శ్రీశ్రీ కాళ్లకి మొక్కు అన్నాడు మా అయ్య... మహాకవి గురించి ఒక జ్ఞాపకం
x

'శ్రీశ్రీ కాళ్లకి మొక్కు' అన్నాడు మా అయ్య... మహాకవి గురించి ఒక జ్ఞాపకం

సినిమా హీరో లా నా ఊహాల్లో ఉన్న శ్రీశ్రీ కి మా ఇంటికి వచ్చిన శ్రీశ్రీకి పొంతన లేదు.


-మలసాని శ్రీనివాస్


1.సుత్తి కొడవలి నీవు

శ్రామికశక్తివి నీవు

జనం గుండె మంటల్లో

మండుతున్న మంట నీవు

అందుకో అందుకో అమరుడ జోహార్లు అందుకో

శ్రీశ్రీ జోహార్లు అందుకో ......

2.నీ రక్తాన్నే సిరా చేసి కార్మికుల బ్రతుకు రాసి

సమసమాజ స్థాపనకై శక్తినంత ధారపొసి

ఒంటి నెత్తురింకిపోయి వల్లకాడు చేరినా

శ్రీశ్రీ వై మా చెంత చిరంజీవిగున్నావు........అందుకో"

3.కార్మికులకు కర్షకులకు విద్యార్థి మేధావికి

చారిత్రక స్థితిగతులను వెన్నుతట్టి చూపావు

ఈ వ్యవస్థ మారాలని ఈ దోపిడి కూల్చాలని

కలంపట్టి కాలంపై క్రాంతిరేఖ నిసిరావు....................అందుకొ"

4అణుక్షణం నిరంతరం యువతరాన్ని కదిలించి

మరో ప్రపంచానికై పోరుమార్గానే చూపించి

ఎర్రజండ ఎగురాలని ఎలుగెత్తిచాటావు

శాంతి లేని నీవు విశ్రాంతి కోసమెళ్ళావా...........అందుకో.

5. ఈ శతాబ్ద కాలానికి తాళన్నే వేసావు

యుగయుగలు గడిచిన ఈ జగం విడిచి పోలేవు

విరసం స్థాపకుడ నక్సలైట్ సోదరుడా

ఎర్రజండ వెలుగువై ఎల్లకాలముంటావు.......అందుకో.

6.పతితులారా భ్రష్టులారా దగపడిన తమ్ములారా

ఎడ్వకండి ఎడ్వకండి శ్రీశ్రీ మనకు లేడని

వ్యక్తి కాదు శ్రీశ్రీ మహాశక్తి అని ఎరుగువా

తూరుపులో ఉదయించే ఎరుపు మయం శ్రీశ్రీ.............అందుకో.

7.నీ రక్తం నీ త్యాగం వృదా మేము కానివ్వం

నీ కలమే మా చేతిలో కత్తివలే మెరుస్తుంది

ప్రజాయుద్ధ పంథాలో పోరాటం సాగించి

మరో ప్రపంచం కోసం మరఫిరంగులవుతాం....అందుకో.

ఈ పాట 1987 ఏప్రిల్30 శ్రీశ్రీ 4వ వర్థంతి సందర్భంగా గుంటూరు విరసం(విప్లవ రచయితల సంఘం) సభలో నెల్లూరుకు చెందిన కె.సి. అనే కవి రాసి పాడినది. అప్పుడు విన్న పాటను చాలా కాలంపాటు పదే పదే హమ్ చేసే వాడిని. ఇపుడు ఆయన జయంతి (ఏప్రిల్) సందర్భంగా ఆ పాటను ట్యూన్ తో గుర్తు చేసుకుని అక్షర రూపం ఇచ్చాను. ఈ సందర్భంగా నా జ్ఞాపకం అందరితో పంచుకుంటున్నాను.

1980లో శ్రీశ్రీ రాజమండ్రి వచ్చాడు. కమ్యూనిస్టు నాయకులు రవణం శ్రీరాములు, ఏలూరి సూర్యరావు, మా అయ్య మలసాని వెంకట్రావులు మా ఊరు బుర్రిలంక పూలతోటలు చూపించేందుకు శ్రీశ్రీ ని మా ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే మహాప్రస్థానం కవితలు బట్టీపట్టేసిన 14 ఏళ్ల పిల్లాడునైన నా ఆనందానికి అంతులేదు. సినిమా హీరో లా నా ఊహాల్లో ఉన్న శ్రీశ్రీ కి మా ఇంటికి వచ్చిన ఆయనకు పొంతన లేదు. సాదాసీదా వేషధారణ షర్ట్ పైజమా, మామూలు కళ్లద్దాలు, మామూలు చెప్పులు, చేతిలో సిగరెట్, శ్రీరాములుతో మంద్రస్థాయి స్వరంతో లెక్కగా కొన్ని మాటలు.

సార్ కాళ్లకు నమస్కారం చేయ్యమంటూ నాకు మా అయ్య చేసిన సూచనకు "తప్పుడు అలవాట్లు పిల్లలకు నేర్పకు వెంకట్రావు" అంటూ సున్నితంగా శ్రీశ్రీ హెచ్చరించారు.

అప్పటికే నక్సలైట్ పార్టీ స్థాపకుడు కొండపల్లి సీతారామయ్యని మా ఇంట్లో చూసి ఉండటంతో ఇద్దరి ప్రవర్తన ఒకేలా ఉందే అనుకుంటూ గొప్పోళ్లందరూ ఇలాగే ఉంటారు అన్న మాట అనేసుకున్న. అప్పటి నా బాల్య నమ్మకం అది.


Read More
Next Story