హారప్పాలో ఆర్యుల అస్తిత్వం
x

హారప్పాలో ఆర్యుల అస్తిత్వం

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 17. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి


-బేతి పాణిగ్రాహి

హరప్పన్- ఆర్యన్ సామ్రాజ్యం విస్తరిస్తూన్న క్రమంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. చాలా మంది ప్రజలు, తమ వాస్తవ వారసత్వాన్ని పక్కనపెట్టి, తమని తాము ఆర్యులుగా చెప్పుకోనారంభించారు.’ ఆర్య ‘ పదం సాంస్కృతిక ఆధిక్యతకు, యుద్ధవిద్యా కౌశలానికి, మేధాపరమైన ఉత్కృష్టత కు పర్యాయపదంగా మారింది.

తమని తక్కువ రకం మనుషులుగా ఎక్కడ పరిగణిస్తారో, వెనక్కి నేట్టేస్తారో లేదా పక్కకు తోసేస్తారో నన్న భయంతో చాలా మంది తాము ఆర్యులమని ప్రకటించుకోసాగారు. ఆర్యులుగా గుర్తింపు పొందడం వలన మాత్రమే రాజోద్యోగాలు లేదా ఉన్నత పదవులు లభిస్తాయన్న నమ్మకంతో వాళ్ళు ఉత్సాహంగా ఆ బిరుదు తగిలించుకున్నారు. కొందరైతే మరీ ముందుకు వెళ్లి తమ ఆర్యజాతి పరంపరకి రుజువుగా ప్రసిద్ధ పూర్వీకుల గాథలు, ప్రశస్తమైన కుటుంబ చరిత్రలు కల్పించి చెప్పారు. మరి కొందరు అన్నింటా ప్రాబల్యం వహిస్తున్న సంస్కృతిలో విలీనం కావడం మంచిదన్న ఉద్దేశంతో నేరుగా ఆర్యన్ ఆచారాలు, సంప్రదాయాలు అవలంబించారు.

“నేను ఆర్యుడిని, నన్ను పొగడాలి !” అన్నాడొక యోధుడు, కళ్ళలో గర్వం, అతిశయం ప్రతిఫలిస్తుండగా.

“ ఆర్యుడు అంటే ఏమిటి అర్థం ?” సందేహాత్మకంగా, వృద్ధుడైన జ్ఞాని ఒకాయన అడిగాడు.”అది తగిలించుకునే ఒక బిరుదు, ఇతరుల కన్నా తాను భిన్నమైన వాడినని చెప్పుకోవడమే కదా ?”

“ఉత్తముడు, అధికుడు అని దాని అర్థం..”బదులిచ్చాడొక వీరుడు, ఛాతీపొంగిస్తూ. “ఆర్యులమైన మనం గొప్పదనం సొంతం చేసుకున్నాం..మానవాళి సాధించిన వాటిలో మన సంస్కృతి శిఖరమానమైనది.”

“ఓహ్..అది ప్రమాదకరమైన అభిప్రాయం కదా..?”కళ్ళు చికిలించి చూస్తూ అడిగాడు వృద్ధ పండితుడు. “కేవలం గుర్తింపు తోనే తాను ఇతరులకన్నాఅధికుడనని భావించడమే కదా..ఈ భావన మినహాయింపు లకు, చీలికకు, ఇతర సంస్కృతుల నిర్మూలనకు దారి తీస్తుంది.”

“ మినహాయింపా?” అర్థం కానట్టు చూశాడు యోధుడు. “ఆర్యులమైన మనం అత్యధిక సమ్మిళితత్వం పాటించే వాళ్ళము. మనలోకి ఎవరినైనా చేర్చుకుంటాం..వాళ్ళు మన సాంప్రదాయిక దుస్తులు ధరించి నంతవరకు, మన ఆచారాల్ని పాటించినంత వరకు... అందరినీ స్వాగతిస్తాం.”

“సమ్మిళితత్వం ?” వ్యంగ్యం ధ్వనించే స్వరంతో అన్నాడు వృద్ధజ్ఞాని. “వాళ్ళు నీ సంస్కృతిని, నీ భాషను, నీ ఆచారాలను స్వీకరించినంత వరకు..అని అర్థమా ? అది సమ్మిళితత్వం కాదు, సాంస్కృతిక సామ్రాజ్యవాదం.”

“అది నా ఆలోచనకు రాలేదు,” అన్నాడు అతడు లోగొంతుకతో.

“ ఔను, రాదు.” అన్నాడు వృద్ధుడు నమ్మకంగా తలవూపుతూ. “గుర్తింపు అనేది శక్తివంతమైనదే, కానీ దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అది మనుషుల్ని విభజించేదిగా కాకుండా కలిపేదిగా వుండాలి.”

యోధుడు అంగీకారంగా తలూపాడు, కొత్త అర్థం స్ఫురించినట్టుగా సాలోచనగా చూశాడు.

“ కృతజ్ఞుడిని.” గౌరవం ఉట్టి పడే స్వరంతో అన్నాడతడు. “ నా గర్వం తప్పుడు స్థానంలో వుందని తెలుసుకున్నాను. కేవలం మన ఆధిపత్యాన్ని కాక, మన ప్రజల భిన్నత్వాన్నిసమాదరించే ఒక మంచి ఆర్యుడిగా మెలిగేందుకు ప్రయత్నిస్తాను.”

జ్ఞాని కళ్ళు సంతోషంతో వెలిగాయి, పెదాల మీద చిరునవ్వు విరిసింది.

“ అదే నిజమైన గొప్పదనం వేపు తొలి అడుగు,” అన్నాడు అతడు. “ఇతరుల విలువను అంగీకరించడం, ఎదుటి వాళ్ళను దూరం పెట్టడానికి బదులు కలుపుకు పోయేందుకు ప్రయత్నించడం.”

కానీ, కాలం గడుస్తున్నా కొద్దీ హరప్పనులు కొందరు ఇంకా ఇంకా అసహనానికి, అశాంతికి లోనయారు. తమ సంస్కృతి తుడిచి పెట్టుకు పోతూ ఆచారాలు కనుమరుగవుతున్నాయనీ, తమ ప్రజలు పక్కకు నెట్టేయ బడుతున్నారనీ వారు భావించసాగారు. ఆశాభంగం చెందిన హరప్పనులు కోపంతో వాళ్ళలో వారు గుసగుసలాడుకోసాగారు.

“ మన భాషలో మనల్ని బయట మాట్లాడుకోనీయడం లేదు. మనది నాగరిక భాష కాదని అంటున్నారు, “ అన్నాడొకడు నిరసనగా.

“మన గుళ్ళలో ఆర్యుల దేవతావిగ్రహాలు పెడుతున్నారు. మన దేవుళ్ళని మరిచి పోతున్నారు,” అన్నాడు మరొకాయన.

“ఆర్యుల దుస్తులు ధరించాలని, వాళ్ళ ఆచారాలు పాటించాలని మనల్ని బలవంత పెడుతున్నారు. క్రమంగా మన గుర్తింపుని కోల్పోతున్నాము..” అని బాధ వ్యక్తం చేశాడు ఇంకో వ్యక్తి.

తాము ప్రాధాన్యత కోల్పోతున్నామన్న విచారం, బాధ వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది. ‘ మనకు మునుపటి గౌరవం లేదు.’ మనసులో అనుకున్నారు వారు. ’మనం గుర్తింపులేని వాళ్ళమవుతున్నాం.’ ఆ ఆలోచనే వాళ్ళను భయపెట్టింది. తమ గుర్తింపును, సంస్కృతిని కాపాడుకునేందుకు ఏదో ఒకటి చేయాలి అన్న గ్రహింపు వారికి వచ్చింది.

“ ఇక్కడ మనం ఇక ఉండలేము,” అన్నారు కొందరు హరప్పనులు లోగొంతుకతో. “మనం పూర్తిగా అదృశ్యమవకముందే ఇక్కన్నుంచి వెళ్లిపోవాలి.”

అలా హరప్పనులు వలసబాట పట్టడానికి సిద్ధమయ్యారు. ఒకనాటి తమ స్వదేశాన్ని వీడి తమ సంస్కృతిని, గుర్తింపుని కాపాడుకోగలిగే మరో చోటుకి మూకుమ్మడిగా తరలి వెళ్ళడానికి సమాయత్తమయారు.(సశేషం)

Read More
Next Story