధం తొలిదశలో వాడకూడదన్న ఉద్దేశంతో తామింకా అసలైన ఆయుధాలను బయటికి తీయలేదని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజని ఇటీవల ప్రకటించడం గమనార్హం. తమ వద్ద ఉన్న ఆయుధాల్లో ఇప్పుడు ప్రయోగిస్తున్నవన్నీ తుప్పుపట్టినవేనని, అసలైన ఆయుధాలను కీలక దశలో ప్రయోగిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఐఆర్‌జీసీ కమాండర్ జబ్బారీ కూడా దాదాపు ఇదే తరహా ప్రకటన చేశారు. అమెరికా వద్ద ఉన్న క్షిపణుల నిల్వలు తరిగిపోయే దాకా డ్రోన్లతో దాడులు కొనసాగించి.. ఆ తర్వాత భారీ స్థాయిలో క్షిపణుల ప్రయోగానికి దిగాలని ఇరాన్ భావిస్తోందన్న దానికి ఈ ప్రకటనలు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు.

