ఎర్ర సముద్రంలో మంటలు.. అరకు కాఫీ తోటల్లో కన్నీళ్లు!
x

ఎర్ర సముద్రంలో మంటలు.. అరకు కాఫీ తోటల్లో కన్నీళ్లు!

ఇరాన్- అమెరికా యుద్ధం తెచ్చిన తంటా, నిలిచిన కాఫీ కొనుగోళ్లు


ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా సీతారామరాజు జిల్లా అరకు ప్రాంతాన్నీ తాకింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన అరకు కాఫీకి ఆదరణ కరవైంది. యుద్ధంతో ఈ 'అరేబికా' కాఫీ గింజల కొనుగోళ్లు బాగా తగ్గాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కాఫీ గింజల నిల్వలు పెరిగిపోతున్నాయన్న ఆవేదన ఎక్కువైంది.

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు- కాఫీ గింజలకు ప్రసిద్ధి. దేశంలో కాఫీ గింజల ఉత్పత్తిలో అరకు వాటా కూడా ఎక్కువే. కేంద్ర కాఫీ బోర్డు అంచనాల ప్రకారం ఈ ఏడాది 18 వేల టన్నుల మేర పంట పండింది. అరకు కాఫీ గింజలు ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, స్విట్జర్లాండ్, యూఏఈ వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది.
యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం (సూయజ్ కాల్వ) మార్గాలు ప్రమాదకరంగా మారాయి. దీనివల్ల నౌకలు 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' (ఆఫ్రికా చుట్టూ) మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ఐరోపా దేశాలకు చేరడానికి పట్టే సమయం మరో 3 నుండి 4 వారాలు పెరిగింది.
అరకు కాఫీ తోటల్లో ఉత్పత్తి బాగున్నప్పటికీ వాటి ధర అంతర్జాతీయ ఇంధన ధరలతో ముడిపడి ఉంది. 15 మార్చి 2026 నాటికి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 24% పెరిగాయి. యుద్ధ భయం వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారీగా పెరిగాయి. రవాణా ఖర్చు దాదాపు 5 రెట్లు పెరిగింది. దీంతో అరకులో కాఫీ గింజల కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి. సరుకు ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుందో తెలియని అనిశ్చితి వల్ల విదేశీ కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లు ఇవ్వడానికి వెనకాడుతున్నారు. దీంతో నిల్వలు పేరుకుపోతున్నాయి.

జాతీయ మార్కెట్‌లోనూ కాఫీ ధరలు అమాంతం పతనం అయ్యాయి. ఇది మన్యం రైతుల పాలిట అశనిపాతంగా మారింది. సీజన్‌ ముగియడానికి ముందే వారపు సంతల్లో కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. అంతర్జాతీయ సంక్షోభంతో ధర ఆశించినంతగా లేదంటూ వ్యాపారులు సరకు కొనుగోలుకు ముందుకు రావడం లేదు.
ఫలితంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరకు అరేబికా కాఫీ ఇప్పుడు అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా కూడా- రెండు వైపుల నుంచి భారీ దెబ్బ తింటోంది.
అరకు కాఫీ ఉత్పత్తిలో 90% అంటే సుమారు 15,000 మెట్రిక్ టన్నులు యూరప్, యూఏఈ వంటి విదేశాలకు ఎగుమతి అవుతుంది. యుద్ధ భయంతో కొత్త ఆర్డర్లు రావడం లేదు. ఇరాన్ పై అమెరికా యుద్ధ ప్రభావంతో హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్ర మార్గాలపై తీవ్ర ఆంక్షలు కొనసాగుతున్నాయి. నౌకలు ఇప్పుడు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళుతున్నాయి. యూరప్‌కు చేరడానికి గతంలో పట్టిన సమయానికి అదనంగా 3–4 వారాల ఆలస్యం అవుతున్నాయని ట్రేడర్లు చెబుతున్నారు. దీంతో పాటు రవాణా ఖర్చు 5 రెట్లు పెరిగింది. ఇన్సూరెన్స్ ఛార్జీలు భారీగా పెరిగాయి.
గ్లోబల్ మార్కెట్ షాక్..
తాజా ట్రేడింగ్‌లో అరేబికా కాఫీ ధరలు -2.31% పడిపోయాయి. రోబస్టా -4.69% పతనం అయ్యాయి. బ్రెజిల్‌లో రికార్డు స్థాయిలో 75.3 మిలియన్ బ్యాగ్స్ వస్తున్నట్టు అంచనా. మొత్తంగా ప్రపంచ ఉత్పత్తి రికార్డు స్థాయికి (180 మిలియన్ బ్యాగ్స్) చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వియత్నాం నుంచి భారీ ఎగుమతులు అవుతున్నట్టు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. అంటే మార్కెట్లో సరకు ఎక్కువగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోతున్నట్టు Barchart సమాచారం.
ఇరాన్- అమెరికా యుద్ధంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే 28% పెరిగాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు 107 డాలర్ల వరకు చేరింది. ఇదే సమయంలో ఇండియాలో రూపాయి విలువ తగ్గి డాలర్ మారకం రేటు గణనీయంగానే పెరిగింది. డాలర్ ఇండెక్స్ పెరగడం కూడా కాఫీకి నెగటివ్ కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో ఎగుమతి ఖర్చులు పెరిగాయి, కొనుగోలుదారులు తగ్గారు.
స్థానిక రైతు కె.గోపాల్ కథనం ప్రకారం.. సీజన్ ప్రారంభంలో అంటే జనవరి, ఫిబ్రవరిలో (పార్చ్‌మెంట్‌) రకం కేజీ రూ. 540 ఉండగా.. మార్చి మొదటి వారానికి ఈ ధర కాస్తా రూ. 446కు పడిపోయింది. జాతీయ మార్కెట్‌ ధర ఇలా ఉంటే... స్థానిక రైతుల వద్ద వ్యాపారులు కొనుగోలు చేస్తున్న ధర మరీ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు రూ.400 లకు కూడా కొనేవారు లేకుండా పోయారు. అదేమంటే యుద్ధ ప్రభావం అని చెబుతున్నారు. ఫలితంగా నిల్వలు పెరుగుతున్నాయి.
అరకు లోయ సమీపంలోని పాచిపెంటకు చెందిన గిరిజన రైతు సింహాచలం మాట్లాడుతూ.. "ఏడాది పొడవునా చెమటోడ్చి పండించాం. ఈసారి పంట బాగా వచ్చిందనీ సంతోషపడ్డాం. కానీ తీరా మార్కెట్‌కు తెస్తే 'యుద్ధం' అంటున్నారు. అప్పులు తీర్చే మార్గం కనిపించడం లేదు."
కేంద్ర కాఫీ బోర్డు అంచనాల ప్రకారం ఈ ఏడాది 18 వేల టన్నుల మేర పంట పండింది. ఏటా జనవరి మొదటి వారం నుంచి మార్చి నెలాఖరు వరకూ పంట ఉత్పత్తి, మార్కెటింగ్‌ జరుగుతుంది. కర్ణాటక రాజధాని బెంగళూర్‌ కేంద్రంగా జాతీయ స్థాయిలో క్రయవిక్రయాలు జరుగుతాయి. అందరూ ఊహించినట్లుగా ఆరంభంలో ధర ఆశాజనకంగానే ఉంది.
మన దేశం నుంచి ప్రధానంగా యూరప్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇంగ్లాండ్, దేశాలకు పంట ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఆయా దేశాలకు ఎగుమతులు స్తంభించడమే మార్కెట్‌లో ప్రతిష్ఠంభనకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ధర ఆశించినంత లేకపోడంతో దళారీలు, వ్యాపారులు తొలుత కొనుగోలు చేసిన సరకును విక్రయించకుండా గిడ్డంగుల్లో నిల్వలు ఉంచారు. ఇదే సమయంలో రైతుల నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించారు. ధర పెరిగినప్పుడు మాత్రమే తాము మళ్లీ రైతుల నుంచి కొనుగోలు చేస్తామని, లేకుంటే భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుందని చెబుతున్నారు.
మార్కెట్‌లో ధరల పతనం తాలూకు ప్రభావం ప్రభుత్వ రంగ సంస్థలైన గిరిజన సహకార సంస్థ (జీసీసీ), సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలపైనా (ఐటీడీఏ) పడింది. ఇవి రెండూ ప్రస్తుతం పంట కొనుగోలు నిలిపివేశాయి. ఇటు వ్యాపారులు కొనుగోలు చేయక.. అటు ప్రభుత్వ సంస్థలూ ముందుకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
షిప్పింగ్ కంటైనర్ల కొరత..
అరకు కాఫీని ఎగుమతి చేసే ట్రేడర్లలో ఒకరైన రవి కిరణ్ మాటల్లో చెప్పాలంటే "యుద్ధం వల్ల కేవలం రవాణా ఖర్చు పెరగడమే కాదు, అసలు కంటైనర్లు దొరకడమే గగనమైంది. గతంలో ఒక కంటైనర్ యూరప్‌కు వెళ్లడానికి $2,000 అయ్యేది, ఇప్పుడది $10,000 దాటింది. పైగా, నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరగడం వల్ల కంటైనర్లు తిరిగి రావడానికి రెట్టింపు సమయం పడుతోంది."
క్వాలిటీ దెబ్బతినే ప్రమాదం..
కాఫీ గింజలను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే వాటిలోని తేమ శాతం మారి అరోమా (సువాసన) తగ్గిపోయే ప్రమాదం ఉంది. నాణ్యత తగ్గిన కాఫీని ఎగుమతి చేస్తే, అంతర్జాతీయ మార్కెట్‌లో 'అరకు కాఫీ' బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికి తక్షణమే గిరిజన సహకార సంస్థ (GCC) తక్షణమే రంగంలోకి దిగి నిల్వలను కొనుగోలు చేయాలన్న డిమాండ్ రైతుల నుంచి వస్తోంది.
దీనిపై కేంద్ర కాఫీ బోర్డు అధికారి రమేష్‌ మాట్లాడుతూ మార్కెట్‌ హెచ్చుతగ్గులు మామూలేనన్నారు. జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఇక్కడా ధరలు పెరుగుతాయని చెప్పారు. ఇదే సందర్భంలో యుద్ధం రావడం వల్ల కూడా కొనుగోళ్లు తగ్గాయన్నారు.
మొత్తం మీద ఒకప్పుడు కాఫీ రారాజు అనుకున్న అరకు కాఫీ రైతులు ఇప్పుడు సంక్షోభంలో చిక్కారు. ఇది కేవలం స్థానిక సమస్య కాదు, పూర్తిగా అంతర్జాతీయ సమస్య. యుద్ధం ముగిసినపుడే దీనికి పరిష్కారం లభించవచ్చు. దీంతో “అరకు కాఫీ” రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
Read More
Next Story