ఉత్తరాన బుద్ధోదయం
x

ఉత్తరాన బుద్ధోదయం

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 20. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి


-బేతి పాణిగ్రాహి

ఆర్య సామ్రాజ్య విస్తరణ కొనసాగుతుండగానే ఒక కొత్త ఆధ్యాత్మిక ఉద్యమం సమాజంలో వ్యాపించ నారంభించింది. పొరుగు రాజ్యమైన కపిలవస్తుకు చెందిన రాజకుమారుడు సిద్ధార్థ గౌతముడు తన రాజ్యభోగాలను త్యజించి జ్ఞానాన్వేషణ బాట పట్టాడు. ఈయన జన్మతః సున్నిత మనస్కుడు, కరుణార్ద్ర హృదయుడు.

రాజు శుద్దోదనుడు, రాణి మాయాదేవిల కుమారుడే సిద్ధార్థుడు. సకల సంపదలు, రాచరిక మర్యాదలు, అంతులేని ఐశ్వర్యం..నడుమ రాజభవనంలో పెరిగిన సిద్ధార్థుడు కళలు, యుద్దవిద్యలు, పాలనా పద్ధతుల్లో శిక్షణ పొందాడు. సకలభోగాల నడుమ పుట్టిపెరిగినా చుట్టూ లోకం లోని దు:ఖాన్ని చూసి అతడు తీవ్రంగా కలత చెందాడు.

“మానవాళిని పీడిస్తున్న కష్టాలకు, దు:ఖాలకు నాకు సమాధానం కావాలి..” బోధివృక్షం కింద కూర్చొని సిద్ధార్థుడు అన్నాడు. “మానసిక ప్రశాంతత, అహింస, భౌతిక సంపత్తి నిరాకరణ.. నేను అవలంబించే మార్గం.”

అక్కడ ధ్యానముద్రలో కూర్చొని సిద్ధార్థుడు నాలుగు గొప్ప సత్యాలను, జ్ఞానోదయ మార్గాన్ని, పునర్జన్మ భావనను కనుగొన్నాడు. వాటి సారమే బౌద్ధం. మానసిక ప్రశాంతత, అహింస, భౌతికసంపత్తి పరిత్యాగం.. ఈ తాత్విక చింతనలోని ముఖ్యాంశాలు. ప్రకృతితో, ప్రకృతిలోని సకలప్రాణులతో సామరస్యపూరితంగా జీవించే ఒక కొత్త జీవనవిధానాన్ని ప్రబోధించిన గౌతమ బుద్ధుని బోధనలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి.

‘సత్యచతుష్టయం’ ( నాలుగు గొప్పసత్యాలు) జీవిత పరమార్థాన్ని అన్వేషించగోరే వారి హృదయాలకు నేరుగా తాకింది. బుద్ధుని ‘అష్టాంగ విధానం’ ఒక ఆశారేఖగా, కరుణామయ జీవనానికి, విజ్ఞానానికి, మానసిక ప్రశాంతతకి మార్గదర్శిగా వారు భావించారు.

బుద్ధుడిగా పిలువబడ్డ సిద్ధార్థుడు ప్రశాంత వదనంతో సన్నగా పొడుగ్గా ఉండేవాడు, అతని నల్లని దట్టమైన కురచ జుట్టు, గాఢమైన గోధుమ వన్నెగల లోతైన కళ్ళు ఎదుటి వాళ్ళని కట్టి పడేసేవి. భౌతిక వస్తు పరిత్యాగానికి చిహ్నంగా ఆయన సాదాసీదా ముతక వస్త్రం ధరించేవాడు. అతని కరుణార్ద్రమైన చిరునవ్వు, చల్లని చూపులు ఎదుటి వారిని ఉల్లాసపరిచేవి. అతని వివేకం, విజ్ఞానం, జీవితం పట్ల లోతైన అవగాహన అయస్కాంతంలా పనిచేసి ప్రజలు వెంటనే ఆకర్షితులయ్యేవారు.

బుద్ధుని బోధనలు శరవేగంగా వ్యాపించి, అన్ని జీవన నేపథ్యాల ప్రజలను అతన్ని అనుసరించేలా చేశాయి, అతని అనుచరుల్లో కొందరు ఆర్య సామ్రాజ్యానికి చెందినవారు కూడా వున్నారు. అతని బోధనల సారమైన అహింస, ప్రేమ, విజ్ఞానం.. రాజ్య పాలకుల సైనిక ప్రయోజనాలకు భిన్నంగా కనపడటంతో ప్రజలు బౌద్ధాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించారు.

“ఇది ప్రేమ, అవగాహన ల సందేశం..” అన్నాడొక అనుచరుడు. “ఎందరి హృదయాలనో కదిలించగల ఉదాత్త సందేశం.”

“ కానీ దు:ఖానికి మూలహేతువు ఏమిటి ? దీన్ని ఎలా అధిగమించగలం? “ అన్నాడు మరొకాయన.

“ ఈ ప్రపంచపు అశాశ్వత వస్తు సంపత్తి పట్ల మన వాంఛ, వ్యామోహం నుండి దు:ఖం, విచారం జనిస్తాయి..” జవాబిచ్చాడు సిద్ధార్థుడు.”‘వాస్తవం యొక్క స్వభావం మనకు తెలియనందువల్లనే అవి పుడతాయి. అయితే అష్టాంగ మార్గం ద్వారా మనం వాటిని జయించగలం; ధ్యానం ద్వారా, భూతదయ ద్వారా, జ్ఞానం ద్వారా వాటిని అధిగమించగలం.”

“మరి పునర్జన్మ సంగతేమిటి ? “ అనడిగాడు మూడో వ్యక్తి. “చనిపోయాక మనకు ఏమి జరుగుతుంది?”

“ మన ఆత్మలు మరో శరీరంలోకి ప్రవేశిస్తాయి, పునర్జీవిత మవుతాయి..” చెప్పాడు సిద్ధార్థుడు.”అయితే ఈ జనన మరణాల చక్రాన్ని ఆధ్యాత్మిక మార్గం ఆచరించడం ద్వారా, జ్ఞానోదయ సముపార్జన ద్వారా ఛేదించగలం. ‘నిర్వాణ’ అనే అంతిమ ప్రశాంతత, విముక్తి దశ మనం సాధించగలం.”

ఆర్యులు ఈ కొత్త సంస్కృతి పెరిగిపోతుండటాన్ని గమనించక పోలేదు. తమ అధికారానికి, ప్రాబల్యానికి, జీవనవిధానానికి అదొక పెను ముప్పుగా పరిగణించారు.

“ బౌద్ధం అనేది ఒక బలహీనమైన, విదేశీ తాత్వికభావన. సగర్వులైన, బలమైన ఆర్యజాతి ప్రజలకు అది అనువైనది కాదు. దాని ఆచారణని వెంటనే రాజ్యంలో నిషేధించాలి..” అన్నాడు ఆర్యుల రాజు ఇంద్రసేనుడు.

“ కానీ, ఇంద్రసేనా..ఇది శాంతి, సామరస్యాల తాత్విక చింతన..” అన్నాడొక సేనానాయకుడు. “ ఇతరులను ప్రేమించాలనీ, హింస, ఘర్షణ విడనాడాలనీ, మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలనీ బోధిస్తుంది ఇది.”

“ అది ఏమి బోధిస్తున్నదో నాకక్కరలేదు, “ కటువుగా అన్నాడు ఇంద్రసేనుడు. “మన సామ్రాజ్యం బలంగా వుండి ఆధిపత్యం చెలాయించడమే నాకు కావాలి. బౌద్ధం మనల్ని బలహీన పరుస్తుంది, మన అధికారాన్ని నీరు గారుస్తుంది, మన జీవన విధానాన్ని ధ్వంసం చేస్తుంది.”

ఏదేమయినప్పటికీ, బౌద్ధం నలుచెరగులా వ్యాపిస్తూనే పోయింది ; దాని ప్రేమ, కరుణల సందేశం ఎందరి హృదయాలనో తాకింది. ఒక కొత్త సంఘర్షణ రూపం పోసుకోసాగింది. ఆర్య సామ్రాజ్యాన్ని శాంతి కాముకులైన బౌద్ధ మతస్తులకు వ్యతిరేకంగా మోహరించిన ఘర్షణ అది. రెండు పరస్పర విరుద్ధ తాత్విక చింతనల నడుమ ఉద్రిక్తతలు అధికమవసాగినై.

ఒక దినం విజ్ఞానీ, కరుణామయుడూ అయిన ఒక వ్యక్తి రాజదర్బారులో పాదం మోపాడు. అతడు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు. ఇంద్రసేనుడి నిరంకుశ పాలన గురించి విని, రాజుకు సరైన మార్గం బోధించేందుకు వచ్చాడు. ఆ బిక్షువు కీర్తి ప్రతిష్టలు విని ఆశ్చర్య చకితుడైన ఇంద్రసేనుడు ఆయనను కలవడానికి అంగీకరించాడు.

గౌతమ బుద్ధుడిని తన నిశితమైన దృక్కులతో పరిశీలిస్తూ ఇంద్రసేనుడు గర్వంగా దర్పంగా నిలబడ్డాడు. సిద్ధార్థుడు ధ్యానముద్రలో కళ్ళు మూసుకొని ఒక చిన్న ఆసనంపై ప్రశాంతంగా కూర్చొన్నాడు.

“ మా బోధనలు ఎవరూ ఆపలేరు..” అన్నాడొక బౌద్ధ బిక్షువు స్థిరమైన స్వరంతో.”మమ్మల్ని ఎవరూ అణచి వేయలేరు. ఎంతటి ప్రతికూల స్థితి ఎదురైనా శాంతి సామరస్యాల సందేశాన్ని మేము ప్రచారం చేస్తూనే ఉంటాము.”

ఇంద్రసేనుడి ముఖం కోపంతో ఎర్రబడింది. అతడు హుంకరిస్తున్నట్టుగా, “ మీరెంత దూరం వెళతారో నేనూ చూస్తాను..” అన్నాడు. “ఈ బౌద్దమతాన్ని మేము అణగదొక్కుతాం. మా ఆధిపత్యానికి అడ్డు లేకుండా చూసుకుంటాం.”

కానీ సిద్ధార్థ గౌతముడు కరుణార్ద్ర దృక్కులతో చూస్తూ ఏమీ మాట్లాడలేదు. క్షణం పోయాక అన్నాడు, “మేము ఘర్షణని కోరుకోవడం లేదు. శాంతి సామరస్యాల మా సందేశాన్ని అందరికీ వినిపించాలనుకుంటున్నాము. భేద భావాలతో మనం విడిపోకూడదు, మానవత్వం అనే సూత్రంతో ఐక్యంగా వుందాం.”

ఇంద్రసేనుడి స్వరంలో వెక్కిరింత ధ్వనించింది. “నువ్వు అమాయకుడివి సిద్ధార్థా..నీ పలుకుల్లో పస లేదు, నీ బోధనలు శుష్క ప్రలాపం. నీ శాంతి సామరస్యాల సందేశం మమ్మల్ని ప్రభావితం చేయదు. అధికారంతో, బలంతో మేము సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూనే వుంటాం. “

సిద్ధార్థుడి వదనం ప్రశాంతంగా వుంది, అతని స్వరంలో తొట్రుపాటు లేదు.”అధికారంతో, బలంతో కొద్దికాలం మాత్రమె పరిపాలించవచ్చు. వాటితో శాంతి సౌభాగ్యాలను ఎన్నడూ తేలేవు. ప్రేమ, కరుణ మాత్రమె అంతిమంగా విజయం సాధిస్తాయి.”

“ మనసే అన్నింటికీ మూలం.. ఇంద్రసేనా.. “ సిద్ధార్థుడు చెబుతూ పోయాడు.” నువ్వు ఏమి అనుకుంటా వో అదే అవుతావు. కోపాన్ని, ద్వేషాన్ని విడిచిపెట్టు, కరుణతో, అవగాహనతో వర్తమానాన్ని ఆలింగనం చేసుకో. గుర్తు పెట్టుకో..నిన్ను నువ్వు గెలవడమే అతి గొప్ప విజయం.”

ఇంద్రసేనుడు కోపోద్రిక్తుడైనాడు. అతని ముఖం ఎర్ర బడింది. అయితే సిద్ధార్థుడి మాటలు అతని హృదయాన్ని ఎక్కడో తాకాయి. కొన్ని క్షణాలు సంకోచిస్తూ ఉండిపోయాడు..ఆ క్షణాల్లో ఒక నిగూఢ సత్యం అతని కళ్ళ ముందర మెరిసింది. కానీ గర్వాతిశయం, అత్యాశ వెంటనే దాన్ని మసకబార్చినాయి.

ఆ ఇరువురు ఒకరికొకరు అభిముఖంగా వున్నారు ; ఇంద్రసేనుడి చూపులు ఎలాంటి మార్పు లేకుండా తీక్షణంగా వున్నాయి, సిద్ధార్థుడి వదనం, దృక్కులు ప్రశాంతంగా వుండి ఒక అనిర్వచనీయమైన తేజో వలయాన్ని ప్రసారం చేశాయి. మార్పు సంకేతాలు అంతకంతకూ ప్రస్ఫుటమవడంతో- ఒకవేపు ఆర్యుల సామ్రాజ్యం, మరోవేపు బౌద్ధం.. ఈ రెండింటి భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.

ఏదేమైనా ఆర్య రాజు ఈకొత్త పరిణామాన్ని తన అధికారానికి, ఆధిపత్యానికి ముప్పుగా పరిగణించాడు ;శాంతి కాముకులైన బౌద్ధమత అనుయాయులకు వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నడానికి పూనుకున్నాడు. (సశేషం)

Read More
Next Story