డిప్యూటీ సీఎం పదవి ఆనవాయితీ మాత్రమేనా.. ఆయన అధికారాలేంటి..
x

డిప్యూటీ సీఎం పదవి ఆనవాయితీ మాత్రమేనా.. ఆయన అధికారాలేంటి..

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఈరోజు మొదటిసారి సచివాలయానికి వచ్చారు. అసలు డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ బద్దమేనా? ఈ పదవి అధికారాలేంటి?


డిప్యూటీ సీఎం, డిప్యూటీ పీఎం.. ఈ మాటలు మనకు కొత్తేమీ కాదు. ఎప్పటి నుంచి కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతి సారి.. మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా తీసుకుంటారు. అలా ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో జనసేనాని పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 2019-24 మధ్య ఉన్న జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఈ ట్రెండ్ కొన్నేళ్ల క్రితం మొదలైందేమీ కాదు. తమన తొలి ఎన్నికల తర్వాత నుంచే డిప్యూటీ సీఎం పదవులను ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్‌కు తొలిసారి 1956లో కొండా వెంకట రంగా రెడ్డి.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి సచివాలయం చేరుకున్నారు. ఈ క్రమంలోనే అసలు డిప్యూటీ సీఎం అధికారాలేంటి? ఆ పదవి చట్టబద్దమేనా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

రాజ్యాంగం ఏం చెప్తోంది..

డిప్యూటీ సీఎం, డిప్యూటీ పీఎం పదవుల గురించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావనే లేదు. ఆ కారణంగా ఏ నేతకు కూడా కేవలం డిప్యూటీ సీఎం పదవే ఇవ్వకుండా కొన్ని ఇతర శాఖలను కేటాయించి మంత్రి వర్గంలో కొనసాగిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్ విధుల నిర్వహణలో సహాయం చేయడానికి లేదా సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రి వర్గం ఉంటుంది. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు మిగిలిన మంత్రివర్గ కూర్పు జరిగి వారి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇంతవరకు భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ డిప్యూటీ సీఎం, డిప్యూటీ పీఎంల గురించి ఎక్కడా చెప్పలేదు.

డిప్యూటీ సీఎం అధికారాలేంటి

డిప్యూటీ సీఎంకు ఎటువంటి విశేష అధికారాలు ఉండవు. క్యాబినెట్ మంత్రుల తరహాలోనే జీతం, ఇతర అలవెన్స్‌లను డిప్యూటీ సీఎం కూడా పొందుతారు. కాకపోతే ముఖ్యమంత్రి తన చొరవతో డిప్యూటీ సీఎంకు కాస్త అధిక భద్రతను కల్పించవచ్చు. జీతం విషయంలో కూడా అంతే. డిప్యూటీ సీఎం, మంత్రులకు మధ్య వ్యత్యాసం ఏమీ ఉండదు. వీరు సమానంగానే పరిగణించబడతారు. డిప్యూటీ సీఎంకు నిర్దిష్టమైన ఆర్థిక, పరిపాలన అధికారాలు ఉండవు. డిప్యూటీని కూడా సీఎంకే నియమిస్తారు. రాజకీయ సమీకరణాలు మారిన సందర్బాల్లో డిప్యూటీ సీఎంను మార్చడం, లేదా బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది.

సీఎం లేకున్నా ఏమీ ఉండదు..

మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంను రెండో అత్యున్నత పదవిగా పరిగణిస్తారు కానీ దీనికి ఎటువంటి చట్టబద్దమైన అధికారాలు ఉండవు. ఏదైనా అత్యవసర, అనివార్య కారణాల వల్ల సీఎం విదేశాలకు వెళ్లినా, అందుబాటులో లేకున్నా నిర్ణయాలు తీసుకునే పవర్ డిప్యూటీ సీఎంకు ఉండదు. పేరుకు పెద్ద పదవే అయినా డిప్యూటీ సీఎం అనేది ఇతర మంత్రి పదవులతో సమానం. ఒకవేళ ఎవరైనా డిప్యూటీ సీఎం.. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో చొరవ చూపి ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఆయన ఆదేశాలు, నిర్ణయాలు చెల్లుబాటు కావు. కానీ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం సీఎంకు బదులుగా కేబినెట్ సమావేశానికి మాత్రం అధ్యక్షత వహించే అధికారం డిప్యూటీ సీఎంకు ఉంటుంది.

Read More
Next Story