
బెడవాడ పునుగులు.. మహా ఫేమస్
చిన్న పునుగులు, మిర్చి బజ్జీ.. మా బెజవాడలోనే తినాలండీ బాబూ!
గుర్తున్నాయా ఆ రోజులు? రామమందిరం సెంటర్ పునుగులు- గోలీ సోడాలు!
ఇప్పుడు ఎక్కడంటే అక్కడ పునుగులు, బజ్జీలు కనిపిస్తున్నాయి గాని సరిగ్గా ఓ పాతిక ముప్పై ఏళ్ల కిందటైతే పునుగులకైతే మా బెజవాడ రామమందిరం సెంటరూ, అలంకార్ సెంటరో కి వెళ్లాలి. బజ్జీలకైతే గుంటూరు ఓవర్ బ్రిడ్జీ పక్కనుండే బళ్ల దగ్గరకెళ్లాలి.
ఏం చేస్తాం మరి.. "జిహ్వకో రుచి" పుర్రకో బుద్ధి..
అప్పట్లో బెజవాడలో ఎక్కడ "రుచులు" బాగా ఉంటాయో అక్కడ వాలే వాళ్లం.
ఏలూరురోడ్డు రామమందిరం సెంటర్ లో మిరపకాయ బజ్జీ బండీ ని మర్చిపోలేం. మిర్చి బజ్జీ అక్కడ ఫేమస్. సాయంత్రం అయ్యేసరికి మిర్చి బజ్జీ ప్రియులు అక్కడికి చేరేవారు. బజ్జీని మధ్యకు కోసి సన్న ఉల్లిపాయ ముక్కలు దట్టించి నిమ్మకాయ పిండి ఇచ్చేవాడు ఆ బండివాడు. అది చూడడంతోనే నోట్లో నీరు ఊరేది. ఎన్ని బజ్జీలు తిన్నా కుతి తీరేది కాదు. బజ్జీలే కాదు ఈ బండి వద్ద చిన్న పునుగు కూడా ఫేమస్. చట్నీ వేసుకుని వేడివేడివి లాగిస్తే స్వర్గం కనిపిస్తుందంటే నమ్మండి.
చిన్న పునుగుల కోసం ఉండే సందడి అంతాఇంతా కాదు. మెత్తటి బియ్యప్పిండీ, మినప్పిండీని వయ్యారంగా కలుపుతూ చేతిలోకి సుతారంగా తీసుకుని అదేదో గమ్మత్తుగా సలసలా కాగే బాండీలో వేసి వాయ తీస్తుంటే వేసినవి వేసినట్టు అయిపోయేవి. మొదట్లో 20 పునుగులు 2 రూపాయలుగా మొదలై ఇప్పుడు 20,25 రూపాయల దాకా వచ్చాయి. అందులో చట్నీ, కాసిని ఉల్లిపాయలు వేసి ఇచ్చేవారు. మందుబాబులు ఆ రోజుల్లో వీటికి ఎగబడేవారంటే నమ్మండి. మందు కొడుతూ ఈ పునుగులు మధ్యలో నమలుతామని తెలిసినవారు చెప్పేవారు. అందుకే ఇప్పటికీ ఇతర ప్రాంతాల వారు ఇది కృష్ణా జిల్లా మంచింగ్ అండీ అంటుంటారు.
ఆ రోజుల్లో ప్రతిరోజూ జేబులగలగల ను బట్టి మేము బజ్జీలు, పునుగులు తినేవారం. తినగానే గోలిషోడా తాగితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం.
మా స్నేహితుడు సాయిబాబు అయితే మిర్చి బజ్జీ, షోడా తాగితేగానీ కదిలేవాడు కాదు. ఆ తరువాత నడుచుకుంటూ నవరంగ్ టాకీస్ వద్దకు చేరే వాళ్లం. అక్కడ టీ తాగితే అదో తృప్తి. అనంతరం బీసెంట్ రోడ్డు మొదట్లో మున్సిపల్ కాంప్లెక్స్ టైలర్ షాపుల వద్ద నిల్చొని బాతాఖాని కొట్టేవారం. ఒకోసారి జైహింద్ టాకీస్ సెంటర్ లో టీస్టాల్ వద్ద సమోసాలు తినేవారం.
ప్రస్తుతం గవర్నర్ బంగళా ఎదురుగా చెట్టు క్రింద టిఫెన్స్ బాగా చేసేవారండీ. అక్కడ ఆరోజుల్లో క్యూ కట్టేవారంటే నమ్మండి. బాగా ఆకలి వేస్తే ఏలూరు రోడ్డులోని అజంతా హోటల్ లో ఇడ్లీ కానీ రవ్వట్టు కానీ తినేవారం. చిన్న చిన్న గదులతో ఉన్న అజంతా హోటల్ లో టిఫెన్ రుచి బహు పసందు సుమీ.
అలాగే బీసెంట్ రోడ్డులోని దుర్గా కాఫీ హౌస్ లో అల్పాహారం, చట్నీ అదుర్స్. మోడరన్ కేఫ్ లో కూడా బాగుండేవండీ బాబూ. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ ఎదురుగాఉన్న కొట్టులో కూడా మిర్చి బజ్జీలు తినే వారం. వన్ టౌన్ వెళితే కోమలా విలాస్ లో టీ, టిఫెన్ తినే వారం.అలాగే వన్ టౌన్ బోడెమ్మ హోటల్ కూడా తేనీరు కు పెట్టింది పేరు. గాంధీ నగర్ వెళితే ఉదయం పూట బాబాయ్ హోటల్ లో ఇడ్లీ మూడు రకాల చట్నీలు, వెన్న, కారప్పొడితో తింటే నిజంగా సూపర్ అనుకోండి. గాంధీనగర్ సినిమా సిబ్బంది, నటులు వచ్చినా వారి టిఫెన్ అడ్డా అదేనండీ. మనోరమా పక్క సందులో టిఫెన్స్ భలే రుచిగా ఉండేవి. నిలుచుని తినాలిగానీ రుచి మాత్రం పైప్ స్టార్ కు తీసిపోయేవి కాదు. ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద కాకా (కేరళవారు)హోటల్ ఎప్పుడూ రష్ గా ఉండేది. టీ పది పైసలు, ఉల్లిదోశ పావలా. ఉదయం షిఫ్ట్ విద్యార్థులు ఎగబడేవారు. లబ్బీపేటలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లే దారిలో కాకా హోటల్ ఉండేది.ఇప్పుడు అలాంటి హోటల్స్ కనిపించడం లేదు. మొగల్ రాజపురంలో సిద్ధార్ధ కాలేజీ పెట్టక ముందు జమ్మిచెట్టు సెంటర్ లో ఒక హోటల్ ఉండేది. మా స్నేహితులం మా ఇంటి వద్ద పరిక్షల్లో ప్రిపరేషన్ స్టడీస్ చేసి ఉదయమే అక్కడ టిఫిన్ తినేవారం. అప్పు పెట్టి మరీ రెండుమూడు టిఫెన్స్ తినిపించేవాడు. ఆ తరువాత సిద్ధార్ధ కాలేజీలో ఆయనే క్యాంటిన్ పెట్టాడు.
అలా చెప్పుకుంటు పోతే బెజవాడలో అల్పాహారాలకు సందుసందూ ప్రసిద్ధి అని చెప్పాలి. రాళ్లు తిన్నా ఆరగించుకునే వయసులు మావి. టిఫెన్ ఎక్కడ బాగుంటుందో తెలిస్తే సైకిల్ మీద "ఝంఝం" అని అక్కడ వాలే వారం. మీకూ నోరు ఊరుతున్నది కదూ.. ఇప్పటికీ మించి పోయింది లేదు.. రండి, విజయవాడలో మీకు నచ్చిన వీధికి వెళ్లండి. సన్నపునుగులు తినండి. మిర్చి బజ్జీ ఘాటు చవిచూడండి. అబ్బబ్బా, ఏముందిరా అనకపోతే ఒట్టండి..
యం.వి.రామారావు, సీనియర్ జర్నలిస్టు
Next Story

