
CPI Symbol
కొడవలి పదునెందుకు తగ్గింది? సీపీఐ చివరికిలా మిగిలిందా?
ప్రజల్లో భాగమైతేనే పార్టీకి విలువ, ఐక్యతకు పునాది
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత జయంతి ముగింపు ఉత్సవాలకు కమ్యూనిస్టుల ఎర్రకోట ఖమ్మం ముస్తాబైంది. 2026 జనవరి 18న ఖమ్మం ఖిల్లా ఎరుపెక్కనుంది. నూరేళ్ల పండక్కి జనం ప్రత్యేకించి కమ్యూనిస్టు శ్రేణులు బాగానే కదం తొక్కనున్నాయి.
శత వార్షికోత్సవాల ర్యాలీ తర్వాత మూడు రోజుల పాటు జరిగే సీపీఐ జాతీయ సమితీ సమావేశాలు, ఇతర కార్యక్రమాలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శులు డి.రాజా, ఎం.ఏ.బేబీ సహా 40 దేశవిదేశాలకు చెందిన వామపక్ష పార్టీల నేతలు పాల్గొనబోతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా, కాలపరీక్షకు తట్టుకుని ప్రస్తుత సంక్షోభ సమయంలో రెపరెపలాడుతున్న సీపీఐ, ఈ ముగింపు సభ నుంచి ఏమి పిలుపివ్వబోతోందన్నది ఇప్పుడు అందరూ ఎదురూ చూస్తున్న అంశం.
సుసంపన్న చరిత్ర...
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి సుసంపన్న చరిత్ర ఉంది. 1917 నాటి రష్యా విప్లవం ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ విప్లవ కెరటాలు…
నదీనదాలను, హిమాలయాలను దాటి బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశాన్నీ తాకాయి. వందేళ్ల కిందట ఆంగ్లేయుల పాలన కాలంలో భారతదేశంలో పరస్పర విరుద్ధమైన రెండు సిద్ధాంతాలు- సంస్థల రూపంలో అవతరించాయి. ఒకటి భారత కమ్యూనిస్టు పార్టీ మరొకటి – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. దేశ విముక్తి పోరాటంతో ఏ సంబంధం లేని RSS ఈరోజు అసాధారణ శక్తిగా ఎదగ్గా త్యాగాల పునాదుల మీద పుట్టిన CPI తుపానులో చిక్కిన నావలా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఈ విరుద్ధ గమనాల మధ్య సీపీఐ వందేళ్ల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకోవడం, మున్ముందు ఏమి చేయాలనుకోవడమే ఇక్కడ ప్రధానం. చరిత్రకారుడు సుమిత్ సర్కార్ చెప్పినట్టు-- భారత కమ్యూనిజం వేర్లు జాతీయ ఉద్యమం నుంచే పుట్టాయి. 1924,25ల నాటికి భారతదేశంలో
ఒక బలమైన వామపక్ష ధార ఉద్భవించింది.
1925 కాన్పూర్ డిసెంబర్ 26 నుంచి 28 జాతీయ సదస్సు నిర్వహించాలని బొంబాయికి చెందిన శ్రీపాద్ అమృత్ డాంగే, విప్లవకారుడు సత్యభక్త్ లాంటి వాళ్లు అనేకమంది అనుకున్నారు. దాదాపు 500 మంది ప్రతినిధుల సమక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అధికారికంగా అవతరించింది.
మౌలానా హస్రత్ మోహాని మాటల్లో – “కమ్యూనిజం రైతులు, కార్మికుల ఉద్యమం. సంపూర్ణ స్వాతంత్ర్యమే మా లక్ష్యం.” లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదం హడలెత్తింది. ‘బోల్షెవిక్ ప్రమాదం’పై నిఘా పెరిగింది. కాన్పూర్, మీరట్, లాహోర్, పెషావర్ కుట్రకేసులు, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, కోర్టులు, కఠినకారాగార శిక్షలు, నిషేధాలు షరా మామూలయ్యాయి.
లాహోర్ కేసులో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు ఉరి కంభం ఎక్కారు. ఉరి తప్పించుకున్న అజయ్ ఘోష్ ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. కమ్యూనిస్టు అనుబంధ సంస్థలు- AITUC, కిసాన్ సభ, IPTA, AISF వంటివి అనేకం పుట్టాయి. వామపక్ష ఆలోచనలు దేశమంతా విస్తరించాయి. సీపీఐ అగ్రనేత పీసీ జోషి చెప్పినట్టు “జాతీయ పోరాటమే అతిపెద్ద వర్గ పోరాటం” అయింది. స్వాతంత్ర్యం సిద్ధించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున సాగి ఆగింది.
1951–52 పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. CPI దేశంలో రెండో పెద్ద పార్టీ. ఇక అధికారమే తరువాయి అనుకునే దశ.. కుట్రలు, కుతంత్రాలు మొదలు.. 1964 వరకు 3 లోక్‌సభల్లో ప్రధాన ప్రతిపక్షం సీపీఐ. 1957లో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం.. ప్రపంచం నివ్వెరపోయింది. 1959లో కేరళపై కాంగ్రెస్ కుతంత్రం.. EMS నంబూద్రిపాద్ ప్రభుత్వం బర్తరఫ్. రాష్ట్రపతి పాలన.
కమ్యూనిస్టు పార్టీ ఆలోచనా ధోరణుల్లో మార్పు మొదలైంది. మార్క్స్., ఏంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో.. మొదటి ముగ్గురు అందరికీ ఓకే.. చివరి రెండింటిలో తేడా.. వ్యూహాల మార్పు.. నిషేధాల మధ్య పార్టీ సభ్యత్వ పతనం.
పార్టీలో తొలి చీలిక...
1964లో CPI మహా చీలిక, CPI(M) అవతరణ జరిగింది. 1990లలో సోవియట్ యూనియన్ పతనం నాటికే ఇండియాలో కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడా పరిస్థితి మరింత తీవ్రస్థాయికి చేరింది. బీహార్, బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ వంటి కమ్యూనిస్టు కోటలు బదాబదలయ్యాయి. అసెంబ్లీలలో ప్రాతినిధ్యమే కరవైంది. కేరళలో సీపీఎం అధికారంలో ఉంటే సీపీఐ భాగస్వామిగా మిగిలింది.
ఓ సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీని ఎన్నికల సంఖ్యలతోనే కొలవాలా? అవసరం లేకపోవచ్చు గాని బలపడాల్సిన అవసరమైతే ఉంటుంది.
కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గబట్టే ఇవాళ మతోన్మాద, సంకుచిత, విధ్వంసకర శక్తులు విజృంభించాయనేది నిజం. వాటిని కట్టడి చేయాల్సిన కమ్యూనిస్టులు ఇవాళ కురచబారిపోయారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక అనేక సార్లు చారిత్రక తప్పిదాలు చేశామని బహిరంగంగా చెప్పుకోవాల్సిన స్థితి..
వామ–ప్రజాస్వామ్య ఐక్యత: ఒక వ్యూహం, ఒక వాదన
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన చీలికలు పీలికలైన కమ్యూనిస్టులు ఇప్పుడు చెబుతున్న మాట వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత. కొత్తదేమీ కాదు. 45,50 ఏళ్లుగా వింటున్నదే. కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, కొన్ని మార్క్సిస్ట్, లెనినిస్టు గ్రూపుల- రాజకీయ ఆలోచనల్లో ఇదో వ్యూహాత్మక, సైద్ధాంతిక కార్యాచరణ భావన.
ఈ “వామపక్ష–ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత” అంటే ఏమిటి? ఇది ఎన్నికల ఒప్పందమా? ప్రజా ఉద్యమాల సమాహారమా లేక దేశ రాజకీయ దిశను మార్చాలనే వ్యూహమా? దేశంలో వామపక్ష భావజాలం ఉన్న ప్రజాస్వామ్య–లౌకిక శక్తులన్నిటిని ఒక తాటిపైకి తెచ్చి కూటమిగా ఉంచడం దీని లక్ష్యం. ఎన్నికలప్పుడే కాకుండా ఇతరత్రా ఉద్యమాల్లోనూ కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలతో సమైక్య సామాజిక ఉద్యమాలు నిర్వహించడం ఉద్దేశం.
ఈ ఐక్యత లక్ష్యాలు ఏమిటి?
మొదటిది- దేశంలో బూర్జువా–భూస్వామ్య పార్టీల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం. వీటి ప్రైవేటీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రతిఘటించడం. రెండోది- సామాజిక దోపిడీకి, మతతత్వ రాజకీయాలపై పోరాటం, ప్రత్యేకంగా RSS–BJP ముందుకు తెచ్చిన హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడడం. కుల, మత, లింగ వివక్ష, అసమానత వంటి సమస్యలను రాజకీయ అజెండాగా మార్చడం.
మూడోది- సామాజిక న్యాయం, లౌకికత్వం, భూ సంస్కరణలు, కార్మిక హక్కులు, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం వంటి సమస్యలపై పోరాడడం. ప్రజాస్వామ్య విప్లవం లేదా సామ్యవాద సమాజం వైపు దేశాన్ని నడిపించడం లక్ష్యం.
ఈ ఐక్యత కేవలం ఎన్నికల కోసమే కాదు. ఎన్నికలు లేనప్పుడు కూడా నిరంతర ప్రజా పోరాటాల ద్వారా కింది స్థాయిలో వివిధ సామాజిక శక్తుల సమతుల్యతను కాపాడడమే దీని లక్ష్యం. ఇందులో పాల్గొనే వామపక్ష పార్టీలు తమ సొంత సిద్ధాంతాలను, గుర్తింపును కాపాడుకుంటూనే ఇతర ప్రజాస్వామ్య శక్తులతో సహకరిస్తాయి.
1988లలో “వామపక్ష, లౌకిక శక్తుల ఐక్యత”, తర్వాత “వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యత”, యునైటెడ్ ఫ్రంట్ పతనం తరువాత “మూడో ప్రత్యామ్నాయం”, ఇప్పుడు ఇండియా (Indian National Developmental Inclusive Alliance (I.N.D.I.A.) కూటమి. జాతీయస్థాయి ఫ్రంట్ లతో పాటు రాష్ట్రాలలోనూ వేర్వేరు కూటములు ఉన్నాయి. కేరళలో ఎల్.డి.ఎఫ్. (Left Democratic Front), బెంగాల్, త్రిపురలో ఎల్.ఎఫ్. (లెఫ్ట్ ఫ్రంట్), బీహార్ లో మహాఘటబంధన్ (Mahagathbandhan), తమిళనాడులో లౌకిక ప్రగతిశీల శక్తుల సంఘటన (Secular Progressive Alliance), మణిపూరులో Manipur Progressive Secular Alliance, మహారాష్ట్రలో Maha Vikas Aghadi, ఆంధ్రాలో లెఫ్ట్ ఫ్రంట్ అని ఓసారి, తృతీయ ఫ్రంట్ అని మరోసారి, తెలంగాణలో సీపీఎం వారి Bahujan Left Front (BLF) (ఇందులో సీపీఐ లేదు, ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ తో పొత్తు)..
ఈ ప్రయాణమంతా సులువు కాదు...
నిజంగానే ఈ ప్రయాణం సులభం కాదు. సిద్ధాంత విభేదాలు, అనుకూల మిత్రుల మధ్య ఊగిసలాట, సొంత బలం పెంచుకోవాల్సిన అవసరం… ఇవన్నీ ఈ ఐక్యతకు నిరంతర సవాళ్లు. స్వతంత్రతను కాపాడుకునే పేరిట ఎవరి కుంపటి వాళ్లదే. ఒకరేమో “విశాల ప్రజా సంఘాలను పోరాటంలోకి తెచ్చినప్పుడే వామ–ప్రజాస్వామ్య ఫ్రంట్ సాధ్యం”, ఇంకొకరేమో ప్రత్యామ్నాయ రాజకీయం, స్వతంత్ర రాజకీయ అస్తిత్వం అంటారు.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమ డాక్యుమెంటల్లో చెబుతున్నదాన్ని బట్టి ఈ ఐక్యత “ఎన్నికల కాన్సెప్ట్ కాదు”. ఇది ఒక ప్రక్రియ. ప్రజలను బూర్జువా–భూస్వామ్య పార్టీల ప్రభావం నుంచి వేరు చేసి, విశాల ప్రజా ఉద్యమాలు, పోరాటాల ద్వారా వామపక్ష రాజకీయాలను బలపరచడం.
డాక్యుమెంట్లలో అలా ఉన్నా ఆచరణలో అలా జరగడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ప్రత్యేకించి ఎన్నికల్లో వివిధ బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకునే సమయాల్లో- బూర్జువా పార్టీల అజెండా మీదనే జత కడుతున్నారు తప్ప సొంత అజెండాతోనే పోవడం లేదనే- విమర్శ ఉంది.
ప్రత్యామ్నాయ రాజకీయమా...
అలాగే రాజకీయ ప్రత్యామ్నాయం వేరు, ప్రత్యామ్నాయ రాజకీయం వేరు. ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమం కోసం కమ్యూనిస్టులు కృషి చేయాలంటే ఏకీకృత నినాదాలు ఉండాలని (బ్యాంకుల జాతీయకరణ, మోదీ అచ్చేదిన్ లాంటివి) సీపీఐ సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టులు వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయనే భావన ప్రజల్లో బలపడాలంటే మనం పొత్తుపెట్టుకునే పార్టీల అజెండాలో కమ్యూనిస్టుల నినాదం ఒకటో రెండో అనివార్యమని, అందుకు సొంత అజెండా ఉండాలని, ఎదుటి వారి అజెండాతో పోతే ప్రజలు కమ్యూనిస్టులను కూడా అదే గాటన కట్టివేస్తారని చెప్పారు ఆయన.
జాతీయ పార్టీలకు జాతీయ అజెండా ప్రధానం కావాలే గాని ప్రజాసంఘాల మాదిరి వేర్వేరుగా ఉండకూడదన్న అభిప్రాయమూ ఉంది. కమ్యూనిస్టుల ప్రత్యేకత లేకపోబట్టే వామపక్ష పార్టీలు ఏ ఉదారవాద బూర్జువా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ బలపడిందే తప్ప వీళ్లు కాదనే వాదనా ఉంది. 1980వ దశకం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష అనుభవం ఇది. పొత్తు పెట్టుకోవడమంటే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను ఇతర పార్టీలకు అప్పగించడమనే జనాంతిక అర్థం వచ్చింది..
కిందిస్థాయిలో ఏం జరుగుతోంది?
కానీ ఈ ఐక్యత గ్రాస్‌రూట్ నుంచి నిర్మితమవుతుందా? సీపీఐలో సుదీర్ఘకాలం పని చేసిన ఓ సీనియర్ నేత అభిప్రాయం ప్రకారం "కమ్యూనిస్టు పార్టీ నాయకులు గ్రామాలకు దూరమయ్యారు. పార్టీలకు రాజకీయ దృష్టి కరవైంది. కలిసి పోటీ చేసినా ఫలితం లేని పరిస్థితిని గత ఎన్నికల్లో ఆంధ్రాలో చూశాం. ప్రజలు దూరమయ్యారు. జనాన్ని వాళ్ల సమస్యలపై పోగేయాలే తప్ప మనమేదో నిర్ణయించుకుని ఉపన్యాసం చెప్తామంటే వినే రోజులు కావివి. కార్యక్రమం ముఖ్యం, ప్రచారం ప్రధానం, ప్రజాసమస్యలు పరిష్కారం కావడం అన్నింటికన్నా ముఖ్యం. గ్రామాలకు వెళ్లి మాట్లాడేవాళ్లు కావాలిప్పుడు. ప్రజా నాడిని పట్టుకునే వారే ఇప్పుడు జనానికి అవసరం. జనం ఇవాళ మీ దగ్గరకు వస్తే నాకేం వస్తుందని జనం అడుగుతున్నారు. దానికి జవాబు చెప్పగలిగిన స్థితిలో కమ్యూనిస్టులు లేరు. అందువల్ల నాయకులు క్రెడిబులిటీ పెంచుకోవాలి. అప్పుడే పుంజుకోగలుగుతారు. ఈ తరహా ఫ్రంటులను ఆదరించగలుగుతారు.."
వందేళ్లు…
పోరాటం…
త్యాగం…
ఆలోచన…
అంటే సరిపోదు. కాలప్రవాహంలో కొడవలి పదునెక్కాలంటే రేపటి చరిత్రే సమాధానం కావాలి. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత అనేది నినాదం కాకూడదు.. అదో సుదీర్ఘ ప్రయాణం. ఎన్నికలకంటే ఎక్కువది. ప్రజా పోరాటాలతో సాధించేది.
"కొన్ని రోజులు భారంగా అనిపించవచ్చు, అంత మాత్రాన మీరు ఆగిపోవాలని అర్థం కాదు. పురోగతి నెమ్మదిగా ఉన్నా, అది పురోగతే అవుతుంది. ఓటమి గెలుపునకు పునాది. జీవితాల్ని ఫణంగా పెట్టి కమ్యూనిస్టు పార్టీలను కాపాడుతున్న లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, పార్టీ హోల్ టైమర్లు ఈ లక్ష్యాన్ని వదులుతారని నేననుకోను.
ప్రముఖ మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్త అనిల్ రాజిమ్వాలే చెప్పినట్టు – “కమ్యూనిస్టులు మారుతున్న కాలానికి తగ్గట్టుగా మారి” జనంలో నిలబడతారు, కొట్లాడతారు. ఆ స్ఫూర్తికి ఈ వందేళ్ల ఉత్సవం సాయపడుతుందని ఆకాంక్ష.
Next Story

