ఆ గ్రామంలో సామూహిక వివాహాలు ఒక నియమం
x

ఆ గ్రామంలో సామూహిక వివాహాలు ఒక నియమం

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే సామూహిక వివాహాలు. ముఖ్రా గ్రామ ప్రయోగం మీద శ్యాం మోహన్ ప్రత్యేక కథనం

ఒక వివాహం జరపాలంటే దుస్తులు, నగలు కట్న కానుకల ఖర్చులే కాకుండా కేవలం వివాహ వేడుక కోసం ఫంక్షన్‌ హాల్‌ కి విందు భోజనాలకి లక్షల్లో ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులు భరించలేక అప్పుల పాలైన కుటుంబాలున్నాయి. అయినప్పటికీ పరువు ప్రతిష్టల కోసం ఈ హంగూ,ఆర్భాటాల నుండి తప్పించుకోలేక పోతున్నారు. ఇదంతా చూసిన ఆదిలాబాద్‌ జిల్లాలోని ‘ ముఖ్రా ’ గ్రామ సర్పంచ్‌ తమ ఊరిలో అందరికీ ఒకే సారి సామూహిక వివాహాలు జరుపాలని గ్రామసభలో తీర్మానం చేశారు. ఆ రోజు ఊరందరికీ విందు భోజనాలు కూడా పంచాయతీ నిధులతోనే పెడతారు! ప్రతీ కుటుంబానికి లక్షల్లో ఆదాచేసి ఒక ‘అర్ధ’ వంతమైన సంప్రదాయానికి నాంది పలికారు.

ఇపుడు ఇదే సంప్రదాయం సాహిత్య రంగంలోకి వచ్చింది. విడి విడిగా కాకుండా ఒకే రోజు ఒకే వేదిక మీద నాలుగు పుస్తకాలను ఆవిష్కరించి ఆర్ధిక భారాన్ని తగ్గించుకో బోతున్నారు హైదరాబాద్‌ రచయితలు!

ఎవరింట్లో పెళ్లి వాళ్లింట్లో జరగడం తరతరాల సంప్రదాయం. ఒక కుటుంబంలో వివాహ వేడుకకు ఊరంతా కదలి రావడం సహజం. ఐతే ఇపుడు మీరు చూడబోయే గ్రామానికి అల్లుడు కావాలన్నా, కోడలుగా రావాలన్నా కచ్చితంగా ఒకే వేదికపైనే అందరితో పాటు పెళ్లిపీటలు ఎక్కాలి. సంవత్సరంలో కుదుర్చుకున్న పెళ్లిలన్నీ వేసవిలో మంచిరోజు చూసి, నిర్వహిస్తారు. అక్కడి అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఒకే ముహూర్తానికి, గ్రామ కమిటీ నిర్ణయించిన సమయానికే దంపతులు అవుతారు. ధనిక, పేద అంతరాలను దాటి, కుల వివక్షకు తావులేకుండా, ఒకే రోజు సంబరంగా జరిగే ఈ సామూహిక వివాహాల వేడుకతో ఆ పల్లెకు పండగ వస్తుంది. మధ్యతరగతి వారికి వివాహ వేడుకలకు అయ్చే ఆర్ధిక భారం తగ్గించి కుల,మత.ఆర్ధిక గోడల్ని పగల గొడుతూ, నవశకానికి నాంది పలికిన ఆ గ్రామం పేరు ముఖ్రా(కె).తెలంగాణలోని, ఆదిలాబాద్‌జిల్లా, ఇచ్చోడ మండలంలో ఉంది. మహరాష్ట్ర సరిహద్దుల్లో ఉంది కాబట్టి ఆక్కడి కొందరు మరాఠీ మాట్లాడతారు.

ఇక్కడ 300 గడపలు, 700 మంది జనాభా ఉంది. వీరిలో 70 శాతం బీసీలు, మిగతా వారు ఎస్సీలు,ఇతరులు. అందరూ వ్యవసాయం మీదనే ఆధార పడి జీవిస్తారు.

ఒకపుడు ఈ గ్రామంలో పెళ్లిళ్లు చేసి ఆర్థికంగా కుంగిపోయిన కుటుంబాలను, గమనించిన గ్రామ కమిటీ సభ్యులు ఆ పరిస్థితులు మార్చాలని భావించారు. అందులో భాగమే ఈ సామూహిక వివాహాల సంబురం.

సామూహిక వివాహం వేడుక

‘‘ వివాహ వేడుక ఏ కుటుంబానికైనా ఆర్థికంగా భారమే. ఇక ఆడబిడ్డ లగ్నం అంటే తల్లిదండ్రులకు కట్నకానుకల ఖర్చులు అదనం. వివాహం అట్టహాసంగా చేయాలనే తాపత్రయంలో విపరీతంగా ఖర్చులు చేసి,బిడ్డను అత్తారింటికి పంపినంక మా గ్రామంలో అప్పుల పాలవుతున్న వాళ్లను ఎందరినో చూసినం. ఈ పరిస్థితుల్లో ఎవరికీ పెళ్లి భారం కాకూడదనే తలంపుతో 2016 నుండి, సామూహిక వివాహాలు చేస్తున్నాం. పేద ఆడబిడ్డలకు మంగళసూత్రాలు,పెండ్లి బట్టలు,సారె మా గ్రామ కమిటీ నే భరిస్తుంది. ’’ అని ఆ గ్రామాన్ని విజిట్‌ చేసిన మాతో అన్నారు గ్రామ సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి.




ఆమె నిబద్ధతను గుర్తించిన ప్రజలు ఆమెనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంటర్‌ వరకు చదివిన మీనాక్షి వందశాతం ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు జిల్లా పాలనాధికారి నుండి అవార్డ్‌ పొందారు.

ఊరంతా ఏకమై ఆర్భాటపు పెళ్లిళ్లను వద్దనుకున్నారు. దుబారా తగ్గించి, తక్కువ ఖర్చుతో ఘనంగా వివాహాలను జరిపిస్తూ ఆర్భాటపు సమాజానికి కొత్త దారి చూపిస్తున్నారు .

‘‘ వివాహ ఖర్చులతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి మార్చాలని , వధూవరుల తల్లిదండ్రులు అప్పుల పాలవకుండా, ఊరంతా కలిసికట్టుగా వివాహాలు జరపాలని నిర్ణయించి, కులాలకు అతీతంగా గ్రామంలోని యువతీయువకుల వివాహాలను ఒకేసారి చేయడం మొదలుపెట్టారు. పేద కుటుంబాల ఖర్చులు కూడా భరించి, ఏ లోటూ రాకుండా దగ్గరుండి వేడుకను నిర్వహిస్తున్నారు. దీనివల్ల మా తల్లిదండ్రులు అప్పుల పాలు కాకుండా ఉన్నారు.’’ అంటోంది, సామూహిక వివాహం చేసుకున్న జాదవ్‌ సుష్మా.

నూతన వధూవరులతో సంస్కరణ బాగ వేసిన గ్రామ పెద్దలు

సంప్రదాయ వంటలు

వివాహ మహోత్సవానికి వచ్చిన అతిథులకు గ్రామకమిటీ నిధులతోనే తెలంగాణ-మహారాష్ట్ర సంప్రదాయ వంటలను కొసరికొసరి వడ్డిస్తారు. ఇలా గత 10 ఏళ్లలో 65 జంటలను ఏకం చేశారు. ఈ గ్రామస్థుల వినూత్న ప్రయత్నం, ఈ ప్రాంతంలో ముచ్చటగా మారింది. మరికొన్ని గ్రామాలు ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇక్కడితో ఆగలేదు...

మద్యం షాప్‌లు ఉండవు

జనం ఆర్దికంగా దెబ్బతినడానికి ఆర్బాటపు వివాహాలే కాక, మరోటి కూడా ఉందని గ్రహించారు.అదే మద్యం.కుటుంబాల్లో కలహాలకు ,అశాంతికి కారణమవుతున్న , లిక్కర్‌ షాప్‌లను 2004లోనే గ్రామం నుండి తరిమేశారు. గ్రామస్థులు కూడా వ్యసనాలకు దూరంగా జరిగి ఒకేతాటిపై నిలిచి పేదరికాన్ని జయించారు.

‘‘ గ్రామ ప్రయోజనాలే లక్ష్యంగా గ్రామ కమిటీ ఏర్పాటయింది. రసాయనాలు లేని ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నాం. సోయా,జొన్నలు, కాయగూరలు పండిస్తున్నాం. వర్మీ కంపోస్ట్‌ ఎరువును తయారు చేసి విక్రయించి గ్రామానికి అదనపు ఆదాయాన్ని సమకూరుస్తున్నాం...’’ అని వివరించారు, గ్రామకమిటీ అధ్యక్షుడు సుభాష్‌.

గ్రామస్తులతో సమస్యలు చర్చిస్తున్న సర్పంచ్‌ మీనాక్షి


ఈ గ్రామకమిటీ కోటిరూపాయల ఫండ్‌ని ఏర్పాటు చేసుకుంది. అవసరమైన వారికి బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు.

గ్రామంలో కూరగాయల పెంపకం.

ఊరిలో ఉన్న ప్రభుత్వ బడి ప్రాంగణంలో కూరగాయలు సేంద్రీయ ఎరువుతోనే పండిస్తున్నారు. బాలింతలకు, బడిపిల్లలకు ఇక్కడి కూరగాయలతోనే ఆహారం ఇస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఉన్న పార్క్‌లో 10 వేల మొక్కలతో, హరిత వనం పెంచారు. చాలా గ్రామాల్లో కులాల వారీగా స్మశాన వాటికలు ఉంటాయి కానీ, ఇక్కడ అందరికీ ఒకే స్మశాన వాటిక.ఈ అరుదైన ఆలోచనల వెనుక, సర్పంచ్‌ మీనాక్షి, ఎంపీటీసీ సుభాష్‌ల కృషి అపారం అంటారు గ్రామస్తులు. ఇద్దరి నాయకత్వంలో, తెలంగాణలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్న తొలి గ్రామంగా గుర్తింపు పొంది, స్వచ్ఛతకు, సామాజిక అభివృద్ధికి నమూనాగా మారింది.

Read More
Next Story