రామాయణ కథలో ఋష్యశృంగుని ఎందుకు ప్రవేశపెట్టినట్టు?
రామాయణంలో నిరుత్తరకాండ-6: ఋష్యశృంగుడు కాలుమోపుతూనే కరువుతో అల్లాడుతున్న అంగరాజ్యంలో వర్షం కురిసింది. వర్షానికి ఆయనకు ఉన్న లింక్ ఏమిటో కథకుడు చెప్పలేదు.
ఏదైనా నాటకం ప్రదర్శించేటప్పుడు నేపథ్యంలో తుపాకీ కనిపిస్తే, నాటకం ముగిసేలోగా అది ఒక్కసారైనా పేలాలి, లేకపోతే అదక్కడ ఉండకూడదని ఓ సూత్రం. ఇది కథ, కావ్యం, నవలతో సహా ఏ ఇతర సాహిత్యప్రక్రియకైనా; ఆ మాటకొస్తే ఏ కళారూపానికైనా వర్తిస్తుంది. ఒక పాత్రను ప్రవేశపెడితే, అది ప్రధానకథాగమనానికి ఎంతోకొంత దోహదం చేయాలి; చేయనప్పుడు దాని ఉనికే అర్థరహితమవుతుంది.
రామాయణంలో ఋష్యశృంగుని పాత్ర వల్ల అలాంటి దోహదం ఏమైనా జరిగిందా?!
ఋష్యశృంగుడు కథలోకి అడుగుపెట్టడానికి ముందు ఏం జరిగిందో ఒకసారి గుర్తుచేసుకుందాం: దశరథుడు అశ్వమేధయాగం చేయాలనుకున్నాడు... మంత్రులతో ఆలోచించాడు... పురోహితులను, ఇతర గురువులను తీసుకుని రమ్మని మంత్రి సుమంత్రుని ఆదేశించాడు... వారు వచ్చి హర్షామోదాలు తెలిపి, యాగానికి కావలసిన సామగ్రిని సమకూర్చమనీ, అశ్వాన్ని విడవమనీ చెప్పారు... సామగ్రిని సమకూర్చడంతోపాటు, సమర్థులైన వీరుల రక్షణలో అశ్వాన్ని విడిచిపెట్టమనీ, వారివెంట గురువులను కూడా పంపమనీ దశరథుడు మంత్రులతో చెప్పాడు... సరయూనది ఉత్తరతీరంలో యజ్ఞభూమిని ఏర్పాటు చేయమన్నాడు... తన ఇష్టపత్నులను కలసి యాగనిర్ణయం తెలిపి దీక్ష తీసుకోమన్నాడు...!
8వ సర్గలో నడిచిన ఈ మొత్తం కథాభాగంలో ఋష్యశృంగుని ప్రసక్తి ఎక్కడా లేదు. అశ్వమేధయాగం చేయడానికి మేము సరిపోమనీ, ఋష్యశృంగుని తీసుకురమ్మనీ వసిష్ఠుడు కానీ, ఇతర గురువులు కానీ దశరథుడితో అనలేదు. అశ్వమేధయాగం చేయించగల సామర్థ్యమూ, అర్హతా దగ్గరలో ఉన్న వీరెవరికీ లేవనీ; దూరంగా ఉన్న ఋష్యశృంగుడి మాత్రమే ఉన్నాయనే వివరం సూచనగా కూడా ఎక్కడా లేదు.
పైగా యాగానికి సంబంధించిన మంతనాల్లో సుమంత్రుడు ప్రత్యక్షంగా పాల్గొన్నాడని; తనే వెళ్ళి పురోహితులను, గురువులను తీసుకొచ్చాడని కూడా పై వివరాలు చెబుతున్నాయి.
అలాంటిది, ఆ వెంటనే 9వ సర్గ ఎలా ప్రారంభమవుతోందో చూడండి: “ఈ విషయం గురించి విన్న సుమంత్రుడు, ఋత్విక్కులు చెప్పిన ఈ ఉపాయం పూర్వం చర్చలోకి రాగా తను విన్నానని రహస్యంగా దశరథుడితో అన్నా”డట(ఏతచ్ఛుత్ర్వా రహః సూతో రాజానమిద మబ్రవీత్/ఋత్విగ్భి రుపదిష్టోZయం పురా వృత్తో మయా శ్రుతః-1శ్లో).
సుమంత్రుడు విన్న విషయం ఏమిటి? 8వ సర్గలో చెప్పిన యాగం గురించే కదా! అందుకు సంబంధించిన మంతనాలలో ఆయన కూడా ఉన్నప్పుడు ఎవరో చెప్పగా ఆయన విన్నట్టుగా ఈ శ్లోకం ఎందుకు చెబుతోంది? సరే, దానిని అలా ఉంచుదాం. దశరథునికి సుమంత్రుడు రహస్యంగా చెప్పినది ఏమిటంటే, పూర్వం కృతయుగంలో దేవతాశ్రేష్ఠుడైన సనత్కుమారుడు త్రేతాయుగంలో జరగబోయే ఋష్యశృంగుని కథను ఋషులకు చెప్పగా తను విన్నది! విశేషమేటంటే, సుమంత్రుడు భవిష్యత్తులో జరగబోతున్నట్టుగా దశరథుడికి చెప్పే ఆ కథలోకి దశరథుడు కూడా ఒక పాత్రగా అడుగుపెడతాడు. మొదట క్లుప్తంగా, తర్వాత దశరథుడు అడిగిన మీదట వివరంగా సుమంత్రుడు చెప్పిన ఋష్యశృంగుని కథ ఇలా ఉంటుంది:
కాశ్యపుని కొడుకైన విభాండకుడి కుమారుడు ఋష్యశృంగుడు. తల మీద మగజింక కొమ్ములాంటి కొమ్ము ఉన్నవాడని ఈ పేరుకు అర్థం. అతనికి తనున్న అడవి, ఆశ్రమం తప్ప బయటి ప్రపంచం తెలియదు. తండ్రిని తప్ప ఇంకో మనిషిని చూసి ఎరగడు. అతనికి స్త్రీ, పురుషభేదం కూడా తెలియదని కథాక్రమంలో అర్థమవుతుంది. ఏమీ తెలియని అతను, లోకాలలో ప్రసిద్ధమైన, బ్రాహ్మణుల ప్రశంసలు అందుకున్న రెండు రకాల బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడని మాత్రం 9వ సర్గలోని 5వ శ్లోకం చెబుతుంది(ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః/లోకేషు ప్రథితం రాజన్ విప్రైశ్చ కథితం సదా). స్త్రీపురుషభేదమే తెలియని అతనికి బ్రహ్మచర్యం గురించి, దానిని పాటించడం గురించి ఎలా తెలిసింది? తండ్రి బోధించాడనుకున్నా అప్పుడు స్త్రీపురుషభేదం గురించి చెప్పవలసిందే కదా!
అలా ఉండగా, అంగదేశాన్ని పాలించే రోమపాదుడనే రాజు ధర్మాన్ని అతిక్రమించడంవల్ల( ఏ విషయంలోనో తెలియదు)అతని రాజ్యంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. విద్వాంసులైన బ్రాహ్మణులను పిలిపించి అనావృష్టి పోయే మార్గం చెప్పమన్నాడు. వారు ఋష్యశృంగుని గురించి చెప్పి ఏదో ఒక ఉపాయంతో అతణ్ణి రప్పించి, సత్కరించి నీ కూతురైన శాంతను ఇచ్చి వివాహం చేస్తే అనావృష్టి పోతుందన్నారు. ఋష్యశృంగుడు వస్తేనే అనావృష్టి ఎందుకుపోతుందో కథకుడు వివరంగా చెప్పలేదు.
అప్పుడా రాజు ఋష్యశృంగుని రప్పించే ఉపాయాన్ని ఆలోచించినట్టు 13వ శ్లోకం చెబుతోంది(తేషాం తు వచనం శ్రుత్వా రాజా చింతామ్ ప్రవత్స్యతే/కేనోపాయేన వై శక్యా ఇహానేతుం స వీర్యవాన్). ఇందులో ‘వీర్యవాన్’ అనే మాటకు ‘జితేంద్రియు’డని పుల్లెలవారు అర్థం చెప్పారు. ఇక్కడ కూడా పై ప్రశ్న లాంటిదే ఎదురవుతుంది: స్త్రీపురుషభేదమే తెలియనివాడిని జితేంద్రియుడని ఎలా అంటాం?! పోనీ, ఎంత అడవి మనిషికైనా వయసుతోపాటు ప్రకృతిసహజంగా వచ్చే మానసిక, శారీరక స్పందనలు ఉంటాయి కనుక, వాటిని జయించినవాడిగా ఋష్యశృంగుని జితేంద్రియుడని ఎందుకు అనకూడదడంటారేమో! ఇంద్రియాలనేవి కొన్ని ఉన్నాయనీ, అవి అప్పుడప్పుడు అదుపుతప్పుతూ ఇబ్బంది పెడతాయనీ, వాటిని జయించాలనీ అతను అనుకోవడానికైనా స్త్రీలను చూసి ఉండాలికదా!
సంగతేమిటంటే; ఇలాంటి తర్కాలూ, హేతుచింతనలూ పురాణ, ఇతిహాసాల దగ్గర పనిచేయవు. సందర్భానికి అతకని పై ప్రయోగాల్లాంటివి వాటిలో అలవోకగా దొర్లుతాయి. అది మనం సరిపెట్టుకోక తప్పని పౌరాణికశైలి. పోనీ వ్యాఖ్యాతలైనా వాటి గురించి మాట్లాడవచ్చుకదా అంటే, వాళ్ళ శైలి వాళ్లది!
అప్పుడు ఋష్యశృంగుని తండ్రి విభాండకుడికి భయపడిన రోమపాదుని మంత్రులూ, పురోహితులూ తాము స్వయంగా వెళ్ళి ఋష్యశృంగుని తీసుకురాలేమని చెప్పేశారు. ఋష్యశృంగుడు స్త్రీసుఖం కానీ, ఇతర విషయసుఖాలుకానీ ఎరగనివాడు కనుక అతని మనసులో ఇంద్రియసంబంధమైన అలజడి కలిగించి ఆకర్షించి తీసుకురావడానికి సౌందర్యవతులైన గణిక(వారకాంత, లేదా వేశ్య)లను పంపుదామన్నారు. రోమపాదుడు అంగీకరించి ఆ మేరకు మంత్రులను, పురోహితులను ఆదేశించాడు. గణికలు వెళ్ళి ఋష్యశృంగుని ఆశ్రమానికి దగ్గరలోనే నివాసం ఏర్పరచుకున్నారు. ఒకరోజు అనుకోకుండా ఋష్యశృంగుడు వారున్న చోటికి వెళ్ళి వారిని చూశాడు. ఉభయుల మధ్యా మాటలు కలిశాయి; ఋష్యశృంగుడిలో వారిపట్ల స్నేహం అంకురించింది. తన ఆశ్రమానికి ఆహ్వానించి అతిథిసత్కారం చేశాడు. వాళ్ళు కూడా అతణ్ణి ఆనందంతో కౌగలించుకుని; తాము వెంట తెచ్చిన మధురపదార్థాలను, ఇతరమైన రకరకాల భక్ష్యాలను ఇచ్చి తినిపించారు. ఎప్పుడూ అలాంటివి తిని ఎరగని ఋష్యశృంగుడు, అవి కూడా ఫలాలే కాబోలనుకున్నాడు.
వాళ్ళు వచ్చి వెళ్లి ఋష్యశృంగుడి హృదయంలో రేపిన సంచలనాన్ని 10వ సర్గలోని 23వ శ్లోకం స్వాభావికంగా చెబుతుంది. అతనికి మనసు చెదిరి అస్వస్థతకు లోనైందట, దుఃఖంతో అక్కడా అక్కడా తిరిగాడట(గతాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజః/అస్వస్థహృదయశ్చాసీత్ దుఃఖా స్మ పరివర్తతే). మరునాడు కూడా అతని అడుగులు వాళ్ళున్న చోటికి దారితీశాయి. వాళ్ళు అతణ్ణి చూస్తూనే సంతోషించి, తమ ఆశ్రమానికి రమ్మనీ, అక్కడ మరింత విశేషంగా అతిథిసత్కారం చేస్తామనీ అన్నారు. వాళ్ళ మనోహరమైన మాటలకు మంత్రముగ్ధుడైన ఋష్యశృంగుడు వెంటనే ఒప్పుకుని (తండ్రితో కూడా చెప్పకుండా) వాళ్ళతో వెళ్లిపోయాడు.
అతను అంగరాజ్యంలో అడుగుపెట్టగానే వర్షం పడిందనీ, రోమపాదుడు అతనికి ఎదురేగి సగౌరవంగా ఆహ్వానించి తన నివాసానికి తీసుకువెళ్ళి అతిథిసత్కారం జరిపాడనీ; తన కూతురు శాంతను అతనికిచ్చి వివాహం చేశాడనీ- అనంతర కథ.
కృతయుగంలో సనత్కుమారుడు ఋషులకు చెప్పగా తను విన్నానంటూ భవిష్యత్తులో జరగబోయేదిగా సుమంత్రుడు దశరథుడికి చెబుతున్న ఈ కథనంలోకి ఇప్పుడు దశరథుడే ఒక పాత్రగా అడుగుపెడతాడు. దాని ప్రకారం, దశరథుడు తన స్నేహితుడైన రోమపాదుని దగ్గరికి వెళ్ళి, పుత్రసంతానం కోసం తను చేయబోయే యాగానికి ఋష్యశృంగుని పంపమని అడుగుతాడు...రోమపాదుడు పంపుతాడు... దశరథుడు యజ్ఞం చేయగా అతనికి నలుగురు కొడుకులు కలుగుతారు...
సనత్కుమారుడు చెప్పినదిగా తను విన్న ఈ భవిష్యత్ కథనాన్ని సుమంత్రుడు ఇక్కడితో ఆపి వర్తమానంలోకి వస్తాడు. “ఓ మహారాజా! నువ్వే స్వయంగా సైన్యవాహనాలతో సహా (రోమపాదుని దగ్గరికి)వెళ్ళి ఋష్యశృంగుని తీసుకురా” అంటాడు. దశరథుడు వసిష్ఠుని అనుమతి కూడా తీసుకుని అంతఃపుర స్త్రీలనూ మంత్రులనూ వెంటబెట్టుకుని రోమపాదుని దగ్గరికి వెడతాడు. ఏడెనిమిది రోజులు అతనికి అతిథిగా గడిపి; తను ఒక కార్యం తలపెట్టాననీ, శాంతనూ, భర్తనూ తనతో పంపమనీ అడుగుతాడు. రోమపాదుడు అంగీకరించి దశరథుని వెంట వారిద్దరినీ పంపుతాడు...
ఇక్కడ ఒకసారి ఆగి, రెండు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించుకుందాం:
సుమంత్రుడు 9వ సర్గలో దశరథుడికి ఋష్యశృంగుడి గురించి చెబుతున్నప్పుడు ఒక చోట అతణ్ణి ‘జామాత’(అల్లుడు)గా పేర్కొంటాడు. ఆ శ్లోకం ఇదీ: ‘ఋష్యశృంగస్తు జామాతా పుత్రాంస్తవ విధాస్యతి/సనత్కుమారకథితమేతావత్ వ్యాహృతం మయా’-అల్లుడైన ఋష్యశృంగుడు నీకు పుత్రులు కలిగే విధానం చేయగలడనీ, ఇంతవరకూ సనత్కుమారుడు చెప్పగా విన్నదంతా నీకు చెప్పాననీ దీని తాత్పర్యం.
ఋష్యశృంగుడు ఎవరికి అల్లుడు, రోమపాదునికి కదా? మరి సుమంత్రుడు దశరథునితో అతని గురించి చెబుతున్నప్పుడు అతణ్ణి అల్లుడని ఎందుకన్నాడనేది ఆసక్తికరప్రశ్న. ఋష్యశృంగుని భార్య శాంత వాస్తవానికి దశరథుని కూతురే ననీ, రోమపాదుడికి దత్తు ఇచ్చాడనీ; అసలు రోమపాదుడనే రాజే లేడు, అది దశరథుని మరో పేరనీ- ఇలా భిన్నకథనాలు ఉన్నాయి. ములుకుట్ల నరసింహావధానులుగారు తమ ‘రామాయణ సారోద్ధారము’, బాలకాండ, ద్వితీయభాగంలో వాటిని ఇచ్చారు. ‘సీత రాముడికి ఏమవుతుంది’ అనే తన రచనలో ఆరుద్ర కూడా శాంత గురించి మరింత సమాచారం ఇచ్చారు. వాటి గురించి చెప్పుకునే సందర్భం ముందు ముందు వస్తుందేమో చూద్దాం.
ఇక రెండోది ఏమిటంటే, పుత్రసంతానం కోసం తను చేయబోయే యాగానికి ఋష్యశృంగుని పంపమని దశరథుడు అడిగినప్పుడు, రోమపాదుడు మనసులో ఆలోచించుకుని పుత్రవంతుడైన ఋష్యశృంగుని అతని వెంట పంపగలడని 11వ సర్గలోని 6వ శ్లోకం చెబుతుంది(శ్రుత్వా రాజ్ఞోZథ తద్వాక్యం మనసా స విచింత్య చ/ప్రదాస్యతే పుత్రవంతం శాంతాభర్తార మాత్మవాన్). ఋష్యశృంగుడు పుత్రుడు, లేదా పుత్రులు ఉన్నవాడని ఇందులోని ‘పుత్రవంతం’ అనే మాట స్పష్టంగా చెబుతోంది. పుల్లెలవారు ప్రతిపదార్థంలో ఆ మాటకు ‘పుత్రులు గల’ అన్న అర్థం ఇస్తూనే, తాత్పర్యంలో మాత్రం, ‘పుత్రులు గల- అనగా తపోమహిమచే ఇతరులకు పుత్రులను అనుగ్రహించగల’ అనే అర్థం చెప్పారు. ఇందులో మూలాతిక్రమణే కాక, అర్థాతిక్రమణ కూడా కనిపిస్తోంది. ఎందుకలా చెప్పారో తెలియదు.
వాటినలా ఉంచి అసలు విషయానికి వస్తే-
నిజానికి కృతయుగమూ-సనత్కుమారుడూ-భవిష్యత్తులో జరగబోయేదిగా ఆయన ఋషులకు చెప్పిన కథా... ఇవేవీ లేకుండానే దశరథుడు రోమపాదుని దగ్గరికి వెళ్ళి యాగం గురించి చెప్పి అతని అనుమతితో ఋష్యశృంగుని, శాంతను అయోధ్యకు తీసుకురావచ్చు. అయినా ఇంత శాఖాచంక్రమణం ఎందుకు చేసినట్టు?! ఋష్యశృంగుని జన్మవృత్తాంతం చెప్పడం కోసమా అంటే దానికింత కల్పన చేయాల్సిన అవసరం లేదు. ఋష్యశృంగుడనే తపశ్శాలి గురించి తను విన్నాననీ, అతని రాకవల్ల అంగదేశంలో అనావృష్టి తొలగిందనీ, అతని ప్రభావంతో అశ్వమేధం ఆశించిన ఫలితాన్ని ఇస్తుందనీ సుమంత్రుడు నేరుగానే దశరథుడికి చెప్పవచ్చు.
ఋష్యశృంగుని ప్రవేశపెట్టడానికి ఇలా రాజమార్గమే ఉండగా ఇన్ని డొంకదారులు పట్టించడం ఎందుకు? పోనీ, మనిషి జీవితంలో ప్రతి ఒక్క ఘటనా విధిలిఖితం ప్రకారమో, లేదా పూర్వమే నిర్ణయించిన ప్రకారమో జరుగుతుందన్న తాత్త్వికసందేశాన్ని ఇవ్వడానికి మూడు కాలాలనూ ముడిపెట్టే ఇలాంటి కథనానికి పూనుకున్నారా అంటే అది కూడా కథాగమనంలో ప్రస్ఫుటం కాలేదు. ఇక ఊహించగల ఒకే ఒక కారణమేమిటంటే, ఎవరో ఒక అత్యుత్సాహి ఋష్యశృంగుని కథను రామాయణంలో చొప్పించడానికి ఈ కల్పనా ప్రావీణ్యమంతా రంగరించాడా అన్నది. కాకపోతే, ప్రధానకథతో దానికి సక్రమంగా అతుకు పెట్టడంలో మాత్రం సఫలం కాలేకపోయాడు.
ఒక్క నిదర్శనం చూడండి. గొప్ప తపశ్శాలి అని చెప్పి దూరం నుంచి రప్పించిన ఋష్యశృంగుని మార్గదర్శనంలో అంతటి అశ్వమేధయాగం జరిగినా, అది దశరథుడు ఆశించిన పుత్రసంతానాన్ని ఇవ్వలేదు. ఆయన పుత్రకామేష్టి పేరుతో మరో కార్యం చేయాల్సివచ్చింది. కనుక అశ్వమేధం విషయంలో విఫలమైన మేరకు ఋష్యశృంగుడు ప్రధానకథకు అందించిన దోహదమేమీ లేదు. పుత్రకామేష్టి విజయవంతం కాబోతోంది కదా అనుకున్నా అది ఋష్యశృంగుని అశ్వమేధ వైఫల్యాన్ని కప్పిపుచ్చలేదు; కనుక వసిష్ఠుడు మొదలైనవారినందరినీ పక్కన పెట్టి అంత ఘనంగా అతణ్ణి కథలో ప్రవేశపెట్టడానికి పుత్రకామేష్టి సాఫల్యం గొప్ప సమర్థన కాలేదు.
మరి ఎందుకు ప్రవేశపెట్టారన్న ప్రశ్నకు ఏ కొంచెమైనా హేతుబద్ధమైన సమాధానం చెప్పుకోవాలంటే…
బాబిలోనియాకు చెందిన ఒక ఇతిహాసకథను స్పృశించాలి!