తిరుపతి సమీపంలో నిశ్శంక దుర్గానికి ట్రెక్...
పుత్తూరు-కార్వేటినగరం మార్గం సురేంద్రనగరం, ద్వారకనగరం, డేరాకండ్రిగ, డి.యం. పురాల దాటి కొంచెం దూరం పోవాలి. అక్కడ పైకి పొడుచుకొచ్చినట్టు కనిపించే రాజకొండ స్థావరమే నిశ్శంక దుర్గం.
(భూమన్)
నేను శ్వేత సంచాలకుడిగా ఉన్నపుడు తిరుపతి ఎస్ వి యూనివర్శిటీ మాజీ వైస్ చాన్స్ లర్ పి.వి. అరుణాచలం గారు తరచు నా వద్దకు వచ్చి అనేక విషయాలు చర్చించేవారు.
ఆయనంటే నాకు చాలా గౌరవం. వెంగమాంబ ప్రాజెక్టు సంచాలకుడిగా ఉన్నాను గదా , ఆమెకు సంబంధించిన చాలా సంగతులు ప్రస్తావిస్తూ , వారి ఎనిమిది మంది ఘంటికలలో వొకరు కార్వేటినగరం వాస్తవ్యులని , ఆ పండితుడు , రాయసగాడి ఘంటిక తనవద్ద ఉందని , అందజేస్తానని చెప్పినారు.
అదే ప్రస్తావనలో కార్వేటినగరం (ప్రాశస్త్యాన్ని) , లీలా ప్రెస్సు గురించి చెబుతూ సారంగపాణి ప్రస్తావన తీసుకువచ్చెవారు. వారి ద్వారానే సారంగపాణి పేరు మొట్టమొదటగా విన్నది. వారు ఒక అజ్ఞాత వాగ్గేయకారుడు.
బొబ్బిలిలో ఒక బిచ్చగాడు పాడే పాటలను పసిగట్టి అవి సారంగపాణి పదాలని, పుగారిపండా అప్పల స్వామి గారు ముద్రించినట్టు చెప్పి, సారంగపాణి ప్రాజెక్టును ఏర్పాటు చేయిస్తే, వేణుగోపాలస్వామి ముద్రతో ఉన్న కీర్తనలు , విస్తృతంగా ప్రచారంలోకి వస్తాయని , క్షేత్రయ్య , త్యాగయ్య , అన్నమయ్యలకు సాటివచ్చే సారంగపాణి పదాలను వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి చెబుతూ “ నిశ్శంక దుర్గం ” గురించి చెప్పినారు. ఆ పేరు వారు చెబితేనే తెలిసింది.
కార్వేటినగర చరిత్ర ప్రస్తావనకు వచ్చినపుడు నారాయణవనం , నిశ్శంకదుర్గం , కార్వేటినగరం మూడు ముప్పిరిగొని “ A Tale Of Thee Place " గా నగర చరిత్ర అల్లుకున్నట్టుగా చెప్పినారు. అప్పటినుండి ఆ నిశ్శంక దుర్గం పోయి చూసి రావాలని గట్టి పట్టుదలగా ఉన్నాను.
మా ట్రెక్కర్స్ ఎవరూ ముందుకు రావడంలేదు. ఒక్క బి. వి.రమణ మాత్రమే చూసివచ్చినాడు. అతనికి తీరిక సమయం దొరకడం లేదు. ఇక లాభం లేదనుకుని అక్కడ అటవీశాఖ అధికారిని సంప్రదించి నా పూర్వ విద్యార్థి సుబ్రమణ్యాన్ని తోడు తీసుకుని ఇద్దరు అటవీశాఖ ఉద్యోగులతో బయలుదేరినాను.
పుత్తూరు మీదుగా కార్వేటినగరం మార్గంలోని సురేంద్రనగరం చేరుకుని అక్కడ నుండి ద్వారకనగరం, డేరాకండ్రిగ, డి.యం. పురాల మీదుగా పోవాలి. కొంచెం దూరం మా వాహనాల్లో పోయి ఎదురు చూస్తే పైకి పొడుచుకొచ్చినట్టు అద్భుత రాజకొండ స్థావరమే నిశ్శంక దుర్గం.
ప్రోలయ వేమారెడ్డి అద్దంకి రాజధానిగా దక్షిణ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు తన సామ్రాజ్య సుస్థిరత కోసం నిర్మించుకున్న 84 దుర్గాలలో ఈ నిశ్శంక దుర్గం వొకటి.
ఈ దుర్గ నిర్మాణం 1378 లో జరిగినట్టు చరిత్ర శాసనాలు చెబుతున్నాయి. ఇది శత్రు దుర్భేద్యమయిన దుర్గంగా ఉంది. ప్రోలయ వేమారెడ్డి వంశస్థులు శివభక్తులు. అతని మంత్రి నిశ్శంక కొమ్మన. వీరే శివలింగాన్ని నిశ్శంక దుర్గంలో ప్రతిష్ఠింప చేసినారు. ప్రోలయ వేమారెడ్డి కొమ్మన ఇంటి పేరుని నిశ్శంక నామం కలిపి దుర్గానికి నిశ్శంక దుర్గమని పేరు పెట్టినారు.
ఈ నిశ్శంక దుర్గం ఓంకార రీతిలో ఉందని మైనంపాటి వెంకట సుబ్రమణ్యం గారు చెప్పినారు, నంది రూపంలో పడుకుని ఉన్న కొండ. కొండ పాదపీఠంలో చెరువు , చెరువుకు దగ్గర్లో నివాస స్థలాలుండేవని తమ పెద్దలు చెప్పినట్టు సుబ్రమణ్యం చెబుతున్నాడు. ఒక మర్రిచెట్టు కింద కన్నెలమ్మలు, మునీశ్వరుణ్ణి చూపించినాడు.
కొండ పై కెక్కితే శిధిలమయిన ఆలయం కనిపించింది, మూల మూర్తి లేడు. ఏ ఆలయమో తెలియరాలేదు. ఇక్కడ అన్నమయ్య విగ్రహం ఉందని బి.వి. రమణ చెబుతూ ఉండేవాడు. ఉత్సుకతగా వెదుకుతున్నాను. సుబ్రమణ్యం తిరుగుతున్నాడు వెదుకులాటలో అన్నమయ్య విగ్రహాన్ని కనిపెట్టగానే అన్నమయ్య వెంకటేశ్వరుని స్తుతించినట్లు నాకుగా నేను " కంటినదిగో మా తాళ్ళపాక సంగీతాచార్యుని , 32 వేల సంకీర్తనలను నైవేద్యంగా సమర్పించిన వాగ్గేయ కారుణీ కనులారా కనుగొంటి నదిగో ” నని సంభ్రమాశ్చర్యాలతో తబ్బిబ్బుయి పోయినాను.
ఎక్కడ తాళ్ళపాక అన్నమయ్య ? ఎక్కడ తిరుమల , ఇక్కడ నిశ్శంక దుర్గంలో ఎట్లా విగ్రహమై ఉన్నాడు , పోగానే దీని కథేందో బి.వి. రమణను అడిగి తెలుసుకోవాలనుకున్నాను. గుడికి కొంచం ఎగువ భాగంలో రాజ ప్రాసాదం , ఆర్చీలు , కమానులతో వైభవంగా ఉంది. దీన్ని “ రెక్కలచావిడి " గా పిలుస్తారని సుబ్రమణ్యం అన్నాడు.
కొంచం దగ్గర్లో ఒక రాతి గుండులో నిలువెత్తు హనుమ బొమ్మను చూపించినాడు. ఇంకొంచెం పైకి పోతే దుర్గం బోడు , ఇదే ప్రాచీన శివాలయం, మూర్తిలేని ఆలయం. ఈ శిథిల దుర్గం నుండి చూస్తే వేంకటేశ్వరుడు వెలసిన శేషాచలపు కొండలు , ఈశాన్య దిక్కున నారాయణవనం వెనకాల సింగిరి కోన కొండలు మరికొంచెం దూరంలో నగరిముక్కు కొంచెం దూరంలో పల్లెపట్టు పరిసరాలు కనువిందు చేస్తున్నాయి.
ఓపిగ్గా అన్నీ నిదానంగా చూసి సాయంకాలానికంతా దిగొచ్చి , కార్వేటినగరం పుష్కరిణి మరొకమారు చూసి ఇల్లు చేరుకున్నాను. ఇం21-22టికొచ్చాక రాత్రంతా నిశ్శంక దుర్గపు కలలే , ఎంతటి వైభవం కనుమరుగు అయిందోనని దిగులు. చరిత్ర మన కళ్ళెదుటే నామరూపాలు లేకుండా పోతున్నదేనని చింత.
కార్వేటినగరపు అజ్ఞాత వాగ్గేయకారుడు సారంగపాణిని ఎట్లయిన వెలుగులోకి తీసుకురావాలనే సంకల్పంతో నిద్రలోకి జారుకున్నాను. తెల్లారి ఆఫీసుకు వెళ్ళగానే మా ఇవొ. రమణాచారి గారితో ఈ నిశ్శంక దుర్గాన్ని ప్రస్తావించి సారంగపాణి ప్రాజెక్టు ఏర్పాటు చేద్దామని అభ్యర్ధిస్తే అదెంత మాటన్నాని సాయంకాలానికంతా ఒక నిర్ణయానికి వచ్చినారు.
వెంటనే సారంగపాణి పద చరిత్ర, సదస్సు, పాటల రికార్డింగు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. సారంగపాణి విగ్రహం ఏర్పాటు ఆమోదం లభించింది. ఇదిగో ఇట్లా చరిత్ర్మాక నిర్ణయాలు అమల్లోకి రావాలంటే ట్రెక్కింగ్లు తప్పనిసరి కదా !