నయగారాల నయాగరాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాల్లేదు...
x

నయగారాల నయాగరాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాల్లేదు...

జలపాతం సౌందర్యం తనవి తీరా చూసేందుకు ఈ రెండు కళ్లు చాల్లేదనే భావన కలిగింది మొదటిసారి.



క్రితం సారి మేనెలలో మా పెద్దబాబు డా. శివసాగర్ మెడికల్ గ్రాడ్యుయేషన్ కొరకు అమెరికా వచ్చినప్పుడే నాకు నయాగరా జలపాతం చూడాలని ఉండింది. కానీ అప్పుడు ఉద్యోగంలో ఉండడం , అదే ఏడాది ప్రభుత్వం బదలీ ప్రక్రియ కూడా నిర్వహించడంతో నాకు ఎక్కువ రోజులు అమెరికాలో ఉండడానికి వీలు కాలేదు. ఫలితంగా నయాగరా చూడకుండానే తిరిగి ఇండియా వచ్చేసాను.


ఇండియాలో చిత్రకూట్ జలపాతాన్ని చూసినప్పుడు మనసులో గట్టిగా అనుకున్నాను....... ఈసారి అమెరికా వెళితే తప్పకుండా నయాగరా జలపాతం చూడాలని....... ఇక్కడికి వచ్చిన వెంటనే మా బాబుకు నా కోరిక చెప్పాను. మా బాబు ఉండే కొలంబస్ నగరానికి నయాగరా కారులో వెళ్లగలిగే దూరంలోనే ఉంది. అందువల్ల ఒక వారాంతపు సెలవు దినాలలో నేను , శ్రీ కారులో బయలుదేరి నయాగరా వచ్చాము.




విద్యుత్ దీపాల భిన్న కాంతిలో కూడా నయాగరా అందాలను చూడాలని ఒక రాత్రి అక్కడ బస చేసాము. క్షణ క్షణానికి మారుతున్న భిన్న వర్ణాలు....... అబ్బా ! నయాగరా అందాన్ని ఏమని వర్ణించ గలను ? చూసి ఆనందించ వలసిందే....... అక్కడి వాళ్లు వెళ్లమని చెప్పేదాకా సమయమే తెలియకుండా అలా చూస్తూ ఉండి పోయాను.రాత్రి దూరం నుంచి చూసాను. ఉదయం దగ్గర నుంచి చూడవచ్చు...... అనే ఉత్సాహంతో హోటల్ రూం కి చేరుకున్నాము. నిద్రలో కూడా నయాగరా అందాలే కనువిందు చేశాయి.




ఉదయం లేస్తూనే గబగబా తయారై రోడ్డున పడ్డాము. ఎటు చూసినా నీళ్లే....... నయాగరా పట్టణంలోని నయాగరా నది పైనుంచి ఇది పడుతుంది. మూడు జలపాతాలను కలిపి నయాగరా జలపాతం అంటారు. నదికి ఒక వైపు కెనడా...... మరో వైపు అమెరికా ఉంటుంది. 160 అడుగుల ఎత్తునుంచి , ఒక్క సెకండు కు 3160 టన్నుల నీళ్లు ఉద్ధృతంగా జారుతుంటాయి.

కెనడా వైపు నుంచి నయాగరా జలపాతం మరింత అందంగా కని పిస్తుందట. మూడు జలపాతాలు దగ్గరదగ్గరగా కనిపిస్తాయి అని చెప్పారు.ఎప్పుడైనా అవకాశం ఉంటే అది కూడా ప్రయత్నించాలని అనుకున్నాను. నాకున్న సమాచారం మేరకు బోటులో వెళ్లి దూరం నుంచి మాత్రమే వీక్షించ గలం అని..... కానీ ఇటీవల అమెరికా టూరిజం శాఖ చేసిన ఏర్పాటు చేసిన కేవ్ ఆఫ్ ది విల్డ్స్ ద్వారా వెళ్ళడం వలన నయాగరా జలపాతానికి అతి సమీపంగా వెళ్లగలిగాను.


ఎంత సమీపానికి అంటే జలపాతంలో చేయిపెట్టి , ఆ భీకర జలపాత వేగానికి చెయ్యి కొట్టుక పోతుందేమో అన్నంత భయంతో కూడిన ఉద్వేగంతో ఆ నీటిలో తడిసి ముద్ద అయ్యాను. అప్పటి నా ఆనందానికి అవధులు లేవంటే నమ్మండి. నిజంగా పసిపిల్లనే అయ్యాను. బాల్యం మళ్లీ ఒకసారి తిరిగి వచ్చిందా !....... అనిపించింది.




ఈ ఆనందంలోనుంచి తేరుకోకముందే సమయం లేదంటూ బోటు షికారుకు పరుగులు పెట్టించాడు శ్రీ. దాని కోసం చాంతాడంత లైను. సన్నగా పైన కురుస్తున్న జలపాతం నీటి తుంపర వల్ల ఎండ వేడి అంతగా తెలియలేదు. మరో వైపు నయాగరా హోరు సవ్వడి వీనుల విందు చేస్తుంటే అంత రద్దీగా ఉన్నా విసుగు కలుగ లేదు. నీలం రంగు రెయిన్ కోట్స్ ఇచ్చారు. వాటిని ధరించి మేము బోటు పై భాగంలోకి చేరుకున్నాము. భయస్తులు కొందరు కింది భాగంలో కూర్చున్నారు.




ఎరుపు రంగు రెయిన్ కోట్లు ధరించిన మనుషులు ఎక్కిన బోటు మాకు ఎదురుగా కన్పించింది. అది కెనడా దేశం నుంచి వస్తోంది. రెండు బోట్లు సమీపంలోకి రాగానే అందరూ ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఏ దేశంలో అయినా ఆనందంలో మానవ స్వభావం ఒక్కలాగే ఉంటుందేమో అన్పించింది. అలా బోటులో రెండు కొండల పైనుంచి భీకరంగా దూకుతున్న జలపాతం నీటి జల్లులో మరోమారు తడిసి ముద్ద అయ్యాము. కానీ బోటు ద్వారా వెళ్లిన దానికన్నా స్వయంగా దగ్గరగా వెళ్లి ఆ నీటి జల్లు లో తడవడమే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందువల్ల బోటు దిగి మరోసారి మెట్ల దారిలో జలపాతానికి దగ్గరగా వెళ్లి ఆ నీటి జల్లులో పరవశించి పోయాను.



నయాగార మీద ఏర్పడిన బహుళ ఇంద్రధనస్సులు మరింత ఆహ్లాదాన్ని కలిగించాయి. చిన్నప్పటినుంచీ ఆకాశంలో ఒక్క ఇంద్రధనస్సు వస్తేనే దాన్నిచూసి మురిసిపోయేదాన్ని. అలాంటిది నాలుగైదు హరివిల్లులో ఆకాశంలో ఏక కాలంలో ఏర్పడడం , వాటికి సమీపంగా నేనుఆడడం భలే ఉల్లాసంగా అనిపించింది. అక్కడనుంచి బయటకు రాగానే కడుపులో ఆకలి నేనున్నాను అంటూ పలకరించింది. అలా నడుచుకుంటూ....... పరిసరాల అందాలను తిలకి స్తూ streetfood దొరికే చోటుకు వచ్చి ఆకలి తీర్చుకున్నాము. ఆ తడి వాతావరణంలో అనుకోకుండా దొరికిన మసాలా టీ మరోరకం ఆనందాన్ని ఇచ్చింది.


ఇలా రెండురోజులు నయాగరా అందాలను కళ్లలో , మనసులో పదిల పరచుకొని తిరిగి ఇంటి ముఖం పట్టాము


Read More
Next Story