
రేపటి నుంచి కర్నూలు ఉత్సవాలు
వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో కర్నూలు చరిత్రను, వైభవాన్ని నేటితరం వారికి తెలిసేలా కార్యక్రమాలు ఉంటాయి
-వడ్ల శ్రీకాంత్
తుంగభద్ర నది ఒడ్డున వెలసిన చారిత్రక కర్నూల్ నగర వైభవం విశిష్టత నేటి తరానికి తెలిసేలా కర్నూలు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ దాకా వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో కర్నూలు చరిత్రను, కర్నూలు వైభవాన్ని నేటితరం వారికి తెలిసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక తొలి రాజధానిగా కర్నూలుకు గుర్తింపు ఉంది.
అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలైన అహోబిలం, మహానంది, యాగంటి, మంత్రాలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల నిలయంగా కర్నూల్ ఉమ్మడి జిల్లా ఉంది. వీటితోపాటు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కలగలిపి శ్రీశైల క్షేత్రం ఉంది. వీటికి తోడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కృష్ణదేవరాయల కాలంనాటి కోటలు, చెరువులు వంటి సందర్శనీయ ప్రాంతాలు ఎన్నో జిల్లాలో ఉన్నాయి. చారిత్రాత్మక, సాంస్కృతిక, సాహిత్య నైపద్యం కలిగినటువంటి కర్నూలు జిల్లా ప్రాచీన వైభవాన్ని నేటి తరానికి తెలియ చెప్పేందుకు కర్నూలు నగరంలో ఉన్నటువంటి టీజీవీ కళాక్షేత్రం ముందుకు వచ్చింది.
కర్నూలు లలిత కళా పరిషత్ సారథి పత్తి ఓబులయ్య
గతంలో 2000 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ ఉమామలేశ్వరరావు ఆధ్వర్యంలో కర్నూలు వైభవాన్ని చెబుతూ ఉత్సవాలను నిర్వహించారు. నాటి ఉత్సవాలు జరిపి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్త తరానికి పాత గుర్తులు తెలియచెప్తూ వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేందుకు టీజీవి కళాక్షేత్రం నడుం బిగించింది.
కర్నూలు చరిత్రను వైభవాన్ని తెలియచెప్పందుకే ఉత్సవాలు - టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య
కర్నూల్ నగరానికి ఉన్నటువంటి చరిత్రను, వైభవాన్ని చాటి చెప్పేందుకే కర్నూలు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు, కళారత్న అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్య తెలిపారు. వారం రోజులపాటు జరిగే ఉత్సవాలలో రోజుకో అంశంపై కళాక్షేత్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల సందర్భంగా సాహితీ రంగం, కళారంగాలతో పాటు వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చాటిన వారిని సన్మానిస్తున్నట్టు ఆయన తెలిపారు.
కార్యక్రమాల వెన్నుదన్నుగా నిలిచిన మాజీ మంత్రి టిజి వెంకటేశ్ (కుడి)తో పత్తి ఓబులయ్య
వారం రోజులపాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా కర్నూలు వైభవాన్ని తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. అలాగే విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసేలా కర్నూలు వైభవం పై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్టు పత్తి ఓబులయ్య తెలిపారు. కర్నూలు ఉత్సవాల నిర్వహణకు టీజీవీ కళాక్షేత్రం కన్వీనర్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని ఆయన తెలిపారు.




