ఇదే ‘ది బీన్’
x

చికాగోలో భారతీయ శిల్పి సృష్టి ప్రత్యేక ఆకర్షణ

క్లౌడ్ గేట్ గా పేరున్న ఈ బీన్ ప్రేరణతోనే హైదరాబాద్ సెక్రెటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం రూపొందించారు.


మా చికాగో పర్యటనలో ఒక విశేషం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది క్లౌడ్ గేట్ లేదా ది బీన్ అనే ఆధునిక శిల్పం. ఎందుకు విశేషమంటే, దీనిని రూపొందించింది ఒక భారతీయ శిల్పి. అతని పేరు అనేశ్ కపూర్. మరొక విషయం ఏమింటే, ఈక్లౌడ్ గేట్ ప్రేరణతోనే హైదరాబాద్ సెక్రెటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం రూపొందించారు.


మొన్న డిసెంబర్ లో చికాగో సందర్శించాను. అమెరికా లోని పెద్ద నగరాలలో చికాగో మూడో స్థానంలో ఉన్నది. ఇది ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉన్నది. పర్యాటక నగరం కూడా కావడం వలన రద్దీ చాలానే ఉన్నది. అక్టోబరు రెండో శనివారం , ఆదివారం నాడు మేము చికాగో వెళ్ళాము. ముందుగా అనుకున్నట్లుగానే ఇండియా నుంచి వచ్చిన నర్మదతోపాటు స్నేహ ఉంటున్న హాస్టల్ కు వెళ్లాము. అక్కడనుంచి నలుగురం కలిసి చికాగో లోని గ్రాంట్ పార్కుకు వెళ్లాము. పోలిష్ కళాకారిణి మాగ్డలీనా అబాకనోవిచ్ రూపొందించిన అగోరా శి ల్పాలను (కింది ఫోటో) చూశాము. ఇవి తలా చేతులూ లేని 106 ఇనుప శిల్పాలు. విభిన్న దిశలలో అమర్చబడి ఉన్నాయి. అక్కడి నుంచి అక్వేరియం కు వెళ్లాము. 11.30 ని. లకు లోపలకు పోయిన మేము బయటకు వచ్చేసరికి మూడు దాటింది.



జాన్ షెడ్ అక్వేరియం లోకి అడుగు పెట్టాము. రద్దీ ఒక మోస్తరుగా ఉంది. దీనిని 1930 మే 30 నప్రారంభించారు. ఆ సమయానికి ఇదే ప్రపంచంలో పెద్ద అక్వేరియం. దీనిలో 32000 జంతువులు , 1500 జాతుల ప్రాణులు ఉన్నాయి. దీని నీటి సామర్థ్యం ఐదు మిలియన్ గాలన్లు. సంవత్సరానికి సగటున రెండున్నర మిలియన్ల సందర్శకులు ఉంటారు. దీనిలో ప్రధానంగా ఆరు విభాగాలున్నాయి.

అవి : అమేజాన్ రైజింగ్ ( Amazon Rising), కరీబియన్ రీఫ్ (Caribbean Reef) ఎబాట్ ఓషనేరియం (Abbott Oceanarium), పోలార్ ప్లే జోన్ (Polar Play Zone), వాటర్స్ అఫ్ ద వరల్డ్ (Waters of the world), వైల్డ్ రీఫ్ (Wild Reef).

జాన్ షెడ్ - జి అనే వ్యాపారవేత్త దీనిని బహుమతిగా ఏర్పాటు చేయడం వలన ఆయన పేరుతోనే ఇది చలామణిలో ఉన్నది. మేము ఒక్కొక్క విభాగాన్ని పరిశీలిస్తూ చూస్తూ పోతున్నా ము. స్టార్ ఫిష్ లు , పెద్ద చేపలు , చిన్నచిన్న చేపలు , రంగు రంగుల చేపలు , చిన్నచిన్న రంగుల కప్పలు , వివిధ రకాల పాములు ఇలా అన్నింటినీ గమనిస్తూ వెళుతున్న నాకు ఒక చిత్రమైన బోర్డును చూసి ఆనందం కలిగింది. విషయం ఏమిటంటే...... ఆ రకమైన మగ చేపలు పునరుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయట. వెంటనే నర్మదకు చూపించాను. ఇది సృష్టి వైచిత్రమే కదా...... అనేక డిజైన్లతో ఉన్న ఆ చేపలను చూసి నప్పుడు చీరల మీద వేయడానికి కొత్త డిజైన్లు మనసులో మెదిలాయి. వైల్డ్ రీఫ్ (కింది ఫోటో) అనే విభాగం నాకు చాలా నచ్చింది.


సముద్ర జంతువుల సహజ అస్తిపంజరాలు , దంతాలు మొదలైనవి అక్కడ ఉన్నాయి. నిర్మాణం అంతా ఎంతో కళాత్మకంగా ఉన్నది. సందర్శకులు కూడా చేతితో చేపలను తాకి చూసి ఆనందించే ఏర్పాటు రెండు చోట్ల ఉన్నది. ఒకటి లోపల , బయట మరొకటి. రెండోది వెలుపల ఉండడం వలన కాబోలు వాతావరణ అనుకూలతను బట్టి అవకాశం ఉంటుంది. మేము రెండు చోట్లా చేతితో చేపలను తాకి సంతోషించాము. డాల్ఫిన్ , సముద్ర గుర్రాల షోలు అక్కడ జరుగుతూ ఉంటాయి. మేము సీ హార్స్ షో (Sea horse show) చూసాము. సుశిక్షితులైన సిబ్బంది వాటితో అనేక రకాల విన్యాసాలు చేయిస్తారు. అది చూస్తున్నంత సేపు అందరూ చిన్నపిల్లలైపోతారు. కరతాళధ్వనులు మారు మ్రోగాయి.


లంచ్ అయ్యేసరికి దాదాపు నాలుగున్నర అయింది. Exam ఉంది , చదువుకోవాలని స్నేహ యూనివర్శిటీకి వెళ్లి పోయింది. నర్మద వెళతానంటే క్యాబ్ బుక్ చేసి పంపించి నేను శ్రీ చికాగో ఆర్కిటెక్చర్ టూర్ కి 5. 30 ని.ల ట్రిప్పు లో బయలు దేరాము. అది ఓపెన్ టాప్ బోట్ ( Open top boat). మిసిసిపి నదిలో 1.45 ని. లు ప్రయాణం. అది సాయంత్రం ట్రిప్పు కావడం వలన విద్యుద్దీపాల కాంతిలో చికాగో నగరం ధగ ధగా మెరిసి పోతున్నది. గైడు చెప్పడం మొదలు పెట్టాడు.

1986 నుంచి అతడు అక్కడ పనిచేస్తున్నాడు. చికాగో లో సంభవించిన దుర్ఘటన గురించి వివరిస్తున్నాడు. 8.10.1872 నాడు చికాగోలో భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. వెలుగుతున్న కిరోసిన్ లాంతర్ ఒకటి పశువుల కొట్టంలో తగిలించి ఉన్నది. ఒక గేదె దానిని కాలితో తన్నడం వలన కొట్టం లో చిన్నగా మంటలు అంటుకున్నాయి. తీవ్రమైన ఈదురు గాలులకు మంటలు అతి వే గంగా వ్యాపించాయి. అంతే..... చికాగో నగరం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ దుర్ఘటనలో 17500 భవనాలు కాలిపోయాయి. దాదాపు లక్షమంది నిరాశ్రయులయ్యారు. 300 మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన కొన్ని భవనాలతోపాటు కొత్తగా నిర్మించిన అందమైన , ఎత్తైన భవనాలు ఇరువైపులా కనిపిస్తున్నాయి.భయంకరమైన ఈ అగ్నిప్రమాదం. చికాగో భవన నిర్మాణ రంగంలో విప్లవాన్ని తీసుక వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన సాంకేతిక సివిల్ ఇంజనీర్లతో భవన నిర్మాణాన్ని చేపట్టారు. వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా భవన నిర్మాణం జరిగింది. ఎవరు ఏ భవనాన్ని నిర్మించారు అనేది పేర్లతోపాటు వివరించాడు గైడు. కానీ విదేశీయుల పేర్లు అంతగా గుర్తు ఉండవు కాబట్టి , గైడ్ పేరుతో సహా ఆయా సాంకేతిక నిపుణుల పేర్లు కూడా మరచి పోయాను. ఆ యా భవనాల ఎత్తును, ఆర్కిటెక్చర్ ను చూసి ఆనందించ వలసిందే. వాటిలో ట్రంపు టవర్ ఒకటి.

అవసరం కొద్దీ తెరువబడే వంతెనలు మరో ఆకర్షణ. బోటు లో రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉండడం వలన వేడి వేడి కాఫీ తాగుతూ గైడ్ చెపుతున్నది వింటూ ఆయా భవనాల నిర్మాణం కౌశలాన్ని వీక్షిస్తూ మధ్య మధ్యలో ఫోటోలు తీసుకుంటూ సాగిన పడవ ప్రయాశణంలో 1.45 ని. ల కాలం ఎలా గడిచి పోయిందో తెలియలేదు.



మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి మాగ్నిఫిషెంట్ మెయిల్ (Magnificent Mail) రోడ్డు లో నడుస్తూ స్కైటిల్ట్ (sky tilt) చేయడానికి వెళ్లాము. ఇదే రోడ్డులో. హోం లెస్ , హెల్ప్ మి లాంటి బోర్డులు పట్టుకొని అడుక్కోవడం కనిపించిది. కూడలిలో పెన్నులు , ఎరైజెర్స్ , పెన్సిల్స్ అమ్ముతూ నల్లజాతి చిన్న చిన్న పిల్లలు కనిపించారు. ఇక్కడ కూడా బాల్యం ఎక్సప్లాయిట్ చేయ బడడం బాధ కలిగించింది. 105 అంతస్తుల జాన్ హాన్ కాక్ భవనంలో 94 వ అంతస్తులో స్కై టిల్ట్ ఏర్పాటు ఉన్నది. వెయ్యి అడుగుల ఎత్తునుంచి 30 డిగ్రీలు ముందుకు వంగి 360 డిగ్రీల కోణంలో చికా నగరాన్ని వీక్షించడము అన్నమాట. అలా చూస్తున్నప్పుడు ఉద్వేగంతోపాటు నాలో కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కింద రోడ్డు మీద పోతున్న కార్లు బొమ్మ కార్ల లాగా అనిపించాయి.


అక్కడినుంచి క్లౌడ్ గేట్ లేక బీన్ (Cloud Gate or the Bean) ను చూడడానికి వెళ్లాము. ఈ కళాఖండం మిలీనియం పార్కులో ఉన్నది. దీని వాస్తు శిల్పి భారతీయుడు కావడం విశేషం. అతని పేరు అనేశ్ కపూర్. 2004 నుంచి 2006 మధ్యలో దీని నిర్మాణం జరిగింది. ఇది చిక్కుడు గింజ ఆకారంలో ఉండడం వలన సందర్శకులు దీనిని బీన్ అని పిలవడం మొదలు పెట్టారు. క్రమేణా ఆ పేరే స్థిరపడింది.

దాదాపు 98 టన్నుల బరువు గల 168 స్టీలు ప్లేట్లను ఒకదానితో మరొక దానిని అతికించి దీని నిర్మాణం జరిగింది. పారదర్శకమైన నునుపు పెట్టడం వలన సందర్శకులతో పాటు చుటూపక్కల ఉన్న భవనాలు , చెట్లు దీనిలో ప్రతిబింబిస్తాయి. అదే దాని ప్రత్యేకత. దాదాపు ఇలాంటిదే హైదరాబాదులో సచివాలయం ఎదురుగా ఈ మధ్య తెలంగాణ అమరవీరుల స్థూపంగా ఏర్పాటు చేసారు.



రెండు రోజుల చికాగో పర్యటన కొద్దిగా అసంతృప్తిగానే ముగిసింది. కారణం ఆ రోజు అక్కడ నిర్వహించ బడిన మారథాన్. వివిధ దేశాల నుండి నలభై వేల మంది దానిలో పాల్గొన్నారు. అందువలన తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. కారును పార్క్ చేయడానికే మాకు గంటల కొద్దీ సమయం పట్టింది. దానివల్ల సమయం వృథా అయింది. sky Deck కూడా చేయలేక పోయాము. కార్మికోద్యమంలో మైలురాయిగా నిలిచిన హే మార్కెట్ ను చూడలేక పోయామనే దిగులు ఉన్నా ఈసారి మరింత ప్రణాళికతో రావాలని నిర్ణయించు కొని , చూసిన ఆనందాన్ని నెమరు వేసుకుంటూ తిరిగికొలంబస్ చేరుకున్నాము.


Read More
Next Story