
పేడతో గ్యాస్: నెలకు లక్ష ఆదా చేస్తున్న గ్రామం
అనకాపల్లి జిల్లా పి.ఎల్.పురంలో బయోగ్యాస్‌తో వంట, విద్యుత్. నెలకు లక్ష వరకు ఖర్చు ఆదా చేస్తున్న సక్సెస్ మోడల్.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలు, హోర్ముజ్ సముద్ర మార్గంలో నౌకాయానానికి అంతరాయం... ఇవన్నీ ప్రపంచ ఇంధన సరఫరాను కుదిపేస్తున్నాయి. ఆ ప్రభావం భారతదేశంలోని సాధారణ కుటుంబాల వంటింటి వరకు చేరింది. ఎల్‌పీజీ సిలిండర్ల కొరత, పెరిగిన ధరలు ఇవి ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారాయి.
ఇలాంటి సంక్షోభ సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామం మాత్రం ఈ సమస్యకు దశాబ్దం క్రితమే పరిష్కారం కనుగొంది.
ఒక విద్యా సంస్ధలో అతి తక్కువ ఖర్చుతో వంట గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. దాని ద్వారా విద్యుత్ కూడా తయారు చేస్తున్నారు. త్వరలో వాహనాలు కూడా ఈ గ్మాస్‌తో తిరిగే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.
బయో గ్యాస్ ప్లాంట్ వద్ద నరసింహరావు
పి.ఎల్.పురం - స్వయం సమృద్ధికి చిరునామా
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట సమీపంలోని పి.ఎల్.పురం గ్రామం. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో విస్తరించిన 50 ఎకరాల వ్యవసాయం , పాడి సముదాయం. ఇక్కడ 400కు పైగా ఆవులు, గేదెలతో నడిచే డెయిరీ ఫామ్ మాత్రమే కాదు, ఇది ఇప్పుడు ఒక ఎనర్జీ ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఈ వ్యవస్థ వెనుక ఉన్న వ్యక్తి మెకానికల్ ఇంజనీర్, రైతు సిహెచ్.వి.కె. నరసింహారావు.
వ్యర్థం నుంచి వనరుగా... శాస్త్రీయ ప్రయోగం
గ్రామాణ ఆర్థిక వ్యవస్థకు అతి ముఖ్యమైనవి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ. అయితే కొంత కాలంగా రైతులు ఈ రంగాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆర్థికంగా స్వయం సమృద్ధం కాలేకపోతున్నారు. డెయిరీ యూనిట్లు, పాడి పశువుల పెంపకం ద్వారా మన మూలాలు వీటిలోనే ఉన్నాయనే విషయాన్ని మళ్లీ గుర్తు చేయడానికే ఈ రంగంలోకి వచ్చానంటారు నరసింహారావు.
బయో గ్యాస్‌తో వంటలు
“ రెండు సంకరజాతి అవులతో 1990 లో పశుపోషణ మొదలు పెట్టాం. ప్రస్తుతం 400లకు పైగా జెర్సీ ఆవులు, ము రా, గోదావరి గేదెలు ఉన్నాయి. పాలు నాణ్యత విషయంలో రాజీ పడక పోవడం వల్ల డెయిరీ నష్టాల్లో నడిచేది. దీని నుండి ఎలా బయట పడాలని ఆలోచించి నపుడు పాల కంటే విలువైన పయోజనాలు పశువుల నుండి చాలా ఉన్నాయిని గుర్తించాం. రోజూ వచ్చే వందలాది టన్నుల పేడను ఉపయోగించి, శాస్త్రీయ పద్ధతిలో 6 ట్యాంకులతో గోబర్ గ్యాస్ ప్లాంట్‌ని పారంభించాం. ఒక్కో ప్లాంట్ నుండి 85 క్యూబిక్ మీటర్ గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ప్లాంటు నిర్వహణకు కేవలం 6 గురు ఉద్యోగులు సరిపోతారు. ’ అంటారాయన.ఈ ప్లాంట్‌లో ఒక్కో యూనిట్ నుంచి సుమారు 85 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. 2007లో ప్లాంట్ ఏర్పాటయినప్పుడు దేశంలోనే మొదటిదని, రా ష్టంలో బయోగ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసిన ఏకైక సంస్థ తమదేనని ఆయన చెప్పారు.
నరసింహారావు పాడి రైతే కాదు, విద్యావేత్తగా శ్రీ ప్రకాశ్ విద్యా నికేతన్ అనే విద్యా సంస్థను డెయిరీ క్యాంపస్‌లోనే నిర్వహిస్తున్నారు.
పశువుల శాల
700 మందికి భోజనం... ఎల్‌పీజీ అవసరం లేదు!
ఈ క్యాంపస్‌లో నడిచే శ్రీప్రకాష్ విద్యాసంస్థ హాస్టల్‌లో రోజూ 700 మందికి వీరు సొంతంగా తయారు చేస్తున్న గోబర్ గ్యాస్ ద్వారా వంటలు తయారవుతున్నాయి,
‘ ఈ హాస్టల్ నిర్వహణకు ఎల్‌పీజీ వాడితే నెలకు 50 నుండి 60 సిలిండర్లు కావాలి,రూ.1,00,000 నుండి 1,20,000 వరకు ఖర్చు అవుతుంది. అదే బయోగ్యాస్ వాడితే కొన్ని వందలు మాత్రమే ఖర్చు అవుతుంది’ అంటారు నర్సింహరావు.
‘గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూసే పరిస్థితి మాకు లేదు. రోజూ వంట గ్యాస్ మన దగ్గరే తయారవుతోంది.’ అంటారు హాస్టల్ కిచెన్ ఇన్‌ఛార్జ్ వెంకట రమణ.
బయో గ్యాస్ ట్యాంక్‌లు
గ్యాస్ మాత్రమే కాదు... విద్యుత్ కూడా
నరసింహారావు ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే, బయోగ్యాస్‌ను విద్యుత్ ఉత్పత్తికి కూడా వినియోగించారు. ఒక దశలో రోజుకు 100 కిలోవాట్ల విద్యుత్ తయారు చేశారు. అయితే ప్రస్తుతం గ్యాస్‌ను పూర్తిగా వంటకు వినియోగిస్తున్నారు.
ఒకే వనరుతో 3 ఉపయోగాలు
ఈ బయో గ్యాస్ ప్లాంట్ వల్ల వంటగ్యాస్ , విద్యుత్ , ఎరువులు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ప్లాంట్ నుంచి వచ్చే స్లరీతో సంవత్సరానికి 200 మెట్రిక్ టన్నుల వర్మీ కంపోస్టు,
400 మెట్రిక్ టన్నుల సేంద్రియ ఎరువులు తయారు అవుతున్నాయి. దీంతో పంటలకు ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గింది.రసాయన ఎరువులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. ‘ పాలు అమ్మడం మాత్రమే పాడి పరిశ్రమ కాదు. పశువుల నుంచి వచ్చే ప్రతి వనరును ఉపయోగించగలిగితేనే రైతు నిజంగా లాభపడతాడు. పేడను వ్యర్థంగా వదిలేస్తే అది సమస్య. అదే బయోగ్యాస్‌గా మార్చితే శక్తి. ఇప్పటి గ్యాస్ సంక్షోభం చూస్తుంటే, ప్రతి గ్రామంలో కనీసం ఒక బయోగ్యాస్ ప్లాంట్ ఉండాలి అనిపిస్తోంది. ఇది కేవలం ఖర్చు తగ్గించడం కాదు... ఇది గ్రామీణ స్వయం సమృద్ధికి దారి.’ ’ అంటారు తన పశువుల శాల వైపు అడుగులు వేస్తూ.
మర్రాజాతి గేదెలతో నరసింహారావు
ఈ మోడల్‌ను చూసి ఇప్పటికే అనేక మంది రైతులు మినీ డెయిరీలు, చిన్న బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. 60 మందికి పైగా రైతులు ఇక్కడ శిక్షణ తీసుకుని తమ గ్రామాల్లో అమలు చేస్తున్నారు. ‘మా ఇంట్లో పదేళ్లుగా ఎల్‌పీజీ సిలిండర్ అవసరం పడలేదు. మా గ్యాస్ మేమే తయారు చేసుకుంటున్నాం.’ అన్నారు ఒక రైతు.
భవిష్యత్తు లక్ష్యం: వాహనాలకు బయోగ్యాస్
నరసింహారావు తదుపరి లక్ష్యం మరింత పెద్దది. కాంప్రెస్డ్ బయోగ్యాస్ (్పుదీG) తయారు చేసి వాహనాలకు ఇంధనంగా వినియోగించాలి.
“డీజిల్‌కు బదులుగా బయోగ్యాస్ వాడితే కర్బన ఉద్గారాలు 80% వరకు తగ్గుతాయి. గ్రామాలే ఇంధన కేంద్రాలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవు” అంటారు ఆయన.
పి.ఎల్ పురంలోని బయోగ్యాస్ ప్లాంట్ వద్ద నరసింహారావుతో జర్నలిస్ట్ శ్యాంమోహన్.
సంక్షోభం ఇచ్చిన పాఠం
ఎల్‌పీజీ వంట గ్యాస్ కొరత మనకు ఒక పెద్ద పాఠం చెబుతోంది,ఇంధనం కోసం పూర్తిగా బయటి ప్రపంచంపై ఆధారపడటం ప్రమాదకరం. మన గ్రామాల్లోనే ఉన్న వనరులను వినియోగంలోకి తేవాలి. ఆహార పదార్ధాలు, పశువుల వ్యర్ధాలను సరైన విధంగా వినియోగిస్తే ప్రతి గ్రామం ఒక చిన్న గ్యాస్ ప్లాంట్‌గా మారవచ్చు
గ్యాస్ కొరత ఒక సమస్య కాదు... అది ఒక మార్పుకు సంకేతం.
పి.ఎల్.పురం చూపించిన దారి స్పష్టంగా చెబుతోంది: సొంతంగా గ్యాస్ తయారు చేసుకోవచ్చు. ఖర్చు తగ్గించుకోవచ్చు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు’ మనం ఆ దిశగా అడుగు వేస్తామా?

