ఆర్యుల చొరబాటుకు హరప్పనుల ప్రతిఘటన
సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం -5 (హరప్పనుల ప్రతిఘటన) ఆంగ్లమూలం-The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi
బేతి పాణిగ్రాహి
...క్రమంగా పునీతుడికి ఆర్మితతో సాన్నిహిత్యం పెరిగింది. హరప్పా అర్చక బృందానికి, ప్రభు వర్గీయులకు ఇది నచ్చలేదు. ఆర్యుల వల్ల తమ జీవన విధానానికి ముప్పు వాటిల్ల గలదనీ, రాకుమారి పై పురుష ప్రభావం పెద్ద ద్రోహమనీ వాళ్ళు భావించారు.
బాగుహర ముఖ్యసలహాదారుడైన దబీరుడు ఆందోళన నిండిన ముఖంతో రాజాస్థానం లోకి అడుగు పెట్టాడు. ‘‘బాగు హర ప్రభూ, నన్ను కలవర పెడుతూన్న విషయమొకటి మీకు విన్నవించుకోవాలనుకుంటున్నా.’’ అన్నాడు కంపిస్తున్న స్వరంతో.
సింహాసనం మీద ఆసీనుడైన బాగుహర ప్రశ్నార్థకంగా చూశాడు. ‘‘విషయమేమిటో చెప్పు దబీరా.. ’’
‘‘ఆర్యుల నాయకుడు పునీతుడు మన రాజకుమారితో సన్నిహితంగా మెలగుతున్నాడు.’’ ఒక్కొక్క పదం ఒత్తి పలికాడు దబీరుడు. ‘‘అతని ప్రభావం వల్ల ఆమె మన పద్ధతులకు దూరమవుతుందేమోనని నాకు భయంగా వుంది. ఆమె భవిష్యత్తు గురించి, మన ప్రజల భవిష్యత్తు గురించి నాకు చాలా ఆందోళనగా వుంది.’’
బాగుహర సాలోచనగా చూసి భృకుటి ముడిచాడు. ‘‘నీ ఆందోళన నాకు అర్థమైంది దబీరా. అయితే వెంటనే మనం అంతిమ నిర్ణయాలకి రాకూడదు. ఆర్మిత బహుశ ఆర్యులలో మంచి గుణం చూస్తున్నది ; ఆమె ఏమి చెబుతుందో మనం వినాలి. ’’
‘‘ప్రభూ, మనం జాగ్రత్తగా వుండాలి..’’ అన్నాడు దబీరుడు స్థిరమైన గొంతుతో. ‘‘ఆర్యులు చాలా శక్తిమంతులు. మన జీవన విధానాన్ని పరిరక్షించుకోవాలి.. ’’
‘‘ప్రభూ, మన అలసత్వానికి పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, నా బెంగ అంతా మన భావి తరాల గురించే. మనల్ని మనం రక్షించుకోక పొతే మన ప్రత్యేకతని, స్వయం ప్రతిపత్తిని కోల్పోతాము. మన సంస్కృతీ సంప్రదాయాలు, మొత్తం మన అస్తిత్వం సహా తుడిచి పెట్టుకుపోతాయి. నిజంగా అంత భారీ మూల్యం మనం చెల్లించాలనుకుంటున్నామా?’’
బాగుహర సాలోచనగా తలాడించాడు. “ఒప్పుకుంటున్నాను దబీరా..మనం రాజీ పడకూడదు. నన్ను ఆర్మితతో మాట్లాడనీయండి..ఈ లోగా మన యోధులని సమాయత్త పరచండి, ఏదైనా ఘర్షణ తలెత్తితే ఎదుర్కోవడానికి మనం సంసిద్ధంగా వుండాలి.’’
యోధులను సమాయత్త పరిచే పనిమీద దబీరుడు వెళ్ళిపోయాడు. బాగుహర తన కూతురి విషయమై తీవ్రాలోచనల్లో పడ్డాడు. ఆమె తన హితవు వింటుందనీ, ఆర్యుల ఆకర్షణలో పడిపోదనీ అతనికి ఆశ వుంది.
రాజకుమారి ఆర్మిత ఎటూ తేల్చుకోలేని సంఘర్షణలో పడింది. తన వాళ్ళ మాట వినాలా, లేక పునీతుడి పట్ల ప్రేమకే మొగ్గు చూపాలా ? తండ్రి బాగుహరకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ఆమె, కానీ అతడు ఆర్యుల పట్ల తన విముఖత లేశమైనా వీడలేదు.
‘‘నాన్నా, నేను చెప్పేది విను’’ అంటూ ఆర్మిత ప్రాధేయపడింది. నిరాశ పూరిత స్వరంతో ఆఖరి ప్రయత్నం చేసింది. ‘‘పునీతుడి వల్లా, అతని మనుషుల వల్లా మనకు ఎలాంటి సమస్యా రాదు. వాళ్ళు శాంతిని కోరేవాళ్ళు. మన నుంచి కొత్తవి నేర్చుకోవడం, మనతో వర్తకం చేయడం వాళ్ళ ఉద్దేశ్యం. అంతే.’’
‘‘అమ్మాయీ, నువ్వు చెప్పేదానితో నేను సమాధాన పడలేను,’’ అన్నాడు బాగుహర స్థిరంగా. ‘‘ఆర్యులు మన జీవన విధానానికి పెద్ద ముప్పు. వాళ్ళ ప్రభావంతో మన రాజ్యానికి ప్రమాదం ఏర్పడబోతోంది, నేను చేతులు ముడుచుకు కూర్చోలేను. నేనిప్పుడు చర్య తీసుకోనట్లయితే తరతరాల మన వారసత్వాన్ని వాళ్ళు సర్వనాశనం చేస్తారు. ’’
అలా కొన్ని రోజులు గడిచాయి. హరప్పా పొలిమేరల ఆవల ఎత్తైన చెట్ల నీడన వేసిన గుడారాల్లో నివాసం ఏర్పరచుకున్న ఆర్యజాతి సమూహం ఒక మధ్యాహ్నం పూట వెచ్చగా సేద దీరుతోంది. నిశ్చింతులైన మగవాళ్ళు విలాసంగా కూర్చుని నవ్వులు, ముచ్చట్లలో మునిగి ఉన్నారు, పిల్లలు ఆడుకుంటూ పెట్టే కేరింతలు చల్లని గాలిలో తేలి యాడినై. ఆడవాళ్ళు పిల్లల మీద ఒక కన్నేసి వుంచి తమ రోజువారీ పనుల్లో నిమగ్నమై వున్నారు. ఒక చోట కూర్చుని వయోవృద్ధులు లోయ అందాలను తదేకంగా చూస్తూండి పోయారు.
పురుష తన ప్రియ నేస్తాలైన అశ్విన్, వరుణ్ లతో సమావేశమై వున్నాడు. ఉమ్మడి లక్ష్యం గల ఆత్మీయ మిత్రులు ముగ్గురు రకరకాల విషయాలు, కథలు, సొంత అనుభవాలు చెప్పుకుంటూ నవ్వుకోసాగారు.
సరిగ్గా అదే సమయంలో హరప్పనులు ఆర్యుల స్థావరాలపై మెరుపు దాడి చేశారు. నడి నెత్తి మీదికొచ్చిన సూర్యుని బంగారు కిరణాలు రక్తసిక్తమైన యుద్ధభూమిపై వింతగా మెరిశాయి. ఏమరుపాటుగా వున్న పునీతుడు వెంటనే తేరుకుని అశ్విన్, వరుణ్ లతో పాటు భీకరంగా పోరాడాడు. అయితే శత్రువుల సంఖ్య ఎక్కువగావుంది.
కరవాలాల కణకణ ధ్వనులు లోయలో మారుమోగినాయి, డాలుల తాకిడి చప్పుడు, క్షతగాత్రుల ఆర్తనాదాలు అక్కడి గాలి అంతటా వ్యాపించినాయి. తన ఖడ్గం సూర్యకాంతిలో తళతళ మెరుస్తుండగా పునీతుడు వీరోచితంగా యుద్ధం చేస్తూ తన అనుచరులకు ప్రేరణనందించాడు. కానీ హరప్పనులు మున్ముందుకే చొచ్చుకు రాసాగారు, వాళ్ళ సంఖ్య పెరుగుతూనే పోయింది.
హరప్పనుల ధాటికి అశ్విన్ నిలువలేకపోయాడు. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి నేలకొరిగాడు, హరప్పనులను గెలవాలన్న అతని కలలు చెదరిపోయినై. వరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు, అతడు బతుకుతాడో లేదో తెలియదు. హరప్పనులు పునీతుడిని చుట్టుముట్టారు. అతడు నిప్పులు కక్కుతూ చూస్తోన్న దబీరుడిని ముఖాముఖి ఎదుర్కొన్నాడు.
బాగా అలసిపోయిన పునీతుని చేతిలోని ఖడ్గం వణికింది. అతడు ఒక స్థిర నిశ్చయంతో దబీరుని కళ్ళలోకి చూశాడు. ‘‘మేము శాంతి కోరి వచ్చాం.’’ బిగ్గరగా అన్నాడు. ‘‘మీ నుంచి నేర్చుకోవడం, వర్తకం చేయడం మాత్రమె మా ఉద్దేశం. మా పై ఎందుకిలా పగబూని విరుచుకు పడ్డారు?’’
దబీరుడి ముఖం కోపంతో ఇంకా ఎర్రబడింది. ‘‘మా రాకుమారి మనసు మార్చేశావు, పునీతా..మా ప్రజలకు ఆమె వ్యతిరేకమయ్యేలా చేశావు. మీ మోసానికి నువ్విప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిందే..’’
దబీరుడు మెరుపు వేగంతో పునీతుడి గుండెలో కత్తిని దింపాడు. అలా, హరప్పా విడిచి వెళ్ళండి లేదా తీవ్ర పరిణామాలు ఎదురుకోండి అని ఆర్యులకు సందేశమిచ్చాడు దబీరుడు.
హరప్పనుల ప్రతిఘటన తీవ్రమైనది, తమ సంస్కృతిని, నగరాన్ని సంరక్షించు కునేందుకు వాళ్ళు కృత నిశ్చయులై వున్నారు. కానీ దాని మూల్యం..? ఆర్యుల పక్షాన చాలా మంది చనిపోయారు. ఆ ఘర్షణ లోతైన గాయాలను మిగిల్చింది, ఆ ప్రాంత భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.
పునీతుడి మరణ వార్త వినగానే ఆర్మిత హృదయం వెయ్యి ముక్కలలైనట్టు విలవిలలాడింది. పునీతుడి మంచి ఉద్దేశాన్ని గుర్తించాల్సిందిగా ఆమె తన తండ్రికి ఎన్నో విధాల నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కాని అతడు వినలేదు. తన తండ్రి చేసిన పని వల్ల ఎంత ఘోరం జరిగిందో దాని పర్యవసానం ఎలా భరించాలో తెలియక సతమతమయింది ఆర్మిత.
నవనాడులు క్రుంగిపోయినట్టుగా ఆర్మిత అచేతనురాలైంది. పునీతుడు లేకుండా అతని మృదువైన చిరునవ్వు చూడకుండా తాను ఈ లోకంలో బ్రతకలేదు. ఏ ఆసరా దొరకని స్థితిలో తాను శోక సంద్రంలోకి విసిరి వేయబడ్డట్టు నిరాశలో కూరుకుపోయింది.
నగర వీధుల గుండా నడుస్తూ ఆర్మిత అవే పరిచిత ముఖాల్ని చూసింది. కానీ అంతా ఏదో తేడాగా వున్నట్టు అనిపించింది ఆమెకు. ఒకప్పుడు నవ్వులతో, ఉల్లాస భరితమైన మాటలతో జీవం తొణికిసలాడిన అంగడి దుకాణాలు ఇప్పుడు బోసిపోయినట్టు కనపడ్డాయి. జన సందోహంతో సందడిగా వుండిన వీధులు నిర్జీవ ఎడారిగా కనిపించాయి. చుట్టూ ఎవరూ లేని ఒక చిక్కని అడవి గుండా నడుస్తున్నట్టు ఆమెకు అనిపించింది. పునీతుడి ముఖం మరో సారి చూడాలని, అతని గొంతు వినాలని, అతని పక్కన తనను తాను చూసుకోవాలని ఆమె మనసు తహతహ లాడింది. కానీ తాను సర్వం కోల్పోయింది, ఆర్యులతో జరిగిన గందరగోళ ఘర్షణలో అన్నింటినీ శాశ్వతంగా పోగొట్టుకుంది.
జరిగిన ఘోరం వల్ల కూతురికి ఎంత దు:ఖం, బాధ కలిగాయో చూశాక బాగుహర చాలా పాశ్చాతాప పడ్డాడు. ‘‘దీనికంతటికీ కారణం నేను. నా సొంత కూతురుకి ఎంతో క్లేశం కలిగించాను. ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదు..’’ అని చింతించాడు.
పునీతుడిలో, అతని ప్రజల్లో మంచిని చూడమని ఆర్మిత తనని ప్రాధేయ పడిన సందర్భాలు బాగుహరకి గుర్తుకి వచ్చాయి. కానీ తాను ఆమె మాటలను తోసి పుచ్చాడు, తన ప్రజలకు ఏది మంచో తనకు బాగా తెలుసుననుకున్నాడు. తన పొరపాటు ఇప్పుడు తెలిసి వచ్చింది. ’ఆమె మాటలు ఎందుకు వినలేదు..? భయం, గర్వాతిశయం నన్ను చేయిపట్టుకు నడిపిస్తే గుడ్డిగా ఎందుకు అనుసరించాను ?’ అని తీవ్రంగా వ్యాకుల పడ్డాడు.
అలా కొన్ని రోజులు గడిచాయి. బాగుహర వైఖరిలో మార్పు వచ్చింది. అపరాధభావనతో కూతురి ముఖంలోకి చూశాడు. ఆర్మిత చూపుల్లో చూపులు కలిపిన అతనికి ఆమె మనసులోని దు:ఖపు లోతులు కనిపించాయి. ఎన్నో రోజులు నిశ్శబ్దంగా ఏడ్చి ఎర్రబడి ఉబ్బిన కళ్ళతో ఆమె చూసిన చూపుల్లో అంతరంగంలోని బాధాబడబాగ్ని ప్రతిఫలించింది.
‘‘నాన్నా, నాకు అతడే గుర్తుకు వస్తున్నాడు, ఈ లోటు భరించలేను, పునీతుడిని నా సర్వస్వంగా భావించాను..’’ దగ్గుత్తికతో అన్నది ఆర్మిత.
‘‘నా తొందరపాటు చర్యలు నీకు క్లేశం కలిగించాయని నాకు అర్థమైంది,.చిట్టితల్లీ. మన నగరాన్ని, సంస్కృతిని రక్షించేందుకు చేసిన ప్రయత్నమది. నా వాళ్లు నన్ను తప్పుదోవ పట్టించారని ఇప్పుడు తెలిసింది..’’
ఆర్మిత తలెత్తి తండ్రి వేపు సూటిగా చూస్తూ అంది: ‘‘నిన్నెవరూ తప్పుదోవ పట్టించలేదు.. నాన్నా. నువ్వు పొరపాటు చేశావు. నీ భయం, గర్వం ఎలా చెబితే అలా చేశావు. వివేకంతో వివేచించేవారి మాటల్ని నిర్లక్ష్యం చేశావు.’’
బాగుహర సాలోచనగా నేలచూపులు చూశాడు. ‘‘నా పొరపాటు చర్య లు నీకు చాలా దుఃఖం తెచ్చి పెట్టాయి బిడ్డా, అందుకు విచారిస్తున్నాను. మన ప్రజలకు ఏది మంచిదని భావించానో అదే చెయ్యాలని ప్రయత్నించాను..ఇది నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా.’’
ఆర్మిత ముఖ కవళికల్లో తేలికదనం చోటు చేసుకుంది. ‘‘నేను అర్థం చేసుకోగలను నాన్నా..కానీ అందుకు భారీ మూల్యం చెల్లించాం. సరే.. ఇరువర్గాలకు తగిలిన గాయాలు మానేలా చూస్తూ మనం ఎలాగోలా ముందుకు పోవడం గూర్చి ఆలోచించాలి.’’
బాగుహర ముందుకు వంగాడు, అతని కళ్ళల్లో పశ్చాత్తాపం, స్థిర నిర్ణయం కనపడ్డాయి. ‘‘నేను ఒప్పుకుంటా చిట్టి తల్లీ. గాయాలు మానడానికి, సామరస్య వాతావరణం నెలకొనడానికి..నువ్వు చెప్పేది వింటాను.’’
ఇన్నాళ్ళ దుఃఖ భారంతో ఆర్మిత గుండె బరువెక్కింది. ఆ క్షణాన తండ్రి చెప్పే మాటలు నిజాయితీతో కూడుకున్నవనీ, ఆ ప్రయత్నంలో ఇక ఆలస్యానికి తావివ్వ కూడదనీ ఆమెకు అర్థ మైంది. అయితే ఇప్పటికే వాళ్ళు చాలా దూరం వెళ్ళారా ? ఒకరికొకరు చాలా నష్టం కలిగించుకున్నారా ? ఇవి ఆమె ఆలోచనకు అందలేదు.
ఆశా, సంకల్పమూ లేని ఒక శూన్య ప్రదేశం గుండా వెళుతున్నట్టుగా ఆర్మితను నిస్పృహ ఆవహించింది. మళ్ళా పునీతుడి చిరునవ్వు చూడాలనీ, అతని అందమైన నవ్వు వినాలనీ, అతని సమక్షంలోని వెచ్చదనం రుచి చూడాలనీ ఆమె మనసు ఉవ్విళ్ళూరింది.
తండ్రితో మాట్లాడి తిరిగి వస్తూండగా తాను పన్నెండేళ్ళ ప్రాయంలో వున్నప్పుడు చనిపోయిన తల్లి ఆర్మితకు జ్ఞాపకం వచ్చింది. తల్లి చెంతన వున్నప్పుడు ఆమెకు ఎంతో ఉపశమనం, గుండె ధైర్యం లభించేవి ; ప్రస్తుత స్థితిలో తల్లి తనకు మార్గదర్శిగా, మద్దతుగా వుంటే బాగుండునని ఆర్మిత మనసు తహతహ లాడింది. ఊర్ధ్వ లోకాల నుంచి తల్లి తనని ఆశీర్వదిస్తున్నదని భావిస్తూ, ఆమె కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ప్రార్థించింది.
‘‘అమ్మా, ఎన్నడూ లేనంతగా నాకిప్పుడు నీ మార్గ దర్శనం కావాలి.. ’’ లోగొంతుకతో పలికింది ఆర్మిత. ‘‘పునీతుడు ఈ లోకం విడిచి వెళ్ళాడు, నేను శకలాలు ఏరుకుంటూ వున్నాను. బలం కూడదీసుకుని ముందుకు నడిచేలా, ఈ సంఘర్షణ తాలూకు గాయాలు మానే దోవ కనపడేలా దయచేసి నాకు సాయపడు.’’
అయితే, తన తండ్రి చర్యలు ఊహించలేనంతటి విపరిణామాలకు దారితీస్తాయనీ, కనీవినీ ఎరగని దుష్ఫలితాలతో అవి హరప్పనుల జీవితాల్ని సమూలంగా మారుస్తాయనీ ఆర్మితకు తెలియదు. (సశేషం)
(తెలుగు అనువాదం: ఆడెపు లక్ష్మీపతి)