అమరావతిలో వీఐపీ టౌన్‌షిప్
x
నిర్మాణాలు పూర్తయిన ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు

అమరావతిలో వీఐపీ టౌన్‌షిప్

భారీ ఖర్చుల మధ్య రూపు దిద్దుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ ల క్వార్టర్లు, ఇప్పటి వరకు అద్దె ఇళ్లలో జీవనం.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అంశమైన వీఐపీ టౌన్‌షిప్ పనులు వేగవంతమవుతున్నాయి. మంత్రులు, జడ్జీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులకు అత్యాధునిక బంగళాలు, క్వార్టర్ల నిర్మాణం కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు ఖర్చులు ఆశ్చర్యకరంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజధాని అభివృద్ధికి ఇది వరమా లేక భారమా అనే చర్చ మరోసారి రేగుతోంది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆశలు ఒకవైపు, ఆర్థిక భారం మరోవైపు. ఇది అమరావతి కథలో కొత్త ట్విస్ట్.


పూర్తి కావొచ్చిన ఎమ్మెల్యే, ఎంఎల్సీల క్వార్టర్లు

వీఐపీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లకు రూ. 1,300 కోట్లకు పైగా ఖర్చు

ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులకు నేలపాడు సమీపంలో 432 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఇప్పటికే రూ. 524.70 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 288 క్వార్టర్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, 144 బంగళాలు ఐఏఎస్ అధికారులకు, 144 అపార్ట్‌మెంట్లు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు కేటాయించారు. అదనంగా మంత్రులు, జడ్జీలకు 71 బంగళాలకు రూ. 401.37 కోట్లు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలకు 115 బంగళాలకు రూ. 411.37 కోట్లు టెండర్లు పిలిచారు పనులు కూడా 50శాతం పైనే పూర్తయ్యాయి. మొత్తంగా ఈ వీఐపీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లకు సంబంధించి రూ. 1,300 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా.


80 శాతం పూర్తయిన మంత్రుల క్వార్టర్లు

పెరిగిన ఖర్చులు

గత టీడీపీ ప్రభుత్వం (2014-19)లో ఈ పనులు ప్రారంభమై రూ. 9,617.21 కోట్ల అంచనా వ్యయంతో 17 ప్రాజెక్టులు చేపట్టారు. అందులో రూ. 1,958.37 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగిలినవి 80 శాతం వరకు పురోగతిలో ఉన్నాయి. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం (2019-24)లో పనులు నిలిచిపోవడంతో ఖర్చులు 15 శాతం పెరిగాయి. అంటే అదనంగా రూ. 7,500 కోట్లుగా అంచనా. మంత్రులు, జడ్జీల బంగళాలు (73 యూనిట్లు) పూర్తి చేయడానికి మాత్రమే అదనంగా రూ. 264 కోట్లు అవసరమయ్యాయి. ఇప్పుడు మళ్లీ పనులు వేగవంతం చేస్తున్నారు. మార్చి 2026 నాటికి మిగిలిన భవనాలు పూర్తి చేయాలని మంత్రి పి నారాయణ ఆదేశించారు.

అమరావతి ఊరుగా కనిపించాలనే తాపత్రయం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశలు ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నాయి. ‘‘ఈ బంగళాలు, క్వార్టర్లు పూర్తయితే జన సంచారం పెరిగి అమరావతి ఒక ఊరుగా కనిపిస్తుంది’’ అని ఆయన అంటున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని అధికారిక భవనాలు సాయంత్రం మూసేస్తే నిర్మానుశ్యంగా మారిపోతున్నాయి. వీఐపీలు ప్రస్తుతం విజయవాడ, గుంటూరులో రెంటెడ్ ఇళ్లలో ఉంటున్నారు. ఇది ప్రభుత్వానికి ఏటా లక్షల రూపాయల భారం. కొత్త టౌన్‌షిప్‌తో ఈ సమస్య పరిష్కారమవుతుందని, రాజధాని జీవంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ. 7,380 కోట్ల నబార్డ్ రుణం, గవర్నర్ రెసిడెన్స్‌కు రూ. 169 కోట్లు వంటి అదనపు కేటాయింపులు ఉన్నాయి.


పూర్తి కావచ్చిన కార్యదర్శుల భవనాలు

స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా మారుతుందా?

ఈ భారీ ఖర్చులు ప్రజా ధనంపై భారం పడకుండా ఉండాలంటే, అమరావతి 'స్వయం సమృద్ధి' ప్రాజెక్టుగా మారాలి. 2025-26 బడ్జెట్‌లో రాజధానికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం దీనికి నిదర్శనం. భూమి విక్రయాలు, ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా నిధులు సమకూర్చుకోవాలి. కానీ గత ఐదేళ్ల నిలిపివేత వల్ల ఇప్పటికే రూ. 7,500 కోట్ల అదనపు భారం పడింది. ఇది ప్రజలపై పన్నుల రూపంలో తిరిగి వస్తుందా? విపక్షాలు ఇప్పటికే ఈ ఖర్చులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఆర్‌డీఏ భవన నిర్మాణానికి రూ. 160 కోట్ల అదనపు కేటాయింపు వంటి వివాదాలు (మొదటి అంచనా రూ. 82 కోట్లు) అవినీతి ఆరోపణలకు దారితీస్తున్నాయి.

మొత్తంగా వీఐపీ టౌన్‌షిప్ అమరావతిని జీవంతంగా మార్చే అవకాశం ఉంది. కానీ ఖర్చుల నియంత్రణ, పారదర్శకత లేకుంటే ఇది మరో ఆర్థిక బాంబుగా మారవచ్చు. ప్రభుత్వం ఈ ట్విస్ట్‌ను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

Read More
Next Story