నేను చనిపోయాక (కవిత )
x

నేను చనిపోయాక (కవిత )

నేటి మేటి కవిత : చెంగల్వ రామలక్ష్మి


నేను చనిపోయాక కన్నీళ్లు కారుస్తూ

కర్తవ్యాన్ని మర్చిపోకు

నేను బతికుండగా
మనని ఎప్పుడూ పట్టించుకోని
ఈ చుట్టూ సమాజాన్ని
ఇంటి ముందు చేర్చకు
వాళ్ళ కపట సానుభూతి వచనాలు
ఈ ప్రాణం లేని దేహాన్ని కూడా
తాకి బాధ పెడతాయి

నా కోసం నిజాయితీగా కన్నీళ్లు కార్చే
స్వచ్ఛ హృదయాలు
ఎన్నో నీకు తెలుసుగా!
వాళ్ళ ప్రేమామృత కన్నీటి ధారలతో
నా ఆత్మ పులకరించాలి

నేను ప్రేమగా పెంచుకున్న పూలతోట
నాలా వాడిపోకుండా
రోజూ కాసిని నీళ్లు పోసి
బతికిస్తావు కదా!

ఆ వికసించిన పువ్వులతో మాట్లాడు
కొమ్మలతో, రెమ్మలతో, తీగలతో సంభాషించు
పూలతోట అణువణువూ
నేనే అయి నీతో మాట్లాడుతాను
ప్రకృతి తో మమేకమైపో
ఒంటరితనం నీ నుండి పారిపోతుంది

నేను లేను కదాని నిర్లిప్తతతో
పుస్తకాల అరల్లోని సాహిత్య భాండాగారాన్నంత ఎవరికీ ఇచ్చేయకే!

గురజాడ, శ్రీశ్రీ, రావి శాస్త్రి
ఓ. హెన్రీ, కీట్స్, ఏ పుస్తకం
నువ్వు తెరిచి చూసినా
మనం కలిసి చదువుతూ రాసుకున్న
అభిప్రాయ వాక్యాలు
నేను దూరమయ్యాననే ఆలోచననే
దూరం చేస్తాయి కదా!

సాకార మవుతున్న మన కల
సొంత గ్రంధాలయం
హోమియో వైద్య సేవలను
కొనసాగిస్తానని మాట ఇవ్వు!

మనం పోట్లాడుకున్న సందర్భాలు
మాటా మాటా అనుకుని
మాట్లాడుకోని సమయాలు
నీ మనసు కాయితం పై నుంచి తుడిచెయ్యి
ఒకరికి ఒకరు నచ్చేట్లుగా ఉన్న ముచ్చట్లు ఉన్నాయి చూడు
అవి గుర్తు చేసుకో!నేనున్నట్లే ఉంటుంది నీకు!
నేనెప్పుడూ చెప్పేది అదేగా
ఎవరిలో నైనా మంచినే
గుర్తుంచుకొమ్మని!

నువ్వు నాకోసం కొన్న
గద్వాల నేత చీర నా కెంతో ఇష్టం
బీరువా లో దాచాను
పాత బడినా వన్నె తగ్గలేదు
అది చివరిగా నా దేహం పై కప్పు

మర్చిపోతావేమో!
నా దేహాన్ని గవర్నమెంట్ ఆసుపత్రికి అప్పగిస్తావుగా
మరణానంతరం కూడా ఈ దేహం ఎవరికైనా ఉపయోగపడితే
ఈ జీవి జీవితానికి అంతకంటే పరమార్ధం ఏముంటుంది!

నాకోసం చింతిస్తూ కూర్చోకు
శరీరానికే మరణం
జ్ఞాపకాలు సదా జీవించే ఉంటాయి
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

(డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గురజాడ రచనలపై పరిశోధన చేసారు. 'చెంగల్వ పూలు 'అనే కథా సంపుటాన్ని, 'గురజాడ అప్పారావు ', జాషువా జీవితం --సాహిత్యం ', అనే పుస్తకాలను ప్రచురించారు.ప్రస్తుతం సాహిత్య వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, కథలు, కవితలు వివిధ పత్రికలలో రాస్తున్నారు.)


Read More
Next Story