తెలి మంచు కరిగింది, తలుపు తీయనా ప్రభూ!
x
ఎదగడానికెందుకో తొందర.. (ఫోటో రవి, ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్)

తెలి మంచు కరిగింది, తలుపు తీయనా ప్రభూ!

అందుకే ఈ ఉదయం ఆ సూర్యుణ్ణి అడగాలనిపిస్తోంది “నీ కాలి అలికిడికి మెలకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ” అని!


మబ్బులింకా వీడలేదు. చీకటి తెరలింకా తొలగలేదు. రాత్రి జాడలింకా గాల్లోనే తేలియాడుతున్నాయి. జనమింకా ముసుగులు తీయలేదు.ఆకాశం ఆవర్ణవమైంది. తూరుపు దిక్కు ఎర్రబారింది. నదిని చీల్చుకుంటూ పొద్దుపొడుపుకి గురుతుగా ఓ ఎర్రటి బిందువొకటి నెత్తుటి ముద్దలా కనిపిస్తున్నాడు. నడిజాముదాటిన తర్వాత కమ్ముకున్న తెలి మంచు నెమ్మదిగా కరుగుతోంది. చెట్ల ఆకుల మీద నుంచి జారిపడుతున్న ప్రతి బిందువు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుంది.

నిన్నటి భారాలు కరిగిపోయాయా…

ఇవాళ్టి ఆశలకు తలుపు తీయాల్సిన సమయమా…
ఏమో.. మనసే మనసును అడుగుతోంది.
హైవేపై ట్రక్కులు పరుగులు తీస్తున్నాయి.
నగరం మేల్కొంటోంది.
కానీ నది మాత్రం ఇంకా నిద్రలోనే ఉంది.
ఆ నిశ్శబ్దంలో సూర్యుడు పైకి ఎగబాకుతున్నాడు.
అది వెలుగుకాదు… ఒక ఆహ్వానం.
చెట్ల మధ్య నుంచి, పక్షుల కిలకిలారావాల నుంచి
నది ఒడ్డు నుంచి, వంతెనపై నుంచి కనిపించే ఈ ఉదయం
ఒక దృశ్యం కాదు… ఒక ప్రశ్న.

ఇన్ని రోజులు మనం మూసేసిన తలుపులు…

ఇప్పుడు తెరవడానికి సిద్ధమేనా?
నిరాశల పేరుతో వేసుకున్న గడులు,
భయాల పేరుతో పెట్టుకున్న తాళాలు,
ఓటముల పేరుతో నమ్మకాన్ని బందీ చేసిన మనసులు…

అన్నిటినీ ఒకసారి వెలుగులోకి తీసుకురావాలా?
తెలి మంచు మాదిరే..
మన లోపలా ఏదో కరుగుతోంది.

అందుకే ఈ ఉదయం ఆ సూర్యుణ్ణి అడగాలనిపిస్తోంది “నీ కాలి అలికిడికి మెలకువల వందనం
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ” అని!

(గురువారం తెల్లవారుజామున విజయవాడ వారదిపై నుంచి చూసినపుడు కనిపించిన దృశ్యాలు,
ఫోటోలు పెదపోలు రవి, ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్)
Read More
Next Story