OBESITY | బరువు తగ్గడానికి మరమరాలు రైటా? మఖానా మంచిదా?
x

OBESITY | బరువు తగ్గడానికి మరమరాలు రైటా? మఖానా మంచిదా?

ప్రపంచంలో ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో సతమతం అవుతున్నారు. బరువు తగ్గడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ దశలో మఖానా, మరమరాలు తెరపైకి వచ్చాయి.


ప్రపంచంలో ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో (OBESITY) సతమతం అవుతున్నారు. 1990 నుంచి ఈ సమస్య రెట్టింపు అవుతూ వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం 2022లో 250 కోట్ల మంది ప్రజలు ప్రత్యేకించి 18 ఏళ్లు పైబడిన వాళ్లలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. అధిక బరువును తగ్గించుకునేందుకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. డాక్టర్లు రకరకాల సూచనలు చేస్తున్నారు. జిమ్ లలో చేసే కసరత్తులు, తిండి తిప్పలపై ఆంక్షలు వంటివెన్నో వస్తున్నాయి. ఇవెన్ని చేసినప్పటికీ సమతూకంతో ఉండే తిండి కావాలి. ఈనేపథ్యంలో ప్రస్తుతం మిల్లెట్స్ ఆహార పదార్థాలు తెరపైకి వచ్చాయి.
ఇక మన దేశానికి వస్తే ప్రస్తుతం మఖానా (MAKHANA) రైటా లేక మరమరాలు (MURUMARA) రైటా అనే చర్చ సాగుతోంది. బరువు తగ్గించుకోవడానికి ఈ రెండూ రైటే అని చెబుతున్నా ఉత్తరాదిన ఒక పదార్థం దక్షిణాదిన మరో పదార్థం బాగా ఫేమస్.
బరువు తగ్గించుకోవడానికి కచ్చితంగా తిండిపై ఆంక్షలు పెట్టుకోవాల్సిందే. తిండి తగ్గించామనే పేరిట మరేవో సాక్స్ తింటే బరువు తగ్గడం కుదరదు. అయితే అన్ని స్నాక్స్ ను ఒకే గాటన కట్టలేం. దేశంలో బాగా ప్రసిద్ధి గాంచిన మఖానా, ముర్మురాలు బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయని డైటీషియన్లు చెబుతున్నారు. ఈ చిరుతిళ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుందని, ఆకలేసినపుడల్లా వీటిని కొంచెం కొంచెంగా తీసుకోవచ్చునని సలహా ఇస్తున్నారు. నిజానికి ఈ రెండు మనకు కొన్ని శతాబ్దాలుగా ఉన్నవే. ఆరోగ్యకరమైన స్నాక్స్‌ కూడా. మనం చిన్నప్పటి నుంచి మరుమరాలు లేదా బొరుగుల ఉండల గురించి వినడమో తినడమో చేసే ఉంటాం గాని ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయనే దానిపై సరైన అవగాహన ఉండకపోవచ్చు.
నిజానికి శరీరానికి కావాల్సిన పోషకాలను ఈ రెండు పదార్థాలు అందిస్తాయి. చాలా తేలికగా అరిగే స్నాక్స్ కూడా. సమతుల (BALANCED DIET) ఆహారానికి అనువైన జోడింపు కూడా. బరువు తగ్గించుకోవడానికి తోడ్పడతాయి. ఇదే సందర్భంలో ఈ రెండింటిలో ఏది మంచిదనే చర్చ సాగుతోంది ఇటీవలి కాలంలో.
మఖానా, మరమరాల్లో ఏది మంచిది?
మకానా, మరమరాల్లో మధ్య తేడాలేమిటో చూద్దాం. మఖానాను ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని పిలుస్తుంటారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువ. ప్రోటీన్ మితంగా ఉంటుంది. కేలరీలు తక్కువ. ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి జీర్ణప్రక్రియకు బాగా తోడ్పడతాయి. మఖానాలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలూ ఉన్నాయి. తక్కువ కొవ్వు పదార్థాలతో ఉంటుంది. పోషకాహార సమతుల్య ఆహారంగా పనికి వస్తుంది.
మఖానా పోషక విలువలతో కూడిన మొక్కల ఆధారిత విత్తనం. యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మపోషకాలను కలిగి ఉంటుంది. అధిక బరువును, వృద్ధాప్యం ఛాయలను తగ్గిస్తుంది. గుండె కు కూడా మంచిదే. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి తోడ్పడుతుంది.
ఇక మరమరాల సంగతికి వస్తే...
మరమరాలను పఫ్డ్ రైస్ అని కూడా పిలుస్తారు. వడ్ల నుంచి తయారు చేస్తారు. ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇందులో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలతో పాటు ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముర్మురా గ్లూటెన్-ఫ్రీ, తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి బాగా పనికి వస్తుంది. కార్బోహైడ్రేట్లు కూడా బాగానే ఉంటాయి.
మరమరాలలో విటమిన్‌ డి, బి తో పాటు కాల్షియం, ఐరన్‌, థయామిన్, రిబోఫ్లావిన్ ఉంటాయి. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచేందుకు పనికి వస్తాయి. మరమరాలు- ఆస్టియోపొరోసిస్‌ ముప్పును తగ్గిస్తాయి. ఎముకలను బలంగా ఉంచుకోవడానికి మరమరాలు స్నాక్‌గా తీసుకోవచ్చునని డైటీషియన్లు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి ఏది మంచిది?
మఖానాలో మాంసకృత్తులు, ఫైబర్ కంటెంట్‌ మెరుగ్గా ఉంటుంది. జీర్ణప్రక్రియను పెంచుతుంది. మరమరాల్లో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ జీర్ణక్రియను నియంత్రిస్తుంది. మరింత తినాలనే కోరికను నిలువరిస్తుంది. నిజానికి ఈ రెండు ఆహార పదార్థాలు తక్కువ క్యాలరీలు, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉన్నవే. నిజంగా బరువు తగ్గాలనుకునే వారు ఈ రెండింటినీ తీసుకోవచ్చు. లేదా తమకు అందుబాటులో ఏది ఉంటే దాన్ని తినవచ్చు. వేయించిన మఖానాను ఇష్టపడే వారైతే కాస్తంత జాగ్రత్త పడాలి. నూనెలో వేయించడం వల్ల అదనపు కేలరీలు చేరే అవకాశం ఉంది. రుచిగా ఉండాలంటే వేయించకతప్పదు. అదే మరమరాలకైతే ఆ ఇబ్బంది లేదు. నేరుగా తినవచ్చు. రకరకాల పదార్థాలను మరమరాలతో తయారు చేస్తున్నారు. అందువల్ల, మనం ఏమి తినాలనేది ఎంత బరువు తగ్గాలనుకునే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండూ శరీర బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడేవే.
Read More
Next Story