
AI Image
అమరావతి చుట్టుపక్కల ఎక్కడ స్థలం కొంటే మంచిది?
అమరావతి చుట్టూ రియల్టర్ల పరుగులు.. సామాన్యుల అడుగులు..
అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం 2026లో చెప్పుకోదగిన మార్పులకు లోనవుతోందని రియల్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం, సామాన్యులకు, పెట్టుబడిదారులకు అనువైన కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను ఊదరగొడుతూ పలు రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్దఎత్తున ప్రకటనలు ఇస్తున్నాయి. సామాన్యుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
2025 ముగుస్తున్న తరుణంలో అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం కాస్తంత పుంజుకుంది. 2026 నాటికి ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందని డెవలపర్లు, పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఆశాభావంతో ఉన్నారు.
సామాన్యుడికి భారమవుతున్న ధరలు?
అభివృద్ధి జరుగుతున్నప్పటికీ, పెరుగుతున్న ధరలు మధ్యతరగతి ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్ద డెవలపర్లు 'క్యాపిటల్ బూమ్' పేరుతో ధరలను విపరీతంగా పెంచుతున్నారని, దీనివల్ల సామాన్యులకు ఇళ్లు కొనడం కష్టమవుతుందని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అఫర్డబుల్ హౌసింగ్ (సరసమైన ధరలలో ఇళ్లు) ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.
2026 అమరావతికి ఒక మలుపు వంటిదని భావిస్తున్నప్పటికీ, సింగిల్ విండో క్లియరెన్స్ వంటి విధానాలు, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలు ఉంటేనే ఈ వృద్ధి స్థిరంగా ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.శ్రీనివాస్ అన్నారు.
గతంలో కేవలం ప్రకటనలకే పరిమితమైన అభివృద్ధి, ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ భవనాలు, ప్రధాన రహదారులు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా పుంజుకుంటున్నాయి. "పెట్టుబడిదారులు ఇప్పుడు నిజమైన నిర్మాణ కార్యకలాపాలను చూస్తున్నారు" అని క్యాపిటల్ రీజియన్ బిల్డర్స్ అసోసియేషన్ (CRBA) ప్రతినిధి ఎం. రామారావు పేర్కొన్నారు.
పలు రియల్ ఎస్టేట్ సంస్థలు, సీఆర్డీఏ అంచనా ప్రకారం ప్రస్తుతం జనం ఎక్కువగా మక్కువ చూపుతున్న ప్రాంతాలు ఇలా ఉన్నాయి.
ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రభావం...
అమరావతి రియల్ ఎస్టేట్ పురోగతికి ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఆమోదం ప్రధాన కారణమైంది. ₹24,791 కోట్ల అంచనాతో, 190 కిలోమీటర్ల పొడవున (హైదరాబాద్ ORR కంటే పెద్దది), 6 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వెళ్లే మార్గాల్లో భూముల ధరలు ఏడాదిలోనే దాదాపు 35 శాతం పెరిగాయి.
ముఖ్య ప్రాంతాలు: ఏలూరు జిల్లా సరిహద్దులోని అడవినెక్కలం, కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, వీరులపాడు మరియు గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు సమీప గ్రామాలు.
ఎందుకు కొనాలి?: ORR అలైన్‌మెంట్ ఖరారైన ప్రాంతాల్లో భూముల విలువ ఇప్పటికే 30-35% పెరిగింది. రింగ్ రోడ్డు పనులు ప్రారంభమైతే ఈ ధరలు మరింత పెరుగుతాయి.
విజయవాడ-గుంటూరు కారిడార్...
విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఇప్పుడు అమరావతికి ప్రధాన ద్వారంగా మారింది. ఈ ప్రాంతంలో సుమారు 20 పెద్ద ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడి భూముల ధరలు 30 శాతం వరకు పెరిగాయి. కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంతో పెట్టుబడిదారులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు.
కోర్ క్యాపిటల్ ఏరియా (ప్రభుత్వ భవనాలకు సమీపంలో)
రాజధాని ప్రధాన కేంద్రంలో స్థలం కొనాలనుకునే వారికి ఇవి అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాలు. ఇక్కడ ధరలు కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారం ఎక్కువ.
ముఖ్య ప్రాంతాలు: రాయపూడి, మందడం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు మరియు ఐనవోలు.
ఎందుకు కొనాలి?: ఇక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి కీలక భవనాలు ఉండటంతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా కనెక్టివిటీ మెరుగ్గా ఉంది. ఐనవోలు, శాఖమూరు ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ హబ్‌లు (VIT, SRM) కూడా ఉన్నాయి.
వెస్ట్ బైపాస్ & హైవే లింక్డ్ ప్రాంతాలు (విజయవాడ వైపు)
విజయవాడ నగరం నుండి అమరావతికి వెళ్లే మార్గంలో ప్రస్తుతం వేగవంతమైన వృద్ధి కనిపిస్తోంది.
ముఖ్య ప్రాంతాలు: తాడేపల్లి, ఉండవల్లి, పెనుమలూరు, నిడమర్రు, కురగల్లు.
ఎందుకు కొనాలి?: ఇక్కడ మెరుగ్గా ఉన్న రవాణా సౌకర్యాల వల్ల నివాస గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 'నిడమర్రు'ను ఎలక్ట్రానిక్ సిటీగా అభివృద్ధి చేస్తుండటంతో అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు.
రెండో దశ ల్యాండ్ పూలింగ్ గ్రామాలు (తక్కువ ధరల్లో)
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ భూమి లేదా స్థలం కావాలనుకునే వారికి ఈ ప్రాంతాలు అనువైనవి. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఎక్కువ మంది రాజకీయ నాయకులు పొలాలు కొన్నట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.
ముఖ్య ప్రాంతాలు: వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి.
ఎందుకు కొనాలి?: ఇక్కడ ప్రభుత్వం రెండో దశ కింద భూములను సేకరిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ధరలు రాజధాని లోపలి ప్రాంతాల కంటే తక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడికి ఇవి మంచి ఎంపిక.
పెట్టుబడిదారులకు, కొనుగోలుదారులకు సూచనలు..
రియల్ ఎస్టేట్ వ్యాపారుల, సంస్థలు, ఏజెంట్ల మాటలు విని మోసపోవద్దు. మీరు స్వయంగా చూసి అన్ని తెలుసుకున్న తర్వాతే రంగంలోకి దిగండి. మీరు కొనే ప్లాట్లు ఖచ్చితంగా APCRDA ఆమోదించిన లేఅవుట్‌లలోనే ఉన్నాయని నిర్ధారించుకోండి. అక్రమ లేఅవుట్‌లలో కొంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు.
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) ద్వారా రైతులకు కేటాయించిన ప్లాట్లు కొనడం చట్టబద్ధంగా సురక్షితం. ధరలు చుక్కలు చూస్తున్నా మీ స్వీయ నిర్ణయమే ఫైనల్.
ధరల పోకడ: ప్రస్తుతం గజం ధర ₹30,౦౦౦లకు పైగా పలుకుతున్నా (ప్రాంతాన్ని బట్టి) 2026 చివరి నాటికి ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాలు బాగుంటాయని, అదే పెట్టుబడి కోసమైతే రెండో దశ పూలింగ్ గ్రామాలు లేదా ORR వెంబడి ఉన్న ప్రాంతాలు ఉత్తమం అని సీఆర్డీఏ మాజీ అధికారి ఒకరు సలహా ఇచ్చారు. ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా తుది నిర్ణయం కస్టమర్లదే అని మనం గుర్తుపెట్టుకోవాలి అని కూడా ఆయన అన్నారు.
Next Story

