ఆ ఊరి పిల్లలలో ఏదో ఒక మిలటరీ క్రమశిక్షణ కనపడేది
x

ఆ ఊరి పిల్లలలో ఏదో ఒక మిలటరీ క్రమశిక్షణ కనపడేది

బడి వొడిలో... ఒక టీచరమ్మ ‘యథానికలు' : 2



పక్క ఊరి స్కూల్ దాకా నేను, ఆ స్కూల్ మేడంగారు ఇద్దరం నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. అప్పటికి మా హెచ్ఎం గారు, పక్క స్కూలు హెచ్ఎం గారు ఇద్దరూ సైకిళ్లు వేసుకొని మా బ్యాగులు తీసుకుని వెళ్లేవాళ్లు. పక్క స్కూల్ నుండి నేనొక్కదాన్నే మా స్కూల్ దాకా ఉదయం నడుచుకుంటూ వెళ్లేదాన్ని. మధ్యాహ్నం సాయంత్రం పక్క స్కూల్ దాకా సైకిల్ మీదే. హెచ్. ఎం. ఎఫఫ్రా రాని రోజు నేను ఒక్కదాన్నే నడక. గాలి వర్షం అయితే ఇద్దరం నడక. సాయంత్రం పక్క స్కూల్ నుండి ఆ టీచర్ గారు, నేను చేతిలూపుకుంటూ ఆ పక్క ఊరి వ్యాను దాకా నడిచే వాళ్ళo. ఆ తొమ్మిది ఊర్లకు మధ్యలో ఉన్న పెద్ద ఊరు అది పెద్దగంజాం. పెద్దగంజాం లో సూర్యుని కిరణాలు భవన్నారాయణ స్వామి తల నుండి ప్రారంభమై కింద పాదాల వరకు సంవత్సరానికి రెండుసార్లు ప్రసరిస్తాయి.

మళ్లీ స్కూల్ దగ్గరకు వద్దాం. లోపల హెచ్ఎం గారు, నాలుగు ఐదు తరగతుల విద్యార్థులు. గోడపక్క నేను, ఒకటి రెండు మూడు తరగతుల విద్యార్థులు. అందరం ఇసుకలో ఓ చెట్టు కింద కూర్చునేవాళ్ళం. నాకు మాత్రం ఓ పట్ట (బియ్యం గోతం లాంటిది). అదే ఓ పెద్ద సింహాసనం. నా చుట్టూ పిల్లలు.

ఊర్లో నుండి నీళ్ళు తెప్పించుకుంటే నీచువాసన. తాగలేకపోయే వాళ్ళం. నీళ్ళు మోసుకెళ్లే వాళ్ళం. నీళ్లు మోసుకెళ్తున్నానని ఓ ప్రజా సంఘ నాయకుడు, "ఏం వాళ్లు తాగడం లేదా వాళ్ళు మనుషులు కాదా!," అంటే నిజమే కదా అనుకున్నాను. (అప్పటికీ పౌరహక్కుల,.మహిళ సంఘాలాలో యాక్టీవుగా ఉన్నాను.) ఊర్లో నుంచి చెంబు తెప్పించి తోమించి మా స్కూల్ ఆవరణలో ఉన్న బావిలో చేదుకొని తాగితే బ్రహ్మాండంగా కొబ్బరిపాలలా ఉన్నాయి. ఊరంతాటికీ అదే బావి. (అయితే స్కూలు కి మేము వెళ్లే లోపలే ఆ బావి నుండి నీళ్లు తీసుకెళ్లేవాళ్లు.)

ఆ పట్టపు పిల్లలనుంచి ఎంతో నిజాయితీని నేర్చుకున్న. ఈ చేలో తాటిచెట్టు ఉండి గట్టు అవతల చేలో తాటికాయపడినా, ఆ చేనువాళ్లు తీసుకోరట. తాటిచెట్టు ఉన్న చేను వాళ్లే తీసుకోవాలి. తీసుకుంటే తప్పు కట్టాల్సిందేనట. మనం అయితే చెట్టు నీ చేలో ఉన్నా, ఆ చెట్టు నాచేలోకి వంగిందని కాయలు మొత్తం కోసుకోగలం. ఇంటి పక్కనే కరెంటు స్తంభం ఉన్నా, గుడ్డి కిరస నాయులు దీపమే గాని బారెడు వైరు లాక్కోరు. అలా లాక్కోవడం కరెంటు దొంగతనం కిందకు వస్తుందంట. ఇది నాకైతే చెప్పలేనoత ఆశ్చర్యం. కరెంటు స్తంభాల నుండి వీధి దీపాలే వెలుగుతాయి. ఏ (ఇంటికి) గుడిసకు కరెంటు కనెక్షన్ లేదు. (అప్పటికి మా ఊర్లలో కరెంటు స్తంభాల నుండి దొంగతనంగా వైర్లు వేసుకుని (పగలు తీచేసి,రాత్రి వేసుకొని) విద్యుత్ బలుపుల్ని వెలిగించుకునే వాళ్ళు).

గ్రామ నాయకుడు ఏదన్నా మీటింగ్ పెట్టి ఎవ్వరు ఎక్కడకు వెళ్ళొద్దంటే పచ్చి చేపలు పాడవుతున్నాసరే వెళ్లరట. పచ్చి చేపలకు ఉప్పు కలిపి నానపెట్టి ఎండు చేపలు చేస్తారట. రొయ్యలు లాంటివైతే పాడవుతాయట. పొలం, చేపల అమ్మకానికి పోతున్న మహిళలు కూడా వెనక్కి వచ్చేయాలట. ఆ విద్యార్థులు ఇలాంటి కబుర్లు చెబుతుంటే నేను నోరు తెరుసుకొని వినేదాన్ని. వాళ్లకు తెలుగు మాట్లాడటం వచ్చు. కొంత మనం చెప్పేది అర్థమయిద్ధి. కానీ చదువు అనేది మాత్రం కష్టంగా ఉండేది. ఆ వూరి నుంచి ఎవరు అప్పటిదాకా హైస్కూలుకు వెళ్లలేదట.

పట్టపు వాళ్లు అంటే తమిళనాడు నుండి (తమిళం మాతృభాషగా గల వాళ్లు.) బంగాళాఖాతం పొడవునా ఆంధ్రప్రదేశ్ కు మైగ్రేట్ అయినవాళ్ళు. పట్టపుపాలెం లో పడవ ఎక్కితే అటు తమిళనాడు ఇటు బెంగాలు దాకా (బంగాళాఖాతం సముద్రంలో) వెళ్లొచ్చు. పల్లెకారులు అంటే ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు. వీళ్ళ మాతృభాష తెలుగు. పెద్దగంజాంకు దక్షిణం వైపుగా పట్టపుపాలెం, తూర్పు వైపుగా పల్లెపాలెం ఉండేవి. వీరిద్దరకు సముద్రపు (ఇద్దరికి ప్రదానవృత్తి చేపలవేట) వేటలో సరిహద్దు తగాదాలు వస్తే అవి తీర్పు చెప్పడం బ్రహ్మ తరం కాదు.నరుక్కొనేదా పోతారు. పోలీసు స్టేషన్ లో సిబ్బంది కూడా తలలు పట్టుకొని కూర్చోవాల్సిందే. పట్టపు వాళ్ళదే ఎక్కువసార్లు పై చేయిగా ఉంటుందట యూనిట్ వలన.

సరే మళ్లీ విద్యార్థుల నుంచి నేర్చుకున్న అంశాల దగ్గరికి వస్తున్నాను. తాటికాయను ఎన్ని రకాలుగా తినొచ్చో మొదటిసారి వాళ్ల నుండి నేర్చుకున్న. దాన్ని ఎలా తినాలో కూడా నేర్చుకున్న. ఆ తాటికాయలు తిన్న సారలు పిల్లలకు ఈ చెవునుండి ఆ చెవిదాకా బంగారురంగులో ఉండేవి. స్నానాలు గట్రా ఉండేవి కావు. ఎలా ఉంటే అలా వచ్చేవాళ్ళు. ఆ సారలేంటి అని అడిగితే తాటికాయ తిన్న సారలు అన్నారు. అవునా? అని ఆశ్చర్యపోతుంటే మీకు తెలీదా అని వాళ్లు ఆశ్చర్యపోయేవాళ్ళు. అప్పటిదాకా నాకు తాటి ముంజలు మాత్రమే తెలుసు. ఈ తాటి ముంజలు కూడా మూగచింతల నుంచి గంపలు గంపలు తీసుకొచ్చి అమ్మితే కొనుక్కునేవాళ్ళం. నా అమాయకత్వానికి నవ్వుకుని, ఓ విద్యార్థి ఓ తాటి పండును తీసుకొచ్చి ఇచ్చి ఇంటికి తీసుకువెళ్లి బెల్లం వేసి వండుకొని తినమన్నాడు. వాళ్లు చెప్పినట్టే ఉడక పెట్టాను. అయితే అది నచ్చలే. కానీ వాళ్లు తింటుంటే మాత్రం, ఆనందంతో నేను తింటున్నట్లుగా ఫీల్ అయ్యేదాన్ని.

నేను ఓ రోజు సముద్రం చూపించండిరా అంటే పదిమంది పిల్లలు ఆ తాటి తోపులకుండా సముద్రం దగ్గరకు తీసుకెళ్లి మొదటిసారి సముద్రాన్ని చూపించారు. సముద్రాన్ని చూస్తే వీళ్లను పట్టుకోవడం కష్టమండి అని నన్ను, ఓ పదిమంది పిల్లలను లీడర్ కు అప్పగించి అనేక బాధ్యతలు అప్పజెప్పి మా హెచ్ ఎం గారు సముద్రం దగ్గరకు పంపించాడు, త్వరగా రండి అని మరి మరి చెప్పి. ఆ సముద్రపు, తాటిచెట్ల హోరు వినగానే భయం వేసింది. ఆ హోరుకు పిల్లలు నాట్యం చేయ చేయడం మొదలెట్టెరు. సముద్రాన్ని చూడడమే, వినటమే. నేను దిగితే పిల్లలందరూ దిగుతారని, బయటకు రావడం కష్టమన్నాడు లీడరు. అక్కడ సముద్రం లోతుగా కూడా ఉంటుందట. నన్ను కూడా నీళ్లలోకి దిగనీయకుండా మళ్లీ స్కూల్ దగ్గరకు తీసుకొచ్చాడు. సముద్రం గురించి మీకు తెలియదు లీడర్ చెప్పినట్టే వినమన్నాడు ఎఫఫ్ర గారు. ఇంకేం చేయను మరి.

ఒకరి బలపం ఒకరు తీసుకోవడం ఒకరి పలకో పుస్తకమో ఇంకొకరు లాక్కోవడం ఒకరిని ఒకరు కొట్టుకోవడం నేను చూడలేదు. ఏదన్నా ఉన్న లీడర్ చూసుకునేవాడు. టీచర్ దాకా రానివ్వడు. ఏదో ఒక మిలటరీ క్రమశిక్షణ కనపడేది నాకు. మనతో సంబంధం లేకుండానే బ్రహ్మాండంగా ఆటలు ఆడుకునే వాళ్ళు ఆ ఇసుకలో. వారి ఆటలు వారి మధ్యలో నిల్చుని మైమరిచి చూస్తుందేదాన్ని. కానీ ఇదంతా చదువు దగ్గరకు వచ్చేటప్పటికి ఆందోళన ఆతృత నిరాశ నిస్సృహులు వచ్చేవి. చెప్పింది అర్థం చేసుకోవడం లేదని, రాయడం లేదని ఒక్కొక్కసారి దుఃఖంగా కూడా ఉండేది. వారికి న్యాయం చేయలేక పోతున్నానని దిగులుగా బాధగా ఉండేది. నాకు చెప్పడం రాదేమోనని, నేను ఎంతో ఇష్టంగా చేరిన ఉపాధ్యాయ వృత్తికి తగనేమోనని అనుకునేదాన్ని.

హెచ్.ఎం గారు మీటింగులు, మండల విద్యాశాఖ అధికారుల పిలుపులని వెళ్లేవాడు. ఎక్కువగా నేనొక్కదాన్నే ఆ ఎడారి స్కూల్లో ఉండేదాన్ని. కొత్త ఉద్యోగం ఉరకలెత్తే ఉత్సాహం, హుషారు. మా నాన్న నేర్పిన, నేను నేర్చుకున్న రాజకీయాలు, నిజాయితీ. నేర్పాలన్న ఓ తపన. చదువు తప్ప పల్లెలు, గ్రామాలు, విద్యార్థులు వారి పరిస్థితిలేమిటో చెప్పని ట్రైనింగులు. అక్కడ దాక వెళ్ళని మన విద్యావేత్తలు. ఆలోచించని మేధావులు. అట్టడుగు పరిస్థితి ఏమిటో అవగాహన లేని మా చదువులు. అన్ని కలగూర గంపలా ఉండేవి.

మా సుబ్బారావు సారు "ఇక్కడ ఏమి మునిగిపోయిందమ్మ రోజు వస్తారు. మాకు గాంగ ఉద్యోగాలు వచ్చాయని, రోజుకొక కొత్త చీర, మ్యాచింగ్ బ్యాగులు వేసుకుని రోజు వస్తారు. రాకపోయినా ఎవరు అడుగుతారు" అనేవాడు నవ్వుతూ మహిళా టీచర్లను. ఆయన అన్నట్టు రోజు వెళ్లేవాళ్ళo. మగ, ఆడ సమానంగా చేరాం. సమానంగా ఉన్నాం. దేనిలో తగ్గలేదు. నీరసపడలేదు ఎవ్వరం.

ఓ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నా. 30 మంది పైగా విద్యార్థులు. చెప్పాలన్న ఓ తపన. ఇంతలో పిల్లికళ్ళ మండల విద్యాశాఖ అధికారి వచ్చారు. ఆయన కళ్ళే పులి కళ్ళలా మెరుస్తూ భయంగా ఉన్నాయి. ఈయనను చూడటం ఇదే మొదటిసారి.. (మేము చేరిన రోజు ఉన్న అధికారి కాదు. ఆ ఎం.ఈ.ఓ గారు టీచింగ్ సైడ్ ఇష్టమని హై స్కూల్ కి వెళ్లారు.) ఆ పరిసరాలు పరిస్థితులు అర్థం చేసుకోకుండా పిల్లలకు చదువులేదు అన్నాడు. ఇతను కొత్త అతనే. అతను ఏవో ఏవో ప్రశ్నలు వేస్తున్నారు. నేను చెబుతున్నాను. పిల్లలు గోలగోలగా అరుస్తున్నారు. మా దగ్గర అతనికి ఇవ్వడానికి మంచినీళ్లు కూడా లేవు. పిల్లల్లో డిసిప్లిన్ లేదని వెళ్లాడు. మనసంతా చిరాగ్గా ఉంది. ఓ పిల్లోడికి ఎంత చెప్పినా రావటం లేదు. కోపం విసుకుతో వాడి రేకు పలకతోనే తలమీద కొట్టేను. చుట్టూ చెక్క అంచు కూడా లేని రేకుపలక. అప్పుడు అన్ని రేకు పలకలే. మట్టి పలకలు ఎనామిల్ పలకలు ఉండేవి కావు. దెబ్బ తగులుతుందని కూడా అనుకోలేదు.

తలమీద చర్మం గట్టిగానే గీరుకుపోయి రక్తం వచ్చింది. నేను కంగారు పడిపోయి నీళ్లతో ఆ విద్యార్థి తల మీద తుడిచాను. అలా తుడవకూడదు. కాటన్ తో ఒత్తి పెట్టాలని కూడా తెలియదు. అయినా కాటన్ ఎక్కడుంది. పాత గుడ్డ ముక్క కూడా లేదు. నీటి తడికి ఇంకొంచెం ఎక్కువ కనిపించింది. లీడర్ ఎప్పుడు పంపాడో తెలియదు. ఎప్పుడు చూసినా కనిపించనివాళ్ళు అప్పటికప్పుడు 15 మంది పైగా గొడవకు వచ్చారు. నేను ఎంత సర్ది చెప్తున్నా వినిపించుకోకుండా పిల్లాడిని చంపేసి నట్లే అరుస్తున్నారు. ఒక్కదాన్నే. బిక్క మొహం వేసుకుని దుఃఖపు గొంతుతో అలా చూస్తుండి పోయా. నన్ను చూసి, వాళ్లలో ఓ అతనే పిల్లాడి తల చూచి పైతోలు గీక్కుపోయిందిలే ఏమీ కాలేదన్నడంతో శాంతించారు. అప్పటికి మూడు కావచ్చిoది. ఓ అరగంట అలానే ఉండి పక్క స్కూల్ కి వచ్చి జరిగింది చెప్పి ఏడ్చెసాను. ముగ్గురం కలిసి మెయిన్ స్కూల్ కి వచ్చినా నా దుఃఖం తగ్గలేదు. కం. వెo., తిరుమలరావు సార్లు చాలా ధైర్యం చెప్పారు.తిరుమలరావు సార్ అయితే, ఓసారి నేను,విద్యార్థి తల్లిదండ్రులు కొట్టుకోపోయాం అమ్మ అని చాలా చెప్పాడు. దిగులు పడద్దని ఎం.ఇ. ఓ గారితో ఏం మాట్లాడతామని, రెండు రోజులు సెలవు పెట్టమ్మ, అన్ని సర్దుకుంటాయమ్మ అన్నారు.

అప్పటికే ఒంగోలు పక్కన ఉన్న ఓ ఊర్లో టీచరు విద్యార్థినిని కొట్టిందని ఆ విద్యార్థి వాళ్ళ అమ్మ వచ్చి టీచర్ని కొట్టిoదట. ఆ టీచర్ అది అవమానంగా భావించి పక్కనే ఉన్న బావిలో దూకిందట. పిల్లలు గోల గోలగా అరవటంతో స్కూలు దగ్గరలో ఉన్న వాళ్లు ఆ టీచర్ని రక్షించి, ఆ విద్యార్థి తల్లిని బాగా అరిచారని. ఇట్లాంటివి చాలా చెప్పి 95 బ్యాచి ఉత్సాహం తగ్గించుకోవాలని, పరిస్థితులను అర్థం చేసుకోవాలని చెప్పారు. పద్మావతి మేడం గారు అయితే నన్ను దగ్గరకు తీసుకుని పట్టపు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలమ్మా అన్నారు. దీని నుండి కూడా విద్యార్థులను తలపై కొట్టకూడదని, రక్తాన్ని నీళ్లతో కడగకూడదని, కాటన్ తో ఒత్తి పెట్టాలని నేర్చుకున్నాను. ఇది కూడా నేర్చుకోవడమే కదా.(సశేషం)


Read More
Next Story