హారప్పన్లలో అంతరాత్మ వత్తిడి
x

హారప్పన్లలో అంతరాత్మ వత్తిడి

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 10. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి


-బేతి పాణిగ్రాహి

ఒక సాయంకాలం ఆర్మిత, వరుణ్ లు రాజభవనం వాకిలిలో కూర్చున్నారు, వాళ్ళ ముఖాల్లో ఆందోళన తాండవించింది. ఒకప్పుడు వైభవంగా వెలిగిన నాగరికతకు ప్రసిద్ధి గాంచిన హరప్పనులు క్రమంగా పతనమై పోతుండటం వాళ్ళు గమనించారు.

‘‘ఇది విషాదకరం, వరుణ్,’’ నిరాశ పూరిత స్వరంతో అంది ఆర్మిత. ‘‘హరప్పావాసులు మునుపు ఎంత చైతన్యవంతంగా హాయిగా నవ్వుతుండేవారు! ఇప్పుడు చూడు, ఇళ్ళన్నీ ఖాళీ అయినై, కుటుంబాల సంఖ్య తగ్గి పోతున్నది.’’

వరుణ్ తలూపుతూ బాధపడుతున్నవాడిలా చూశాడు. ‘‘నాకు తెలుసు, రాజకుమారీ. నిజంగా ఏమి జరుగుతున్నదో వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయ వెర్రి వాళ్ళని పూర్తిగా ఆవహించింది. బాంధవ్యాల మాధుర్యం, సామాజిక జీవన సౌందర్యం వాళ్ళు బొత్తిగా విస్మరించారు.’’

ఆర్మిత స్వరం ఉద్వేగభరితమై పోయింది. ‘‘నేను నిస్సహాయస్థితిలో కూరుకు పోయాననిపిస్తున్నది వరుణ్. వాళ్ళని కలిసి మాట్లాడాలని చూశాం, పతనం అంచునుండి వాళ్ళని పైకి లాగాలని ప్రయత్నించాం. కానీ వాళ్ళు వినడం లేదే ! వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు.’’

వరుణ్ కళ్ళల్లో కూడా నిరాశా ఛాయలు కమ్ముకున్నాయి. ‘‘అయినా వదిలిపెట్టకూడదు, రాజకుమారీ, మన ప్రయత్నం కొనసాగించాల్సిందే. ఇది హరప్పనులు, వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల పిల్లల పట్ల మన బాధ్యత.’’

అలా హరప్పనులు ఆధ్యాత్మిక జ్ఞానయాత్ర సాగిస్తూంటే ఆర్యజాతి అర్చకుల మనసుల్ని ఒక రకమైన అపరాధ భావన తొలిచింది.. వరుణ్, ఆర్మితలు అలుపెరగకుండా తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండటంతో – తమ చర్యల వల్ల నిజంగా హరప్పనులకు లేని కష్టాలు వచ్చి పడ్డాయే అని ఆర్యులు గ్రహించారు. తాము ఒడిగట్టిన సాంస్కృతిక కబళింపు మానవ చరిత్రలోని ఒక ముఖ్య భాగాన్ని తుడిచిపెట్టేసిందని కూడా ఆర్యులు తెలుసుకున్నారు.

అధికార దాహం, విజ్ఞాన పిపాస తో ఒకప్పుడు నోరు మూయించిన వాళ్ళ అంతరాత్మ ఇప్పుడు గొంతెత్తి బిగ్గరగా అరుస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టవల్సిందిగా కోరింది. జరిగిన పొరపాటు తెలుసుకున్నాక వారు హరప్పన్ సంస్కృతి విశిష్టత, విలువను చూడలేనంతటి గుడ్డివాళ్లుగా తమ ఆధిక్యతా భావన తమని మార్చిందని గ్రహించారు.

అలా పాశ్చాత్తాపంతో తల్లడిల్లిన ఆర్యజాతి నాయకులు రాజు బాగుహరని, ఇతర హరప్పన్ పెద్దలను కలిసి మాట్లాడారు, తమ వల్ల తప్పిదం జరిగిందని ఒప్పుకున్నారు. వాళ్ళ సాంస్కృతిక వారసత్వాన్ని దొంగిలించి వాళ్ళనెంతగానో బాధపెట్టామని అంగీకరించారు.

‘‘మీ విజ్ఞానాన్ని, మీ కళ ని, మీ ఆచారాలను లాగేసుకున్నాము,’’ చెప్పారు వాళ్ళు. ‘‘మీ వారసత్వాన్ని తుడిచివేసి మీ వాళ్ళని అంచులకు నెట్టి వేశాము. ఇందుకు మమ్మల్ని క్షమించమని, తప్పుల్ని సరిచేసే అవకాశం ప్రసాదించమనీ అడగడానికి వచ్చాం.’’

వివేకవంతుడూ, కరుణార్ద్ర హృదయుడూ అయిన బాగుహర కళ్ళెత్తి వాళ్ళ వేపు చూశాడు. అతని చూపులో విచారం, క్షమాగుణం ద్యోతకమైనాయి. ‘‘మేం మిమ్మల్ని క్షమిస్తున్నాం’’ అన్నాడు బాగుహర. ‘‘క్షమాపణ తో సరిపుచ్చుకోగూడదు. పోయిన దాన్నితిరిగి తెచ్చేందుకు, మా సంస్కృతిని, మా వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు మీరు కష్టపడాలి.’’

‘‘సరిగా చెప్పారు నాన్నా’’ మార్దవం నిండిన స్థిరమైన గొంతుతో అన్నది ఆర్మిత.’ ‘‘హరప్పనులమైన మనం చాలా నష్టపోయాం. అయితే జరిగినదాన్ని వెనక్కి నెట్టేసి, మన ఇరువురి సంస్కృతులు సహజీవనంతో కలకాలం వర్ధిల్లే ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రమించడానికి సిద్ధంగా వున్నాం.’’

‘‘మాకు అర్థమైంది ప్రభూ,’’ అన్నాడు వరుణ్ జాలి నిండిన గొంతుతో. ‘‘తప్పులు సవరించే దిశగా పని చేయడానికి మేము సిద్ధం. కానీ ఇందుకు మీ మార్గదర్శనం, నమ్మకం అవసరం.’’

‘‘మేము మిమ్ములను నమ్ముతున్నాం, వరుణ్,’’ హామీ ఇస్తున్నట్టుగా అన్నాడు బాగుహర. ‘‘కానీ మాకు కావాల్సింది చేతలు.. మాటలు కావు. మా సంస్కృతి, మా వారసత్వం పునరుజ్జీవనాన్ని, మా ప్రజలు మునుపటిలా గౌరవాభిమానాలు పొందడాన్ని మేము చూడాలి.’’

‘‘అలా జరగడానికి మాకు చేతనైనదంతా చేస్తాం’’ మాట ఇచ్చాడు ఆర్యుల నాయకుడు. ‘‘మీ సంస్కృతీ, మీ వారసత్వం పునరుద్ధరించడానికి, పరస్పర గౌరవం, అవగాహన... పునాదిగా ఒక కొత్త భవిష్యత్తుని నిర్మించడానికి మేము అవిశ్రాంతంగా కష్ట పడతాం.’’

‘‘మనం కష్ట పడాలి.. ’’ ఒత్తి పలికాడు వరుణ్. ‘‘ఇరు ప్రజావర్గాల నుంచి పండితులు వచ్చి చదువుకోవడానికి, బోధించడానికి అనువైన ఒక పెద్ద విశ్వ విద్యాలయాన్ని స్థాపించాలని నా ప్రతిపాదన. మనం హరప్పనుల విజ్ఞానాన్ని భద్రపరచాలి, దాన్ని ఆర్యుల విజ్ఞానంతో మేళవించాలి. కలిసి కట్టుగా వుంటే మనం ఒక కొత్త జ్ఞానోదయ, ప్రగతిశీల శకాన్ని ఆరంభించ గలం.’’

బాగుహర అతనితో ఏకీభవిస్తున్నట్టుగా తలవూపాడు. ‘‘అలాంటి విశ్వవిద్యాలయాన్ని నిర్మించుదాం, మన ప్రజల ఆకాంక్షలకి అది ప్రతిరూపంగా వుంటుంది. మానవ సంస్కృతీ వైవిధ్యాన్ని, సంక్లిష్టతని గౌరవించే ఒక దేదీప్యమాన భవిష్యత్తు సృష్టించేందుకు సమైక్యంగా పని చేద్దాం.’’

అలా ఇరువర్గాలవారు తమ జీవన యాత్రలో -సహకారం, సాంస్కృతిక మారకం, మానవ అనుభవ వైవిధ్యానికి ఎనలేని గౌరవం..ముఖ్యాంశాలుగా గల ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. బృహత్ విశ్వవిద్యాలయ నిర్మాణానికి హరప్పనులు, ఆర్యులు కలిసి కట్టుగా పనిచేశారు, ఆ విద్యాలయం వారి కొత్త మైత్రీ బంధానికి, పరస్పర గౌరవానికి అపూర్వమైన సంకేతంగా మన్నన లందుకున్నది.

కొత్త పరిణామాలతో ఆర్మిత సంతృప్తి పడింది; తన ప్రజల సంస్కృతి, వారసత్వం అంతిమంగా గౌరవానికి నోచుకుని పరిరక్షింప బడతాయని ఆమె తెలుసుకున్నది. ఒకరి సంస్కృతి పట్ల మరొకరి కి కొత్తగా ఏర్పడిన గౌరవాభిమానాలు గుండెల్లో, మనస్సుల్లో నిండిన హరప్పన్, ఆర్య యువత... కలిసి చదువుకోవడం గర్వంగా చూస్తూ ఆర్మిత పండితులు, విద్యార్థులతో కలిసి విద్యాలయ ప్రాంగణంలో నడిచింది.

తమ కర్తవ్యం విషయం లో ఇప్పుడు స్పష్టత వచ్చిన ఆర్యులు సుదీర్ఘమైన నిష్కృతి యాత్ర కు శ్రీకారం చుట్టి హరప్పన్ సంస్కృతీ, వారసత్వాలను పురుద్ధరించి అందరి కోసం ఒక ఉజ్వల భవిష్యత్తు నిర్మించే పనిలో పడ్డారు.

Read More
Next Story