ఈ తెలంగాణ పల్లెలో సంక్రాంతి పండగైనా మందు చుక్క ఉండదు, ముక్క ముట్టరు
మద్యం, మాంసం తీసుకోవడంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్. ఇందులో అన్ని వూర్ల కాంట్రిబ్యూషన్ ఉంది, ఒక్క ఊరు తప్ప. ఎందుకంటే, ఆవూర్లో మద్యం, మాంసం ముట్టరు. అదేదంటే...
తెలంగాణ పల్లెల్లో ఎక్కడికెళ్లినా కష్టజీవులు సాయంత్రం అయితే కల్లు లేదా మద్యంతో సేదతీరడం, సంక్రాంతి,దసరా లాంటి పండుగలకు బంధువులు,దోస్టులతో చుక్కా, ముక్కాతో
దావత్ తీసుకోవడం ఒక ఆనవాయితీ. ఐతే ఆదిలాబాద్ జిల్లా, కవ్వాల్ దండకారణ్యం సమీపంలోని మామిడి గూడ అనే గోండు పల్లె మాత్రం భిన్నం. అక్కడ మద్యం మాంసం ముట్టరు.
పండుగలకే కాదు, అసలెప్పుడూ మద్యం మాంసం ముట్టరు. దాని వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం ఉంది. అవన్నీ అక్కడి పెద్దలు, స్వచ్ఛంద కార్యకర్తలు మాకు వివరించారు.
న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో మద్యం భారీగా అమ్ముడుపోయింది. గత డిసెంబర్ నెలలోనే రూ.3,805 కోట్లు విలువైన 38.07లక్షల కేసుల లిక్కర్, 45.09లక్షల కేసులు బీర్లు విక్రయించినట్లు ఒక అంచనా. గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఏకంగా రూ.37,682 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోయినట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఇలా మద్యం అమ్మకాల్లో రికార్డు సృష్టించిన తెలంగాణ గురించి దేశమంతా చర్చించుకుంటున్న సమయంలో మరో అరుదైన ముచ్చట కూడా ఉంది. ఈ మద్యం లెక్కల్లోకి చేరని ఒక గ్రామం గురించే ఈ కథనం. అక్కడికి ఒక్క మద్యం సీసా కూడా రానివ్వరు. తెలంగాణ సమాజ ప్రతిష్టను పెంచే మాద్ గిరిజన తెగ ప్రజలను కలుద్దాం రండి.
నిర్మల్ నుండి ఉట్నూరు వెళ్తూ ఇంద్రవెల్లి దగ్గర ఆగాం. మధ్యాహ్నం 12 దాటింది. రోడ్డు పక్కనే ఛాయి తాగుతూ ఈ ప్రాంతంలో ఏమైనా విశేషాలున్నాయా అని ముచ్చట్లు చెప్పుకుంటున్న వారిని అడిగాం...
‘ఎలాంటి విశేషాలు కావాలి బిడ్డా? ’ ఒక పెద్దాయన అడిగాడు.
‘ వింత ఆచారాలు , విశేషమైన పంటలు ఇలా ఏమైనా ...’ అన్నాం
‘ఈ దగ్గరలో మామిడిగూడ అనే చిన్న పల్లె ఉన్నది. అక్కడికి వెళ్లండి చాలా సంగతులు తెలుస్తాయి.’ అన్నాడాయన. అరగంటలో వారు చెప్పిన వైపు వెళ్లాం.
‘‘మా ఊర్ల మాంసం దుకాణాలు ఉండవు. వైన్ షాప్లుండవు. చికెన్, మటన్, చేపలు ఎవరూ తినకూడదని గ్రామసభలో తీర్మానం చేసినం. ముక్కలు తింటే మందు తాగాలనిపిస్తది. అది తాగితే గొడవలు , నేరాలు షురు అవుతవి.. అందుకే మద్యం ఆపడం కోసం మాంసం తినడం మానేసాం,’’ అన్నారు, మామిడి గూడలో ఇంటి ముందు తులసి మొక్కలకు నీళ్లు పోస్తున్న మహిళ.
అటవీ ప్రాంతంలో అరుదైన జీవనం!
రోజంతా రెక్కలు ముక్కలు చేసుకునే గిరిజన తెగల్లో మాంసం, మద్యం ముట్టని వారు చాలా అరుదుగా ఉంటారు. లిక్కర్ షాపులు అందుబాటులో లేక పోయినా ఈత, తాడి, జీలుగ కల్లు తీసుకుంటారు. మరికొన్ని చోట్ల ఇప్పసారా చేసుకుంటారు. అయితే తెలంగాణ లోని, ఆదిలాబాద్ జిల్లా , కవ్వాల్ అటవీ ప్రాంతపు మాద్ గిరిజన తెగ మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయరు.
ఇంద్రవెల్లి మండలం , మామిడి గూడ జనాభా దాదాపు 400. అక్కడ ఏ ఒక్క కుటుంబంలో వ్యక్తులు కూడా మద్యం ముట్టరు, మాంసం తినరంటే నమ్మశక్యంగా లేదు, కానీ ఇది నిజం. ఇక్కడి ప్రజలు తమదైన కట్టుబాట్లతో బ్రతుకుతూ ఒక కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఈ ఆచారం ఇప్పటిది కాదు, దీని వెనుక మూడు దశాబ్దాల క్రితం చరిత్ర ఉంది..
గురువు చెప్పిన మాట!
మామిడి గూడలో దాదాపు 40 ఏండ్ల క్రితం నీటి వసతి లేక సేద్యం చేయడం కష్టంగా ఉండేది. కొందరు సమీపంలోని అడవుల్లోకి వెళ్లి కట్టెలు, తునికాకుల సేకరణ పై ఆధారపడి బతికే వారు. మరి కొందరికి నాటుసారా కాయడమే జీవనాధారంగా మారింది. దాంతో తండాలో యువకులు మద్యానికి బానిసలు కావడమే కాకుండా, అనారోగ్యం పాలవ్వడం గ్రామస్థులను బాధించింది. అదే సమయంలో ఆ గ్రామంలోకి అడుగు పెట్టిన ఆధ్యాత్మిక గురువు ఫులాజీ బాబా. మనిషి పతనానికి మద్యం, మాంసం ప్రధాన వ్యసనమని అక్కడి ప్రజలకు చెప్పారు. వారి బలహీనతల్లో మార్పుకు ప్రయత్నం చేశారు. ఆయన బోధనలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. ఆయన చెప్పిన మాటలు నమ్మితే ఊరు బాగుంటుందని నమ్మారు. ఆయన చెప్పిన నైతిక విలువలను పాటించారు. కొన్ని రోజుల తరువాత ఆయన కాలం చేశారు.
బాబా జ్ఞాపకార్ధం ఒక ఆధ్యాత్మిక మందిరం నిర్మించుకున్నారు. ప్రతి ఉదయం అక్కడ ధ్యానం చేసి, ఊరి మంచి చెడులు చర్చించుకొని ఎవరికైనా సమస్యలుంటే పరిష్కరించుకునే వారు.
ఊరంతా ఒకే మాట...
‘‘ఒకవేళ మందు, మాంసం తీసుకుంటే దేవుడు కోప్పడతాడని, గ్రామానికి కీడు జరుగుతుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అదే కట్టుబాటును ఇప్పటికీ ఆచరిస్తున్నారు. అందుకే మద్యం తాగే విషయంలో చాలా కట్టడిగా ఉంటారు. పండుగలు పర్వదానాల్లో కూడా మద్యం ముట్టరు. అదొక్కటే కాదు, కనీసం బీడీ, సిగిరెట్, పాన్పరాగ్ లాంటివి కూడా దరిచేరనివ్వరు. పొరుగూర్లకు చెందిన వారు సైతం మద్యం సేవించి గ్రామంలోకి అడుగుపెట్టకూడదని కట్టుబాటు ఉంది. ఒక వేళ ఎవరైనా మద్యం సేవించి వస్తే , మరో సారి అలా చేయకూడదని, వారికి నచ్చచెబుతారు. వినక పోతే వెనక్కి పంపుతారు. ’’ అని గ్రామస్తురాలు పెమ్రే గోకుల వివరించారు. ఆమె బిఏ చదివారు. మాద్ గిరిజన తెగలో డిగ్రీ వరకు చదవినవారు తక్కువే ఆమె తో పాటు ఆ గ్రామంలో మరో నలుగురు బీటెక్, బీ ఫార్మసీ చదువుకున్నారు.
వ్యసనాలు వదిలి వ్యవసాయం వైపు...
కుటుంబాలు రోడ్ పాలయ్యే తాగుడు వంటి వ్యసనాలకు దూరం కావడంతోనే వారు ఆగ లేదు . తమ బీడు భూములును సాగుకు అనువుగా మార్చే పనులు మొదలు పెట్టారు. కొన్ని స్వచ్ఛంద సంస్ధల సహకారంతో 2006లో వాటర్ షెడ్ ప్రాజెక్టును అమలు చేసి, వాన నీరు పారే వాలు ప్రాంతంలో కందకాలు తవ్వి వాన నీటిని ఇంకింప చేశారు.
పొలాల సమీపంలో పదహారు చిన్న నీటి కుంటలను శ్రమదానంతో తవ్వుకున్నారు. ఫలితంగా వాన కురిసినప్పుడు నీరంతా వాటిల్లోకి చేరి భూమిలో తేమ పెరిగింది. ఈ కార్యక్రమానికి సాంకేతిక,ఆర్ధిక సాయాన్ని‘ ఏకలవ్య ఫౌండేషన్ ’ స్వచ్ఛంద సంస్ధ అందించింది.
‘‘ పాడి పంటల కోసం జల సంరక్షణను గ్రామస్థులు చేపట్టడం వల్ల ఒకపుడు పత్తి మాత్రమే పండిరచిన రైతులు నేడు పది ఎకరాల్లో గోధుమలు పండిస్తున్నారు. కందులు ,జొన్నలు, కాయగూరలు సాగు చేస్తున్నారు.’’ అని గోధుమ పైరును చూపించాడు గణపతి కాలే. ఇతను ఏకలవ్య ఫౌండేషన్ సంస్ధ తరుపున ఈ గ్రామంలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. వాటర్ షెడ్ కార్యక్రమం అమలులో కీలకంగా వ్యవహరించారు.
ఏడాదికి మూడు పంటలు...
‘‘సాగునీరు లేక ఒక పంట పండించడం కష్టంగా ఉండేది. కానీ మద్యపానానికి దూరం అవ్వడం వల్ల యువకులు కష్టపడి పనిచేయడం మీద దృష్టిసారించారు. వాననీటిని ఒడిసి పట్టడం వల్ల వేసంగిలో కూడా 3 బావులు, ఇరవై బోర్లులో జలమట్టం తగ్గలేదు. ఇపుడు మూడు పంటలు సాగు చేస్తున్నాం. ’’ అని రెండు ఎకరాల్లో జొన్నలు,కాయగూరలను సేంద్రియ పద్దతిలో పండిస్తున్న రాజేశ్వరి పాండ్రే సంతోషంగా చెప్పారు.
వీరు మాంసాహారం తినక పోయినా మాంసకృత్తులు ఎక్కువగా ఉండే కందులు,సోయా పండిస్తున్నారు. అన్నిరకాల ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ పోషక విలువలున్న ఆహారం తీసుకుంటున్నారు.
మామిడి గూడ లో మరో విశేషం అక్కడ నడుస్తుంటే, ప్రతీ ఇంటి ముందు వివిధరకాల మొక్కలు, పూలు మనల్ని కనువిందు చేస్తాయి. ప్రతీ కుటుంబం వీలైనంత వరకు ఇంటి ముందు మొక్కలు పెంచడం ఒక పద్ధతిగా ఉంది. వాటిలో తులసి మొక్క తప్పని సరిగా ఉంటుంది.
నేరాలు లేని ఊరు!
‘‘ ఏ ఒక్కరూ మద్యం సేవించం అని ఫులాజీ బాబాకు మేం మాటిచ్చాం. ఇప్పటి వరకు దానిని పాటిస్తున్నాం. దీని వల్ల బద్దకం తగ్గి శ్రమించే తత్వం పెరిగింది. మా కట్టుబాట్లు గౌరవిస్తూ పొరుగు గ్రామాల వారు కూడా మద్యం సేవించడం తగ్గిస్తున్నారు. ’’ అంటారు భురిజబాయి, నారాయణ్.
ఈ గ్రామంలోకి ఇప్పటి వరకు ఒక్క పోలీసు కూడా అడుగు పెట్టలేదని గ్రామస్థులు అంటారు, కారణం మద్యం వల్ల జరిగే వేధింపులు, గృహ హింస, అత్యాచారాలు, దొంగతనాలు లేక పోవడమే. అందరు కష్టించి పనిచేస్తూ, బహుళ పంటలు సాగు చేస్తూ, ప్రశాంతంగా ఆర్ధిక సమస్యలు లేకుండా, స్వయం సమృద్ది సాధిస్తూ సమీప పల్లెలకు ఆదర్శంగా నిలిచారు. మద్యం తీసుకోక పోవడం వల్ల ఆరోగ్యమే కాదు, సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందో వీరు నిరూపించారు.