కరువుపై వనితల విజయం ఎలా సాధ్యమైంది..?
x

కరువుపై వనితల విజయం ఎలా సాధ్యమైంది..?

పడిన ప్రతి చినుకును దాచి పంటలు పండిస్తున్న రాయలసీమ మహిళా రైతులు


‘‘ఒకప్పుడు మా ఊర్లో పెద్ద చెరువు ఒకటుండేది గదా, మా పూర్వీకులు దాన్ని ఆధారం చేస్కొని సాగు చేసేవాళ్లు. అందుకనే మా ఊరికి ‘చెర్లోపల్లి’ అని పేరు వచ్చింది. కానీ, క్రమంగా వానలు తగ్గిపోయి, చెరువు ఎండిపోయి, కరువు మొదలైంది. నీళ్లు లేకుండా, సాగు ఆగిపోయి, జనం వలసలు పోవడం స్టార్ట్‌ చేసినారు. ఇలాగే కొనసాగితే, ఊరు ఖాళీ అయిపోతదని మాకు అర్థమైంది. అందుకని, మేమంతా గ్రామ సభలో కూసినోళ్లం, మాటామాటీ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏం జరిగినా సరే, ఎప్పుడో ఒక్కసారి కురిసే వాన చుక్కలనైనా కాపాడుకోవాలని. వేరే దారి లేదు కదా! ఆ నాలుగు వాన చుక్కలతోనైనా నేలలో పచ్చదనం పుట్టించుకోవాలని, అందరం ఏకమై, కురిసిన వానని మా పొలాలు దాటకుండా అడ్డుకున్నాం...!!’’

వాటర్‌ షెడ్‌ కమిటీ సభ్యులు

అని , తన పొలంలో కోతకు వచ్చిన వేరుశనగ మొక్కను భూమిలోంచి జాగ్రత్తగా పీకి గుత్తులు,గత్తులుగా ఉన్న పల్లీకాయలను మాకు చూపించింది, సహరాబీ.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదు అయ్యే కరువు ప్రాంతం అనంతపురం. సమీపంలోని ఓ.డి. చెరువు మండలంలోని, ‘చెర్లోపల్లి’ గ్రామస్తులు కూడా ఒకపుడు సాగుబడి లేక కష్టాలు పడ్డారు. కానీ ఈ రోజు ప్రతీ పొలమూ పచ్చగా మారడం వెనుక ఆ గ్రామ మహిళల ఐక్యత, పట్టుదల ఉంది.

ఒకపుడు చెర్లోపల్లి తో సహా సమీపంలోని, దొన్నికోటవారి పల్లి, పుట్టవాండ్లపల్లి, వీరఓబన పల్లి, పాలినేనివారి పల్లి, బండకింద పల్లి లో ఎక్కడ చూసినా ఎండిపోయన బావులు, బోర్లుతో పంటలు లేక ఉపాధి కరువైంది. ఆడవాళ్లు లేచింది మొదలు నీళ్లను వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చేది. నీరు ,పశు గ్రాసం లేక పశుపోషణకు వెనుకాడేవారు. నీటి కొరతే ఈ బాధలకు మూలమని గ్రహించారు. వానలు మాత్రమే పంటలకు ఆధారమని, చినుకు పడ్డపుడే ప్రతీబొట్టును దాచుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ఆలోచనకు ‘‘ మైరాడ స్వచ్ఛంధ సంస్ధ ’’ తోడుగా నిలిచింది. పన్నెండు మంది చురుకైన రైతులతో సహరాబీ అధ్యక్షురాలిగా చెర్లోపల్లి వాటర్‌ షెడ్‌ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.

పెరిగిన భూగర్భ జలాలు

జలసంరక్షణ పై అవగాహన

చెర్లోపల్లి సమీపంలోని కదిరిలో మైరాడ క్యాంపస్‌లో జలసంరక్షణ పై ఈ కమిటీ సభ్యులకు రెండు వారాలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, అవగాహన కల్గించారు. క్యాంపస్‌లో ఉన్న మోడల్‌ వాటర్‌ షెడ్‌లో జలసంరక్షణ పద్దతులు చూపించారు. దీని ద్వారా కొండల మీద పడిన వాన నీటిని.. ఫారం పాండ్స్‌ , రాక్‌ ఫిల్‌ డ్యామ్స్‌లో ఎలా ఇంకింప చేయాలో కళ్లకు కట్టినట్టు తెలుసుకున్నారు.

‘‘ వాటర్‌ షెడ్‌ అంటే, అధికారులు ఎంత చెప్పినా, అసలు మాకు అర్దం అయ్యేది కాదు. మైరాడ ఆవరణలో ఉన్న మోడల్‌ వాటర్‌ షెడ్‌ చూశాక సహజవనరులను ఎలా కాపాడుకోవాలో ,కురిసిన వానను ఎలా ఆపుకోవాలో పూర్తిగా అవగాహన చేసుకున్నాం, దానినే మా గ్రామంలో అమలు చేశాం...’’ అని రత్నమ్మ అంటారు. ఆమెకు పొలం ఉన్నప్పటికీ సాగుకు యోగ్యంగా లేక కూలీ పనులకు వెళ్లి బతికేది. ఇపుడు వాటర్‌ షెడ్‌ వల్ల భూగర్భజలాలు పెరగడంతో భర్తతో కలిసి చిరుధాన్యాలు సాగుచేస్తోంది.

రైతులంతా అభివృద్ధి చేసిన పంటకుంట

తక్కువ నీరుతో ఎక్కువ సేద్యం...

సహరాబీ నాయకత్వంలో చెర్లోపల్లి చుట్టుపక్కల భూగర్భ జలాలను పైకి తీసుకురావడానికి పొలంలో వాలు ప్రాంతంలో రాతికట్టల ఏర్పాటు, నీటి వినియోగం తక్కువయ్యే ప్రత్యామ్నాయ పంటలు పండించడం పై రైతుల్లో అవగాహన కల్పించారు. రెయిన్‌గన్‌లు, తుంపర సాగు, డ్రిప్‌ ఇరిగేషన్‌ వైపు రైతులను మళ్లించడంతో తక్కువ నీటితో పంటలు పండిస్తున్నారు. సుమారు 1060 హెక్టార్లలో నీటిని పొదుపు చేస్తున్నారు.

వాటర్‌ షెడ్‌ దేశంలో ఎలా మొదలైంది ?

వర్షం పడినప్పుడు ఆ నీరు కొండలు, పర్వతాలు, మైదానాలు మీదుగా ప్రవహిస్తూ చివరికి ఒకే దారిలో చేరుతుంది. ఆ పరిసర ప్రాంతాన్ని వాటర్‌షెడ్‌ అంటారు.

వాటర్‌ షెట్‌ ప్రాజెక్టు అనంతరం సమృద్ధిగా పండిన పంటలు

వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ అంటే ?

– వర్షపు నీటిని నిల్వ చేసి, భూగర్భజలాలను పునరుద్ధరించడం, భూమి ఎరోషన్‌ తగ్గించడం, సాగునీటి వనరులను పెంచడం, రైతుల జీవనోపాధిని బలపరచడం లక్ష్యంగా చేసే ప్రాజెక్ట్‌.

ఇండియాలో ప్రారంభం

1970–80 దశకాల్లోనే కొంతమంది పరిశోధకులు, ఎన్‌జీఓలు వర్షపు నీరు, నేల సంరక్షణ కోసం చిన్నచిన్న పంపిణీ ప్రాజెక్టులు మొదలుపెట్టారు.

1972లో కేంద్ర ప్రభుత్వం DPAP (Drought Prone Area Programme), DDP (Desert Development Programme) వంటి పథకాల్లో వాటర్‌షెడ్‌ అభివృద్ధిని ప్రవేశపెట్టింది.

1990లలో నాబార్డ్ (NABARD) సహకారంతో వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు పెద్ద ఎత్తున అమలు అయ్యాయి.

2001 నుంచి "National Watershed Development Project for Rainfed Areas (NWDPRA)" ద్వారా వర్షాధార వ్యవసాయం ఉన్న ప్రాంతాలకు విస్తరించారు.

తర్వాత Integrated Watershed Management Programme (IWMP) (2008) అన్ని రాష్ట్రాల్లో అమలులోకి వచ్చింది.

ఏడాదంతా నీటికి లోటు లేక పోవడంతో పచ్చని పంటలు

పడిలేచిన కెరటాలు

చెర్లోపల్లి మహిళలు రెక్కలు ముక్కలు చేసుకొని సాధించిన వాటర్‌షెడ్‌ ఫలితాలను,భూతాపం వల్ల ఏర్పడిన వాతావరణ మార్పులు దెబ్బతీశాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి, వాటర్‌షెడ్‌ పనులకు తోడుగా మరికొన్ని అదనపు పనులు అవసరమని భావించి, వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడేలా రైతులను సంసిద్ధం చేయడానికి మైరాడ ప్రతినిధులు భూసారాన్ని కాపాడుకోవడం వల్ల వాతావరణ పరిస్ధితులను తట్టుకోవచ్చని రైతులకు వివరించారు. ప్రతీ రైతుభూమిలో మట్టిపరీక్షలు చేసి, తగిన విధంగా పంటలు పండిరచడం, వేసవిలో చెరువు మట్టిని పొలాల్లో చల్లించారు. సొంత వనరులతో సహజ ఎరువులు తయారు చేసుకుని వాడుతూ, పేడ, మూత్రంతో జీవామృతం,

ఘనాజీవామ ృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువులను వాడుతూ మంచి దిగుడులు సాధిస్తున్నారు. శ్రమదానంతో, పొలాల్లో మట్టికట్టలు, కొండకింద కందకాలు తవ్వి వానాకాలంలో భూసారం కొట్టుకు పోకుండా ఆపారు.

భూమి లేని రైతులకు టైలరింగ్‌ ద్వారా ఉపాధి

జీవనోపాధుల మెరుగుదలకు...

పై పనులన్నీ పొలాలున్నవారికోసమైతే, మరి భూమిలేని పేదవారి పరిస్ధితేంటీ అని ఆలోచించింది సహరాబీ. కూలీ పనుల మీదనే బతుకుతున్న వారిని గుర్తించి వారిలో కొందరికి మెరుగైన అవకాశాలు కల్పించడానికి టైలరింగ్‌ యూనిట్లు, పాడిపశువుల పెంపకం పై అవగాహన కల్పించింది. జాతీయ వ్యవసాయ గ్రామీణ బ్యాంకు రుణాలివ్వడంతో వారు స్వయం ఉపాధి కి ముందుకు వచ్చారు. కొందరు పాల కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ ఇంట్లో ఒక కుట్టుమిషన్‌ వచ్చింది.

ఎస్‌హెచ్‌జి లు తొలిసారి ఏర్పాటు చేసిన సంస్ధ

‘‘ పేద మహిళల స్వయం సమృద్ధికి స్వయం సహాయక సంఘాల ఏర్పాటే మార్గం అని ఎస్‌.హెచ్‌.జీ వ్యవస్ధను భారతదేశంలో తొలిసారి ప్రవేశ పెట్టిన సంస్ధ మైరాడ 1978 లో కర్నాటకలో ఏర్పాటయింది. మహిళల భాగస్వామ్యంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా సహజవనరులను కాపాడే కార్యక్రమాలు అనేకం అమలు చేస్తున్నాం.

కదిరి గ్రామంలో నిర్మించిన మోడల్‌ వాటర్‌ షెడ్‌ నిర్మాణం మహిళా రైతుల్లో అవగాహన పెంచడానికి దోహదం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రైతులు మా ప్రాంగణానికి వచ్చి శిక్షణ పొందుతుంటారు. కరవు సీమలో భూసారాన్ని కాపాడి, చుక్కల సేద్యంతో అధిక దిగుబడులు సాధించడంలో రైతులు విజయం సాధించారు.’’ అంటారు , మైరాడ స్వచ్ఛంద సంస్ధ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌, యన్‌. భాస్కర్‌ రెడ్డి.

మైరాడ ప్రాంగణంలో వాటర్‌ షెడ్‌ మోడల్‌ని పరిశీలిస్తున్న రైతులు

ఆడవాళ్లు సాధించిన విజయంజ

1, వాటర్‌ షెడ్‌ పరిధిలోని వర్షాధార నేలల్లో పంటలు దెబ్బతినే తీవ్రత, విస్తీర్ణం తగ్గింది. ఆర్గానిక్‌ సాగుతో భూసారం కాపాడుతూ, మైక్రోఇరిగేషన్‌తో నీటిని పొదుపు చేశారు.

2, జలసంరక్షణ పనుల వల్ల బోర్లు, బావుల్లో జలమట్టం గతంలో కంటే 20శాతం పెరిగింది.

3,పేద మహిళలు 16 సంఘాలుగా ఏర్పడి, చేతివృత్తులు, కుట్టుమిషన్ల పై శిక్షణ పొంది జీవనోపాధులు మెరుగుపరుచుకున్నారు.బ

4, చెర్లోపల్లి చుట్టుపక్కల 6 గ్రామాల్లో సాగు విస్తీర్ణం అదనంగా 120 హెక్టార్లు పెరిగింది. దాదాపు 440 మంది రైతులు లబ్ది పొందారు. నికర ఆదాయం 20శాతం పెరిగింది.

ఒకపుడు దుర్భిక్షానికి చిరునామాగా మారిన ఈ ప్రాంతం నేడు సుభిక్షంగా మారింది. కరవుతో అల్లాడిన ఈ ప్రాంతం పచ్చల హారంగా మారింది. చుట్టుపక్కల భూగర్భ జలాల మట్టం పెరిగింది. ఒకప్పుడు పక్క పొలంలో రైతులు మోటారు వేస్తే గంటపాటు నీళ్లు రావడం కూడా గగనమయ్యేది. కానీ ఇప్పుడు ఏకధాటిగా ఐదు గంటలు వస్తుండటం విశేషం.

సంఘటితంగా శ్రమిస్తే,కరవుని జయించవచ్చని నిరూపించారు. ఒకపుడు ఎడారి లాంటి మనుషులు. ఇపుడు నదిలా పారుతున్నారు .

Read More
Next Story