ధిక్కార ధీరుడు
x

ధిక్కార ధీరుడు

మూడు పదుల ప్రాయం పూర్తికాకుండానే తనువు చాలించిన నాగప్ప గారి సుందర్రాజు కు చిరు నివాళి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచనలు ప్రసంగాల ప్రభావంతో తన ఆలోచనలకు మరింత పదును పెట్టి సాహిత్య సృష్టి చేసిన వారిలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్యులు. ఒకవైపు స్నాతకోత్తర స్థాయి విద్యార్థులకు ఆచార్యులుగా బోధిస్తూ పరిశోధక విద్యార్థులకు మార్గ దర్శకత్వం చేస్తూ తాను ప్రత్యక్షంగా చూసింది మరియు అనుభవించింది సాహిత్యంగా సృష్టిస్తున్నారు. వారు రచనలలో ముఖ్యమైనది ఒక మాదిగ స్మృతి. ఇది దళిత సాహిత్యం కొరకు పాటుపడిన నాగప్ప గారి సుందర్ రాజు (మే 30, 1968-జూలై 17, 2000) పరిచయం మాత్రమే కాదు జీవితం లో ఎదుర్కొన్న ప్రతి విషయాలను పొందుపరిచారు.

సుందర్రాజు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా నేమకల్లులో పెద్ద నరసమ్మ, రంగన్న దంపతులకు 1968 మే 30న జన్మించారు. అనంతపురం గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంఏ, ఎంఫిల్, పీహెల్డీ పూర్తి చేశారు. అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం లో 1999లో తెలుగు సహాయ ఆచార్యుడిగా చేశారు. జీవితంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, ఆత్మ గౌరవ పోరాటాలు అనేకం ఉన్నాయి. సెంట్రల్ వర్శిటీలో చదివే సమయంలో బ్రాహ్మణవాదంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 'చండాల చాటింపు'(1996) కవితా సంపుటి వేశారు.



మూడు పదుల ప్రాయం పూర్తికాకుండానే తనువు చాలించిన సుందర్రాజు చిన్నతనం నుండి వారి జీవితంలో ఎదురైనా వివక్షతపై సమరం చేసిన తీరును చిత్రీకరించడంలో ఆచార్య దార్ల సఫలీకృతుడయ్యారు. రాయలసీమలో ఒక వీధి బడిలో నుండి మొదలైన సుందర రాజు ప్రస్థానం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మరియు మరణం వరకు సాగిన తీరు ఎటువంటి పాఠకుడినైనా వెనక్కు తీసుకువెళుతుంది. అడుగు అడుగున అవమానాలు, ప్రతిక్షణం ప్రతిఘటనలు వారి జీవితంలో చోటు చేసుకున్న తీరుని ఆచార్య దార్ల మోనోగ్రాఫ్ లో చిత్రీకరించారు. దళిత సాహిత్యంలో అందున మొగ్గలు తొడిగిన మాదిగ సాహిత్య పరిపక్వతకు సుందర్రాజు చేసిన సాహిత్య సమరం పాఠకుల లో ఆలోచనలను రేకెత్తిస్తుంది. పూట కూడా గడవని కుటుంబానికి చెందిన సుందర్రాజు కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో స్నాతకోత్తర స్థాయి విద్యను అభ్యసించి జె ఆర్ ఎఫ్ పొంది తన పరిశోధన సాగించిన తీరును, వారి సాహిత్య ప్రస్థానమును ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఈ మోనోగ్రాఫ్ లో పొందుపరిచారు.

విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పటినుండి రాజు జీవితంలో ఎదురైన అనుభవాలు, అవమానాలు మరియు అతని సాహిత్య జీవితానికి పడిన బీజాలు,ఉద్యమ జీవితాన్ని, ఆత్మగౌరవ పోరాటాన్ని, సాహిత్య ముద్రణకు ఎదుర్కొన్న ఆర్థిక ఆర్థికేతర సమస్యలను మోనోగ్రాఫ్ నందు రచయిత ఆవిష్కరించారు.




సుందర్రాజు తన రచనల్లో రాయలసీమ మాండలికానికి ప్రాధాన్యతనిస్తూ, తన స్వజాతి జనుల దుస్థితిని, నాటి మూఢాచారాలను కవిత్వీకరించాడు. తన పరిశోధనలో స్వజాతి పట్ల దళిత, దళితేతరులైన కవులు, రచయితలు చూపిన సానుభూతిని మరియు సాహిత్యాన్ని ప్రస్తావించారు.

స్పందించే స్థితి నుండి దళిత అస్తిత్వం కొరకు ఉద్యమించే స్థాయికి ఎదిగి తన జీవితాన్ని మాదిగ సాహిత్య చైతన్యానికి అంకితం చేసి, జీవితంలో స్థిరపడుతున్న సమయంలో ఈ లోక యాత్రను వీడిన తీరు ఎటువంటి పాటకుడినైనా కన్నీటి పర్యంతం చేస్తుంది. లేమిని అనుభవించిన కుటుంబం తమను ఆదుకుంటాడని ఆనందించే సమయంలో రాజు అకాల మరణం ఆ కుటుంబాన్ని విషాదంలోనికి తీసుకువెళ్లిన స్థితిని రచయిత ఈ మోనోగ్రాఫ్ లో తెలియజేశారు. ఎంతో వ్యయ ప్రయాసలను భరించి సుందర్రాజు జీవితాన్ని మోనోగ్రాఫ్ రూపంలో అందించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కలం నుండి మరిన్ని రచనలు వెలువడాలని కోరుకుంటూ.

-అనిల్ కుమార్ దారివేముల. మాచర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

Read More
Next Story