ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరదేనా! రేపే మ్యాచ్
x
SRH, RR Cricket teams

ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరదేనా! రేపే మ్యాచ్

ఐపీఎల్-2025 సీజన్ లో రెండో మ్యాచ్ కి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. SRH వర్సెస్ RR జట్లు ఆదివారం తలపడనున్నాయి.


ఐపీఎల్ -2025 సీజన్ కి హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కొత్త పెళ్లికూతురిలా దగదగా మెరిసిపోతోంది. ప్రస్తుత సీజన్ ప్రారంభమైన మర్నాడే అంటే మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌ (RR)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో SRH ఈ సీజన్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. మొత్తం ఏడు మ్యాచ్ లు ఈ స్టేడియంలో జరుగనున్నాయి. సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో స్టేడియంను ముస్తాబు చేశారు. ప్రేక్షకులు, క్రీడాకారులు ఎటువంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
39వేల సీటింగ్ కెపాసిటీ...
సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. సుమారు 39,000 మంది కూర్చొనేందుకు వీలుగా ఈ స్టేడియంను నిర్మించారు. దక్షిణ భారతదేశంలోని పెద్ద క్రికెట్ స్టేడియంలలో ఇదొకటి. నైట్ మ్యాచ్‌ల కోసం అత్యాధునిక ఫ్లడ్‌లైట్స్ ను అమర్చారు. రెండు ప్రధాన పెవిలియన్లు ఉంటాయి. మీడియా కవరేజ్ కోసం మంచి సౌకర్యాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్రెస్సింగు రూంలు, ఇతర ఏర్పాట్లు సరేసరి.

భారీగా వాహనాలు పార్కింగ్ చేసుకునే సౌకర్యంతో పాటు స్టేడియంకు ఓవైపు మెట్రో స్టేషన్, దాని పక్కనే సిటీబస్ స్టాప్, స్కైవాక్, సర్క్యూట్ రూట్ ఉన్నాయి. మ్యాచుల సమయంలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు వీలుగా కొన్ని రూట్లలో వాహనాలను డైవర్ట్ చేస్తుంటారు.
వాస్తవానికి ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) హోమ్ గ్రౌండ్ కూడా. SRH మార్చి 23న ఈ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తమ తొలి హోం మ్యాచ్ ఆడనుంది. గత సీజన్‌లో SRH మెరుగైన ప్రదర్శన ఇచ్చిన నేపథ్యంలో ఈసారి అభిమానులు ప్రత్యక్షంగా స్టేడియంలో మ్యాచ్ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
SRH మ్యాచ్‌లకు టికెట్ బుకింగ్ ఎలాగంటే..
SRH ఫ్రాంచైజీ యాజమాన్యం తన మొదటి రెండు మ్యాచ్‌లకు టికెట్లను ఇప్పుడు అమ్ముతోంది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో, మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎస్ఆర్హెచ్ ఆడే మ్యాచ్ లకు టికెట్లను విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల టికెట్లు District యాప్ లేదా వెబ్‌సైట్‌ ద్వారా లభిస్తాయి. టికెట్ ధరలు రూ.2,750 నుంచి రూ.30,000 వరకు ఉన్నాయి.
District యాప్ లేదా వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు చూడాలనుకునే SRH మ్యాచ్‌ను ఎంచుకోండి. అక్కడ అడిగే వాటికి సమాధాలు చెప్పుకుంటూ వెళ్లి మీకు కావాల్సిన చోట సీటును ఎంచుకుని డబ్బు చెల్లించాలి.
ప్రతి రెండు టికెట్లకు ఒక జెర్సీ ఉచితంగా వస్తాయి. స్టాక్ ఉన్నంతవరకే అనే షరతు కూడా ఉంటుంది. టికెట్లు కొన్నాం కదా జెర్సీ ఇమ్మంటే ఇవ్వరు.
టికెట్ పికప్ కోసం మీకు అనువైన స్లాట్‌ను ఎంచుకోండి. స్టేడియంలో ప్రవేశించడానికి చేతిలో టికెట్ ఉండాల్సిందే. పికప్ వివరాలు ఆ సైట్ లో ఉటాయి. వాటిని జాగ్రత్తగా చదవండి.
మీ పేరు, పిన్‌కోడ్, రాష్ట్రం, ఇమెయిల్ వంటి వివరాలు రిజిస్టర్ చేయాలి.
పేమెంట్ మోడ్ కూడా ఉంటుంది. ఇ-టికెట్లు మీ ఇమెయిల్‌కి వస్తాయి. స్టేడియంలో ఫిజికల్ టికెట్లు తీసుకునేటప్పుడు వాటిని బాక్స్ ఆఫీస్‌ వద్ద చూపించి లోపలికి వెళ్లాలి. ఏదో ఒక గుర్తింపు కార్డు కూడా వెంట ఉండాలి.
టికెట్ ధరలు ఎలా ఉంటాయంటే..
ఈస్ట్ స్టాండ్ మొదటి అంతస్తు, వెస్ట్ స్టాండ్ మొదటి అంతస్తు – ₹2,750
ఈస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్, వెస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్ – ₹4,500
BKT టైర్స్ నార్త్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ – ₹6,500
జియో సౌత్ ఈస్ట్ ఫస్ట్ ఫ్లోర్, ఆల్ సీజన్స్ సౌత్ స్టాండ్ – ₹8,000
రైజర్స్ లౌంజ్ నార్త్ వెస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఆరెంజ్ ఆర్మీ లౌంజ్ - నార్త్ ఈస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ – ₹16,000
నార్త్ పావిలియన్ ఈస్ట్ సెకండ్ ఫ్లోర్ (S23-S28), నార్త్ పావిలియన్ వెస్ట్ సెకండ్ ఫ్లోర్ (S29A-S31) – ₹22,000
సౌత్ పావిలియన్ వెస్ట్ సెకండ్ ఫ్లోర్ (S1-S4), సౌత్ పావిలియన్ ఈస్ట్ సెకండ్ ఫ్లోర్ (S18A) – ₹30,000
SRH హోం మ్యాచ్‌ల షెడ్యూల్:
SRH vs RR – మార్చి 23, 2025
SRH vs LSG – మార్చి 27, 2025
SRH vs GT – ఏప్రిల్ 6, 2025
SRH vs PBKS – ఏప్రిల్ 12, 2025
SRH vs MI – ఏప్రిల్ 23, 2025
SRH vs DC – మే 5, 2025
SRH vs KKR – మే 10, 2025
నకిలీ టికెట్లతో జర జాగ్రత్త...
ఇదిలా ఉండగా.. ఆదివారం ( మార్చి 23 ) హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ), రాజస్థాన్ రాయల్స్ ( RR ) మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్ మ్యాచ్ కోసం కొందరు కేటుగాళ్లు బ్లాక్ అమ్ముతున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఐపీఎల్ బ్లాక్ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. అవి చెల్లుబాటు కావని, మోసం చేసి డబ్బు సంపాయించేందుకే ఈ పని చేస్తున్నారని, వాటిని కొని మోసపోవద్దని చెప్పారు.
మెట్రో రైల్ ఏర్పాట్లు...
మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం మైట్రో రైలు వేళల్ని పొడిగించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లు జరిగే రోజుల్లో ఈ సదుపాయం ఉంటుందని భావిస్తున్నారు. ఆదివారం వంటి సెలవు దినాల్లో మెట్రో రైళ్లను రాత్రి 11.30 గంటల వరకునడుపుతారు. మార్చి 23న ఆదివారం రావడంతో ఈ మ్యాచ్ కోసం మెట్రో రైలు వేళల్ని మరో గంట పొడిగించనున్నారు. పైగా ఆదివారం సూపర్ సేవర్ కార్డులు పని చేస్తాయి. 59 రూపాయలు చెల్లించి సూపర్ సేవర్ కార్డును రీచార్జ్ చేయించుకుంటే ఎన్నిసార్లైనా తిరగవచ్చు.
వాతావరణం ఎలా ఉండవచ్చు...
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం మార్చి 23న వాతావరణం చల్లగానే ఉండే అవకాశం ఉంది. అయితే అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన చిరు జల్లులు పడవచ్చు. హైరాబాద్ లో రేపటి కనిష్ట ఉష్ణోగ్రత 23.31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రత 34.77 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని అంచనా. ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
ఈ వాతావరణ పరిస్థితులు మ్యాచ్ కి పెద్ద ఆటంకం కలిగించకపోవచ్చునని క్రీడాభిమానులు చెబుతున్నారు. భారీ వర్షమైతే తప్ప ఆట నిలిచే పరిస్థితి ఉండదు. స్టేడియంలో అందుకు తగ్గ ఏర్పాట్లు ఉన్నాయి. పిచ్ లన్నింటిని కవర్ చేసి ఉంచారు.
పరుగుల వరదేనా..
మార్చి 23న జరిగేది IPL 2025లో రెండవ మ్యాచ్. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్- రెండు జట్లలోనూ భారీ పరుగులు చేయగల ఫైర్ బ్రాండ్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. అందువల్ల ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారే అవకాశం ఉంటుందన్నది అభిమానుల అంచనా. భారీ స్కోరింగ్ థ్రిల్లర్‌ను ఆశించవచ్చు. ఛేజింగ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది.
బ్యాటింగ్ హెవీవెయిట్స్ ఉన్న SRH, RR జట్లు ఐపీఎల్ లో ఇప్పటి వరకు మొత్తం 20 సార్లు తలపడ్డాయి. వాటిలో 11 సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజేతగా ఉంటే తన ప్రత్యర్థికి గట్టిపోటీని ఇచ్చే సత్తా ఉన్న RR జట్టు 9సార్లు గెలిచింది.
మొత్తం మీద ఆదివారం జరిగే ఈ మ్యాచ్ ఓ ఆసక్తికరమైన మ్యాచ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మార్చి 23, 2025 ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్షప్రసారం చేస్తోంది.
Read More
Next Story