స్త్రీ ఆత్మ గౌరవ పతాక ‘విత్ యువర్ పర్మిషన్’
x

స్త్రీ ఆత్మ గౌరవ పతాక ‘విత్ యువర్ పర్మిషన్’

భార్యా భర్తల మధ్య జరిగే ఎన్నో చేదు సంఘటనలను, దారుణాలను ‘విత్ యువర్ పర్మిషన్’ బహిర్గతం చేస్తుంది.


మారిటల్ రేప్ (Marital Rape) ను వంద దేశాలు నేరంగా పరిగణించాయి. మారిటల్ రేప్ ను, అంటే వైవాహిక అత్యాచారాలను నేరంగా పరిగణించాలా? వద్దా? అని మన న్యాయస్థానాల్లో ఇంకా తర్జనభర్జనలు జరుగుతునే ఉన్నాయి. మారిటల్ రేప్ ను నిషేధిస్తూ చట్టం తీసుకురావాలంటే తొలుత చట్టసభల్లో ఉన్న వారే ఎక్కువ ఇబ్బంది పడిపోయేట్టున్నారు. అందుకే చట్టం తేవాలన్న ఆలోచన వారికి తట్టినట్టు కనిపించడం లేదు. ఈ దశలో మారిటల్ రేప్ పై దేశంలోనే వచ్చిన తొలి నవలగా గీతాంజలి రాసిన ‘విత్ యువర్ పర్మిషన్’ స్త్రీల ఆత్మ గౌరవ పతాకగా నిలిచిపోయింది.


మహిమ ప్రధాన పాత్రగా ఈ నవల సాగుతుంది. ‘‘మహీ నీతో ఉంటే చాలు, నేను కళ్ళు మూసుకుని, గుడ్డివాడిగానైనా సరే నీ చేయి పట్టుకుని నడిచేస్తాను. అంత నమ్మకం నీమీద నాకుంది’’ అన్న బిపిన్ చంద్రకు మహిమ దూరమవుతుంది. బిపిన్ చంద్రను మహిమ పెళ్ళి చేసుకుంటే చెల్లెలు యామినికి పెళ్ళి కుదరదు. నాన్న విషం తాగి చచ్చిపోతానన్నాడు. ఇద్దరి కులాలు వేరుకనుక. ‘నువ్వు నన్ను కలవద్దు. నేనూ నిన్ను కలవను’ అని గుండె రాయి చేసుకుని బిపిన్ నుంచి మహిమ దూరంగా జరుగుతుంది. ఆ తరువాత చరణ్ తో మహిమ వివాహం జరిగిపోతుంది.

మొదటి రాత్రికి ముందే తనకు కొంత గడువు కావాలని చరణ్ కు మహిమ చెపుతుంది. ‘‘సరే’’ అంటాడు. వెంటనే రెండు రోజులైనా కాకుండానే ముహూర్తం పెట్టిస్తారు. ‘‘నిన్ను నేనేం చేయను మహిమ. కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోదాం’’ అన్నాడు. అర్ధ రాత్రి పన్నెండైంది. నిద్రపోతున్న మహిమపైకి చరణ్ ఎక్కేశాడు. ‘‘ఏంటిది చరణ్ లే’’ అంటుంది. ‘‘అమ్మ కూడా ఒప్పుకోవడం లేదు. ముహూర్తం ఉంది ఇప్పుడే. ఇంకో అయిదు నిమిషాల్లో అయిపోవాలిట.’’

చరణ్ ఒళ్లంతా వెంట్రుకలతో నగ్నంగా భల్లూకంలా అసహ్యంగా ఉన్నాడు. తాగిన మైకంలో కళ్ళంతా చింత నిప్పుల్లా ఎర్రబారి ఉన్నాయి. ‘‘ప్లీజ్ చరణ్ వద్దు..నేను సిద్దంగా లేను ఒదిలేయ్’’ అంది. అతను వినలేదు. తన మీదపడి ఘోరంగా రేప్ చేశాడు. రెండు కాళ్ళ మధ్య రక్తం కారడం, నొప్పి తప్ప ఆమెకు ఏమీ తెలియడం లేదు. స్పృహ తప్పింది. స్పృహ వచ్చాక ‘‘యూ బాస్టర్డ్..యూ రేప్డ్ మి.. హౌడేర్ యూ’’ అంటూ అతని ముఖం మీద ఖాండ్రించి ఉమ్మేస్తూ, అవమాన భారంతో బాత్ రూంలోకి వెళ్లి లైజాన్ తాగేసింది. వారం రోజులు ఆస్పత్రిలో శవంలా పడిఉంది.

మహిమకు కావలసింది మోహం కాదు, ప్రేమ, లాలన, గౌరవం, తన దేహానికి మర్యాద, విలువ. ‘‘సెక్స్ కి సిద్ధంగా లేను, వద్దు’’ అంటే వద్దనే అర్థం. భర్త అయినా సరే వద్దన్నాక కూడా చేసేది రేప్ మాత్రమే అవుతుంది. స్త్రీ ఆత్మాభిమాన భావనే కీలకంగా నవల సాగుతుంది. చరణ్ మహిమ ఇంటికి వస్తే ‘‘అమ్మాయితో అంత క్రూరంగా ఎట్లా చేశావు అల్లుడూ’’ అంటూ మహిమ అమ్మా నాన్న చరణ్ ను మందలించారు. నాలుగు నెలల వరకు చరణ్ ని చూడనివ్వదు మహిమ. ఆ ఒక్క సంఘటన తప్ప, మహిమ మళ్ళీ చరణ్ ను చేయివేయనివ్వలేదు.

ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ట్యాంక్ బండ్ పై ఒంటరిగా ఉన్న మహిమకు వరద పరిచయమవుతుంది. వరద ‘స్త్రాంగ్ ఉమన్స్ ఫైట్’ సంస్థను ఏర్పాటు చేసిన న్యాయవాది. పెళ్ళయిన స్త్రీలు భర్తల నుంచి ఎదుర్కొనే లైంగిక హింసను, అత్యాచారాలను ఎలా ఎదుర్కొవాలో, ఎలా బయటపడాలో ఆ సంస్థలో చర్చిస్తారు. మహిమ సంఘటన ఒక్కటే కాదు, మహిమ కంటే ఘోరమైన, దారుణమైన సంఘటనలు ఈ నవలలో దృశ్య మానవమవుతాయి. ‘గే’ లు, లెస్బియన్లు, ట్రాన్స్ జెండర్లు కూడా తమ తమ సమస్యలతో ఈ నవలలో కనిపిస్తారు.



పరిమళ పెళ్ళి కుదిరినప్పటి నుంచి భర్త ప్రేమలో పడిపోయింది. ‘‘వద్దమ్మా ఈ రోజు వద్దు. రెండు రోజులు ఆగి అతగాడితో మాట్లాడాక, కొంచెం బెరుకు పోయాక ప్లీజ్.’’ అన్నా వినిపంచుకోలేదు. ‘‘ఈరోజు రాత్రే ముహూర్తం’’ అన్నారు. ‘‘జ్వరం, ఒళ్ళు నొప్పులు, కడుపుతో తిప్పుతోంది ఈ రోజు వద్దు’’ అన్నా వినిపించుకోలేదు. పరిమళకు పెనుగులాడటమే గుర్తుంది. మరుక్షణం అర్థమైంది తన పై రేప్ జరిగిందని. కాళ్ళ మధ్య కత్తి దిగినట్టయింది. ముడుచుకుపోయి ఏడుస్తోంది. నడుము కింద చీర రక్తంతో తడిసిపోయింది. చీరుకుపోయి కారుతున్న రక్తం. కడుక్కుంటే పోయేదా. పెళ్లైన మరుక్షణం నుంచి భార్యలను తమకు అనుకూలంగా తయారు చేసుకుంటారు. నాన్న, అన్నయ్య, బాబాయ్, మావయ్య, తమ్ముడు, పెదనాన్న, రేపు తనకు కొడుకుపుడితే వాడూ..అంతేగా. దాచేయటాల్లోనే రేప్ అన్నది ఎంత హింసాత్మకమైంది.


పాస్టర్ జాన్ భార్య ఎగ్మెస్. తొలి రాత్రి అతను తాగి గదిలోకి వచ్చాడు. ఎగ్మెస్ ను బరబరా లాక్కొచ్చి మంచం మీద కూలేశాడు. ప్రతిఘటిస్తున్నా బూతులు తిడుతూ, బలప్రయోగంతో రేప్ చేశాడు. ఆ రాత్రి ‘‘నొప్పి చాలా ఎక్కువైంది. వద్దు ప్లీజ్’’ అని చెప్పింది. చెంపలు వాయగొట్టి, కింద పడేసి తన్ని, ఎత్తి మంచంమీద కూలేశాడు. ‘‘దొంగ లంజా.. భర్తను సుఖ పెట్ట లేని నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు’’ అంటూ టార్చ్ లైట్ ను తిరగతిప్పి ఎగ్మెస్ వెజైనాలోకి దూర్చి గుచ్చుతూ పోయాడు. ఆ మంచం ఎగ్మెస్ ను సజీవంగా కాల్చేసే సతీసహగమన కాష్టమైంది. కాకపోతే ఎగ్మెస్ భర్త బతికే ఉన్నాడు. అతను అరెస్టు అయ్యాడు. విడుదలయ్యాడు. ఎగ్మెస్ విడాకులకు దరఖాస్తు చేసుకుంది.

భువన విడాకులు తీసుకున్నాక చాలా సంతోషంగా ఉంది. ఆమె గతంలోకి వెళితే, తొలి రాత్రి ఎనిమిది సార్లు భర్త రేప్ చేశాడు. స్పృహ తప్పి పడిపోయింది. దేహం రక్తమోడుతున్న మాంసం ముద్దలా తయారైపోయింది. భువన జీవితంలో రేప్ ఒక భాగమైపోయింది. పడకగది ఆమెకు వద్యశాలగా మారిపోయింది. మంచం మీంచి లేవనివ్వడు, వాష్ చేసుకుంటానన్నా, మూత్రం పోసుకుంటానన్నా పోనివ్వడు. ఆమె వెజైనా ఎప్పుడూ పచ్చిగానే ఉండేది. ‘‘అసలెందుకు వద్దంటావే నువ్వు..ఎవడైనా ఉన్నడా నీకు..’’ అంటాడు. అతనొక సెక్స్ పర్వర్టెడ్. అబార్షన్ అయిన వారం రోజులకే మళ్లీ సెక్స్ కావాలంటాడు. పుట్టింటి నుంచి తిరిగి భర్త దగ్గరకు దింపడానికి వచ్చిన అన్నయ్యను ‘ఉండరా టీ ఇస్తాను’ అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి హార్పిక్ తాగేస్తుంది.

‘స్త్రాంగ్ ఉమన్స్ ఫైట్’ నిర్వాహకురాలు వరద తండ్రి రిటైర్డ్ జిల్లా జడ్జి, అభ్యుదయ వాది. స్త్రీలు, పిల్లల హక్కులకు సంబంధించి అనేక పుస్తకాలు రాశాడు. ఆ ప్రభావం వరదపైన పడింది. వరద లా చదివింది. లాయర్ గా ప్రాక్టీసు చేస్తున్న తన స్నేహితురాలి అన్న సుధాకర్ ను పిచ్చిగా ప్రేమించి, అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. అమ్మా నాన్న పోయాక సుధాకరే తన లోకమనుకుంది. ఒక సారి టూర్ కెళ్ళి చెప్పిన దానికంటే ముందుగా వచ్చేస్తుంది. తన బెడ్ రూంలో ఏవో శబ్దాలు, మూలుగులు వినిపించాయి. శబ్దం రాకుండా మెల్లగా తలుపు తోసి చూసేసరికి, ఎదురుగా కనిపించిన ఒక దృశ్యం! నిశ్చేష్టురాలైపోయింది. మంచంపైన వరుణ్, సుధాకర్ పూర్తి నగ్నంగా ఉన్నారు. సుధాకర్ వరుణ్ ను వెనుక నుంచి సెక్స్ చేస్తున్నాడు. పక్కనే లాబ్ టాప్ లో అదే దృశ్యం ప్లే అవుతోంది. ‘‘స్టాపిట్’’ అంటూ వరద పెనుకేక వేసింది. దు:ఖం ఆపుకోలేక గుండె పగిలిపోతుంటే బైటికి వచ్చేసింది. తరువాత సుధాకర్ ను నిలేసింద వరద. ‘‘మీ అమ్మకు, నాన్నకు, చెల్లెలికి తెలుసా నీవు ‘గే’ అని. ‘‘తెలుసు’’ అన్నాడు. ‘నేను వరుణ్ లేకుండా బతకలేను. కానీ యు బికమ్ మదర్ విత్ మి’’ అన్నాడు. ‘‘యూ ఛీట్’’ అంటూ అక్కడి నుంచి బయటపడిపోయింది. వరద తల్లి దండ్రులు పోయారు. ఆమె వంటరైపోయింది. మహిళా సంఘాలు, హక్కుల సంఘాలతో కలిసి పనిచేస్తోంది.

విభాత అమ్మ నర్సు. పేదరికానికి తోడు నాన్న తాగుబోతు. కూతుళ్ళ చెడ్డీల్లో చేతులు పెట్టి, రెండు కాళ్ళ మధ్య గట్టిగా గుచ్చేవాడు. చాలా కాలం అమ్మకు చెప్పలేదు. చెల్లి బట్టలు ఉతుకుతుంటే గంజిలా జిగురుగా ఉంది. అమ్మ నిర్ఘాంత పోయింది. ‘‘నాన్నా..నాన్నా..’’ అంటూ చెల్లి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. అమ్మ నిద్రపోతున్న నాన్నను కర్రపుచ్చుకుని బాదుతూ ‘‘ఏంట్రా కుక్కా..ఇదేంటి?. అంది చెడ్డీ చూపిస్తూ. నాన్నను ఒదిలేసి, ఇద్దరు చెల్లెళ్ళను తీసుకుని అమ్మ ఇల్లు మారింది. అమ్మ పోయింది. పురుషుడు అన్నా, అతని దేహం అన్నా విపరీతమైన అసహ్యం, భయం ఏర్పడింది. పెళ్ళి, భర్త అంటే హింసాత్మక జీవితం తప్ప మరొకటి కాదని విభాతకి అర్థమైపోయింది. విభాత, లాయర్ వరద కలిసి లెస్బియన్లుగా జీవిస్తున్నారు.

భర్త సుధాకర్ ‘గే’ అవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన వరద తాను, విభాత కలిసి లెస్బియన్లుగా జీవించడం ఈ నవలలో వైరుధ్యంగా కనిపిస్తుంది. తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సుధాకర్ తనతో కొనసాగుతూ, తొలి నుంచి రహస్యంగా ‘గే’ గా వ్యవహరిస్తూ తనను మోసం చేశాడన్న బాధ తో అతనిపట్ల వ్యతిరేకతే తప్ప, ‘గే’ ల పట్ల, వారి హక్కుల పట్ల ‘స్ట్రాంగ్ ఉమన్ ఫైట్స్’ కు కానీ, దాని నిర్వాహకురాలు వరదకు కానీ వ్యతిరేకత కనిపించదు. లెస్బియన్లది అసహజ లైంగిక ధోరణా, కాదా అన్నది వేరే చర్చ.

పావనికి పద్నాలుగేళ్ళ వయసప్పుడు, ఆమె కంటే పన్నెండేళ్ళ పెద్దవాడైన బావనిచ్చి బలవంతంగా పెళ్ళి చేస్తారు. అతను పెట్టే హింసలు భరించలేక మొదటి భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. పావని పెళ్ళికి అమ్మ వద్దంటే, నాన్న ఆమె కాళ్ళూ చేతులు కట్టేసి, చీకటి గదిలో బంధించాడు. అమ్మకు ఒళ్ళంతా నెత్తుటి గాయాలే. నెలసరి ఉందని అబద్దం చెప్పింది పావని. అంతే రెచ్చిపోయి పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టాడు.ఎత్తి మంచంపైన వేశాడు. విరిగిన పావని చేతితో పాటు మరొక చేతిని కూడా ఆడపడుచు గట్టిగా పట్టుకుంది. ‘‘లంజా ఇంకెన్ని రోజులు వేపుకు తింటావే’’ అంటూ అత్త పావని కాళ్ళు పట్టుకుంది. మొగుడు నోట్లో గుడ్డలు కుక్కి జంతువులా పడ్డాడు. లంగా, బెడ్ షీట్ రక్తంతో తడిసిపోయాయి. పావని స్పృహ తప్పి పడిపోయింది. చచ్చిపోతుందేమోనని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. యోని దగ్గర లోతుగా చీలిపోయింది. ‘‘మొగుడి మాట విని ఉంటే పోయేది కదా’’ అన్నాడు నాన్న. ఎర్రబడ్డ కళ్ళతో నిప్పుని దాచుకున్న కొలిమిలా అనిపించింది అమ్మ. భర్త, అత్త, ఆడబిడ్డ పైన కేసుపెట్టారు. శివంగిలా అమ్మ రాత్రింబవళ్ళు పావనికి కాపలా కాసింది. లా చదివించిన అమ్మ పావనికి ఫీనిక్స్ పక్షిలా కనిపించింది.

ఆమె పేరు అనుసూయ. భర్త మాత్రం ‘బోగం ముండ’ ‘జెష్టా’ అని పిలిచేవాడు. కాళ్ళతో, చేతులతో, బెల్టుతో చితక్కొట్టాక రేప్ చేసేవాడు. మీద నుంచి లేచాక తుపుక్కున ఊసేవాడు. అతనితో సెక్స్ అంటే అసహ్యంగా ఉండేది. వేళ్ళతో తొడల మధ్య గుచ్చడం, తట్టడం చేసేవాడు. మర్మాంగాల్లోకి క్యాండిల్స్ జొనిపేవాడు. ఒక సారి రొమ్ముల మీద సిగరెట్ వాతలు పెట్టి, తొడల మధ్య కారం అద్దాడు. అనుసూయ సహనం చచ్చిపోయింది. నిద్రపోతున్పప్పుడు వాణ్ణి కూడా మంచానికి కట్టేసి కర్రతో చావబాది, వాడి గాయాల మీద కారం అద్దింది. మళ్ళీ అతని దగ్గరకు పోనందుకు ముప్ఫై ఏళ్ళొచ్చిన అనసూయను నాన్న కొట్టాడు. తిరగబడి నాన్నను కొట్టింది. అతని గాయాలపైన కారం అద్దింది. నాన్న ఆ మంటకు కేకలుపెడుతుంటే, ‘‘నీ అల్లుడు నన్ను ఇలాగే కోసి కారం పెడతాడు. అయినా వెళ్ళనా చెప్పు’’ అంది అనసూయ.

అందరి కథ కంటే సుమైరా కథ భిన్నంగా ఉంటుంది. ఆమె వైవాహిక జీవితంలో శారీరక హింస లేదు కానీ, మానసిక హింస ఉంది. ఆమె భర్తకు సెక్స్ అబ్సెషన్. సుమైరా పదవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటికి తిరిగి వస్తుండగా దారుణంగా గాంగ్ రేప్ జరుగుతుంది. లా చదువుతుంటే చదువు మధ్యలో ఆపి నిఖా చేశారు. శోభనం గది తలుపులు తెరుచుకుని ‘‘అమ్మీ..దోఖా హోగై..ఏ బీవీ నక్కో మేరేకె..ఇన్ కో రేప్ హువా..ఏ గంధీ ఔరత్ హై.’’అంటూ అరవడం మొదలుపెట్టాడు. ఆమె ఒక రేప్ విక్టిమ్, నేరస్థురాలు కాదు. అతను చూసే చూపులు రేప్ కంటే భయంకరంగా ఉన్నాయి. అమ్మీని అబ్బా ‘ఆప్..’ ‘జీ..’ అంటూ గౌరవిస్తాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. బంధువుల్లో అమ్మని ఎవరు ఏమన్నా ఖబడ్దార్ అని హెచ్చరిస్తాడు. సుమైరా హీరో ఆమె అబ్బానే. మగాళ్ళు అలా ఉండాలనుకుంటుంది.

ఇలా ఉండగానే సుమైరాకు మరొక సంబంధం కుదిరింది. అతనూ రెండవ పెళ్ళి వాడే. గర్భవతి అని కూడా చూడకుండా అతనికి ప్రతిరోజూ సెక్స్ కావాలి. లేకపోతే పిచ్చెక్కిపోతుంది. గర్భ సంచిని టైట్ గా కుట్టి, పాపాయి జారకుండా ఆపరేషన్ చేసి బెడ్ రెస్ట్ తీసుకోమంటే, పాపాయి చనిపోతుందని కాళ్ళా వేళ్ళా పడ్డా కూడా రేప్ చేశాడు. పాపాయిని చంపేశాడు. డాక్టరమ్మ వాడి చెంపలు పగలకొట్టేసింది. ‘‘అంత మంది మగాళ్ళని భరించినదానివి నన్నొక్కడినీ భరించలేవా?’’ వంటి మాటలతో హింసించాడు. లాయర్ వరద ద్వారా విడాకులకు దరఖాస్తు చేసుకుంది.

ముస్లింలలో బోహ్రా కమ్యూనిటీకి చెందిన జోయాది, కూతురు దరియాది లవి అందరి కథలకంటే దయనీయమైనవి. బాంబే మోహ్రామొహల్లాలో జోయా పుట్టి పెరిగిన పాత అపార్ట్ మెంట్ లో చీకటి నిండిన ప్లాట్ లోకి ఆమెను తీసుకెళ్ళారు ఐస్ క్రీం తినిపిస్తామని. నలుగురు మొగవాళ్ళు ఆమెను నాలుగు వైపులా కమ్ముకున్నారు. ఆమెను టేబుల్ పైన బలవంతంగా పడుకోబెట్టారు. చేతులు విరిచిపట్టుకున్నారు. ఇద్దరు కాళ్ళు విడదీశారు. ఒక ఆడ మనిషి చేతికి బ్లేడ్ తీసుకుని ఆమె కాళ్ళ మధ్యకు ఒంగింది. జోయాది భయంకరమైన నొప్పితో స్పృహ తప్పింది. రెండు కాళ్ళూ కలిపి కట్టేశారు. రక్తంతో బట్టలు తడిసిపోయాయి. పద్నాలుగు రోజులు అలాగే పడుకుండిపోయింది. పద్నాలుగో రోజు అంతా దావత్ చేసుకున్నారు. తన కూతురు దరియాకు అత్తింటి వారే ఖత్నా చేసి నిఖా చేసుకున్నారు. తల్లి జోయాది ఆపలేకపోయింది. దరియా కూతురు చిన్నారి ఆఫ్రీన్ ను మాత్రం ఈ దురాచారం నుంచి ఆ తల్లీ కూతుళ్ళు కాపాడగలిగారు.

నూరున్నిసా ప్రతి ఏడాది కడుపులో ఒక బిడ్డ, చంకలో ఒక బిడ్డ మోయలేక అత్త కాళ్ళ మీద పడి ఏడ్చింది. ఆరుగురు పిల్లలు పుట్టాక కూడా ప్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించలేదు. భర్తకు మరో స్త్రీతో సంబంధాలు. ‘‘నీ పొట్ట ఎప్పుడూ ఎత్తుగా ఒక వింత జంతువులా ఉంటావు. నీ రొమ్ముల్ని చీకుతూ ఇంకో బిడ్డ. ఛీఛీ నీ మీద కోరికే కలగడం లేదు. పైగా నీది లూజ్ అయిపోయింది. నీతో సెక్స్ ఆనందమే లేదు. బేషరం ఔరత్’’ అంటూ ఆమె చెంప పగలకొట్టాడు. నూరున్నిసా ఎవరికీ తెలియకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంది. లూజ్ అయ్యిందంటే కుట్లేయించుకుంది. నెలకే ‘‘ఛీ వదులైపోయావు’’ అని కాళ్ళతో తన్ని వెళ్ళిపోయాడు. ఆ తన్నులకు చెయ్యి విరిగిపోయింది. ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ కాక ముందే పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది.

మమత పరిస్థితి మిగతా అందరికంటే పూర్తి భిన్నమైంది. సాత్విక్ పురుషుడుగా పుడతాడు. అతను పెరుగుతున్నకొద్దీ స్త్రీ హావభావాలు, అక్కలతో పాటు పడుకోవడం, వాళ్ళ దుస్తులు వేసుకోవడం చూసి తండ్రి చావ కొట్టేవాడు. ఇంట్లోంచి వెళ్ళిపోయి సెక్స్ మార్పిడి చేసుకుని మమతగా మారతాడు. మమత డ్యాన్సర్ గా సంపాదించడం మొదలుపెట్టింది. అరుణ్ తో పరిచయమై పెళ్ళి చేసుకుంటుంది. రెండు నెలలకే అరుణ్ లో మార్పు కనిపించింద. మమత డబ్బు ల కోసమే అరుణ్ పెళ్ళి నాటకమాడాడు. సెక్స్ చేసేటప్పుడు మమతను ఒక జంతువులా భావించేవాడు. రేప్ చేసేవాడు. అరుణ్ లేనప్పడు వేరే వాళ్ళను మమత దగ్గరకు పంపించేవాడు. అనేక రేప్ లు జరిగాయి. అరుణ్ పైన కట్నం కోసం వేదిస్తున్నాడని కేసు పెట్టింది.

‘‘కొజ్జా లంజా..మీరు చేసేదే వ్యభిచారం కదే.కేస్ పెట్టాలా..ఎక్కడి నుంచి రేప్ చేశాడో చెప్పు. అంటూ ఎస్సై మమత చీర పైకెత్తి రెండు కాళ్ళ మధ్య లాఠీ గుచ్చి దారుణంగా కొట్టాడు. రెండేళ్ళు ఇలాంటి చిత్ర హింసలు అనుభవించి ‘స్ట్రాంగ్ ఉమన్స్ ఫైట్’ సంస్థ దగ్గరకు వచ్చింది మమత. ‘స్టాంగ్ ఉమన్స్ ఫైట్’ సంస్థలో ఇలా అనేక ఆవేదనలు ‘విత్ యువర్ పర్మిషన్’ నవలలో వినిపిస్తాయి. మహిమ ఒక రచయిత్రిగా ఈ సంఘటలన్నిటినీ తన కథలకు ముడిసరుకుగా నమోదు చేస్తుంది. ఇన్ని దారుణాలు, ఇందరి విషాదాలు నవలలో చూపించడం సాధారణ విషయం కాదు.

మహిమ కోలుకున్నాక పుట్టింటికి, అత్తారింటికి మధ్య రాయబారాలు నడుస్తాయి. మహిమ పుట్టింట్లోనే ఉంటే ఆమె చెల్లెలు యామిని పెళ్ళి కాదని, చరణ్ చెల్లెలు శరణ్య పెళ్ళి కూడా సమస్యగా తయారవుతుందని చరణ్ వైపు నుంచి బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లు. పంచాయితీలో మహిమ చరణ్ దగ్గరకు వెళ్ళక తప్పలేదు. ‘‘శాంతంగా ఉండడం నేర్చుకో. అన్నీ అవే సర్దుకుంటాయి’’ అంది నాయనమ్మ. ‘‘అయ్యో నా మహీ..నా బంగారూ..నీకేమైనా అయితే ఒక్కక్షణం ఉండబాకు. వెంటనే నా దగ్గరకు వచ్చేసేయ్’’ అంది అమ్మమ్మ. ‘‘అవును అమ్మమ్మా రేపిస్టుతో నేను సంసారం చేయను. అది అవమానం నాకు.. చరణ్ సంసారం చేయడానికి అర్హత లేనివాడు’’ అంటుంది మహిమ.

‘‘నీ లిమిట్ లో నువ్వుండు. నువ్వు నన్ను ముట్టుకోవడం నా కిష్టం ఉందా లేదా కనుక్కోవా? నేను నో అంటే నో అంతే..’’ అని మహిమ బెదిరించింది. చరణ్ వాలంటైన్స్ డేకి మహిమను ఒక హోటల్ కు తీసుకెళతాడు. మహిమ చేతిని బలంవంతంగా లాక్కుని ఉంగరం తొడుగుతాడు. ‘‘ఐ లవ్ యూ’’ అంటూ మహిమ ముందర ఒంగి నోట్లో స్వీట్ పెట్టబోతాడు. ‘‘యూ బిచ్’’ అని తిట్టిన నోటితోనేనా చరణ్ ఈ మాటంటున్నది అని మహిమ ఆశ్చర్య పోతుంది. ఇంటికొచ్చాక చరణ్ తొడిగిన ఉంగరానిన విసిరి కొడుతుంది.

‘‘పురుషులకు భార్యను రేప్ చేసే వెసులు బాటు ఆర్టికల్ 21 కల్పిస్తుంది. అది స్త్రీ హక్కులను కాలరాస్తోంది. పెళ్ళి అయ్యాక భర్త భార్యను రేప్ చేయడం నేరం కాదని ఛత్తీస్ కోర్టు చెప్పింది. కానీ, అది నేరమే అని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. శృంగారం దంపతుల మధ్య సాన్నిహత్యం, ప్రేమకు సంబంధించిందని తీర్పు చెప్పింది’’ అంటుంది మహిమ.

చరణ్ , మహిమ విడిపోతారు. మహిమ ఎప్పటి లాగే ఆ రోజు ‘స్ట్రాంగ్ ఉమన్స్ ఫైట్’ సంస్థ కార్యాలయానికి వస్తుంది. అక్కడ మహిమ పుట్టిన రోజు ఏర్పాట్లు చాలా సాదాసీదాగా జరిగాయి. అప్పటికే మహిమ అమ్మ, అమ్మమ్మ, నాన్న, చెల్లెలు యామిని, ఆమె భర్త కిరణ్ అక్కడ ఉన్నారు. ఆమెలో రేప్ బాధితుల పోరాటాలు, విజయాలు ధైర్యాన్ని నింపి, ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్’ (బాధాకరమైన అసమతౌల్యత) నుంచి బైటపడేశాయి. ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో’ అన్న రవీంద్ర నాథ్ టాగోర్ కవితను మహిమ చదువుతుంది. చప్పట్లతో హాలు మారుమోగిపోతుంది.

కలకత్తాలో ఉన్న బిపిన్ నీ కోసమే ఉన్నాడని, అతని ఇంట్లో వాళ్ళంతా నిన్ను ఎంతో ఇష్టపడుతున్నారని వరద మహిమకు చెపుతుంది. కలకత్తాలోని బిపిన్ చంద్రకు మహిమ రాసిన ఉత్తరానికి స్పందనగా అతని నుంచి మహిమకు లేఖ వస్తుంది. కలకత్తాలో జరిగే బంగ్లా సంగీత్ సమ్మేళన్ కు రమ్మని రాస్తాడు. మహిమ కలకత్తా బయలుదేరుతుంది. సంతోషమో, ఉద్వేగమో తెలీని అనుభూతికి లోనవుతుంది. ఆ సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదిస్తూ మంత్రముగ్దు రాలైపోతుంది.

మహాశ్వేతా దేవి ఇంటినే మ్యూజియంగా మర్చారు. ఆ ఇంటి ముందు ఆమె నితువెత్తు చిత్ర పటం. మహాశ్వేతాదేవిని చూడలేకపోయినా, ఆమె ఇంటిని దర్శించడం ఆమె నివసించిన ఇంటిని దర్శించడం గొప్ప అనుభూతి కలిగింది. ఇంటిలోనికి అడుగుపెడుతుంటే ఉద్వేగానికి లోనై హృదయం లయ తప్పింది. ‘‘నా భర్త నుంచి విడిపోయాక నేను చాలా స్వేచ్ఛను అనుభవించాను. నేను దేనికీ బాధ్యత పడాల్సిన అవసరం అనిపించలేదు. ప్రశాంతంగా రాసుకోగలుగుతున్నాను’’ అని మహాశ్వేతా దేవి అక్కడి డాక్యుమెంటరీలో గంభీరంగా చెపుతోంది.

బిపిన్ చంద్ర ఇంటికి రాగానే అతని తల్లి సుచిత్రా దేవి మహిమతో ‘‘దేఖో మహిమా బేటీ బిపిన్ షాదీ కబ్ కరోగీ..డైవర్స్ హోకర్ ఏక్ సాల్ హోగయానా..షాదీ కర్ లో..’’ అంటుంది. మహిమ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కలకత్తాలోని హుబ్లీ నది సమీపంలో పార్క్ దగ్గర నడుస్తూ మహిమ వేళ్ళ మధ్య తన వేళ్ళనుపెట్టి, ‘‘విల్ యూ మ్యారీ మి’’ అంటాడు. ‘‘యస్ ఐ విల్’’ అంటుంది మెల్లగా. ‘‘విత్ యువర్ పర్మిషన్’’ అంటాడు. దేనికంటుంది మహిమ. ‘‘ఐ వాంట్ టు కిస్ యు’’ అంటాడు చరణ్. ‘‘యస్ యు కెన్ కిస్ మి’’ అంది సిగ్గు పడుతూ. నవల ఇలా ఒక ప్రేమ కావ్యంలా ముగుస్తుంది.

భార్యా భర్తల మధ్య జరిగే ఎన్నో చేదు సంఘటనలను, దారుణాలను ‘విత్ యువర్ పర్మిషన్’ బహిర్గతం చేసింది. ఒక మారిటల్ , సైకో తెరపిస్ట్ గా రెండు దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేస్తున్న గీతాంజలి(డాక్టర్ డి. భారతి) వద్దకు వచ్చే రోగుల జీవన వ్యథలతోనే ఈ నవలలోని పాత్రలను తీర్చి దిద్దారు. మనం గమనించాలే కానీ, మన ఇళ్ళలో ఉండే మనుషుల స్వభావాలన్నీ మహిమ కుంటుంబ సభ్యుల్లో కనిపిస్తాయి. సమాజంలో ఉండే స్త్రీ పురుషుల భావోద్వేగాలన్నీ ఈ నవలలో ప్రత్యక్షమవుతాయి. ఇందులో మహిమ పాత్ర గీతాంజలి కాకపోయినప్పటికీ, తన ఆదర్శాలను, అభిరుచులను పోత పోసి మహిమ పాత్రను చాలా అందంగా, దాన్నొక అద్భుతమైన నవలగా గీతాంజలి తీర్చి దాద్దారు.


Read More
Next Story