అమెరికా శిలాతోరణాల చిత్రశాల సందర్శన
x

అమెరికా శిలాతోరణాల చిత్రశాల సందర్శన

అరుణ శిలల అద్భుత ప్రపంచం అది. అక్కడ దాదాపు 2000 రాతి తోరణాలున్నాయి. అక్కడికి సాగిన యాత్ర మీద గిరిజ పైడిమర్రి యాత్రకథనం

అమెరికా యుటా రాష్ట్రంలో ఉండే ఆర్చెస్ నేషనల్ పార్క్ ఒక ప్రకృతి చిత్రశాల. చూసేందుకు రెండు కళ్ళు చాలని కొండల లాండ్ స్కేప్ అద్భుతాలున్నాయి అక్కడ. ఎవరో శిల్పి ఈ నిర్జన ప్రదేశంలోకి వచ్చి జాగ్రత్తగా ఇక్కడి శిలలను తొలిచి, మొలచి, సాగదీసి, సానబట్టి, వంచి, తోరణాలుగా, ఆకాశాన్నంటే స్తంభాలుగా, రేకులుగా నిలబెట్టాడా అనిపించే అరుణ శిలల అద్భుత ప్రపంచం అది. అక్కడ దాదాపు 2000 రాతి తోరణాలున్నాయి. అక్కడికి సాగిన యాత్ర మీద గిరిజ పైడిమర్రి యాత్రకథనం.


కొలంబస్ నుంచి డెన్వర్ దాకా విమానంలో వెళ్లి అక్కడ నుంచి మా పెద్దబాబు, కోడలుతో కలిసి జీప్ లో యుటా (Utah) లోని మోబ్ (Moab) బయలుదేరాం. ఎనిమిది గంటల ప్రయాణం. అక్కడ ఎయిర్ బీ అండ్ బీ ఇంటిలో ఐదు రోజులు బసచేసి ఆర్చెస్ నేషనల్ పార్క్ (Arches National Park) కేక్యాన్ లాండ్ నేషనల్ పార్క్ (Canyon Land National Park) సందర్శించాలని ప్లాను.

మార్గమధ్యంలో గ్లెన్ ఉడ్ కేన్యాన్ (Glen wood Canyon) దగ్గర ఆగినము. చుట్టూ పెద్దపెద్ద కొండలు, పచ్చని చెట్లు, కొండల పై నుంచి కరిగే మంచును తనలో కలుపుకొని కొండల నడుము ఉధృతంగా ప్రవహించే డెన్వర్ నది. నీటిలో కాళ్లు పెడితే క్షణాల్లో తిమ్మిరి పట్టేశాయి. పిల్లలు నీటిలోంచి బయటకు రమ్మని హెచ్చరిస్తున్నారు కానీ ఆ వాతావరణంలో బయటకు కదలాలని అనిపించలేదు. అలా మనసారా ఆనందించి చుట్టు పక్కల ప్రాంతాలు కూడా చూసుకొని అక్కడ నుంచి కదిలాం. మోబ్ కు రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నాము.


ఆర్చెస్ నేషనల్ పార్కు

అర్చెస్ అంటే కమాన్లు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ దాకా సందర్శించడానికి అనుకూలమైన సమయం. మేము సెప్టెంబర్ 20 , 21 తేదీలలో వెళ్లాము కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉన్నది. Moab నుంచి 8 కిమీ దూరం. 76,518 ఎకరాలలో విస్తరించి వుంది.

సహజసిద్ధంగా ఏర్పడిన ఎర్రరాతి ఆర్చీలు (కమాన్లు) 2 వేలకు పైగా అక్కడ ఉన్నాయి. ఎన్నో బ్యాలెన్స్డ్ రాక్స్ ఉన్నాయి. విభిన్న ఆకారాల్లో వున్న ఎర్రరాతి శిలల అందం చూసి తీరవలసిందే. మొదటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు మేము కరోనా ఆర్చ్ కి బయలు దేరాము. (కరోనా వైరస్ వచ్చిన తరువాత పెట్టిన పేరు కాదు ఇది) మూడు మైళ్లు హైకింగ్. శివ మాధురి ఇద్దరూ పోటీ పడుతూ ఆ అందాలను తమ తమ కెమెరాలలో బందీ చేస్తున్నారు. ఒక చోట మరీ ఏటవాలుగా వున్న రాతి కొండ అంచున ఊపిరి బిగ పట్టు కొని నడిచాను. హమ్మయ్య... అంటూ ఊపిరి పీల్చుకున్న అంతలోనే నాకు మరో సవాలు ఎదురైంది. ఒక నిటారుగా వున్న రాతి కొండ పైకి అక్కడ ఏర్పాటు చేసిన చైను పట్టు కొని ఎక్కాలి. అల్లంత దూరంలో కరోనా ఆర్చీ నన్ను రమ్మని రెచ్చగొడుతున్నది. ఈ టాస్క్ పూర్తి చేస్తేనే నన్ను చేరుకో గలవు అన్నట్టుగా ఎంతో ప్రయత్నించాను. నాలుగైదు అడుగులు ఎక్కాను.... ఇంక నా వల్ల కాలేదు... పిల్లలను వెళ్లమని చెప్పి నెమ్మదిగా కిందికి దిగి ఎక్కే వాళ్లను దిగే వాళ్లను గమనిస్తూ కూచున్నాను.


ఒక అమెరికా అమ్మాయి, 30 ఏళ్లు ఉండొచ్చు, గొలుసు ఊతం కూడా తీసుకోకుండా చకచకా పైకి ఎక్కేసింది. అందులోనే ఒక వృద్ధ జంట ఎప్పుడు పైకి ఎక్కారో తెలియదు. కిందకు దిగడం కనిపించింది. ఆయన దిగి ఆమెకు తన చేతిని అందిస్తూ కిందకు దింపుతున్నాడు. వాళ్లకు 75 ఏళ్ళు పైనే ఉంటాయి. అది కదా జీవితం అంటే అనిపించింది.

నేనే 60 ఏళ్ల వయసులో కూడా రాఫ్టింగ్ , హైకింగ్ లాంటి సాహసాలు చేయగలుగుతున్నా అని అప్పటివరకూ నాలో వున్న ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అది ఆత్మవిశ్వాసం కాదని అతి విశ్వాసం అని తేటతెల్లమైంది. మరింత ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని అర్థమైంది. పౌష్టిక ఆహారం, వ్యాయామం పట్ల మరింత శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నాను.


అదే విషయం పిల్లలకు చెప్పాను. ఇక మీదట సాధ్య పడదని ఒక్క దాన్నే కూచునే పరిస్థితి రాకూడదు అని... ఆరోగ్యం, దృఢత్వం మొదలైన అంశాల చుట్టే మా ముచ్చట సాగింది. భోజనం ముగించుకొని ఇల్లు చేరేసరికి మూడు దాటింది. ముందు ముందు మరింత కఠినంగా వుంటుంది అని పిల్లలు నన్ను ముందే మానసికంగా సంసిద్ధము చేశారు.

మరుసటిరోజు యధావిధిగా ఉదయం మా అరుణ శిలా వీక్షణ మొదలైంది. సోదరి శిలలు, ( sisters rocks ) సమతుల్యతా శిల ( balanced rock ), డబుల్ ఆర్చీ, నార్త్, సౌత్ ఆర్చెస్ (North and south Arches) లాంటి ఎన్నో శిలాకృతులను చూసి ఆశ్చర్యపోయాను.


అప్పటికే సమయం దాటి పోవడంతో ఇల్లు చేరుకొని విశ్రాంతి తీసుకున్నాను. డెలిగేట్ (Delicate Arch) సందర్శన ఈరోజే ఇది యుటా రాష్ట్రా చిహ్నం కూడా. ఆరు మైళ్లు రాతి కొండల మీద పైకి ఎక్కుతూ వెళ్లాలి. అప్పటివరకూ తగిన బూట్లు , వస్త్ర ధారణతో వున్నాను అనే నమ్మకం పటాపంచలైంది. ఇక ముందు చేయబోయే ప్రయాణాలలో ఈ విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. మొత్తానికి పైవరకూ వెళ్లాను. ఆర్చ్ కి ఫర్లాంగ్ దూరం లోనే కూర్చొని దాని అందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఐదారుగురు మాత్రమే ఆర్చీ కింది వరకూ వెళ్లారు. నాలో దాని కింది వరకూ వెళ్లి దిక్కులు పిక్కటిల్లేలాగా అరవాలనే కోరిక బలంగా కలిగింది. కానీ అక్కడికి చేరడం అంత సులభంగా లేదు. అర్ధచంద్రాకారంలో ఏటవాలుగా వున్న రాతి కొండ పైనుంచి అతి జాగరూకతతో అక్కడికి వెళ్లాలి. ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా కాలుజారి కింద లోయలో పడడం ఖాయం. కానీ కరోనా ఆర్చీకి వెళ్లలేకపోయిన వైఫల్యం మనసులో మరింత కసి రేపుతుంది.


ఇదే విషయం శివతో చెప్పాను. ముందు వద్దని వారించినా నా పట్టుదల చూసి కాదనలేకపోయాడు. అంతే.... బయలుదేరాం. శ్రీనా చెయ్యి పట్టు కొని జాగ్రత్తలు చెపుతున్నాడు. ఇద్దరం జాగ్రత్తగా నడుస్తున్నం. ఎంతో కష్టంగా గమ్యాన్ని చేరుకున్నాం అక్కడ నిలబడి ఫోటోలు తీసుకుంటే ఆర్చీ కింద చిన్న ఆట బొమ్మ లాగా ఉన్నాను.

సహజసిద్ధంగా ఏర్పడిన 165 అడుగుల అర్ధచంద్రాకారంలో వున్న అరుణిమతో అలరారుతున్న ఆ ప్రదేశంలో నిలబడి ఒకసారి చుట్టూ కలయజూసినప్పుడు ఆ అద్భుత దృశ్యం నా మనసు లో ముద్రించ బడింది. చీకటి పడక ముందే కిందకు చేరుకోవాలన్న ఉద్దేశంతో అక్కడనుంచి కదలాలని లేకున్నా వెనుదిరగక తప్పలేదు.


అమావాస్య రోజులు కావడం వలన రాత్రి భోజనం చేసి తొమ్మిది గంటలకు బయలు దేరి నక్షత్ర వీక్షణం కొరకు కేటాయించిన ప్రదేశానికి చేరుకున్నాం. కృత్రిమంగా ఏర్పరిచిన నక్షత్రశాలలో తప్ప అన్ని నక్షత్రాలను ఇంతకు మునుపు ఎప్పుడూ చూడలేదు. చుట్టూ కటిక చీకటి , ఎముకలు కొరికే చలి , చుట్టూ ఎత్తైన కొండలు , నిర్మలమైన నీలాకాశం , మిల మిల మెరుపులీనుతున్న తారలు , వాటిలో పాలపుంత...... అబ్బ ! ఆ దృశ్యం ఆ అనుభూతి మాటలకు అందనిది. అపురూపమైన ఆ అనుభవాన్ని మదిలో పదిలపర్చుకొని ఇంటికి చేరేసరికి అర్థ రాత్రి ఒంటిగంట అయింది.


కెనియాన్ లాండ్ నేషనల్ పార్కు

మూవాబ్ నుంచి 32 కి. మీ. దూరంలో ఉన్నది. మొదటి రోజు మేము మేసా ఆర్బీకి వెళ్లాము. 0.6 మైలు హైకింగ్. అక్కడి నుండి గ్రాండ్ వ్యూ పాయింట్ కు నడక మొదలు పెట్టాము. 1.8 మైలు నడిచిన తర్వాత అద్భుతమైన దృశ్యం కళ్ళముందు సాక్షాత్క రించింది. అన్ని కోణాలలో ఆ అందాలను తనివి తీరా వీక్షించి భోజన సమయం దాటి పోతుందని అయిష్టంగానే వెనక్కి మళ్లాము. మరుసటి రోజు 8.2 మైళ్ళు నడిచి సింక్లిన్ లూప్ కి చేరుకున్నాము.


1500 అడుగుల ఎత్తు నుంచి ఆ లోయ అందాలను చూస్తుంటే గొప్ప చిత్రకారుడు చిత్రించిన చిత్రం లాగుంది. కొండ కొనలు రెక్కలు కట్టుకొని ఎగురుతున్న ఒక బ్రహ్మాండమైన అనుభూతి కలిగింది. కొంత మంది అమెరికన్లు తమ కుంచెలతో ఆ అందాలను చిత్రిస్తున్నారు. వాళ్ళు ఆ ప్రకృతిలో లీనమైన తీరు చూస్తే ఆధునిక రుషులలాగా అనిపించారు.

మరుసటి రోజు మాన్యుమెంట్ వ్యాలీకి వెళ్ళాము. మూవాబ్ నుంచి మూడు గంటల ప్రయాణం. వ్యాలీ లోపలికి 15 మైళ్లు కచ్చా రోడ్డులో ప్రయాణం చేయాలి. గుర్రాల మీద వేళ్లే సౌకర్యం ఉన్నది. యాజమాన్యం నడిపే వాహనాలు కూడా ఉన్నాయి. మేము వెళ్ళింది ప్రత్యేకమైన జీపులో కాబట్టి మా వాహనాన్ని లోపలికి అనుమతించారు. అక్కడక్కడా ఆగుతూ పరిసర అందాలను ఆస్వాదిస్తూ ముందుకు కదిలాము.


ఇక్కడ ఫారెస్ట్ గంప్ (Forrest Gump 1994) అనే హాలీవుడ్ సినిమాలోని కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. అమీర్ ఖాన్ ఈ సినిమాను లాల్ సింగ్ చడ్డా పేరుతో హిందీలో రీమేక్ చేశాడు. అక్కడక్కడా కొన్ని చెట్లు కనిపించాయి. వాటికి మన రుద్రాక్షల లాంటి చిన్నచిన్న కాయలున్నాయి. వాటితో నగలు తయారు చేస్తారు. అలాంటి నగలు నేటివ్ అమెరికన్స్ అమ్ముతూ ఉంటారు. కొనాలని చూసాను కానీ ఒకే వరుసతో సింపుల్ గా కనిపించలేదు.


మేము ఉన్న ఇంటి కిటికీలో నుంచి కూడా ఆ ఎర్రటి కొండలు పొద్దస్తమానం మాకు కనువిందు చేశాయి. అద్భుతమైన ప్రకృతి అందాలను వీక్షిస్తూ బండలూ కొండలూ ఎక్కుతూ దిగుతూ నడుస్తూ ఐదు రోజులు అలా గడచి పోయాయి. అలసట అన్నదే తెలియలేదు. వారం రోజుల మా ప్రయాణం లో రానూ పోనూ రెండు రోజులు ప్రయాణానికి పోను ఐదు రోజులలో రెండు నేషనల్ పార్కులు చూసుకొని తరువాత ట్రిప్ ఎక్కడికి వెళితే బాగుంటుంది ? అనే ముచ్చట్లతో ఇల్లు చేరాము.

Read More
Next Story