వర్షం లో ఒక రోజు (కవిత )
x

సోర్స్: Pinterest

వర్షం లో ఒక రోజు (కవిత )

డా. చెంగల్వ రామలక్ష్మి Sunday Poem



-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి


ఏ అర్థరాత్రి మొదలైందో అందమైన వాన తెల్లవారుతున్నా కురుస్తూ, మురిపిస్తోంది
ఆమె తెల్లవారుజామున నాలుగింటికి లేచింది, దంతధావనం ముగించి,
ఆ వీధి నుంచి ఈ వీధికి విస్తరించిన రైలుపెట్టెల పాతింటిని
ఆణువణువు శోధించి శుభ్రం చేసింది.

స్నానించి వచ్చాక ఆమె వంటిల్లు అగరొత్తుల పరిమళంతో గుభాళించింది.
ముందు గదిలో టీ. వీ. మోత, మధ్యగదిలో పిల్లల కేకలు,
వెనక వైపు వర్షంహోరులో వంటింట్లో దేవుడికే కాదు
తనకే అర్థం కాని పూజను ముగించాననిపించుకుంది.

ఒక పక్క పిల్లలకి పాలు, మరో పక్క వంట, మధ్య మధ్య సింకులో గిన్నెలప్రక్షాళన,
ఇంకో పక్క వాషింగ్ మిషన్..
అష్టావధానం చేస్తూ,
ఆ ఇరుకు వీలులో వర్షాన్ని ఆస్వాదిస్తూ, మధ్యమధ్య టీ చుక్కలను నోట్లో పోసుకుంటూ

స్టీలు సామాను కొట్టులా భోజనాలు సర్దిన డబ్బాలను టేబుల్ మీదకు చేర్చింది

అందర్నీ బైటకి పంపి, ఎదురుగా కనిపించిన చీర లోకి మారి,
కనిపించని కళ్ళజోడును వెతుక్కుంటూ,
ఆగని వర్షాన్ని తిట్టుకుంటూ,
ఎండకి, వానకి
తన తోడు -నీడ గొడుగును పట్టుకుని బైటకు నడిచింది

వర్షం ఎవరి కోసం ఆగదు.
ఎవరూ వర్షం కోసం ఆగరు

చిన్న చిన్న పిల్లకాలువలు, వైతరణి నదులు ఈదుకుంటూ ఆమె బడికి చేరుకొని,
మనసైన పాఠాలను, మనసేలేని విద్యార్థులకు జీతం మీద మనసుతో చెప్పి వచ్చింది

తన కోసం ప్రేమగా ఎదురు చూస్తున్న
వంటింట్లోకి చొరబడి, వర్షపు ఆనవాయితీని పాటిస్తూ వేడి వేడి పకోడీలను భర్త, పిల్లలకు అందిస్తూ,
కాగితపు పడవలు,
వానా వానా వల్లప్ప ఆటల బాల్యపు వర్షానందాన్ని
నెమరు వేసుకుంటుంటే

ఆకాశం లో మెరుపులు, ఆమె పెదవులపై చిరు దరహాసం
ఒకేసారి తళుక్కున మెరిసి అలసట ను మాయం చేసేసాయిu


Read More
Next Story