
IRAN-US WAR: హలో ట్రంప్, యుద్ధాన్ని ముగించేది మేమే: ఇరాన్
మధ్యవర్తిత్వానికి సిద్ధమైన రష్యా, నిన్న ట్రంప్ తో ఇవాళ ఇరాన్ తో రష్యా మంత్రి మాట్లాడడం కొసమెరుపు
ఒకవైపు దాడులు ముగింపు దశకు వచ్చాయని అమెరికా చెప్తుంటే.. అసలు పోరాటం ఇప్పుడే మొదలైందని ఇరాన్ హెచ్చరిస్తోంది.
ముగింపుపై భిన్న వాదనలు
Live Updates
- 10 March 2026 8:53 PM IST
రష్యా మధ్యవర్తిత్వం- పరిష్కారం లభించేనా?
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి (Abbas Araghchi)తో మంగళవారం ఫోన్ లో మాట్లాడారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత రష్యా ఇరాన్‌తో చేసిన ముఖ్య సంభాషణ ఇదే.
లావ్రోవ్ రష్యా తరపున పొలిటికల్, డిప్లొమాటిక్ సెటిల్‌మెంట్ కోసం ఆశిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి మరింత దిగజారిపోకుండా రష్యా తోడ్పడడానికి సిద్ధంగా ఉన్నట్టు రష్యా మంత్రి తెలిపారు.
ఈ ప్రక్రియలో ఇరాన్, పొరుగు దేశాల భద్రతా అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఒత్తిడి చేసినట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా తెలిపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా ఇరాన్‌కు మద్దతు ఇస్తోంది. ప్రత్యక్ష మిలిటరీ సపోర్ట్ కాకుండా డిప్లొమాటిక్ మార్గంలో మద్దతు ఇస్తున్నట్టు ఈ చర్చల ద్వారా తెలుస్తోంది.
రష్యా ఈ యుద్ధాన్ని అనవసరమైందిగా ఖండిస్తోంది. మధ్యవర్తిత్వాన్ని ప్రతిపాదిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ నిన్న ఫోన్ లో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. ట్రంప్ ఇరాన్ ను "భేషరతుగా లొంగిపోవాలని" డిమాండ్ చేస్తుండగా రష్యా మాత్రం డిప్లొమసీని ప్రోత్సహిస్తోంది.
రష్యా-ఇరాన్ మధ్య వ్యూహాత్మక బంధం ఉంది. కానీ పబ్లిక్‌గా ట్రంప్‌తో సంబంధాలు దెబ్బతీనకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
- 10 March 2026 4:42 PM IST
‘ట్రంప్ మాటలకు చర్యలకు పోంతనే లేదు’
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటల్ని ఇరాన్ మేధావులు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన ఉత్త మాటల పుంజంటూ వ్యాఖ్యానిస్తున్నారు. టెహ్రాన్‌లోని మిడిల్ ఈస్ట్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో అబాస్ అస్లానీ మాట్లాడుతూ, ట్రంప్ “విరుద్ధమైన ప్రకటనలు” కారణంగా అమెరికా అధ్యక్షుడి మాటల్ని నమ్మలేమన్నారు.
అల్ జజీరాతో మాట్లాడిన ఆయన, యుద్ధం త్వరలో ముగుస్తుందని ట్రంప్ చెప్పిన వ్యాఖ్యలను కొందరు ఆయిల్ ధరలపై ప్రభావం చూపడానికి, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ పరిణామాలను నియంత్రించడానికి ప్రయత్నంగా భావిస్తున్నారని చెప్పారు.
భూమిపై జరుగుతున్న దానికీ ట్రంప్ మాటల మధ్య తేడా ఉందని గమనించారు. “ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేస్తున్న అదే సమయంలో, టెహ్రాన్‌లో, దాని శివార్లలో (కరాజ్ సహా) ఫైటర్ జెట్‌లు ఎగురుతున్నాయి, భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయి” అని అస్లానీ చెప్పారు.
ఇరాన్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోని వారి దృష్టిలో, యుద్ధం మొదలవడానికి ముందు అమెరికా, ఇజ్రాయెల్ ఊహించినట్లు విషయాలు జరగడం లేదని, అందుకే ట్రంప్ ఇప్పుడు కృత్రిమ విజయాన్ని (manufacture a victory) తయారు చేసుకుని బయటపడే మార్గం (off-ramp) కోసం వెతుక్కుంటున్నారని అన్నారు.
టర్కీలో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్...
టర్కీ దేశ మధ్యభాగంలో ప్యాట్రియట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మోహరించినట్టు టర్కీ ప్రకటించింది. ఇది NATO రెండో బాలిస్టిక్ మిసైల్.
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ విషయాన్ని ప్రకటించారు.
“మా సరిహద్దులు, ఎయిర్‌స్పేస్ భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. NATO, మా మిత్రదేశాలతో చర్చలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో తీసుకున్న చర్యలతో పాటు, NATO ఎయిర్, మిసైల్ డిఫెన్స్ చర్యలను బలోపేతం చేసింది” అని టర్కీ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటనలో తెలిపింది.
“ఈ సందర్భంలో, మా ఎయిర్‌స్పేస్ రక్షణకు సహాయం చేయడానికి ఒక ప్యాట్రియట్ సిస్టమ్ మలట్యాలో (సెంట్రల్ టర్కీ) మోహరించనున్నాం.”
మలట్యా టర్కీలోని కురేసిక్ ఎయిర్‌బేస్ ఉంది – ఇక్కడ అమెరికా సైనికులు ఉంటారు. NATO ఎర్లీ-వార్నింగ్ రాడార్ సిస్టమ్ ఉంది, ఇది ఇరాన్ మిసైల్ లాంచ్‌లను గుర్తించగలదు అని తెలిపారు.
ట్రంప్ యుద్ధం త్వరలో ముగుస్తుందని చెప్పినా, భూమిపై (టెహ్రాన్‌లో పేలుళ్లు, ఫైటర్ జెట్‌లు) దాడులు కొనసాగుతున్నాయి.. ఇది ఆయన మాటలు, చర్యలతో సరిపోలడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
- 10 March 2026 1:07 PM IST
అమెరికాతో మాటల్లేవ్.. ముచ్చట్లేవ్: తెగేసి చెప్పిన ఇరాన్
అమెరికాతో ఇకపై చర్చలు, చర్చల ప్రయత్నాలు ఉండబోవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ స్పష్టం చేశారు. గతంలో జరిగిన అణు ఒప్పంద చర్చల్లో తమకు చాలా చేదు అనుభవం ఎదురైందని ఆయన తెలిపారు. అందుకే ఇకపై అమెరికాతో మాట్లాడే అంశం అజెండాలో లేదని వెల్లడించారు.
అమెరికా తమపై దాడి చేయాలనే ఉద్దేశం లేదని, అణు సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పిందని అరఘ్చీ గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత కూడా అమెరికా దాడి చేయడం విశ్వాసాన్ని దెబ్బతీసిందని చెప్పారు. అందువల్ల అమెరికాతో మళ్లీ చర్చలు జరపడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, తమ క్షిపణి కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా చెబుతున్నది నిజం కాదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొంది. మరింత ఎక్కువ సంఖ్యలో, ఒక టన్నుకిపైగా వార్‌హెడ్లు కలిగిన క్షిపణులను వినియోగిస్తున్నామని తెలిపింది.
ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లను అడ్డుకుంటే ఇరాన్‌పై 20 రెట్లు తీవ్రంగా దాడులు చేస్తామని ఆయన అన్నారు. అదే సమయంలో యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగిస్తోంది. బహ్రెయిన్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. బహ్రెయిన్ రాజధాని మనామాలో ఒకరు మృతి చెందగా, ఇజ్రాయెల్‌లో ఇద్దరు మరణించినట్లు సమాచారం.
ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో రాత్రిపూట తీవ్ర బాంబుదాడులు జరిగినట్లు సమాచారం. రిసాలత్ స్క్వేర్ సమీపంలో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 486 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
- 10 March 2026 10:07 AM IST
5000లకు పైగా ఇరాన్ టార్గెట్ల ధ్వంసం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ప్రకటించారు. ఫ్లోరిడాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై సైనిక చర్యలు ప్రారంభించిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడటం ఇదే మొదటిసారి.
యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ చెప్పారు. అయితే అది ఎప్పుడు ముగుస్తుందో మాత్రం స్పష్టమైన తేదీ చెప్పలేదు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తమ లక్ష్యాలను సాధించాయని కూడా ఆయన పేర్కొన్నారు.
5000లకు పైగా ఇరాన్ లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు అమెరికా సైన్యం ప్రకటించింది
ఇరాన్ నుంచి మళ్లీ ఎలాంటి దాడులు ప్రారంభమైనా మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అవసరమైతే ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు.
ఇక ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమెనీ నియామకంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఇరాన్‌లో ఇప్పటివరకు ఉన్న సమస్యలే కొనసాగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించిన అలి ఖమెనీ స్థానంలో అతని కుమారుడు మొజ్తబా ఖమెనీని ఇరాన్ ప్రభుత్వం కొత్త సుప్రీం లీడర్‌గా నియమించింది.

