పాలమూరు వలస బతుకుల చేదు నిజాల ‘ఉయ్యాల’
x

పాలమూరు వలస బతుకుల చేదు నిజాల ‘ఉయ్యాల’

ఈ పుస్తకంలో ఏడు కథలున్నాయి. మనసు పెట్టి ఏ కథను చదివినా అవన్నీ ఏడుపొచ్చే వెతలే.


దేశంలో మనం గర్వంగా చెప్పుకునే ఏ భారీ ప్రాజెక్టును చూసినా, వాటి కింద నలిగి, నశించి, కృశించి పోయింది పాలమూరు కార్మికుల బతుకులే! ఉన్న ఊరిని, కడుపున పుట్టిన బిడ్డల్ని, కన్న అమ్మా నాయనల్ని ఒదిలేసి, పనుల కోసం కశ్మీర్ వెళ్లినా, బొంబాయి వెళ్లినా, భోపాల్ వెళ్లినా, చివరికి వైజాగ్ వెళ్లినా చచ్చిపోయింది పాలమూరు కార్మికులే! టిప్పర్లు బోల్తాపడిన ప్రమాదాల్లో ప్రాణాలు పోగుట్టుకున్నది పాలమూరు కార్మికులే! బతకలేక ఆత్మహత్యలు చేసుకున్నది పాలమూరు కార్మికులే! దుబై షేకులకు అమ్ముడుపోయింది పాలమూరు కార్మికులే. వలసపోయి నాశనమయ్యింది పాలమూరు కార్మికులే!


చరిత్ర పుటలకెక్కని ఈ కథలన్నీ, ఈ వెతలన్నీ సజీవంగా కావాలిప్పుడంటే ఎక్కడా దొరుకుతాయి!? గీతాంజలి రాసిన ‘పాలమూరు వలస కథలు-1’ ‘ఉయ్యాల’ చదవితే తప్ప ఎక్కడా దొరకవు! విషాదంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల ఏడుగురు అప్పచెల్లెళ్ల లాగా, ఈ పుస్తకంలో ఏడు కథలున్నాయి. మనసు పెట్టి ఏ కథను చదివినా ఏడుపొచ్చే వెతలే. పాలమూరు నేలను ఒరుసుకుంటూ తుంగభద్ర ప్రవహించినా, కృష్ణమ్మ పరవళ్లు తొక్కినా, భీమా నది సాగినా శ్రీశ్రీ అన్నట్టు అవి ‘శిశువుకు దక్కని స్థన్యమే’ మరి. అందుకునే దశాబ్దాలుగా పాలమూరు కార్మికులు వలసలు పోతున్నారు.

పాలమూరు కార్మికుల వలసలు కూడా నెలల తరబడి, ఏళ్ల తరబడి ఎందుకిలా!? అంటే నేలకు తీరని దాహం, మనుషులకు తీరని దాహం, పశువుల కూ తీరని దాహ మే. భూములు ఏళ్ల తర బడి బీళ్లుపడి దాహంతో నోళ్లు తెరుచుకుంటున్నాయి. వర్షాలు పడక, నీళ్లు లేక కుంటలు బావులు బావురు మంటున్నాయి. చెలకల దప్పిక తీర్చలేమంటూ ఎండిపోయిన చెరువులు చేతులెత్తేశాయి. తుంగభద్ర, కృష్ణమ్మ కూడా వలసలు పోవడం కాదు, పాలమూరు కార్మికులు వలసపోయినట్టు వాటిని కూడా తీసుకెళ్లిపోయారు.



‘‘నీ బుచ్చి బుచ్చి కాల్లకు..ఎండి గజ్జెలెందుకు కొనలేదే నీ బద్మాష్ తల్లి? బాగా సద్వల్లంటే గాఎండి గజ్జెల ఆశ ఎందుకు పెట్టిండే మీ అయ్య?’’ అంటూ స్పృహలో లేని పన్నెండేళ్ల కూతురు మంగ పడుకున్న మంచం కేసి తల కొట్టుకుంటూ భాగ్యమ్య ఏడవడానికి అసలు కారణమేంటి? తండ్రి, అక్క మరణించడం, అప్పులు, వాటికి మిత్తి కట్టలేక కూతురిని కూడా చదువు మాన్పించి పూల దుకాణంలో పెడితే, వెండి గజ్జెల ఆశ చూపించి సేట్ కొడుకు మోసం చేస్తాడు. ఉన్న ఊళ్లో బతకలేక వలసపోయి ‘ఎండి గజ్జెల్లో మోసపోయింది ఈ పాలమూరు బిడ్డే. పరికిణీ తొడుక్కుని, వెండి గజ్జెలు కట్టుకుని, ఘల్లు ఘల్లుమని శబ్దం చేస్తూ నడవాలనే ప్రతి ఆడ పిల్లకుండే చిరు కోరిక మంగది. అది కూడా తీర్చలేకపోయిన ఆ తల్లి దారిద్య్రం, నిస్సహాయత ‘ఎండి గజ్జెలు’ లో కళ్లముందు కదలాడుతుంది.


దేశానికి తిండి పెట్టిన రైతులు కూలీలుగా కశ్మీర్ కు వలస వెళ్లి, అక్కడ చలికి తట్టుకోలేక పారిపోయి ఢిల్లీ చేరి, అక్కడ ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ, భాష తెలియని దేశ రాజధానిలో అన్నదాతలు అడుక్కుంటున్న విషాదకర దృశ్యాన్ని ‘పాలమూరు నుంచి కశ్మీర్ దాకా’ కథలో చూస్తాం. చీకటి, చలి, ఆకలి, దారిద్య్రం వాళ్లను వెంటాడుతుంది. ఆకలికి తట్టుకోలేక కింద పడి పొర్లుతున్న చిన్న పిల్ల గోదావరిని చివరికి అమ్ముకోడానికి కూడా వెనుకాడని దైన్యం వారిది. ‘ఓ అమ్మ, నాయ్నా నన్ను అమ్మకున్రి’ అంటూ గోదావరి ఏడ్చే ఏడుపు కలిచివేస్తుంది.

విజయవాడ వస్తే, చుట్టూ ఎటు చూసినా పచ్చని పంట పొలాలు. కనకదుర్గమ్మ గుడి దగ్గర పాత మేస్త్రీ కనిపించి వ్యవసాయ పనులిస్తాడు. ‘‘కరువుతో దేశం మీనకు పోయి మన కర్మమేమిటి? కుక్కల తీరు హీనంగా, నీచంగా బిచ్చగాల్ల తీరు గోజారుత..ఆకలికి పేగులారి కన్న బిడ్డ్నమ్ముకుంటూ పోతాంటే..వీల్ల కేమో మన ఊర్లకెల్లి వచ్చిన నీల్లతోని పుట్టల కొద్ది పంటలు పండుడు, దానికి మనం కూలోల్లుగా, జీతం కోసం మన రాజ్యం, మన మనుషులను ఇడ్సి వచ్చుడు’’ అంటూ బాధతో కొమరయ్య అనుకుంటాడు.

పగలంతా జీతం కోసం నాట్లు వేసి, ఇక్కడ పుట్ల కొద్ది పంట పండించడ మేమిటి? ఎటు చూసినా పచ్చని పంటపొలాలు, సముద్రం లాగా కృష్ణమ్మ. అక్కడ పాలమూరులో ఎండిపోయి, పూడికలు తీయని చెరువులు, పాతాళానికి వెళ్లిన బావులు మన ఖర్మమేమిటి? అక్కడ బక్కచిక్కిన కృష్ణమ్మ, తుంగభధ్రలు, బీడు పడ్డ లక్షల ఎకరాలు. కబేళాలకు తరలుతున్న పశువులు. ఇది పాలమూరు ముఖచిత్రం. ఆ ముఖ చిత్రాన్ని చూస్తుంటే పాలమూరు కూలీల్లో కృష్ణమ్మ లాగా ద:ఖం ప్రవహిస్తుంది. మన పాలమూరు దగ్గర ఉండే మన క్రిష్ణమ్మను ఇక్కడికి తీసుకొచ్చి కట్టేశారంటూ ఆవేదన.

పాలమూరులో నీటి సమస్య, కరువుతో పాటు దొరల పెత్తనమూ సాగుతోంది. లక్ష్మయ్య పట్టినప్పుడు దొరసానికి కూడా కొడుకు పుడతాడు. దొరసానికి పాలు పడలేదని లక్ష్మయ్య తల్లిని వచ్చి తన కొడుకుకు పాలు పట్టమంటుంది. మిగిలిన పాలను పిండేయిస్తుంది. పాలు లేక లక్ష్మయ్య అల్లాడుతాడు. కన్న బిడ్డకు పాలివ్వలేని తల్లి, దొర బిడ్డకు పాలివ్వడాన్ని క్రిష్ణమ్మ పాలమూరును తడపకుండా, కోస్తా జిల్లలాలను తడుపుతోందన్న బాధన పోల్చడం ఒక వైచిత్రి. ఎప్పటికైనా మన పాలమూరు పోమా అన్న ఆశ తో కథ ముగుస్తుంది.

‘క్రిష్ణమ్మ’ కథ కూడా పాలమూరు వలస కూలీల వెతల్లో భాగమే. పనుల కోసం వేరే ప్రాంతం వెళ్లిన పాలమూరు కూలీలు ప్రయాణించే టిప్పర్ బోల్తా పడి ఎనిమిది మంది మరణిస్తారు. కొందరు బతికినా ఒళ్లంతా గాయాలే. నీళ్లెక్కడ? చెరువులు ఎండిపోయాయి, క్రిష్ణ, తుంగభద్ర, ఊరి మీదనే అలిగి కూచున్నాయి. ఊళ్లొ గుడిసెలు, ఇళ్లు అన్నీ తాళాలు వేసుకుని అంతా వలస వెళ్లిపోతున్నారు. ఊళ్లో నీళ్లుంటే ఈ కరువుండదు, ఈ వలసలుండవు.

చివరికి పీనుగుల టిప్పర్ వచ్చేసరికి ఏడుపులు సోకన్నాలు. మేస్త్రీలతో పోలీసులు కుమ్మక్కయ్యారు. చచ్చిపోయిన వారికి పదివేల చొప్పు ప్రభుత్వం ఇస్తానంటోంది. పీనుగుల పైన కూడా మధ్య దళారుల సంపాదన. చంద్రమ్మ బిడ్డకు పాలుపడుతుంటే, పాలు రావడం లేదు కానీ, ఆమె కళ్లలోంచి నీళ్లొస్తున్నాయి.

ఈ కథలో ధనిక రైతు దొర రామిరెడ్డి పరిస్థితి కూడా కూలీల పరిస్థితికి ఏమాత్రం భిన్నంగా లేదు. కరెంటు కని, విత్తనాలకని, బోర్ల కని అప్పులు చేశాడు. ఇవిగో నీళ్లొస్తయి, అవిగో నీళ్లొస్తయి అని దొరసాని ఒంటి మీద ఉన్న బంగారం కాస్తా అమ్ముకుని మూడు సార్లు బోర్లు వేయించాడు. ధనిక రైతుకు కూడా అసలు ఎందుకీ దుస్థితి వచ్చింది?

వ్యవసాయంలో కూడా విదేశీ కంపెనీలు చొరబడ్డాయి. సంప్రదాయ పంటల బదులు వాణిజ్య పంటలు వేయమని ప్రభుత్వమే ప్రోత్సహించింది. దాంతో కందులు, మినుములు, పల్లీలు వేసే రామిరెడ్డి కూడా మూడేండ్ల బట్టి పత్తి వేస్తున్నాడు. కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందుల వల్ల నష్టం వచ్చి అప్పులపాలయ్యాడు. దానికి తోడు వర్షాలు లేవు. దొర కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎంత మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నా, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందు కంపెనీల మీద ప్రభుత్వ చర్య ఉండదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రతి పౌరుడు పన్నులు కడుతున్నాడు. రైతులే కాదు, కూలీలు కూడా కట్టే పన్నుల తోనే ప్రభుత్వం నడుస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడలేనప్పుడు ఈ పాలనా యంత్రాంగం దేనికి? ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టడం దేనికి? రాజకీయ నాయకులను, ప్రభుత్వాన్ని ఇలా మేపడం దేనికి?

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. ప్రభుత్వం విదేశీ కంపెనీలకు తలుపులు బార్లా తెరిచింది. విదేశీ కంపెనీలకు లాభ నష్టాలే తప్ప మంచి చెడులతో సంబంధం లేదు. ఆత్మహత్యలతో ఇలా రైతులు, కూలీలు సర్వ నాశనమైపోతున్నారు. విదేశీ కంపెనీలపైన ప్రభుత్వానికి ఏ మాత్రం అదుపు లేదు. పైగా ఆ విదేశీ కంపెనీల అదుపులో రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు పనిచేయడం, దీన్ని ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడం ఎంత ఆత్మవంచన !

వలస వచ్చిన కూలీలకు మేస్త్రీ పెట్టే తిండి చాలా దారుణంగా ఉంటుంది. రోజూ నూకలన్నం, చింత పులుసు తిని గొడ్డు చాకిరీ చేయాలి. వారానికొక సారి నీళ్ల పప్పు చారు. పదిహేను రోజులకొకసారి నాలుగు యాటముక్కల కూర. కూలీలతో మేస్త్రీల వ్యహహారం పొదుగు కోసి పాలు తాగినట్టుగా ఉంటుంది. బిడ్డకు పాలిచ్చి వస్తానన్నా పంపించరు. కాళ్ల మీద పడినా కనికరించరు.

కృష్ణమ్మ కథలో ‘‘చెల్లి యాడ్త్సాంది పాలిద్దు రా’’ అంటూ మూడవ అంతస్తులో ఉన్న తల్లి చంద్రమ్మను పిలుస్తూ కృష్ణమ్మ జారి, పొయ్యి కిందపడిపోయి తీవ్రంగా గాయపడుతుంది. హైద్రాబాదు ఉస్మానియాకు తీసుకెళ్లాలంటే మేస్త్రీ ఖర్చు పెట్టడు. హైదరాబాదుకు రైల్లోనే పంపుతాడు. రైల్లోనే కృష్ణమ్మ చనిపోతుంది. ఏడిస్తే శవాన్ని రైల్లో తీసుకెళ్లకూడదని దింపేస్తారు. ఏడుపును కూడా దిగమింగుతూ పాలమూరుకు బయలుదేరుతారు.

ఇది వాస్తవ గాథ. నిజాకి కృష్ణమ్మ బొంబాయిలోనే చనిపోతే, బతికున్న మనిషిని తీసుకొచ్చినట్టు, చంద్రమ్మ, సాలయ్యదారి పొడవునా ద:ఖాన్ని దిగమింగుకుంటూ, హైదరాబాదు వచ్చాక గుండెలు పగిలేలా ఏడుస్తారు. కృష్ణమ్మ కథ ముగిసే సమయానికి కళ్లను నీటి పొరలు కమ్మేస్తాయి.

‘పోలేపల్లి పీనుగను మాట్లాడుతున్నా’ కథ ఒక మార్మిక వాస్తవికత (మ్యాజిక్ రియలిజం). అంటే ఒక వాస్తవాన్ని కాస్త మార్మికంగా చెప్పడం. ఈ కథలో పీనుగ మాట్లాడడమన్నది ఒక మార్మికం. పీనుగ మాట్లాడినట్టు చెప్పేదంతా వాస్తవం. ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఏడాదికి రెండు పంటలు పండేవి. పొలంలో ఇంటిల్లి పాది కష్టపడే వాళ్లు. కానీ ఇప్పుడలా లేదు. మహబూబ్ నగర్ అంటే కరువుకు పర్యాయపదంగా మారింది.

పోలేపల్లిలో పొలాలకు కరెంటు సరఫరా సరిగా చేయకపోవడం, విత్తనాలు దొరకకపోవడం, దొరికినా కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందుల దొరకడం, బావుల్లో బోర్లు వేసినా నీళ్లు పడకపోవడం, పండిన పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడం, రుణాల కోసం వెళితే బ్యాంకులు ఇబ్బంది పెట్టడం, అప్పు సరిగా కట్టడం లేదని ఇళ్లమీద పడి పరువు తీయడం వంటి వన్నీ తెలుగు దేశం పాలనలో జరిగిపోతున్నాయి. కాంగ్రెస్ వచ్చాక రైతు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండళ్లు పేరుతో భూములను, ఇళ్లను లేగేసుకుంటోంది. భూములను ఇవ్వనన్న వారి పంట పొలాలకు నిప్పు పెట్టిస్తుంది. అరవిందో ఫార్మసీ కంపెనీ కోసం ప్రభుత్వమే బలవంతంగా భూసేకరణను చేపట్టింది. భూములు కోల్పోయిన వాళ్లకు కంపెనీలో ఉద్యోగం ఇస్తామన్నారు కానీ, శవం మట్లాడుతోందని రచయిత్రి చెపుతున్న ఆ రైతు పెంటయ్యకు వయసు ఎక్కువని ఉద్యోగం ఇవ్వకుండా అతని కొడుక్కి ఇస్తారు.

రైతు బిచ్చగాడైపోయాడు. ఇల్లు కూడా లేనివాడైపోయాడు. తాను పడుకునే సాంబశివుడి గుడినికూడా కూలగొడతారు. పెద్ద పెద్ద యంత్రాలొచ్చి ఇళ్లను, పచ్చటి పంటపొలాలను ధ్వంసం చేసేస్తుంటాయి. కనీసం శవాలను పాతిపెట్టే బొందల గడ్డనుకూడా ఆక్రమించేస్తారు. ఈ సెజ్ విధ్వంసానికి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంటుంది. ఈ ఆందోళనలో గీతాంజలి పాలుపంచుకోవడం వల్లనే ఈ కథను ఆమె అంత సజీవంగా చూపించగలిగారు.

రైతు పెంటయ్య తను నివసించిన ఇంటి ముందరే పడిపోయి చచ్చిపోతాడు. కొడుకు రాడు, బంధువులు రారు. ఊర్లో జనమే వచ్చి పాడెకట్టి బొందల గడ్డ వద్దకు తీసుకెళతారు. బొందల గడ్డ దగ్గరకు ఎవరినీ రానీయకుండా కంపెనీ గూండాలు కాపలాగా ఉంటారు. ఈ బొందల గడ్డలలోనే శవాన్ని పాతిపెడతామని ఆందోళన చేస్తే కంపెనీ గూండాలు కాల్పులు జరుపుతారు. చివరికి రైతు శవానికి కూడా తుపాకీ గుండ్లు తగులుతాయి.

శవాన్ని పూడ్చడానికి కనీసం ఆరడుగుల చోటు కూడా లేక పోవడంతో గ్రామస్తులు ఆరైతు శవాన్ని నల్లమల అడవిలో ఉన్న చెట్టుకు వేలాడ దీసి వచ్చేస్తారు. రోజులు గడుస్తున్నాయి కానీ,శవాన్ని ఖననం చేసే అవకాశం లేక కుళ్లి పోయి వాసన వస్తోంది. పీనుగకే ఆరడుగుల జాగా లేదు, బతికే వాళ్లకు ఇంకెంత కావాలో ఆలోచించండి అంటూ ఆ శవం ఒక ప్రశ్నను సంధించడం ద్వారా రచయిత్రి సమస్య తీవ్రతను చూపిస్తారు. మూడు రోజులు ఆ శవం అలాగే కుళ్లు కంపు కొట్టింది. ఈ కథ ఆంధ్రజ్యోతిలో వచ్చాక మహబూబ్ నగర్ కలెక్టర్ దమయంతి గీతాంజలికి ఫోన్ చేసి పోలేపల్లి గ్రామాన్ని సందర్శించడానికి ఆహ్వానించారు. ‘పోలేపల్లి పీనుగను మాట్లాడుతున్న !’ దీన్ని బట్టి ఈ కథథ ఆ నాటి పరిస్థితిని ఎంత బాగా చిత్రించిందో అర్థమవుతుంది.

సెజ్ ల పేరుతో చేపట్టే భూసేకరణకు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు నాటి ప్రతిపక్ష పార్టీ కూడా తన సంపూర్ణ మద్దతును తెలిపింది. రైతులకు, కూలీలకు వ్యతిరేకంగా చేపట్టే చర్యలకు అధికార ప్రతిపక్ష పార్టీలు పూర్తి మద్దతు ఇచ్చాయి. ఫలితంగా రైతులు తమ భూములను పోగొట్టుకున్నారు. తమ గ్రామాన్ని పోగుట్టుకున్నారు. తమ గుళ్లను పోగొట్టుకున్నారు. చివరికి బొందల గడ్డను కూడా పోగుట్టుకున్నారు. వాళ్లు పోగొట్టుకోవడానికి మిగిలినవల్లా ప్రాణాలు మాత్రమే. కొందరి ఆ ప్రాణాలు కూడా పోయాయి. కంపెనీల సేవలో భాగంగా అవసరమైతే రైతుల, కూలీల ప్రాణాలను సైతం తీయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంటుంది.

వ్యవసాయం మూలపడేసరికి కమ్మరోళ్లు, కుమ్మరోళ్లు, సాలోళ్లు, కూర్మోళ్లు, చాకలోళ్లు ; ఎవరికీ పనులు లేకుండా పోయాయి. వీళ్లంతా వలసకూలీలుగా మారారు. పాతి కేళ్ల క్రితం ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన రామిరెడ్డి మేస్త్రీ వీళ్లందరినీ గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రా, హైదరాబాదు వంటి అనేక ప్రాంతాలకు కూలీలుగా సరఫరా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు విజయకుమార్ రెడ్డి ఆ బాధ్యతను తీసుకున్నాడు.

విజయకుమార్ రెడ్డి కన్ను ఎల్లమ్మ మనుమరాలు పదహారేళ్ల పుష్పపైన పడింది. పుష్ప తల్లి, తండ్రి వలసకూలీలుగా వెళ్లి టిప్పర్ బోల్తా పడి మరణించడంతో అమ్మమ్మ ఎల్లమ్మే చూస్తోంది. ఎల్లమ్మ భర్త కూడా అలా మరణించిన వాడే. విజయకుమార్ రెడ్డి పుష్పలోరుచుకుంటాడు. పుష్ప గర్భవతి అని తెలిసి ఎల్లమ్మ విజయకుమార్ రెడ్డిని, అతని తండ్రి రామి రెడ్డి కాళ్ల మీద పడి న్యాయం చేయమని వేడుకుంటుంది. వాళ్లిద్దరూ ఎల్లమ్మను తిట్టి పంపించేస్తారు. అలాగే రాంరెడ్డి దగ్గరకు వెళ్లి తన మనమరాలికి న్యాయం చేయమని అడిగినా అదే పరిస్థితి.

రాత్రి పూట పుష్ప స్వయంగా విజయకుమార్ రెడ్డి గదిలోకి వెళ్లే సరికి తాగుతున్నవిజయకుమార్ రెడ్డి పుష్పను నోటికొచ్చినట్టు తిట్టి, చావకొడతాడు. కడుపులో ఉన్న పిండంపైన తంతాడు. పుష్ప మరణిస్తుంది. పుష్ప శవాన్ని మరొక చోట పడేసి విజయకుమార్ రెడ్డి వెళ్లిపోతాడు. వలస కూలీలపైన మేస్త్రీల లైంగిక అత్యాచారాలే కాకుండా, వారిప్రాణాలను కూడా ఎలా తీస్తున్నారనడానికి ‘చావు’ కథ అద్దంపడుతుంది.

గ్రామాల్లో దారిద్య్రం వల్ల ఏర్పడిన సామాజిక వెనుకుబాటు తనంతో దళిత కుటుంబాల్లో జోగిని వ్యవస్థ పుట్టింది. పోలేపల్లెలో చదువుకుంటున్న అనుసూయ గండ్రి వలసకార్మికుడిగా వేరే ప్రాంతానికి వెళ్లి, అక్కడ జరిగిన ప్రమాదంలో కాలు పోగొట్టుకుంటాడు. పనిదొరకని రోజు ఇంటిల్లిపాది పస్తులే. కుటుంబం గడవడం కోసం బందువులంతా కలిసి పదకొండేళ్ల వయసున్న అనుసూయను జోగినిగా మారుస్తారు. దాంతో అనుసూయ చదువు మానేస్తుంది. అప్పటి నుంచి ఎవరు అడిగితే వాళ్ల లైంగిక కోర్కెలు తీరుస్తూ, ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తుంది. దళితుల్లో ఉండే జోగిని వ్యవస్థ కోస్తా జిల్లాల్లో ఉండే కళావంతుల వ్యవస్థను పూర్తిగా పోలి ఉంది.

ఈ బాధలు భరించలేక ఒక వ్యక్తిని నమ్మి బొంబాయి వెళ్లి అక్కడ రెడ్ లైట్ ఏరియాలో అమ్ముడుపోతుంది. వయసైపోయిందని అనసూయను పంపించేస్తారు. అప్పటికే అనుసూయకు ఎయిడ్స్ సోకు తుంది. పోలేపల్లెకు తిరిగొచ్చాక ఎవరికీ పనికిరాకుండా పోతుంది. చివరికి బస్టాండ్లలో, ఇంటిఇంటికి వెళ్లి అడుక్కు తిని బతుకుతోంది. పోలేపల్లిలో జరిగే మూడు రోజుల జాతరలో జోగినిగా అనుసూయ 60 అడుగుల ఎత్తున ఉండే ఉయ్యాలకు బరిబత్తల ఊగాలి. అలా ఊగుతుంటే రేణుకమ్మ పూనిందని గ్రామమంతా సంబరపడుతున్న వేళ, ఆ ఉయ్యాల మీద దిగంబరంగా ఉన్న అనుసూయ కిందపడి చచ్చిపోతుంది. ‘ఉయ్యాల’ కథ మరొక విషాదం. జోగినిల జీవితాలు ఎలా విషాదాంతమవుతాయో రచయిత్రి కళ్ల కట్టెదుట సజీవంగా చూపించారు.

బొంబాయిలో పనిచేస్తున్న వలసకూలి బాలయ్య అనారోగ్యంతో అక్కడి నుంచి తప్పించుకుని అమ్రబాద్ మండలంలోని అమ్మిరెడ్డి పల్లికి బయలుదేరుతాడు. స్వగ్రామానికి చేరుకోకుండానే పాలమూరు బస్టాండులో ప్రాణాలు కోల్పోతాడు. కుటుంబ సభ్యులకు చిరునామాలు తెలియక, కనీసం శవం కూడా స్వగ్రామానికి వెళ్లకుండా పాలమూరు వలస కూలీలు ఎంతో మంది అనాథలుగా మరణిస్తున్న హృదయవిదారక సంఘటనే ‘ప్లాట్ ఫారం నెంబర్ 34’.

బ్రోకర్ ను నమ్మి మోసపోయిన రషీదా దుబాయ్ వెళుతుంది. పని ఇప్పిస్తానని దుబాయ్ తీసుకెళ్లి, అక్కడ సేట్ కు అమ్ముడుపోతుంది. అక్కడ నరకాన్ని అనుభవించిన రషీదా అతి కష్టం పైన గర్భంతో హైదరాబాదు తిరిగి వస్తుంది. బిచ్చగత్తె అయిపోతుంది. ఎల్లమ్మ సాయంతో స్వగ్రామం తిరిగొస్తుంది. తల్లి, తండ్రి ఆమెను గుర్తు పట్టలేరు ‘నేను రషీదాను’ అంటుంది. బ్రోకర్లను నమ్మి మోసపోయి దుబయ్ సేట్ లకు అమ్ముడు పోయిన ముస్లిం బాలికల విషాదగాథ ‘నేను రషీదాను. ’ఇలా పాలమూరు వలసకూలీల బతుకులన్నీ విషాదాలే. ఈశాన్య రాష్ట్రాల ఏడుగురు అప్పచెల్లెళ్లలాగా ఏడు కథలూ విషాదాంతాలే.

ఈ ఏడు కథలు మన కళ్ల ముందు జరిగే విషాద దృశ్యాలే. పాలమూరు కార్మికుల వలసల వెనుక కరువుంది, కరువుకు కారణాలున్నాయి, కరువు వల్ల జరిగే చావులున్నాయి, ఆత్మహత్యలున్నాయి! నిజానికివ్వన్నీ ఎలా ప్రభుత్వ హత్యలు అవుతాయో గీతాంజలి సజీవంగా చూపించారు.

గీతాంజలి పాలమూరు జిల్లాకు చెందిన వారు కాదు. ఆమె తండ్రి మూలాలు చిత్తూరుజిల్లాలో ఉన్నాయి. తల్లి మూలాలు విజయవాడలో ఉన్నాయి. జీవిత సహచరుడి మూలాలు ఉత్తర తెలంగాణాలో ఉన్నాయి. ఆమె పుట్టి పెరిగింది, స్థిరపడింది హైదరాబాదు నగరంలో. పాలమూరు జిల్లా పల్లెల్లో వాడే మాండలిక భాషను సజీవంగా చూపించగలిగారంటే, ఈ కథలు రాయడానికి భాషాపరంగా, అక్కడి జీవితాన్ని సజీవంగాచేపించడానికి ఎంత అధ్యయనం చేశారో అర్థం చేసుకోవచ్చు. పోలేపల్లిలో జరిగిన సెజ్ వ్యతిరేక పోరాటంలో గీతాంజలి స్వయంగా పాల్గొనడం వల్ల, నిజాయితీగా అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. కథలలో రచయిత్రి చెప్పే మాటలు కూడా పాలమూరు మాండలికం లోనే ఉండడం గమనార్హం. గీతాంజలి తన మధ్యతరగతి బిడియాలను, మొహమాటాలను పక్కనపెట్టేసి పాత్రలు తమ ఆవేదనల్లో ఉపయోగించే తిట్లను కూడా అలాగే ఉపయోగించారు. పాలమూరు కరువుకు కారణమైన ప్రభుత్వాన్ని ‘భాడ్కావ్ ప్రభుత్వం’ అంటూ పాత్రల చేత కసితీరా తిట్టించారు. నిజానికిది ధర్మాగ్రహమే తప్ప తన స్థాయిని ఏమాత్రం తగ్గించుకోవడం కాదు.

పాలమూరు వలస కూలీల కథలు నన్ను కూడా విపరీతంగా కదిలించేశాయి. నిజానికి నా బాల్యం నుంచి తొలి యవ్వనపు రోజుల వరకు, అంటే ప పద్దెనిమిదేళ్లు వచ్చేవరకు పాలమూరు జిల్లాలోనే గడిచాయి. పాలమూరు తప్ప మిగతా ప్రపంచం తెలియకుండా బతికేసిన నాకు, ఆ కథల్లోని వారి మాండలిక మాధుర్యాన్ని ఎంతగా ఆస్వాదించగలిగానో, అక్కడి జీవితాల్లోని విషాదాన్ని అంతే స్థాయిలో జీర్ణించుకోలేకపోయాను. గీతాంజలి కథల్లో పాలమూరు వలస కూలీలు-1 ‘ఉయ్యాల’ ఒక గొప్ప మైలురాయిగా మిగిలిపోతుంది.


Read More
Next Story