
Julie K Brown Image (Gemini AI)
కుబేరుల సెక్స్ రాకెట్ గుట్టు విప్పిన జర్నలిస్టు జూలీ ఎవరంటే..
జర్నలిజం 'కోవా బన్ వలీ'ల మీద కాదు.. కుంభకోణాల మీద చేయాలి యుద్ధం..
వియత్నాం యుద్ధ రహస్య డాక్యుమెంట్లను 1971లో డానియల్ ఎల్స్‌బర్గ్ అనే డిఫెన్స్ అనలిస్ట్ లీక్ చేశాడు. అవే పెంటగాన్ పేపర్స్. వీటితో ఆనాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పదవి ఊడింది. ఇప్పుడు సెక్స్ మానియా ఎప్‌స్టీన్ పేపర్స్ లీకేజీతో జర్నలిస్టు జూలీ కే. బ్రౌన్ ప్రపంచవ్యాప్తంగా ప్రిన్స్ ఆండ్రూ, బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్, పీటర్ మాండెల్సన్, స్టీవ్ టిష్ వంటివారితో సహా 200 మందిని చిగురుటాకుల్లా వణికిస్తున్నారు.
ఈ రెండు లీకేజీలు జర్నలిజం చలువే. పవర్‌ఫుల్ వ్యక్తుల రహస్యాలు కవర్ చేయడమనేది మీడియా ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. జర్నలిజం పునాది సత్యాన్వేషణ. నిక్సన్ కుర్చీ పోవడానికి వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టులు వుడ్‌వర్డ్-బెర్న్‌స్టీన్ లాంటి వాళ్లు నడుంకడితే పెద్దమనుషుల ముసుగులో నీచ నికృష్ట పనులు చేసే వారి అసలు స్వరూపాన్ని ఎప్‌స్టీన్ మెయిల్స్ లీకేజీ పేరిట జూలీ కే. బ్రౌన్ ఒంటి చేత్తో బయటపెట్టారు. ఇప్పుడామె పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.
ఇంతకీ ఎవరీ జూలీ కే.బ్రౌన్...
జూలీ కే. బ్రౌన్ ఓ సాదాసీదా రిపోర్టరు. ఇన్వెష్టిగేటివ్ జర్నలిస్టు. అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరంలో పుట్టి పెరిగింది. 1969 చివర్లో లేదా 1970ల ప్రారంభంలో పుట్టారని అంచనా.
శ్వేతజాతీయురాలు. మధ్యతరగతి కుటుంబం. తల్లి ఒంటరిగా ముగ్గురు పిల్లలను పెంచింది. తల్లి రెండు ఉద్యోగాలు చేసేది. ఒకటి వెయిట్రెస్ పని. దీంతో ఇంట్లో తల్లి తక్కువ సమయం ఉండేది. జూలీ చిన్నతనంలోనే స్వతంత్రంగా ఉండాల్సి వచ్చింది. తోటి పిల్లలు ఆమెను తక్కువగా చూసేవారు. ఒంటరితనం అనుభవించింది. 16 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. స్నేహితులతో కలిసి ఉండేది. పొట్టగడవడానికి చిన్న చిన్న పనులు చేసేది. లాంప్‌షేడ్ ఫ్యాక్టరీలో పని చేసింది. అప్పుడు చూసిన కొన్ని ఘటనలు ఆమెను తీవ్రంగా కలచివేశాయి. అన్యాయాన్ని చూసినపుడు కోపం కట్టలు తెగేది. మార్పు తీసుకురావాలనే కోరిక బలంగా ఉండేది.
ఫిలడెల్పియాలో చదువు...
ఆమె చదువు ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్శిటీలో జర్నలిజం విభాగంలో సాగింది. 1987లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. మాగ్నా కమ్ లాడే గ్రేడ్‌తో గ్రాడ్యుయేట్ అయింది. అంటే టాప్ స్థాయి మార్కులు వచ్చాయి. కాలేజీలోనూ వెయిట్రెస్ పని చేసి ఖర్చులు భరించింది. స్కాలర్‌షిప్ సహాయంతో ట్యూషన్ ఫీజు చెల్లించింది. స్కూల్ రోజుల్లోనే స్కూల్ న్యూస్‌పేపర్ ఎడిట్ చేసింది. ప్రైజ్‌లు గెలిచిన కథలు రాసింది. ఇది ఆమెలో రచనా ఆసక్తి పెంచింది.
ఆమె కుటుంబం గురించి వివరాలు తక్కువే. తండ్రి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆమె వివాహం విడాకులతో ముగిసింది. ప్రస్తుతం ఆమె ఒంటరి. ఆమె చిన్నం అనుభవాలు బాధితుల పట్ల సానుభూతి పెంచాయి. "నేను కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొనవచ్చు" అని ఆమె తరచూ మదనపడేది.
జర్నలిజం రంగంలోకి ఆమె రావడానికి ఈ అనుభవాలే కారణం. మార్పు తీసుకురావడం ఎలా అనే దానిపై యోచిస్తూ ఉండేది. "ప్రపంచాన్ని మార్చాలని" కోరుకుంది. వినేవాళ్లకు వెటకారంగా అనిపించినా అది నిజమని అనేక సందర్భాలలో చెప్పారు.
ఫిలడెల్ఫియా డైలీ న్యూస్ రిపోర్టర్ గా...
టెంపుల్ యూనివర్శిటీలో జర్నలిజం తర్వాత ఫిలడెల్ఫియా డైలీ న్యూస్‌కు తొలుత పని చేశారు. ఆ తర్వాత వివిధ పత్రికలకు మారారు. 30 ఏళ్లకు పైగా అనుభవం. క్రైమ్, న్యాయవ్యవస్థ, మానవ హక్కులు వంటి అంశాలపై దృష్టి పెట్టింది. మయామి హెరాల్డ్‌లో ఇన్విస్టిగేటివ్ రిపోర్టర్‌గా చేరింది. ఇప్పటికీ అక్కడే పనిచేస్తోంది.
ఫెమినిస్టుగా...
ఆమె భావాలు ఫెమినిస్ట్ దిశగా మొగ్గు చూపుతాయి. ఆమె పని ముఖ్యంగా ఆడవారి హక్కులు, శక్తివంతుల దుర్వినియోగం మీద దృష్టి పెడుతుంది. ఎప్‌స్టీన్ కేసులో యువతులు, మైనర్ బాలికలు పడిన బాధలు ఆమెను తీవ్రంగా తాకాయి. సమాజంలో లింగ వివక్ష, అధికార దుర్వినియోగం మీద ఆమె రిపోర్టింగ్ చేసింది. సోషలిస్ట్ భావాలు కూడా ఉన్నాయి. వర్గ అసమానతలు, ధనవంతులు పేదలను దోపిడీ చేయడం మీద ఆమె దృష్టి పెట్టింది. కానీ ఆమె ఎక్కడా ఏ భావజాలానికి బద్ధురాలని ప్రకటించలేదు. ఆమెను ప్రోగ్రెసివ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా చెప్పవచ్చు. సామాజిక న్యాయం, బాధితుల హక్కుల మీద ఆమెకు మక్కువ ఎక్కువ.
సాధాసీదా జీవనం..
ఆమె జీవనం మధ్యతరగతి స్థాయిలో ఉంది. మయామి హెరాల్డ్‌లో ఆమె జీతం సుమారు 55 వేల నుంచి 70 వేల డాలర్లు. ఎప్‌స్టీన్ కేసు తర్వాత ఆమె బుక్ "పర్వర్షన్ ఆఫ్ జస్టిస్" రాసింది. ఇది బెస్ట్ సెల్లర్ అయింది. పబ్లిషర్ నుంచి సుమారు 1 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ వచ్చింది. కానీ ఆమె ప్రైవేట్ డిటెక్టివ్ తో భాగస్వామ్యం వల్ల ఆమెకు సుమారు 6.5 లక్షల నుంచి 8.5 లక్షల డాలర్లు వచ్చాయి. పుస్తకం అమ్మకాలు, రాయల్టీలు నుంచి అదనపు ఆదాయం వచ్చింది. అవార్డులు, ప్రసంగాలు నుంచి కొంచెం డబ్బు వస్తుంది. కానీ ఆమె రిచ్ కాదు. ఇప్పటికీ ఆమె పని చేస్తోంది. ఆమె ఆదాయం మధ్యతరగతి స్థాయిలోనే ఉంది. ఆమె నికర సంపద సుమారు 1 నుంచి 2 మిలియన్ డాలర్లు అని అంచనా.
ఎప్‌స్టీన్ మెయిల్స్ లీక్ తర్వాత కూడా ఆమె తెరచాటు మనిషిగానే మిగిలారు. ఎక్కడా ప్రసంగాలు చేసినట్టు ఆధారాలు లేవు. కానీ ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఎన్‌పీఆర్, సీఎన్‌ఎన్, ఎమ్‌ఎస్‌ఎన్‌బీసీ వంటి మాధ్యమాల్లో మాట్లాడింది. పాడ్‌కాస్టుల్లో పాల్గొంది. నైట్ మీడియా ఫోరమ్ 2026లో మార్టీ బారన్‌తో చర్చలో పాల్గొంది. ఆమె పని ఇప్పటికీ అన్వేషణ మీదే దృష్టి పెట్టింది.
యువ జర్నలిస్టులకు ఆమె సలహా ఏమంటే...
యువ జర్నలిస్టులకు ఆమె ఇచ్చే సలహాల్లో ముఖ్యమైంది పట్టుదల. ఇది చాలా ముఖ్యం అని చెబుతుంది. ఎప్‌స్టీన్ కేసును చేధించడానికి ఆమెకు కొన్నేళ్లు పట్టింది. అయినా ఆమె పని చేసే పత్రిక యాజమాన్యం అంగీకరించింది. మనకు ఏదైనా వార్త తెలిసినప్పుడు కంగారు పడవద్దు అని చెబుతారు. పెద్ద కుంభకోణం గురించి భయపడవద్దు అంటుంది. చిన్న స్టోరీల నుంచి అనుభవం సంపాదించండి అంటుంది. డెడ్ ఎండ్స్ వచ్చినా వదలవద్దు అంటుంది. బాధితుల పట్ల సానుభూతి ముఖ్యం అంటుంది. స్థానిక జర్నలిజం శక్తిని గుర్తించండి అంటుంది.
జూలీ కె. బ్రౌన్ అత్యంత ప్రసిద్ధి పొందిన కేసు జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ కేసు. 2017-2018లో మయామి హెరాల్డ్‌లో "పర్వర్షన్ ఆఫ్ జస్టిస్" సిరీస్ రాసింది. ఎప్‌స్టీన్ కి 2008లో పడిన స్వల్ప శిక్షను ఈ వార్త బయటపెట్టింది. ఆమె రిపోర్టింగ్ వల్ల కేసు మళ్లీ ఓపెన్ అయింది. ఎప్‌స్టీన్ మీద కొత్త ఆరోపణలు వచ్చాయి. 2019లో అతను అరెస్ట్ అయ్యాడు. ఫ్లోరిడా దక్షిణ జిల్లా యుఎస్ అటార్నీ, డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అమెరికా లేబర్ సెక్రటరీ (U.S. Secretary of Labor) అలెగ్జాండర్ అకోస్టా రాజీనామా చేశాడు. ఆమె 80 మంది బాధితులను గుర్తించింది. వారి కథలు బయటపెట్టింది. ఇది జార్జ్ పోల్క్ అవార్డ్, సిడ్నీ అవార్డ్ వంటివి తెచ్చింది. ఇదే కేసు మీద ఆమె పుస్తకమూ రాసింది.
అనేక కేసుల్లో సంచలనాలు..
ఆమె ఇతర సంచలన కేసులు కూడా చేసింది. ఫ్లోరిడా జైలు వ్యవస్థలో అవినీతి, దుర్వినియోగాలు మీద నాలుగేళ్లు వరుసగా కథనాలు రాసింది. జైల్లో ఖైదీల మరణాలు, జైలు అధికారుల అవినీతి మీద రిపోర్ట్ చేసింది. లోవెల్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో (Lowell Correctional Institution అనేది ఫ్లోరిడా రాష్ట్రంలోని మహిళల జైలు)లో పౌర హక్కులు ఎలా దుర్వినియోగం అయ్యాయో సోదాహరణంగా వివరిస్తూ 2018 నుంచి వార్తలు రాస్తోంది. ఆమె రాసిన కథనాల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఫెడరల్ దర్యాప్తు ప్రారంభించింది. మెడికల్ మాల్‌ప్రాక్టీస్, హెల్త్‌కేర్ మోసాలు మీద కూడా రిపోర్ట్ చేసింది. 2022లో సర్ఫ్‌సైడ్ కాండో కలాప్స్ కవరేజ్‌లో భాగమైంది. పులిట్జర్ ప్రైజ్ గెలిచిన టీమ్‌లో ఆమె ఉంది. సమాజంలో అన్యాయాలు బయటపెట్టడం మీద దృష్టి పెట్టింది.
మనం యుద్ధం చేయాల్సింది ఎవరి మీద..
"జూలీ కె. బ్రౌన్ ఒక సాధారణ మహిళ, కానీ ఆమె సాధించిన విజయం అసాధారణం. పవర్ ఫుల్ వ్యక్తుల వెన్నులో వణుకు పుట్టించడం జర్నలిజం అసలు ఉద్దేశం. అంతేగానీ, ఇటీవల సమ్మక్క సారక్క జాతరలో 'కోవా బన్' అమ్ముకునే వలీ లాంటి సామాన్య వ్యాపారుల మీద పడి, వారి ఉపాధిని దెబ్బతీస్తూ సంచలనం కోసం పాకులాడటం కాదు. తెలుగు జర్నలిస్టులు, ముఖ్యంగా సోషల్ మీడియా 'రిపోర్టర్లు' జూలీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ధైర్యం, బాధితుల పట్ల సానుభూతి ఉండటమే నిజమైన జర్నలిజం."
Next Story

