
షేక్ నాజర్ (ఫైల్ ఫోటో)
షేక్ నాజర్ ను పుచ్చలపల్లి సుందరయ్య ఏమన్నారంటే..
ఫిబ్రవరి 5 ప్రజా కళాకారుడు షేక్ నాజర్ జయంతి సందర్భంగా 'జనసాహితీ' దివి కుమార్ రాసిన వ్యాసం
"వినరా వీర కుమార వీర గాధ వినరా..." అంటూ ఆయన కథ మొదలుపెడితే ప్రేక్షకులు ఊగిపోవాల్సిందే. కింద జనం "తందాన తాన తందానాన" అంటూ చిందేయాల్సిందే. అది చారిత్రక వీరగాథలైనా, పౌరాణిక కథలైనా, భూ పోరాటమైనా.. అది ఏదైనా ఆయనకు ఆయనే సాటి. సామాజిక విషయాలను అన్వయించి చెప్పడంలో మేటి. ఆయనే షేక్ నాజర్. బుర్రకథ పితామహుడు, నవరసాలు పండించడంలో దిట్ట. హాస్య, వీర, కరుణ రసాలకు పెట్టింది పేరు.
ఏ నాటక కళా ప్రదర్శకునికైనా పాత్రోచితమైన ఆంగికము, ఆహార్యము, వాచకము తప్పనిసరి.
బుర్రకథ- కథాగాన (Story telling) ప్రక్రియకు చెందింది.
నాజర్ అంటే బుర్రకథ, బుర్రకథ అంటే నాజర్. ఆ ఖ్యాతి పొందిన షేక్ నాజర్, తాను చెప్పే కథను ప్రేక్షకుడి ఊహా ప్రపంచంలో కంటికి కనిపిస్తున్నట్లు దృశ్యమానం చేసేవాడు.
తన శరీరంలోని సమస్త అంగాల లయాత్మక విన్యాసాలతో నవరసాలు పలికించగల 'బాడీ లాంగ్వేజ్ ' (శరీర భాష) ఆయనలో పుష్కలం. పెద్ద కనుగుడ్లతో సూటిగా ప్రేక్షకుడి గుండెలతో మాట్లాడినట్లు అభినయించేవాడు. ఆవేశాన్ని ప్రదర్శించవలసిన యుద్ధంలాంటి సన్నివేశంలో మెరుపు వేగంతో గిర్రున తిరిగేవాడు.
ప్రత్యేక వేషధారణ (ఆహార్యం) ద్వారా ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించేవాడు. రంగు తలపాగా కట్టు తీరు నుండి, నొసటన పెట్టుకునే పెద్ద బొట్టు నుండి.. మెడలో ధరించే రుద్రాక్షల ఆకారంలోని రంగురంగుల పూసలు, కుడి చేతి వేళ్లకు తగిలించుకునే అందెలు, ఎడమ భుజంపై తంబూర, మెడ నుండి మోకాలి దాకా పొడవాటి మెరుపు రంగుల అంగరఖా (కుర్తా), దాని నడుము కట్టు (కటిబంధం), బిగుతయిన తెల్లని పైజామా (చుడీదార్), లయాత్మకమైన పాటకు, ఆంగిక విన్యాసాలకు అనుగుణమైన శబ్దాలను ఇచ్చే కాలి గజ్జలు... ఇలా సమస్తమైన ఆహార్యo ప్రేక్షకుడిని ఇట్టే ఆకట్టుకునేటట్లు ఉండేవి.
వివిధ రాగ, తాళ, గతుల, జతుల పాటలు మాటలతో ఆటను జోడిస్తూ నవరసాలను పలికించ గల సుస్పష్టమైన అద్భుత వాచకం ఆయనది. తన గాత్ర విన్యాసాలతో ప్రేక్షకులను శోకతప్త హృదయులను చేసినా, ఆగ్రహావేశాలతో రగిలించినా ఆయనే!
ప్రజల నుండి ప్రజలకు అనే తత్త్వాన్ని తనదిగా చేసుకున్న నాజర్, తన బుర్రకథ కళారూపం ద్వారా పీడిత, తాడిత, బాధిత వర్గాలలో చైతన్యగ్నిని రగిలించి సాధారణ ప్రజలే అసాధారణ పోరాట వీరులయేట్లు రెండు తరాలను ప్రభావితం చేసిన, 'కమ్యూనిస్టు ఉద్యమకాలం' మలచిన గొప్ప కళాస్రష్ఠ. పొన్నెకల్లు గ్రామంలోనే చాలదు, విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లాంటి చోట్ల కూడా ఆయన విగ్రహ ప్రతిష్ట జరగాలి. ఆయన స్ఫూర్తి నూతన తరాలకు అందాలి!
ఫిబ్రవరి 5, నాజర్ పుట్టిన రోజు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నెకల్లు. భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదని ఆయన కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు.
"నాకున్న ఆసక్తితో తండ్రి గారి బుర్రకథ కళను నిల్ప గలిగాను,
"కళారత్న" అవార్డును అందుకోగ లిగాను.. కానీ
నాకున్న ఆర్థికశక్తి సరిపోక విగ్రహం పెట్టించ లేక పోతున్నాను...
పిబ్రవారి 5 వ తారీఖున నాన్న గారి జయంతికి పొన్నెకల్లు లో ఉన్న విగ్రహానికి రంగులు దిద్దించి చిన్న సభ జరుప ప్రయత్నిస్తున్నాను.. పెద్దలందరికీ నమస్సులు" అంటూ ఈ రచయితకు సందేశం పంపారు.
నాజర్ గురించి నాలుగు మాటలు..
బుర్ర కథా పితామహుడు షేక్ నాజర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకుల ముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 20 వ తేదీన షేక్ మస్తాన్, బీబాబీలకు దంపతులకు జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి". తండ్రి నాజర్ ను సన్నాయి కళాకారుడిగా తీర్చి దిద్దాలని ప్రయత్నించినా పేదరికము అడ్డుపడింది. 1929 లో తెనాలి లోని బాల రత్న సభ డ్రామా ట్రూప్ లో సభ్యుడిగా చేరి నాటకా లాడి మంచిపేరు గడించారు. ఎస్ రాఘవయ్, ఆర్. కోట వీరయ్య దగ్గర బుర్ర కథను నేర్చు కున్నాడు. కమ్యూనిస్టు పార్టీ వారు నిర్వహించిన పాటల పోటీలో పాల్గొని ప్రధమ బహుమతి పొందారు. 1944లో బెంగాల్ లో వచ్చిన కరువు పరిస్తుతులను తెలియజేసేలా డొక్కల కరువు అనే బుర్రకథ ను రచించి తోటి మనిషికి సహాయపడవలసిందిగా తన వంతు ప్రచారం కొనసాగించాడు.
"ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కావు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.
పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామ రాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు తదితర ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు.
ఓ సందర్భంలో తన ప్రత్యేక ఆహార్యాన్ని గురించి ప్రస్తావిస్తూ కాషాయ రంగు శాంతికి, ఎరుపు విప్లవానికి గుర్తుగా భావించాలని అంటాడు. నాజర్ కథ చెప్పుతుంటే ప్రేక్షకులు మెలితిరిగి పోయేవారు. నవ్వులు పువ్వులవుతాయి. వీరం మహోద్రేకం.. కరుణం కన్నీటి సంద్రమవుతుంది. పూలరంగడు సినిమాలో అక్కినేనికి నేర్పించారు. చాలా మందికి ఈ విద్య నేర్పాడు. ఆయన గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన సినీ సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావు సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు. "ఆసామీ" నాటకాన్ని రచించాడు. నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన "పింజారీ" అనే పుస్తకంగా ప్రచురించాడు.
రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవాచార్యులు నాజరు బుర్రకథ విని బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూసిన డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం, ప్రముఖ పాత్రికేయుడు కె. అబ్బాస్ నాజరును ఆంధ్ర అమర షేక్ అని అభివర్ణించడం, పుచ్చలపల్లి సుందరయ్య నాజరు ప్రజాభాషకు ముగ్ధుడై 'నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో' అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు. నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్ దగ్గర శిక్షణ తీసుకోవటం నా నట జీవితానికి పట్టం కట్టింది అని నటి జమున, "నేను మీ ఫాన్ ని" అని ఎన్.టి రామారావు అన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. 1997, ఫిబ్రవరి 22 న అంగలూరులో మరణించారు. ఆయన పుట్టింది, చనిపోయింది కూడా ఫిబ్రవరి నెలలోనే..
... దివి కుమార్, జనసాహితి
Next Story

