నేడు గిరిజన యోధుల గౌరవ దివస్..
ఝార్ఖండ్ రాష్ట్రంలో ఆంగ్లేయులపై పోరాటం చేసిన బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం నవంబర్ 15న "జన్ జాతీయ గౌరవ దివస్" నిర్వహిస్తోంది.
- Dr D Satyanarayana
19వ శతాబ్దం చివర ఆదివాసీ స్వాతంత్ర ్యం కోసం ఝార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటీషు వారిపై పోరాటం చేసిన బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నవంబర్ 15న దేశమంతటా "జన్ జాతీయ గౌరవ దివస్" ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా వనవాసీల స్వాతంత్ర్య పోరాట కృషిని గౌరవించుకోవడం ఒక ప్రధాన అంశం. కాబట్టి మనం బిర్సా ముండాతో పాటు మన తెలంగాణ గిరిజన స్వాతంత్ర్య సమరయోధులను కూడా స్మరించుకుందాం.
బ్రిటీషువారు భారత దేశంలో తమ పాలనను ప్రారంభించిన తరువాత రెండు ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకటి, క్రిస్టియన్ మిషనరీలు లక్షలాది మందిని, ప్రత్యేకించి ఆదివాసులను తమ మతంలోకి మార్చడం. తద్వారా వారి తరాల సాంస్కృతిక జీవన విధానానికి తీవ్ర విఘాతం కలిగింది. రెండు, అప్పటి వరకు అటవీ ఫలసాయం, పశుపోషణ, వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న ఆదివాసుల ప్రాంతాలలో భూస్వాములు చొరబడి వాణిజ్య పంటలు పండిస్తూ ఆదివాసులకు భూహక్కులు లేకుండా చేయడం. ఈ పరిణామాల వల్ల పాలుపోని గిరిజనులు బ్రిటిషువారిపై తిరగబడ్డారు. అటువంటి వారిలో అనేక పోరాటాలు చేసినవాడు బిర్సా ముండా.
బిర్సా ముండా గురించి..
ఝార్ఖండ్ రాష్ట్రం లోహర్ దగ జిల్లా ఉలిహతులో 1875 నవంబర్ 15 న జన్మించిన బిర్సా ముండా తన కుటుంబ సభ్యులతోపాటు కూలీ కోసం పలు ప్రాంతాలు తిరిగాడు. గిరిజనుల అమాయకత్వం, మంచితనాలను అలుసుగా తీసుకుని వారి శ్రమను దోచుకుంటున్నవారి హుషారు తనాన్ని గ్రహించాడు. ఆదివాసీ సాంప్రదాయ విద్యలు, నమ్మకాలకు ఉండే శక్తులు, మూలికా వైద్య విధానాలు నేర్చుకున్నాడు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో జీవించే గిరిజనులైన ముండాలు, ఒరాన్లు, ఖరియాలు బిర్సా ఉండే చల్కడ్ గ్రామానికి తండోప తండాలుగా వచ్చేవారు-తమ బాధలను నివారించుకోవడానికై. వారికి ఏకపత్నీవ్రతం పాటించాలని, సాంప్రదాయ గిరిజన దైవతం పైనే అచంచల విశ్వాసం ఉంచాలని, తద్వారా తమ సమస్యలు దూరమవుతాయని బోధించేవాడు. ఆ బోధనలతో బిర్సాను భక్తులు భగవాన్ బిర్సా ముండా అని సంబోధించేవారు.
‘ధర్తి ఆబ’గా...
క్రమంగా భక్తులు పెరుగుతున్న కొద్ది, తాను పలు ప్రాంతాలు తిరుగుతున్న కొద్ది బిర్సాకు క్రిస్టియన్ మిషనరీల ద్వారా తమ ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలకు విఘాతం కలుగుతున్నదని అర్థమై 1895 లో చల్కడ్ గ్రామంలో క్రైస్తవాన్ని వదులుకుని తన గిరిజన భక్తులకు కూడా బొంగల పూజను వదిలి ఒకే దైవాన్ని ఆరాధించండని చెప్పాడు. తనను తాను ప్రవక్తగా ప్రకటించుకొని తన ప్రజలు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సాధించడమే లక్ష్యమని చెప్పాడు. విక్టోరియా రాణి రాజ్యం అంతమయిందని, ముండా రాజ్యం ఆరంభమయిందని, కాబట్టి కౌలు రైతులు కౌలు రుసుము చెల్లించవద్దని చెప్పాడు. అప్పట్నుంచి ముండాలు బిర్సాను ధర్తి ఆబ (భూమి పిత)గా పిలువనారంభించారు.
బిర్సాను పట్టించిన వారికి రివార్డు..
ఆ సమయంలో బిర్సాను అనుసరించనివారు హత్య చేయబడుతారు అనే పుకారు పుట్టడంతో 1895 ఆగస్ట్ 24 న బిర్సాను బ్రిటీషువారు అరెస్ట్ చేశారు. 1898 జనవరి 28న విడుదలై బిర్సా తన అనుచరులతో కలిసి వెళ్ళి చుటియాలో ఉన్న దేవాలయం రికార్డుల ప్రకారం కోల్ గిరిజనులదని చెప్పాడు. క్రిస్టియన్ మిషనరీలు బిర్సాను అరెస్ట్ చేయాలని భావించడంతో అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. అయినా ఎన్నో రహస్య సమావేశాలు జరిపేవాడు. అదే కాలంలో ప్రఖ్యాత జగన్నాథ దేవాలయాన్ని దర్శించాడు.
1899 నాటి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఏడు వేల మంది సభలో క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా ఉల్గులాన్ (విప్లవం) ప్రకటించాడు. బిర్సా అనుయాయులు ఆ విప్లవాన్ని ఖుంతి, తమర్, బసియా, రాంచీ ప్రాంతాలకు పాకించి తమ ఉద్యమం బ్రిటీషు వారిని శత్రువులుగా భావిస్తుంది కాని క్రిస్టియన్ ముండాలకు వ్యతిరేకంగా కాదని స్పష్ట పరిచారు. 1900 జనవరి మొదటి వారాంత దినాల్లో ఎత్కెడిహ్, ఖుంతి పోలీస్ స్వేషన్లపై దాడి చేసి ముగ్గురు బ్రిటీష్ పోలీసులను చంపారు. దాంతో బ్రిటీషు ప్రభుత్వం బిర్సా తలపై రూ. 500 ల రివార్డు ప్రకటించి ముండా గొరిల్లా దళాలను దుంబరికొండ దగ్గర ఓడించింది. తప్పించుకున్న బిర్సాను చక్రధరపూర్ లోని జంకోపయ్ అడవిలో 1900 ఫిబ్రవరి 3న అరెస్ట్ చేసి జైలులో పెట్టి ఆయన ఆరోగ్యం క్షీణించేట్లు చేయగా ఆయన జూన్ 9 న మరణించాడు. దాంతో ఉద్యమం ఆగిపోయినా బ్రిటీషు ప్రభుత్వం 1908లో గిరిజనుల భూములను గిరిజనేతరులకు మార్చరాదని చోటానాగపూర్ టెనాన్సీ ఆక్ట్ ను ప్రవేశపెట్టింది.
తెలంగాణ తొలి గిరిజన యోధుడు రాంజీ గోండ్:
బిర్సా ముండా కంటే 40 సంవత్సరాల ముందే (1850 లలో) తెలంగాణలో గోండు గిరిజన యోధుడు రాంజీ గోండు రాజకీయ స్వాతంత్ర ్యం కోసం నిర్మల్ - ఆదిలాబాద్ ప్రాంతంలో పోరాడాడు.ఆనాటి హైదారాబాద్ రాష్ట్రంలో ఉన్న 16 సుభా(జిల్లా)లలో ఒకటైన బీరార్ సుభాలో ఆదిలాబాద్ జిల్లా ఉండేది. 1853లో బ్రిటీష్ వారు నిజాంతో సంధి చేసుకుని బీరార్ సుభాను సొంతం చేసుకున్నారు. అది ఆ ప్రాంత ప్రజలకు, గిరిజనులకు, ప్రజా పక్షపాతులైన నానా సాహెబ్, తాంతియా తోపే వంటి మహారాష్ట్ర నాయకులకు కంటగింపయింది. ఎందుకంటే వారి ప్రాంతాలను బ్రిటీషువారు అంతక్రితం కొన్ని దశాబ్దాల ముందే కైవసం చేసుకున్నారు కాబట్టి. అట్లాగే అప్పటికి రాజరికం చేస్తున్న మొఘలులనూ బ్రిటీషువారు ఓడించారు కాబట్టి వారి సైనికులైన రోహిల్లాలు నిరుద్యోగులయి కొందరు నిర్మల్ ప్రాంతం వైపు వలస వచ్చారు. ఈ అసమ్మతులకు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటూ నానా సాహెబ్, తాంతియా తోపే వంటి జాతీయ స్థాయి నాయకుల నుంచి సలహాలు, సహాయ సహకారాలు అందుతూ ఉండేవి. దీంతో గోండులు, ఇతర సహచర గిరిజనుల తరఫున మర్సుకోల రాంజీ గోండ్, రోహిల్లాల తరఫున హాజీ అలీ నుస్రత్ నాయకత్వం వహించి వందలాది యువ సిపాయిలను తీర్చిదిద్దారు. వారికి నిర్మల్ ప్రాంతంలో ఉన్న ఘాట్లు, గుట్టలు, గుహలు, అడవుల మీద సంపూర్ణమైన అవగాహన ఉండటంతో వారు గెరిల్లా యుద్ధ తంత్రంలో నిపుణులయ్యారు. 1830 ల నాటికే రోహిల్లాలు సాయుధులైన బ్రిటీష్ వాళ్లను సైతం దోచుకునే స్థితికి చేరుకున్నారని, ఆ మార్గం గుండా కాశీ యాత్ర చేసిన ఏనుగుల వీరస్వామయ్య రాశాడు.
రాంజీ గోండ్ రోహిల్లాల నుంచి యుద్ధ విద్యలను నేర్చుకుని గోండులతో పాటు ఇతర గిరిజనులకు కూడా ఆ విద్యలను నేర్పించాడు. నిర్మల్ ప్రాంతం నుంచి బ్రిటీష్, నిజాం ప్రభుత్వాల్ని పారదోలేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. అయితే స్థానిక ప్రభువులు గోండులు, రోహిల్లాల పోరాటాన్ని తాత్కాలికంగా అణచివేశారు. అనంతరం రాంజీ గోండ్, హాజీ అలీ తమ బలం పెంచుకునే పనిలో పడ్డారు. రాంజీ సుమారు 300 మంది గిరిజన సైనికులను తయారు చేయగా, హాజీ 200 మంది రోహిల్లాలతో సైన్యాన్ని సిద్ధం చేశాడు. రాంజీ, హాజీలు తమ సైన్యానికి అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్పడంతోపాటు తుపాకులు వాడటంలో కూడా తర్ఫీదునిచ్చారు. అంతటి బలోపేతమైన సైన్యం స్థానిక ప్రభువులను, బ్రిటీష్ అధికారులను నిర్మల్ ప్రాంతం నుంచి పారదోలి నిర్మల్ రాజధానిగా రాంజీ గోండ్ అధికారం కూడా చేపట్టాడని స్థానికులు ఆయన వీరగాధలు చెప్తుంటారు. కానీ అది ఎక్కువ కాలం నిలువలేదు. ఎందుకంటే, వెంటనే బ్రిటీష్ వారు కల్నల్ రాబర్ట్ అనే సైనికాధికారి నాయకత్వంలో నిజాం సైన్యంతో పాటు తమ ఇంగ్లిష్ సైన్యాన్ని పెద్ద సంఖ్యలో నిర్మల్ ప్రాంతానికి పంపించి గోండులు, రోహిల్లాలపైకి ఉసిగొల్పారు. కానీ గెరిల్లా యుద్ధతంత్ర నిపుణులైన గిరిజనులు పలు చోట్ల ఇంగ్లిష్ సైనికులను ప్రతిఘటించి ఓడించారు. అయితే నిజాం, బ్రిటీష్ సైనికుల సంఖ్య, ఆయుధ సంపత్తి చాలా ఎక్కువ కాబట్టి గిరిజనులు చివరకు పరాజయం పాలయ్యారు. నిజాం ప్రభుత్వ బలగాలను స్వయంగా నిర్మల్ కలెక్టర్ నడిపించి నిర్మల్ కు 15 క్రోసుల దూరంలో రహదారికి 4 క్రోసుల దూరంలో ఉన్న పర్వత గుహల్లో రాంజీ, హాజీల దళాలను వేటాడాడు.
1860 ఏప్రిల్ 9 మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య భీకర పోరు జరిగింది. మొదట తుపాకీ యుద్ధం, తరువాత కత్తుల యుద్ధం జరిగాయి. ఈ యుద్ధంలో నిజాం బ్రిటీష్ బలగాలలో ఐదుగురు చనిపోగా రాంజీ అనుచరులలో సుమారు 30 మంది అసువులు బాశారు. హాజీ, రాంజీ గోండ్ లు మాత్రం తొలుత తప్పించుకుని అనంతర గాలింపుల్లో నిజాం బలగాలకు బందీలుగా చిక్కారు. వారితో పాటు గోండులు, రోహిల్లాలు, ఇతర గిరిజన సిపాయిలు వందలాది మందిని ప్రభుత్వ బలగాలు బందీలుగా పట్టుకున్నాయి. రాంజీ గోండ్ సహా బందీలందరినీ నిర్మల్ ఖజానా చెరువు దగ్గరున్న మర్రిచెట్టుకు ఉరి తీశారు. నాటి దుర్మార్గానికి సజీవ సాక్ష్యంగా ఇటీవలి కాలం వరకు నిలిచి ఉన్న ఆ చెట్టును "వెయ్యి ఉరిల మర్రి" అని పిలిచేవారమని నిర్మల్ ప్రాంతీయులు చెప్తుంటారు.
రాంజీ గోండ్ ను ప్రభుత్వ బలగాలు సంహరించిన విషయానికి సంబంధించిన రిపోర్ట్ ఒక నెల తరువాత 1860 అక్టోబర్ 15 నాడు నిర్మల్, హైదరాబాద్ ల నుంచి లండన్ కు పంపబడింది. ఆ రిపోర్ట్ అక్టోబర్ 27న "ఇంగ్లిష్ మాన్" అనే దినపత్రికలో ప్రచురించబడింది. అక్టోబర్ 15 కు సుమారు నెల రోజుల ముందు రాంజీ గోండ్ వీర మరణం పొందినట్లైతే ఆ తేదీ సుమారుగా సెప్టెంబర్ 17 అవుతుంది. కాబట్టి సెప్టెంబర్ 17న మన ప్రథమ గిరిజన స్వాతంత్య్ర్య సమరయోధుని వర్ధంతిని జరుపుకోవడం సమంజసం. కాకతాళీయంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు 1948లో సెప్టెంబర్ 17నే స్వాతంత్ర్యం లభించడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాంజీ గోండు గౌరవార్థం తెలంగాణ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియాన్ని హైదారాబాద్ లో నిర్మిస్తున్నది.
తెలంగాణ మలి గిరిజన యోధుడు కుమ్రమ్ భీమ్..
రాంజీ గోండు పోరాటాన్ని అణచివేసినా ఆయన పోరాట స్ఫూర్తి అణగారి పోలేదు. మళ్ళీ ఎనిమిది దశాబ్దాల తరువాత ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ ప్రాంతంలో మరో గోండు పోరాటం పెల్లుబికింది. ఈ పోరాటానికి నాయకుడు కుమ్రమ్ భీమ్.
జోడేఘాట్ ప్రాంతంలో జోడు (రెండు) ఘాట్ లు తమ మధ్య కొన్ని కిలోమీటర్ల పొడవైన లోయను ఏర్పరచాయి. ఆనాటి రెవెన్యూ, అటవీ (జంగ్లాత్) అధికారుల దౌత్యాలకు తాళలేక కుమ్రమ్ భీమ్ చిన్నాన్న ఆధ్వర్యంలో వలసపోయి గోండులు, కోలాములు, నాయకపోళ్లు, పర్ధానులు, తోటీలు అనే గిరిజనులు బాబేఝరి - జోడేఘాట్ మధ్య లోయలో పన్నెండు ఆవాసాలు ఏర్పరచుకున్నారు. తరతరాలుగా అడవుల్నే ఆదాయ ఆర్థిక వనరులుగా చేసుకుంటూ బతుకుతుండేవారు. అలాంటివారిపై 1917లో నిజాం ప్రభుత్వం చేసిన ఒక అటవీ చట్టం అనేక పరిమితులు, పన్నులు విధించింది. ఆ చట్టం ప్రకారం గిరిజనులు అడవుల్లో తమ పశువులను మేపుకుంటే బంచెరాయి (బచెరా) అనే పన్ను కట్టాలి. ఘర్పట్టి, నాగల్పట్టి, ఫసల్పట్టి, చౌబీనా వంటి ఇతర పన్నులను కూడా గిరిజనులు ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో చెల్లించవలసి వచ్చేది. పోడు కొట్టుకుని, పంటలు పండించుకుని పొట్ట గడుపుకోవడమే తప్ప పైసలను వాడటం అంతగా తెలియని గిరిజనులు పన్నులు కట్టలేక అటవీ చట్టం కూడా అమలు పరుస్తుండటంతో అయోమయంలో పడిపోయారు. అనేక బాధలు అనుభవించారు.
అలాంటి దుస్థితిలో కుమ్రమ్ భీమ్ ఆసిఫాబాద్ లో ఉండే న్యాయవాది రామచంద్రపూర్ పైకాజీ సలహా మేరకు తమ గిరిజనులకు అటవీ భూముల మీద హక్కులు కావాలని, తమ ప్రాంతం మీద తమకు స్వేచ్ఛాధికారాలు కావాలని నిజాంను అడగాలని జనకపురు పంతులుతో కలిసి హైదరాబాద్ వెళ్ళి నిజాంను కలవడానికి ప్రయత్నించారు. అధికారులు అనుమతించలేదు. కుమ్రమ్ భీమ్ హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు జోడేఘాట్ ప్రాంతంలోని కొన్ని గిరిజన గూడాలలో గిరిజనులు కష్టపడి సిద్ధం చేసుకున్న పోడు భూములు, పంటలు తమవేనని, లంచాలు ఇవ్వుమంటూ నానా విధ్వంసం సృష్టించారు.
ఇక విధిలేని పరిస్థితుల్లో గిరిజనులు నిజాం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు పన్నెండు గ్రామాల గిరిజనులు జోడేఘాట్ లోని అవ్వల్ పేన్ అనే అమ్మవారి దగ్గర 1940 సెప్టెంబర్ 9 నాటి రాత్రివేళ సమావేశమై కార్యాచరణ గురించి చర్చించుకొని అక్కడే పడుకున్నారు. ఒక ద్రోహి ద్వారా ఈ సమాచారం తెలుసుకొని నిజాం ప్రభుత్వ పోలీసులు 1940 సెప్టెంబర్ 10 నాటి ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో అలా పడుకున్న గిరిజనులను అకస్మాత్తుగా మూడు వైపుల నుంచి ముట్టడించారు. మరో వైపు లోయ. తప్పించుకోలేని స్థితిలో వారిని లొంగిపొమ్మని ఆశలు చూపారు. కుమ్రమ్ భీమ్ అందుకు తలొగ్గక తాము కొత్తగా నెలకొల్పుకున్న పన్నెండు గ్రామాలపై తమకు స్వతంత్ర అధికారం (మావె నాటే మావె రాజ్) ఇవ్వాలని పట్టుబట్టాడు. అది మాత్రం కుదరదన్న పోలీసు అధికారిపై బర్మార్ గురిపెట్టి కాల్చాడు. అది ఆయన చెవిని చీల్చుకుంటూ వెళ్ళింది. అందుకు కోపగించిన ఆ అధికారి గిరిజనులపై కాల్పులు జరపాలని పోలీసులకు ఆజ్ఞ ఇచ్చాడు. కుమ్రమ్ భీమ్ దళం పోరాటానికి ఎదురు నిల్చింది. కాని పోలీసులు వారిపైకి బాంబు విసరడంతో గావుగడ దేవతకు రెండు వందల మీటర్ల దూరంలో నిజాం పోలీసులతో పోరాడుతూనే భీమ్, ఆయన సహచరులు 13 మంది అక్కడికక్కడే కుప్పకూలి అమరులయ్యారు. క్షతగాత్రులైన మరెందరో గిరిజన వీరులు తదనంతరం అసువులు బాసారు.
భీమ్ పోరాటంలో అసువులు బాసినా అతని పోరాటం తదనంతర అణచివేత వ్యతిరేక పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. గిరిజన సంక్షేమం పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలనే విషయాన్ని స్పష్టపరిచింది. ఇందుకు నిదర్శనంగా వెంటనే నిజాం ప్రభుత్వం లండన్ లో ఆచార్యుడుగా పనిచేస్తున్న మానవ శాస్త్రవేత్త హైమెండార్ఫ్ ను ఆహ్వానించి, ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆనాటి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులకు భూములపై హక్కులనిచ్చింది.
భీమ్ మరణించిన రోజు (1940 సెప్టెంబర్ 10) చాంద్రమాన పంచాంగం ప్రకారం భాద్రపద శుద్ధ నవమి అవుతుంది. కానీ భీమ్ వారసులు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనులు మాత్రం దసరా పండుగ తర్వాత ఆశ్వయుజ పౌర్ణమి నాడు భీమ్ వర్ధంతిని జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రోజుల భీమ్ వర్ధంతిని 2014 నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నది. కుమ్రమ్ భీమ్ పేరిట ఆయన అమరుడైన స్థలం జోడేఘాట్ లో ఆయన స్మారక మ్యూజియాన్ని 2016 లో నిర్మించింది. అదే సంవత్సరం ఆయన పేరుతో ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసింది.