LIVE IRAN WAR Destruction
x
ఏకమైన ఇరానీయన్లు, హోరెత్తుతున్న నిరసనలు

అమెరికా భూతల యుద్ధానికి దిగితే మృత్యులోయలో ఇరుక్కున్నట్టే!

మంటల్లో హెర్మూజ్ జలసంధి.. ఆయిల్ నౌకలపై క్షిపణులు


ఇరాన్ పై యుద్ధాన్ని ప్రకటించి గగనతలంపై పట్టుసాధించానని చెప్పుకుంటున్న అమెరికా నేరుగా భూతల యుద్ధానికి (Ground War/Invasion) వెళ్లకుండా ఎందుకు వెనుకాడుతోంది? చేసింది చాలు ఇక వెనుదిరుగుదామని అమెరికా సైనిక నిపుణులు ఎందుకు చెబుతున్నారు? కేవలం వైమానిక దాడులకే (Airstrikes) పరిమితం కావడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

సాక్షాత్తు అమెరికా సైనిక నిపుణులు (ముఖ్యంగా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కైన్ వంటి వారు) యుద్ధాన్ని ఆపమని లేదా వెనక్కి తగ్గమని సలహా ఇచ్చారు. ఎందుకంటే..
ఆయుధ నిల్వల కొరత..
అమెరికా సైనిక నిపుణులు చెబుతున్న అతిపెద్ద సమస్య ఆయుధాల కొరత. ఇరాన్ ప్రయోగించే వందలాది డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికి అమెరికా భారీగా పేట్రియాట్ (Patriot) క్షిపణులను వాడుతోంది. గతేడాది నుంచి ఇప్పటివరకు జరిగిన దాడుల్లో అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా రక్షణ క్షిపణులను ఖర్చు చేసింది. యుద్ధం ఇలాగే కొనసాగితే, అమెరికా వద్ద నిల్వలు తగ్గిపోయి భవిష్యత్తులో ఇతర ముప్పులను (ఉదాహరణకు చైనా లేదా రష్యా నుండి) ఎదుర్కోవడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద యుద్ధం వల్ల చమురు రవాణా నిలిచిపోయింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 40% పెరిగాయి. యుద్ధం ఇంకా కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటాయి. ఇది అమెరికాతో సహా అన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యానికి (Recession) దారితీస్తుందని ఆర్థిక, సైనిక సలహాదారులు భయపడుతున్నారు.
లక్ష్యాలు పూర్తయ్యాయని భావించడం..
సైనిక నిపుణుల ప్రకారం, ఈ యుద్ధం ప్రారంభించిన ప్రధాన లక్ష్యాలు - ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం, క్షిపణి కేంద్రాలను దెబ్బతీయడం - ఇప్పటికే 90% పూర్తయ్యాయి. "ఇంతకంటే ఎక్కువ సేపు యుద్ధం చేస్తే అది అనవసరమైన ప్రాణనష్టానికి దారితీస్తుంది తప్ప, అదనపు ప్రయోజనం ఉండదు" అని వారు భావిస్తున్నారు.
ఇరాన్ ఎదురుదాడి ముందు నిలవలేకపోతోందా?
ఇరాన్ నేరుగా యుద్ధం చేయడమే కాకుండా, తన మిత్రదేశాల ద్వారా మధ్య ప్రాచ్యం అంతటా అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. దీనివల్ల ఇరాక్, సిరియా, యూఏఈలలో ఉన్న అమెరికా సైనికులకు ముప్పు పెరుగుతోంది.
"అంతులేని యుద్ధ" భయం....
అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో "నేను యుద్ధాలను ఆపుతాను, కొత్తవి మొదలుపెట్టను" అని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఇరాన్ లోపలికి సైన్యాన్ని పంపితే (Ground Invasion), అది దశాబ్దాల పాటు సాగే యుద్ధంగా మారిపోతుందని, అమెరికా మరోసారి "అఫ్గానిస్థాన్ వంటి ఊబిలో" చిక్కుకుపోతుందని సలహాదారులు హెచ్చరిస్తున్నారు.

భూతల యుద్ధానికి భయమెందుకంటే...

అమెరికా సైనిక నిపుణులు అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో చెప్పిన అంశాల ప్రకారం భౌగోళిక సవాళ్లు చాలా ఎక్కువ. ఇరాన్ భౌగోళికంగా ఇరాక్ లేదా ఆఫ్ఘనిస్తాన్ లాంటిది కాదు. ఇరాన్ చుట్టూ ఎత్తైన పర్వత శ్రేణులు (Zagros and Alborz mountains) ఉన్నాయి. లక్షలాది మంది సైనికులను, ట్యాంకులను ఆ పర్వతాల గుండా లోపలికి పంపడం అమెరికాకు ప్రాణనష్టంతో కూడుకున్న పని.

గత చేదు అనుభవాలు...
అమెరికా గత యుద్ధాల నుండి చాలా పాఠాలు నేర్చుకుంది. మరింత మూల్యం కూడా చెల్లించింది. "సుదీర్ఘ కాలం యుద్ధం చేస్తే వియత్నాం, ఇరాన్-ఇరాక్ యుద్ధాలలో మాదిరి చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది. అందువల్ల నేరుగా భూమి మీద యుద్ధానికి సైన్యాన్ని పంపకూడదు" అనే పాఠాలను నేర్చుకుంది. అందుకే ఇప్పుడు కేవలం హై-టెక్ దాడుల ద్వారా ఇరాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాలని ప్రయత్నిస్తోంది.
గతంలో వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో అమెరికా వేల కోట్లు ఖర్చు చేసి, వేలాది మంది సైనికులను కోల్పోయింది. చివరకు అక్కడ ఆశించిన ఫలితాలు రాలేదు. అమెరికాలో పాలకులే మారిపోవాల్సిన పరిస్థితి. అందుకే భూతల యుద్ధానికి వెళ్తే అమెరికా సైనికులు ఇరాన్ గడ్డపై చిక్కుకుపోయే ప్రమాదం ఉందని పెంటగాన్ భయపడుతోంది.
ఇరాన్ అంతర్గత తిరుగుబాటుపై ఆశలు..
అమెరికా వ్యూహం ఏమిటంటే.. బాంబు దాడులతో ఇరాన్ సైనిక శక్తిని బలహీనపరిస్తే, అక్కడి ప్రజలే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మార్పు తెస్తారని ఆశించింది. అది కాస్తా ఇప్పుడు బెడిసికొట్టింది. తమ అంతర్గత విభేదాలను పక్కనబెట్టి ఇరానీయులు అందరూ ఒక్కటై అమెరికాను తూర్పారబడుతున్నారు.

జనవరిలో జరిగిన భారీ నిరసనల తర్వాత, ఇరాన్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని అమెరికా నమ్మింది. "ఈ దేశం మీది (ఇరానియన్లది), మీరే మార్పు తెచ్చుకోవాలి" అని ట్రంప్ తన సందేశాల్లో పరోక్షంగా చెబుతూ వచ్చారు. చివరికి 2026 ఫిబ్రవరి 28న గగనతల దాడులు చేసి ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీని చంపేశారు. అయితే ఆ తర్వాత ఇరాన్ అసెంబ్లీ ఆయన రెండో కుమారుడు మొజ్తాబాకే పట్టం కట్టడంతో అమెరికా నిస్సహాస్థితిలో పడింది.
ఖర్చులు తడిసిమోపెడు...
ఇరాన్ లాంటి పెద్ద దేశాన్ని ఆక్రమించాలంటే రోజుకు కొన్ని బిలియన్ డాలర్ల ఖర్చవుతుంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో, సైనికుల మృతదేహాలు స్వదేశానికి రావడం రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే 8 మంది అమెరికా సైనికులు మరణించడంపై అక్కడ విమర్శలు మొదలయ్యాయి.

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తాబా

కుక్కలు చింపిన విస్తరిలా మారితే...
ఒకవేళ భూతల యుద్ధం చేసి ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోస్తే, ఆ తర్వాత ఏర్పడే అస్తవ్యస్త పరిస్థితుల వల్ల ఇరాన్ మరో లిబియా లేదా సిరియాలా మారిపోయే ప్రమాదం ఉంది. అరాచకం పెరిగితే అది ఇజ్రాయెల్, అరబ్ దేశాలకు మరింత ముప్పుగా మారుతుందని అమెరికా భావిస్తోంది. అందుకే భూతల యుద్ధానికి వెనకడుగు వేస్తోంది.

Live Updates

  • 11 March 2026 3:20 PM IST

    మండుతున్న హోర్ముజ్ జలసంధి..

    మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఇప్పుడు లెబనాన్, గల్ఫ్ దేశాలకు కూడా విస్తరించింది.

    ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ రాజధాని బీరూట్‌తో పాటు దక్షిణ లెబనాన్ ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది. బీరూట్‌లోని ఒక అపార్ట్‌మెంట్ భవనం దెబ్బతింది. ఈ దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి.

    హోర్ముజ్ జలసంధిపై భయాలు

    ప్రపంచానికి అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

    ఒక కార్గో నౌకపై క్షిపణి దాడి జరిగింది

    సముద్ర మార్గం భద్రతపై ఆందోళనలు పెరిగాయి

    ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

    గల్ఫ్ దేశాలపై దాడులు

    ఇరాన్ మిస్సైళ్లు , డ్రోన్లతో గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుంది. కొన్ని ప్రాంతాల్లో అలారం సైరన్లు మోగాయి. సౌదీ అరేబియా వంటి దేశాలు కొన్ని మిస్సైళ్లను కూల్చివేశాయని తెలిపారు. 

  • 11 March 2026 11:21 AM IST

    ఇరాన్ లో నిరసనలు తెలిపితే వాళ్లు శత్రువులే..

    -స్వదేశంలో నిరసనలు చేస్తున్న వారిని ఇకపై “శత్రువులుగా” పరిగణిస్తామని ఇరాన్ ప్రకటించినట్టు ప్రభుత్వ మీడియా తెలిపింది.

    -లెబనాన్‌లోని బీరూట్, బెకా వ్యాలీ ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

    - కువైట్ 8 డ్రోన్లను కూల్చివేసింది.

    కువైట్ నేషనల్ గార్డ్ తెలిపిన ప్రకారం, “భద్రతను పెంచడం, కీలక ప్రదేశాలను రక్షించడం, బాంబు దాడులను ఎదుర్కోవడం” కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా 8 డ్రోన్లను కూల్చివేశాం అని ప్రకటించింది.

    ఇరాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టుకు చెందిన మరో ఇద్దరు క్రీడాకారులు ఆస్ట్రేలియాలో ఆశ్రయం కోరారని ఆస్ట్రేలియా హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్ తెలిపారు.

    ఇంతకుముందు ఐదుగురు మహిళా క్రీడాకారులు మానవతా వీసాలు (Humanitarian visas) మంజూరు అయ్యాయి.

    --UAE తీరంలో కంటైనర్ నౌకను తాకిన క్షిపణి

    -UAEలోని రాస్ అల్ ఖైమా సమీపంలో కంటైనర్ నౌకను క్షిపణి తాకింది. UAEలోని రసల్ ఖైమా నుంచి సుమారు 25 నాటికల్ మైళ్ల దూరంలో ఒక కంటైనర్ నౌకను గుర్తు తెలియని క్షిపణి తాకింది.

  • 11 March 2026 8:06 AM IST

    ఇరాన్‌లో ఆమ్ల వర్షం వదంతులు

    ఇరాన్‌లో ఆమ్ల వర్షం (Acid Rain) లేదా నల్లటి వర్షం కురిసిందని కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబర్లు చెబుతున్నా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నిర్ధారణ లేదు.


    అధికారిక సమాచారం లేదు: ఇరాన్ ప్రభుత్వం కానీ, ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం కానీ లేదా అంతర్జాతీయ రెడ్ క్రాస్ (Red Crescent) సంస్థలు కానీ ఇరాన్‌లో ఆమ్ల వర్షం కురిసినట్లు ఎక్కడా ప్రకటించలేదు.

    ప్రచారంలో ఉన్న వార్తలు: సోషల్ మీడియాలో మరియు కొన్ని అన్-వెరిఫైడ్ వెబ్‌సైట్లలో "నల్లటి ఆమ్ల వర్షం" కురుస్తోందని, ప్రజలకు శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

    సాంకేతిక విశ్లేషణ: ఇలాంటి వార్తలతో కూడిన గ్రాఫిక్స్ చాలావరకు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా సృష్టించినవే. యుద్ధ సమయంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.

    శాస్త్రీయ కోణం: ఒకవేళ భారీ స్థాయిలో చమురు క్షేత్రాలు లేదా కెమికల్ ఫ్యాక్టరీలు పేలిపోతే, ఆ ప్రాంతంలో మసి, రసాయనాలు గాలిలో కలిసి వర్షంతో పాటు కిందకు రావచ్చు. కానీ ప్రస్తుతం అటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినట్లు ఎక్కడా ధృవీకరించలేదు.

    ప్రస్తుతం ఇరాన్‌లో ఆమ్ల వర్షం కురుస్తుందనే వార్త నిజం కాదు. ఇది కేవలం సోషల్ మీడియాలో తిరుగుతున్న వదంతులే.

Read More
Next Story