
'మన్యం'లో గజరాజుల ధ్వంస రచన ఆగేదెప్పుడు?
ఏళ్ల తరబడి పంటల నష్ట పరిహారం కూడా అందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం బంగారంపేటకు చెందిన అల్లు అప్పలనాయుడుకు ఆరెకరాలు కౌలు భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో వరి ఎకరం, పత్తి మూడు, మినుము రెండెకరాల్లోనూ వేశాడు. ఐదేళ్ల క్రితం ఏనుగుల గుంపు వచ్చి ఆ పంటలను ధ్వంసం చేశాయి. ఇప్పటివరకు ఆ రైతుకు పరిహారం అందలేదు. దీంతో ఆయన వ్యవసాయాన్ని వదిలి వేరొకరి వద్ద గుమస్తాగా చేరాడు.
కొమరాడ మండలం కౌలు రైతు కొల్లి సాంబమూర్తి రెండెకరాల వరి చేను, ఎకరం జీడి తోటను 2022లో గజరాజులు నాశనం చేశాయి. అధికారుల చుట్టూ అప్పట్నుంచి తిరుగుతున్నా ఆయనకూ ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం ఇవ్వలేదు.
ఇలా వీరిద్దరివే
వీరిద్దరివే కాదు.. ఆ జిల్లాలో పలువురి రైతుల పంటలను మదపుటేనుగులు ఏడాది పొడవునా ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. రైతులకు తీవ్ర నష్టాలను మిగిలిస్తూనే ఉన్నాయి. వీరిలో కొద్దిమంది మాత్రమే పంట నష్ట పరిహారాన్ని పొందుతున్నారు. మరికొందరు ఏళ్ల తరబడి పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. గడచిన పదేళ్లలో ఈ ప్రాంతంలో సుమారు మూడు వేల ఎకరాల్లో పంటలను నాశనం చేసినట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అడొచ్చిన వారిని ఈ ఏనుగులు హతమారుస్తూనే ఉన్నాయి. ఇలా ఈ ప్రాంతంలో ఏడెనెమిదేళ్లలో 13 మందిని ఈ ఏనుగులు హతమార్చాయి. దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలో అటవీ ప్రాంతానికి అనుకుని ఉన్న కొమరాడ, పాలకొండ, సీతంపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, బలిజపేట మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
పదేళ్ల నుంచి మరింత తీవ్రతరం..
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బెడద ఈనాటిది కాదు. ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా అక్కడ పరిస్థితి మాత్రం ఏమాత్రం మారడం లేదు. ఆ ప్రాంతంలో రైతులు అరటి, చెరకు, బొప్పాయి, వరి, పామాయిల్ తదితర పంటలు పండిస్తున్నారు. అక్కడి భూములు సారవంతమైనవి కావడంతో వాణిజ్య పంటలకు అనువుగా ఉంటుంది. పదేళ్ల క్రితం వరకు ఏనుగులు అలజడి అంతంతమాత్రంగా ఉండేది. కానీ ఆ తర్వాత నుంచి వీటి విజృంభణ అధికమైంది. పొరుగున ఉన్న ఒడిశా నుంచి వచ్చిన పది ఏనుగులు మన్యం జిల్లా అటవీ ప్రాంతంలోనే తిష్టవేశాయి. అక్కడ నుంచి తిరిగి ఒడిశా అడవులకు వెళ్లకుండా మన్యం జిల్లాలోని ఊళ్లు, పంటల మీద పడుతున్నాయి. ఏనుగులకు ఎంతో ఇష్టమైన చెరకు, అరటి, బొప్పాయి, వరి వంటి పంటలు ఏడాదంతా పండుతుండడంతో ఈ ప్రాంతం వాటికి ఎంతో అనువుగా మారింది. దీంతో ఇవి ఈ ప్రాంతాన్నే అనువైన ఆవాసాలుగా మార్చుకున్నాయి. అక్కడే మకాం పెట్టుకుని ధ్వంస రచనను కొనసాగిస్తున్నాయి.
కొమరాడలో ఏనుగులు ధ్వంసం చేసిన అరటి పంట మన్యం
ఆ తొమ్మిది ఏనుగులదే హవా!
ఈ అటవీ ప్రాంతంలో చాన్నాళ్లు పది ఏనుగులు అలజడి సృష్టించాయి. వీటిలో ఒక మగ (హరి) ఏనుగు కాగా తొమ్మిది ఆడ ఏనుగులు. మగ ఏనుగు హరి రెండేళ్ల క్రితం ఒడిశా అడవులకు వెళ్లిపోయి ఇక తిరిగి రాలేదు. హరి పోతూపోతూ మూడు ఆడ ఏనుగులతో సంపర్కం జరపడంతో అవి మూడింటికి జన్మనిచ్చాయి. వీటిలో రెండు మగ ఏనుగు కూనలు కాగా ఇటీవల పుట్టిన ఏనుగు పిల్ల ఆడో, మగో ఇంకా నిర్ధారణ కాలేదు. ఇలా తల్లి ఏనుగులన్నీ పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. గుంపులుగా వస్తున్న వీటిని స్థానిక గ్రామస్తులు గాని, రైతులు గాని ఎదురించే సాహసం చేయలేకపోతున్నారు. ఎవరైనా ధైర్యం చేస్తే వారిని వెంటాడి చంపేస్తున్నాయి.
మూడు వేల ఎకరాల్లో పంట ధ్వంసం..
అటవీ శాఖ అధికారుల అంచనా ప్రకారం గడచిన ఏడెనిమిదేళ్లలో పార్వతీపురం ప్రాంతంలో సుమారు మూడు వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఫలితంగా రూ. మూడు కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. ఇక్కడ విధ్వంసం సృష్టిస్తున్న ఏనుగులను ఒడిశా అడవుల్లోకి తరిమివేసేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను తీసుకొస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ అదేమీ కార్యరూపం దాల్చడం లేదు. రెండు నెలల క్రితం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. అలా తెచ్చిన వాటిలో పార్వతీపురం మన్యానికి కూడా తీసుకొస్తారని బాధిత రైతులు ఆశపడ్డారు. కానీ ఇప్పటివరకు ఒక్క కుంకీ ఏనుగును కూడా తీసుకురాలేకపోయారు. సాంకేతిక కారణాలతో కుంకీలను సత్వరమే తీసుకురావడం సాధ్యం కాలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈలోగా ఏనుగుల దండు పంటలను నాశనం చేస్తూనే ఉన్నాయి. కుంకీ ఏనుగులను త్వరలోనే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని అటవీ శాఖ అధికారులు కొన్నాళ్లుగా చెబుతున్నా అది ఆచరణకు నోచుకోకపోవడంపై బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుణ్యం కట్టుకుని కుంకీ ఏనుగులను రప్పించి ఇక్కడ తిష్టవేసిన మదగజాలను శాశ్వతంగా తరిమి వేసేలా చర్యలు తీసుకోవాలని వీరు వేడుకొంటున్నారు.
పంట నష్టం అంచనా వేయడం లేదు..
'ఏనుగుల దాడిలో జరిగిన పంట నష్టాన్ని అధికారులు వచ్చి అంచనా వేయడం లేదు. అంతేకాదు.. తామెన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదు. నా రెండెకరాల (ఎకరం వరిచేసు, ఎకరం జీడితోటను) పంటను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఇప్పటివరకు పంట నష్ట పరిహారం అందలేదు. ఏనుగుల విధ్వసం ఆగడం లేదు. నాలా చాలామంది రైతులది ఇదే పరిస్థితి. అని కొమరాడకు చెందిన రైతు కొల్లి సాంబమూర్తి ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఐదేళ్ల క్రితం నష్టం జరిగినా..
నేను కౌలు రైతుని. ఐదేళ్ల క్రితం ఎకరం వరి, మూడెకరాల పత్తి, రెండెకరాల మినుము పంటను ఏనుగులు నాశనం చేశాయి. ఇప్పటిదాకా పంట నష్టపరిహారం ఇవ్వలేదు. అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేదు. అప్పుల పాలయ్యాను. దీంతో వ్యవసాయం మానేసి వేరొకరి వద్ద గుమస్తాగా చేరాను. మా ప్రాంతంలో ఇంకా ఎంతోమంది రైతులు ఏనుగుల బాధితులు, పంట నష్టపరిహారం అందని వారు ఉన్నారు. డొంకాడ త్రినాథ్, దొడ్డి సింహాచలం లాంటి బాధిత రైతులు మరణించారు. అటు ఏనుగుల ధ్వంసాన్ని ఆపలేకపోతున్నారు. ఇటు పంట నష్ట పరిహారాన్ని అందించలేకపోతున్నారు' అని కొమరాడ మండలం బంగారంపేటకు చెందిన కౌలు రైతు అల్లు అప్పలనాయుడు 'ద ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి చెప్పాడు.
కౌలు రైతు అల్లు అప్పలనాయుడు
రూ.46 లక్షల పరిహారం చెల్లించాం..
'జిల్లాల పునర్విభజన తర్వాత గత ఏడాది వరకు పార్వతీపురం మన్యం జిల్లాలలో ఏనుగుల ధ్వంసం చేసిన పంటలకు రూ.46 లక్షలు పరిహారంగా చెల్లించాం. ఇంకా మరో రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంది. రైతుల నుంచి పంట నష్టం పరిహారం కోసం దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ఇంకా ఎవరైనా పరిహారం రానివారు రేంజ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పరిహారం అందేలా చూస్తాం' అని పార్వతీపురం మన్యం జిల్లా అటవీ శాఖాధికారి ప్రసూన 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.