
పండగ రమ్మంది... బతుకు వలస పొమ్మంది!
సన్ రైజ్ స్టేట్ లో సంక్రాంతి ‘కాంతి’ ఎంతో గొప్పగా వచ్చింది. కనుమూసేలోపే తిరిగి పట్టణాలకు వెళ్లిపోయింది. ఇదీ ఏపీ ప్రజల పరిస్థితి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం సంక్రాంతి పండగకు వివిధ ప్రాంతాల నుంచి 30 లక్షల మందికి పైగా వచ్చారు. ఈ విషయం ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అంటే ఏపీ నుంచి వలస బతుకులు 30 లక్షల మంది అధికారికం. అనధికారిక లెక్కల ప్రకారం వలస బతుకులు 50 లక్షలు. ఒక్క హైదరాబాద్ నుంచి 3 లక్షల వాహనాలు పండగ రోజు ఏపీకి వచ్చినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇది టోల్ గేట్ల ద్వారా తెలుసుకున్న లెక్క. కానీ పండగకు వారం రోజుల ముందు నుంచే ఏపీకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇక ద్విచక్ర వాహనాలు ఉపయోగించిన వారు ఎంతో మంది ఉన్నారు.
కూలీల వలసలే ఎక్కువ
ఉద్యోగాల్లో ఉన్న వారు తక్కువే. కూలి పనుల్లో ఉన్న వారు చాలా ఎక్కువ. ప్రధానంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారు ఏపీ నుంచి పలు రాష్ట్ర రాజధానులకు వెళుతున్నారు. సంక్రాంతి పండగ అనగానే కుటుంబంలోని వారంతా ఒక చోట కలిసి సందడి చేయడం ఆనవాయితీ, ఆచారం. అందులో భాగంగానే విదేశాల్లో ఉన్న వారిలో కూడా కొందరు సంక్రాంతికి గ్రామాల్లోని తమ ఇళ్లకు చేరుకుంటారు. ఒక సినిమాలో పాడిన పాట ఈ సందర్భంగా గుర్తుకు వస్తోంది. తూరుపు తెలతెల వారగనే... తలుపులు తెరచీ తెరవగనే చెప్పాలమ్మా శ్రీ వారి ముచ్చట్లు... అంటూ పాడినట్లుగా భోగి, సంక్రాంతి, కనుమ పండగ మూడురోజుల సందడి. మూడు రకాల వంటకాలతో, షడ్రుచులతో కొత్త అల్లుళ్లకు మంచి రుచికరమైన వంటకాలతో ఆనందంగా గడపడంతో సంతోషాలు పంచుకునే పండగ సంక్రాంతి.
అందుకే ఎన్ని కష్టాలు ఉన్నా, బాధలు పడుతున్నా అందరూ గ్రామాలకు చేరి బాధలు మరిచిపోయి, మూడు రోజులు సరదాగా గడిపి తిరిగి బతుతెరువు కోసం వెళుతున్నారు. ఈ వలసలు ఎప్పుడు ఆగుతాయి. స్థిరమైన పనులు, ఉద్యోగాలు ఏపీ ప్రజలు ఎప్పుడు సంపాదించుకుంటారు. పాలకులు ఇందుకు ఏమి చేస్తారనేది ప్రస్తుతం చర్చగా మారింది.
పశువులతో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి
సంక్రాంతి రాష్ట్ర ప్రజల మధ్య బలమైన సాంస్కృతిక, భావోద్వేగ బంధాలను ప్రతిబింబిస్తోంది. ఈ మహా వలస ద్వారా ఏపీని వదిలి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తమ మూలాలను మరచిపోలేదని స్పష్టమవుతోంది. పండుగ సందర్భంగా కోనసీమలోని జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలు అత్యద్భుతంగా జరిగాయి. ఇది రాష్ట్ర సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ సందర్భంగా ఈ వలసల వెనుక ఉన్న సామాజిక-ఆర్థిక కారణాలు, ప్రజల స్వస్థలాలు, రాష్ట్రానికి ఇచ్చే సందేశాన్ని విశ్లేషిద్దాం.
హైదరాబాద్‌లో ఏపీ ప్రజల సంఖ్య, ఒక అంచనా
ముఖ్యమంత్రి చెప్పినట్లుగా హైదరాబాద్ నుంచి 3 లక్షల వాహనాలు సంక్రాంతి కోసం ఏపీకి వచ్చాయి. ఒక్కో వాహనంలో సగటున 4గురు ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తే, దాదాపు 12 లక్షల మంది హైదరాబాద్ నుంచి వచ్చినట్లు భావించాలి. కానీ ఇది కేవలం పండుగ సమయంలో వచ్చిన వారి సంఖ్య మాత్రమే. ద్విచక్ర వాహనాలు కూడా లక్షల్లోనే వచ్చినట్లు టోల్ గేట్స్ వద్ద నమోదైన వివరాలు చెబుతున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిలో కీసర టోల్ ప్లాజా వద్ద 36 గంటల్లో హైదరాబాద్ వైపు వెళ్లిన వాహనాల సంఖ్య 58వేలుగా నమోదైంది. ఇవి కాకుండా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.
2026 నాటికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా జనాభా 1.15 కోట్లకు చేరుకుంది. ఇందులో 24 శాతం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి నివాసం ఉంటున్న వారే ఎక్కువ. చారిత్రకంగా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ (1956-2014) రాజధానిగా ఉండటం వల్ల, లక్షలాది మంది ఏపీ ప్రజలు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అంచనాల ప్రకారం హైదరాబాద్‌లో 30 లక్షల మంది పైన తెలుగు మాట్లాడే ఏపీ వాసులు ఉండవచ్చు. వీరిలో ఎక్కువ మంది ఐటీ, వ్యాపారం, విద్యా రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఈ సంఖ్య తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా పెరిగింది. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ప్రధాన ఆర్థిక కేంద్రం.
ఏపీ వలసలు, ఎక్కువగా ఏ ప్రాంతాల్లో?
సంక్రాంతికి 30 లక్షల మందికిపైగా వచ్చిన వారు ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మహానగరాల్లో స్థిరపడినవారు. హైదరాబాద్ నుంచి మాత్రమే మూడు రోజుల్లో 30 లక్షల మంది ప్రయాణికులు ఏపీకి వచ్చారు. దీని కోసం 150 స్పెషల్ ట్రైన్లు, 6,431 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి కూడా లక్షలాది మంది వచ్చారు. ఎందుకంటే కర్నాటకలో ఏపీ వాసులు ఐటీ రంగంలో ఎక్కువ. చెన్నైలో వ్యాపారం, సినిమా రంగాల్లో ఏపీ ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇతర రాష్ట్రాల్లోనూ వలసలు పెరిగాయి. కానీ హైదరాబాద్ ప్రధాన కేంద్రం. ఈ వలసలు ఏపీలో ఉపాధి అవకాశాల కొరత వల్ల జరుగుతున్నాయి. కానీ పండుగల సమయంలో తిరిగి వచ్చి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.
ఒక అద్భుత ఉత్సవం
సంక్రాంతి వేడుకల్లో భాగంగా కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోటలో జరిగిన ప్రభల తీర్థం ఉత్సవాలు ఈ ఏడాది ఎప్పుడూ లేనంత ఘనంగా నిర్వహించారు. ఇది 450 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉత్సవం, కనుమ రోజున (సంక్రాంతి తర్వాతి రోజు) జరుగుతుంది. లార్డ్ శివుని 11 రూపాలు (ఏకాదశ రుద్రులు) ఇక్కడ సమావేశమవుతాయని నమ్మకం. 11 గ్రామాల నుంచి ప్రభలు (చారియట్లు) తీసుకువచ్చి, కొబ్బరి తోటల్లో ప్రదర్శిస్తారు. తర్వాత గోదావరి కాలువలో విసర్జిస్తారు. ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది ఏపీ సంస్కృతి ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేస్తుంది. ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. పండుగలకు ప్రజలను ఏకం చేసే శక్తిని చూపిస్తోంది.
ఐక్యత, అభివృద్ధి
ఏపీని వదిలి ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సంక్రాంతికి తిరిగి వచ్చి పండుగ జరుపుకోవడం ఒక బలమైన సందేశాన్ని ఇస్తోంది. ఇది రాష్ట్ర ప్రజల మధ్య భావోద్వేగ బంధాలను, సాంస్కృతిక వారసత్వాన్ని బలపరుస్తుంది. ఆర్థికంగా ఈ వలసలు ఏపీలో ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఐటీ హబ్‌లు, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేస్తున్నారు. దీని వల్ల వలసలు తగ్గి, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అదే సమయంలో పండుగలు రాష్ట్ర ఐక్యతను ప్రోత్సహిస్తాయి. ఇది 'ఒకే భాష, ఒకే సంస్కృతి' అనే సందేశాన్ని చాటుతుంది. మొత్తంగా ఈ సంక్రాంతి ఏపీకి ప్రకాశవంతమైన భవిష్యత్తును సూచిస్తోంది. ప్రజలు తమ మూలాలతో ముడిపడి ఉండాలని, అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిస్తోంది.

