
తూర్పుగోదావరి జిల్లాలో పట్టుబడిన క్రికెట్ బెట్టింగ్ ముఠా
గ్రామాలపై బుకీల గురి, అప్పులు తీర్చలేక యువత బలి
క్రికెట్ మోజు కొంపలు కూల్చుతోంది. బంతిబంతికీ బెట్టింగ్ పేరిట కొత్తరకం బుకీలు గ్రామీణ ప్రాంతాలను కమ్మేస్తున్నారు. యువతకు కొత్త మత్తు ఎక్కిస్తున్నారు..
ఐపీఎల్-2025 సీజన్ ప్రారంభమైంది. మొత్తం 74 మ్యాచ్ లు, 60 రోజులు.. సందడే.. సందడి.. ఇలా మ్యాచ్ ప్రారంభమైందో లేదో అప్పుడే బుకీలు తెరపైకి వచ్చారు. బెట్టింగులు పెద్దఎత్తున సాగుతున్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ యాపులు యువత కొంపముంచుతున్నాయి. దీనికి సాక్ష్యమే మార్చి 22న తూర్పుగోదావరి జిల్లాలో దొరికిన నగదు, పట్టుబడిన నిందితులు.
దేశవ్యాప్తంగా మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియం లీగ్(ఐపీఎల్) ప్రారంభమైంది. దీంతో బుకీలు ప్రధానంగా గ్రామీణప్రాంతాలు, మేజర్ పంచాయితీల వైపు చూపు మొదలు పెట్టారు. బుకీలు నగరాలు, పట్టణాల్లో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా పందాలు కాయిస్తూ కొంపలు ముంచుతున్నారు.
ఎలా నిర్వహిస్తారంటే..
మెయిన్ బుకీలు మూడో కంటికి కనపడకుండా నగరాల్లో ఉంటారు. వీళ్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తమ ఏజెంట్లను నియమించుకుంటారు. ఈ ఏజెంట్లు బెట్టింగ్ కాసే వారిని గుర్తించి ఓ గ్రూపు తయారు చేస్తారు. ఇలా ప్రతి ఊరిలో నలుగురైదుగురు ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు ఉంటారు. వీళ్లు
బెట్టింగ్ కట్టేవారిని గుర్తించి వారితో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. మ్యాచ్ ఎవరు గెలుస్తారనే దగ్గర్నుంచి ప్రతి బంతికి పందెం కాస్తుంటారు. ఏ బాల్ కి ఎన్ని పరుగులు వస్తాయో, అవుటనో, వైడనో, నోబాల్ అనో ఇలా రకరకాలుగా బంతిబంతికీ పందెం ఉంటుంది. ఆ వివరాలను ప్రధాన బుకీ ఏజెంట్లకు పంపిస్తారు. వాళ్లు తమ వాట్సాప్ గ్రూపుల్లోకి పంపిస్తారు. ఏ బాల్ కి ఎంత బెట్టింగో చెబుతుంటారు. ప్రధాన బుకీలు ఏజెంట్లకు భారీ కమీషన్లు ఇస్తున్నారు. మరికొందరు నేరుగా కొన్ని కంపెనీలు నిర్వహించే బెట్టింగ్ యాప్‌లలో పందేలు కాస్తున్నారు.
వీళ్లు ఎక్కడైనా భేటీ కావాలనుకున్నా ముందస్తు సమాచారంతో కలుస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడిదో వ్యసనం అయింది. పోలీసులు ఎక్కడైనా పసిగడితే ఏమీ తెలియనట్టుగా పారిపోతుంటారు.
ఇలా బెట్టింగుల మోజులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో బాగా ఎక్కువైందని, దీన్ని అరికట్టాలని జనవిజ్ఞాన వేదిక నాయకుడు లక్ష్మణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొందరైతే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరికొన్ని గ్రామాలలో ఏజెంట్లే అప్పులు ఇచ్చే వాళ్లను కూడా చూపిస్తుంటారు. వాళ్లు ఈ జూదగాళ్లకు డబ్బులు వడ్డీకి ఇస్తుంటారు. అప్పు తీర్చలేని వాళ్ల ఇళ్ల వద్దకు వెళ్లి గొడవ చేస్తుంటారు. ఎక్కడ పరువు పోతుందోనని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి అప్పులు తీరుస్తున్న సంఘటనలూ అనేకం ఉన్నాయి.
దాదాపు అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి. గతంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ కొన్నాళ్లుగా గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించింది. కొంత మంది బుకీలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నె వంటి నగరాల నుంచే ఈ బెట్టింగ్ వ్యవహారాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల హెచ్చరిక...
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, సహకరించినా జైలు శిక్ష తప్పదని రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరించింది. బెట్టింగ్ ముఠాలు, యాప్‌ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. పాత ముఠాలపై నిఘా ఉంచాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. పందేలు నిర్వహించే వారిని వ్యవస్థీకృత నేరస్తులుగా పరిగణించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని పోలీసులు హెచ్చరించారు.
Next Story