మహిళాభ్యుదయం- గురజాడ దృక్కోణం
x
గురజాడ అప్పారావు

మహిళాభ్యుదయం- గురజాడ దృక్కోణం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.


గోపాలకృష్ణ కొవ్వలి


మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు, గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, అవకాశాలు వంటి అంశాలను గుర్తుచేసే రోజు.

తెలుగు సమాజంలో ఈ విలువలను శతాబ్దంన్నర క్రితమే ధైర్యంగా, స్పష్టంగా పలికిన మహానుభావుడు గురజాడ అప్పారావు. ఆయన రచనలు కేవలం సాహిత్య, భాషా వికాస పతాకాలు మాత్రమే కాదు సమాజాన్ని కదిలించిన, మనుషులను మేల్కొలిపిన, మహిళాభ్యుదయానికి మార్గదర్శకమైన విప్లవ వేదవాక్కులు.

కన్యాశుల్కం: మహిళా హక్కుల నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సామాజిక నాటకం

గురజాడ గారి కన్యాశుల్కం (1892) తెలుగు సాహిత్యంలోనే కాదు, భారతీయ సామాజిక చరిత్రలో కూడా ఒక మైలురాయి. ఈ నాటకం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను చాకచక్యంతో కూడిన వ్యంగ్యంతో, ఘాటైన విమర్శతో, మానవతా దృక్పథంతో బహిర్గతం చేసింది.

బాల్యవివాహం, కన్యాశుల్కం, పితృస్వామ్య ఆధిపత్యం

వేశ్యలపై ద్వంద్వ నైతికతవంటి సమస్యలను గురజాడ కేవలం చూపించలేదు, మహిళకు విద్య, స్వేచ్ఛ, ఆత్మగౌరవం అవసర మని పాత్రల వ్యక్తిత్వ ప్రకటనద్వారా నిరూపించారు.

ఆయన పాత్రలు, ముఖ్యంగా మధురవాణి, సంప్రదాయ నైతికతను సవాలు చేస్తూ మహిళా స్వరాన్ని ప్రతిధ్వనింపచేస్తాయి. స్త్రీ విద్యావంతురాలయితే సమస్యలను ఎలా పరిష్కరించుకోగలదో, పరిష్కరించగలదో కమలిని, మధురవాణి పాత్రల ద్వారా చెప్పించాడు గురజాడ. ఇక్కడ విద్యావంతురాలు అంటే డిగ్రీలు పొందిన మహిళ అని కాదు. విద్వత్తు, వినయంతో కూడిన వికాసం చెందిన స్త్రీ అని అర్థం. డిగ్రీలు ఉన్న ఎందరో మహిళలు ఈ నాటి సమాజంలో ఆత్మాహుతి చేసుకోవడం చూస్తున్నాం.

గురజాడ రచనల్లో మహిళా దృక్పథం

గురజాడ రచనలు ఒక స్పష్టమైన మానవతా తత్త్వాన్ని ప్రతిబింబిస్తాయి. “సమాజం పురోగమించాలంటే మహిళ పురోగమించాలి” అన్నది గురజాడ శాస్త్రీయ ప్రతిపాదన.

- విద్యే విముక్తి- మహిళ చదువుకుంటే కుటుంబం, సమాజం, దేశం ఎదుగుతుందని ఆయన నమ్మకం.

- స్వేచ్ఛే శక్తి - మహిళ తన జీవితంపై నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగి ఉండాలి.

- సమానత్వమే సమాజ నైజం - స్త్రీ, పురుషుల మధ్య సమాన హక్కులు అభివృద్ధి హేతువు. ఇవి గురజాడ చెప్పిన ఆదేశసూత్రాలు.

గురజాడ రచనలలో మహిళా శక్తి

గురజాడ రచనల్లో మహిళలు బలహీనులు కాదు.

- ఆలోచించే వారు

- నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ధైర్యంగలవారు

- అన్యాయాన్ని ఎదిరించగలవారు

- సమాజాన్ని మార్చగల చాతుర్యంగలవారు

మధురవాణి వంటి పాత్రలు నేటి మహిళా సాధికారతకు ప్రతీకలు. ఆమె ధైర్యం, స్పష్టత, స్వతంత్రత, సామాజికస్పూర్తి, నేటి యువతికి కూడా ప్రేరణ. అవమానాలు, అసమానతలు అధిగమించి ఉత్తమ మానవులుగా ఎలా పరిణామం చెందగలరో నిరూపించే సామాన్య వనిత. గురజాడ సృష్టించిన మధురవాణి వేశ్య కాదు, ఒక చేతనాత్మక స్త్రీమూర్తిత్వానికి మూలవిరాట్.

నేటి మహిళా దినోత్సవానికి గురజాడ సందేశం

21వ శతాబ్దంలో కూడా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు

- లింగ వివక్ష

- వేతన అసమానత

- హింస

- విద్య-ఉద్యోగాల్లో అడ్డంకులు

- సామాజిక ఒత్తిళ్లు

ఇవన్నీ చూస్తే గురజాడ గారి సందేశం ఇంకా పూర్తిగా నెరవేరలేదని అనిపిస్తుంది.

ఆయన చెప్పే రెండు శాశ్వత పాఠాలు

- మహిళ వస్తువు కాదు, వ్యక్తి

- ఆమె స్వేచ్చాజీవి, ఆమె నిర్ణయాలు ఆమెవే.

గురజాడ రచనలు మనకు ఒక శాశ్వత సత్యాన్ని గుర్తుచేస్తాయి.

“దేశం అంటే భూభాగం కాదు, ప్రజలే దేశం. ప్రజల్లో సగం మహిళలు. వారిని గౌరవించని దేశం ఎదగదు.”

నిష్టూరమైనా, ఇబ్బందికరమైనా, కొన్ని విషయాలు నిష్పక్షపాతంగా ప్రస్తావించుకోవాలి. అప్రస్తుతమనించినా ప్రస్తావనకు సమంజసం అయిన విషయం ఏమంటే గురజాడ ఆశించిన స్త్రీ చైతన్యం చలం ప్రతిపాదించిన విశృంఖలత్వం ఒకటి కాదు. విజ్ఞానంతో, విజ్ఞతతో కూడిన ఆలోచనల సారధ్యంలో క్లిష్ట సమస్యల పరిష్కారం వెదికే దిశగా పయనించే వనిత గురజాడ ఆడపడుచు.

సమానత్వం అనే భావానికి వికృత భాష్యం గ్రహించి చరించే పడతులు నేడు ఎక్కువగా ఉండడం గమనార్హం.

జీవించి జీవించనిచ్చే నియమం సకల జీవరాశులకు చెందినది. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులలో సద్భావనతో, సమభాగస్యామ్యంతో జీవించే ఉదాత్త భావన ఆధారంగా సమానత్వ భావన చెలామణీ అవుతున్నట్టుగా అనిపించడం లేదు. వికృత చేష్టలు, విశృంఖల ఆలోచలలో స్త్రీ పురుష సమానత్వం గురజాడ సమాజ ఆశయం కాదు.

గురజాడ దర్శించిన మహిళ ఉదాత్త వ్యక్తిత్వంతో కూడిన విశేష పయస్విని.

Read More
Next Story