శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కు 75  యేళ్లు
x

శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కు 75 యేళ్లు

సాహిత్య విమర్శకుడు తెలకపల్లి రవి ‘మహా ప్రస్థానం@75’ పరామర్శ


-తెలకపల్లి రవి

కమ్యూనిస్టు పార్టీ పుట్టుక 105/100వ వార్షికోత్సవం, భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం ఇంకా అనేకం జరుపుకుంటున్నాం.ఆరెస్సెస్‌ పుట్టకకు ఇది వందో సంవత్సరం. తెలుగు జాతిపై భాషా సాహిత్యాలపై చెరగని ముద్రవేసిన మహాప్రస్థానం కావ్యం ప్రచురణకూ ఇది 75 వ వార్షికోత్సవ సందర్భం.మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి సంవత్సరం కూడా.

అప్పటికే పెద్దవాళ్ల అభినందనలుపొందుతూ యువసాహిత్య కారులజేబుల్లో కత్తిరించుకున్న కాగితాల్లోంచి వినిపిస్తున్న మహాప్రస్థానగీతాలు పదేళ్ల వూహల ఆలస్యాల తర్వాత 1950లో పుస్తకరూపం తీసుకున్నాయి.

‘చూడు చూడు నీడలు పేదవాళ్ల వాడలు’’ అన్నా, ‘‘ఇంతేలే పేదల గుండెలు’’ అన్నా శ్రీశ్రీ కవితలను సానుభూతి కవితగా భావిస్తారు తప్ప స్వానుభవ కవితలనుకోరు. నిజానికి అది అచ్చమైన ఆయన జీవితానుభవం. ప్రపంచాన్ని శాసించగలిగిన కవితా స్రష్ట అయివుండి కూడా కోరి ప్రజా కవిత్వ మార్గాన్ని చేపట్టిన శ్రీశ్రీ తదుపరి జీవితంలో అనుభవించిన కష్టాల గురించి చాలా మందికి తెలుసు. కాని అంతకు ముందు కూడా ఆయన జీవితంలో వెలుగు నీడలున్నాయి.30వ దశకం ఆకలి దశకం అని ఆ కాలంలోనే తన మహాప్రస్థాన గీతాలు వెలువడ్డాయని ఆయన చాలా సార్లు చెప్పారు.

‘‘1930 నుంచి 1940 దాకా నేను చాలా అవస్థలుపడ్డాను. ఆ దశాబ్దంలోనే నా మహాప్రస్థానం గీతాలన్నీ (చాలామట్టుకు) రాశాను. అదో భయంకరమైన దశాబ్దం. దాన్ని హంగ్రీ థర్టీస్‌ అన్నారు చరిత్రకారులు.’’ ఈ ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతటినీ కలవరపర్చింది. రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసింది.పరాయి పాలనలోని ఈ దేశం ఆ దుష్ప్రభావాన్ని మరింతగా మోయవలసి వచ్చింది. సామాన్యుల జీవితాలు సంక్షుభితమైనాయి. దీనికి శ్రీశ్రీ నాన్న రమణయ్య మాష్టారు వ్యసనాలు తోడయ్యాయి.ఆయన పెద్ద జూదరి. పేకాట, గుర్రప్పందాలు ఆయన వ్యసనాలు. ఇతర కారణాలతో పాటు ఈ వ్యసనాల వల్ల ఆస్తిని పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. శ్రీశ్రీ మద్రాసులో చదువు పూర్తి చేసే నాటికే కుటుంబ పరిస్థితి దిగజారుతున్నది. ఈ కారణంగానే తనకు లక్నో వెళ్లి ఎంఎ చదవాలని వున్నా మానుకున్నాడు.అప్పుడే శ్రీశ్రీకి ప్రాణాంతకమైన టైఫాయిడ్‌ జ్వరం వచ్చింది. భయంకరమైన జ్వరంతో వచ్చేప్రాణం పోయే ప్రాణంగా ఉంటుండుగా మా ఇల్లు వేలం పాటలో అమ్మకమైపోయింది...అవి నా దరిద్రపు రోజులు. రెండేసి రోజులు తిండిలేకుండా బ్రతికాను. ఆ పది సంవత్సరాల్లోనే మహాప్రస్థాన గీతాలు రాశాను. అంత దరిద్రంలోనూ నేనెవ్వరినీ ‘దేహీ’ అని యాచించలేదు. కేరమ్సులో గెలిచిన కప్పుల్ని అమ్ముకున్నాను. కవిత్వాన్ని కూడా అమ్ముకున్నాను.....’’ఆ దరిద్రపు రోజుల గురించి ఆయన రాసుకున్న దాంట్లో ఇది చిన్న భాగం మాత్రమే,సంఘర్షణాత్మకమైన నాటి దేశ కాల పరిస్థితులు కూడా ప్రజాకవి ప్రభవాన్ని ఆహ్వానిస్తున్నాయి. గురజాడ, కందుకూరి గతించే నాటికి తెలుగుదేశంలో పరిశ్రమలు అపుడపుడే తలెత్తుతున్నాయి. రైల్వేల నిర్మాణం శ్రీశ్రీ కాలం నాటికి అవి బాగా వూపందుకున్నాయి. ఆ యంత్ర యుగమే పారిశ్రామిక వాతావరణమే తెలుగులో శ్రామిక వర్గ మహాకవికి జన్మనిచ్చింది.

ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం కన్నా మానవ నిర్మితమైన కర్మాగారమే తనను అమితంగా ఆకర్షిస్తుందని మాగ్జింగోర్కి అంటాడు. అలాగే భావ కవుల వూహా ప్రేయసి కన్నా, ప్రకృతి ఆరాధన కన్నా శ్రామిక శక్తి సాధిస్తున్న అద్భుత విజయాలే శ్రీశ్రీని ఆకర్షించాయి. విశాఖపట్టణంలో హార్బరు నిర్మాణం చురుకుగా సాగిపోతోంది. వెనకటి కవులంతా ఆరాధించిన సహజ ప్రకృతి సౌందర్యంలోని ఆకర్షణ తన లోంచి, తన కవిత్వంలోంచి నిష్క్రమించింది. దూరంగా కొందమీద నిలబడి, టెలిగ్రాఫు తీగలను చూస్తూవుంటే, ఆ సమానాంతర రేఖలలో ఆయనకో అద్వితీయ అనుభూతి కలిగింది.ఇది దేవుడుగారు సృష్టించిన ప్రకృతిగాదు. ప్రకృతిని తన అదుపులోకి తీసుకురావడానికి మానవుడు చేస్తున్న ప్రయత్నం అని తెలుసుకున్నాడు. ఆ తీగల్లో ప్రసరించే విద్యుచ్ఛక్తి తన నూతన కవిత్వానికి ఆవేశం ఇచ్చింది. దూరాన సముద్రంలో కనిపించే స్టీమర్లు చూస్తే ఆవిరిని తన బానిసను చేసుకున్న మానవుని మహత్యం తన మనస్సుని పదును పెట్టేది. దీనికి నాటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు కూడా తోడైనాయి. మహాప్రస్థానం’’ గీతాలు రాస్తున్న దశాబ్దం (1930-40) లో స్పెయిన్‌లో ప్రచండమైన అంతర్యుద్ధం సాగింది. దాని ప్రభావం విపరీతంగా పనిచేసింది. 1920 సత్యాగ్రహోద్యమం ప్రారంభమైన కాలానికే రష్యాలో విప్లవం విజయవంతమైంది. దాని ప్రభావ ఛాయలు ఉన్నవవారి‘‘మాలపల్లి’’లో ప్రస్ఫుటమయ్యాయి.1920 దశకం నాటికి సాహిత్యరంగంలో భాషలో, భావంలో, సాహితీ సంస్థల నిర్మాణంలో మార్పులు వచ్చాయి. కేవలం భాషా పాండిత్యాలకే పరిమితమైన సాహితీ సంస్థలు పోయి, సాహితీసమితి, నవ్యసాహిత్య పరిషత్తు లాంటివి తలెత్తాయి. విదేశీ పాలన నుండి స్వేచ్ఛగానే గాక ఫ్యూడల్‌ సమాజ బంధనాల నుండి విశృంఖల భావస్వాతంత్య్రాన్ని కోరుతూ వచ్చారు కృష్ణశాస్త్రి తరం భావకవులు. మహిళా హైన్యస్థితి విధ్వంసనకై స్వేచ్ఛను బోధించారు చలం లాంటి వాళ్లు. కర్షకుల, పాటక జనుల జీవిత పరిస్థితులను దువ్వూరి రామిరెడ్డి, కవి కొండల వెంకటరావు మొదలైనవారు తమ కవితల ద్వారా చిత్రించారు.రెండు సత్యాగ్రహ ఉద్యమాలు ముగిసి, కాంక్షించిన స్వరాజ్యం రాకపోగా జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు తెలుగు కవులలో గొప్ప జాగృతిని కల్గించాయి. ప్రపంచ పరిస్థితులూ విషమించాయి. జర్మనీలో హిట్లర్‌ నాజీ ప్రభుత్వం ఏర్పడిరది. ప్రపంచ సంస్కృతి పరిరక్షణ ఒక ప్రధానకర్తవ్యంగా ప్రపంచమందలి వివిధ దేశాల మేధావుల కర్తవ్యమైంది.

తుమ్మల సీతారామమూర్తి, విద్యాన్‌ విశ్వం మొదలైనవారు రైతు సమస్యలపై రాసిన పాటలను కవితలను ‘‘రైతు భజనావళి’’ ప్రచురించింది.1934లోనే సోషలిస్టుపార్టీ ప్రత్యక్షంగానూ, కమ్యూనిస్టు పార్టీ ప్రచ్ఛన్నంగాను పనిచేయడం ప్రారంభించిన రోజుల్లోనే తుమ్మల రాసిన ‘‘ఎగరాలి ఎగరాలి మన ఎర్రజెండా’’ అనే ఎర్రజెండాపాట, ‘‘ఆకలి మంటల మలమలమాడే అనాథలందరు లేవండోయ్‌’’ అనే అంతర్జాతీయ గీత అనువాదం, ‘అన్నా కూలీ లేకము కావలెరా’’ అనే కార్మిక ఐక్యతా ప్రబోధగేయం, గోర్కీ ‘‘అమ్మ’’ మొదలైన రచనలు అభ్యుదయ రచనోద్యమానికి తెలుగునాట అంకురార్పణ చేశాయి. వ్యావహారిక భాషా ఉద్యమం విజయ పతాకను ఎగురవసస్తున్నది. సంస్కరణోద్యమాల ప్రభావమూ, హేతువాద దృష్టీ, సమకాలీన సమాజ దుస్థితి పరిశీలనా ప్రారంభమయ్యాయి.’’

ఈ స్వాతంత్య్ర చైతన్యం తదుపరి దశ సామ్యవాద చైతన్యం. శ్రీశ్రీ దానికి ప్రతినిధి,శ్రీశ్రీ అయితే స్వాతంత్య్ర యుగ కవులను ఎంతగానో గౌరవించాడు.ఇవన్నీ చదువుతున్నా, అటువంటి స్వాతంత్య్ర మీద తానేదీ రాయలేదు..శ్రీశ్రీ రాసిన దాని మహత్తర చారిత్రిక ప్రాధాన్యతను చూడకుండా రాయనివే మాట్లాడే వారు ఆయన స్వాతంత్య్ర పోరాటంపైన కూడా రాయలేదని గమనించరు. ఆయన దృష్టి ఆర్థిక స్వాతంత్రం, సమానత్వం కోసం సాగే పోరాటంపై కేంద్రీకృతమైందన్నాడు.. అందుకోసం ఆయన మోగించిన కవిత జయభేరి.‘‘మాత్రాచ్ఛందస్సులో, వాడుకభాషలో నేను మొట్టమొదటి రాసినగేయాలలో మొట్టమొదటిది ‘‘నేను సైతం’’. దీని ఛందస్సు ముత్యాలసరం. ఆ ఛందస్సులోని ఒకటి రెండు పాదాలతోనే ఎంత వైవిధ్యం సాధించవచ్చునో తెలుసుకున్నప్పుడు నాకాశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి. వైజ్ఞానికుడు ఒక కొత్తసత్యం కనిపెట్టినప్పుడు పొందే సంతృప్తి అప్పుడు కలిగింది.అన్నాడు.

‘‘నేను సైతం/ప్రపంచాగ్నికి/ సమిధనొక్కటి ఆహుతిచ్చాను’’‘‘కవిత్వం వాడుక భాషలోనే ఉండాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత అంతకుముందు అవలంబించిన భావ కవిత్వ ధోరణికి స్వస్తిచెప్పాను. నామీద అవ్యాహతంగా ప్రసరిస్తున్న కృష్ణశాస్త్రి, విశ్వనాథల ప్రభావం నుంచి ప్రయత్నపూర్వకంగా బయటపడ్డాను..‘‘గిబ్బన్‌ రాసిన ఁI, జుఙవఅ Iఁ అనే గీతం ‘‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’’ అని వ్రాయించింది. దాన్ని కొంపెల్ల జనార్దనరావు కొత్త పత్రిక ఉదయినిలో అచ్చేయడం ో ధైర్యమిచ్చింది.

‘జయభేరి’’తో మొదలైన కవితా ప్రస్థానం మహా ప్రస్థానం గీతంతో తారాస్థాయికి చేరింది. ఈ రెంటికీ మధ్యన ఒక రాత్రి, గంటలు, ఆకాశదీపం కవితలు వస్తాయి.తెలుగు జాతి జీవ నాదాల్లో ఒకటిగా మిగిలిపోయిన మహత్తర గీతం మహాప్రస్థానం రాయడానికి అయిదు నిముషాలు కూడా పట్టలేదంటే ఆ భావం అంతరాంతరాల్లో ఆయన ఎంతగా నిబిడీకృతమై పోయిందో తెలుస్తుంది. ఈ మహత్తర గీత రచన పై ఆయనే చాలా హృద్యంగా చెప్పాడు. ‘‘మరో ప్రపంచం/మరో ప్రపంచం/మరో ప్రపంచం పిలిచింది’’ఈ గీతాన్ని 1934 సంవత్సరం ఏప్రిల్‌నెల 12వ తేదీనాడు రాశారు.పెన్ను దొరక్కపోతే పెన్సిలుతోనే రాశాడు. మరో ప్రపంచం అని ప్రారంభించి భుగభుగలు అని ముగించేదాకా పెన్సిల్‌ ఆపలేదు.మరో ప్రపంచం గీతం రాయడానికి ముందు 1934వ సంవత్సరం ఫిబ్రవరి నెల 18వ తేదీన ఎడ్గార్‌ పో గంటలని అనుసరిస్తూ (అనువదిస్తూ కాదు) ఒక గేయం రాశాను. అందులో-‘‘హరోం హరోం హర హర హర హరహర అన్న పాదాలు తతిమ్మా గేయంతో బేలన్సు కాకపోవడంవల్ల వాటిని ఉపసంహరించాడు.. రెండు నెలల తర్వాత ఆ ‘హరోం హరోం హర’ నించే మరో ప్రపంచం గీతం వెలువడిరదని చెప్పొచ్చు.శ్రీ శివశంకర శాస్త్రిగారు బ్రిటిష్‌ పోలీసుల లాఠీఛార్జీపై చదివిన-మారో మారో, మారో మారోఒకటి రెండూ మూడు నాలుగు,మారో మారో మారో మారో’’అనే శిష్ల్లా ఉమామహేశ రచన కూడా ఒక ప్రోద్బలమే అని చెప్పారు

‘‘మహాప్రస్థానం’ గీతసంపుటిలోని చాలా రచనలు ఒక్కమాటు ఒక్కచోట ఒక్కపూటలో రాసినవే. కాని నాలుగైదు గీతాలు మాత్రం మొదట ప్రారంభించి తర్వాత కొన్నాళ్ళకు పూర్తిచేసినవి. ‘దేశచరిత్రలు’ వరుసగా రెండురోజులు కూర్చుని రాశాను. ప్రారంభించిన తేదీకాక పూర్తిచేసిన తేదీనే విషయానుక్రమణికలో ఇచ్చాను. మొదట కొంతవరకు రాసి, తర్వాత చాలాకానికి పూర్తి చేసిన గీతాలలో ముఖ్యమైనది ‘జగన్నాథుని రథచక్రాలు’ ఇది ఎప్పటికీ అసంపూర్ణంగా ఉండిపోతుందేమో అని ఒక్కొక్కప్పుడు నాకే సందేహం కలిగేది. ఇదిలేకుండా మహాప్రస్థానం పూర్తికావడానికి వీల్లేదు. కాని తొందరపడి ఏదోవిధంగా రాసెయ్యడానికి యిష్టంలేదు.

మహాప్రస్థానం సంపుటిలో మొట్టమొదటి గీతం మహాప్రస్థానం, చిట్టచివరి గీతం జగన్నాథుని రథచక్రాలు ఉండాలని నా ఉద్దేశం. ఎలాగైతేనేం అనుకున్న విధంగా 1940 లో ఒకరోజు రథచక్రాలు రాయడం పూర్తి అయింది. కాని తర్వాత పదేళ్ళవరకు గాని గ్రంథం అచ్చు కాలేదు. అందుచేత 40 తర్వాత వ్రాసిన నీడలు, నిజంగానే, గర్జించు రష్యా అనే గేయాలు కూడా ఈ సంపుటిలో చేర్చాను. 1930 నుండి 50 దాకా చాలా అధివాస్తవిక గీతాలు రాసినా ఇందులో చేర్చలేదు. ఇదీ నా కవితా ప్రస్థానం కథ.’’ అని శ్రీశ్రీ వివిధ చోట్ల చెప్పారు .

అంతేకీలకమైంది మరోకటి వుంది. సుందరయ్య నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ మొదటి మహాసభ కూడా 1934లోనే విజయవాడలో కాట్రగడ్డ నారాయణరావు తోటలో జరిగింది.మహా ప్రస్థానం రాసే నాటికి తనకు మార్క్సిజం తెలియదని శ్రీశ్రీ అన్న మాటకు విపరీతార్థాలు తీసేవారు కొందరున్నారు. ఆయనే ఇలా స్పష్టం చేశాడు: ‘‘గురజాడ అప్పారావుగారు మార్క్సిజం చదువుకోలేదు. కాని ఆయన ‘కన్యాశుల్కం’లో కనబడే సామాజిక పరిశీలన చాలా గొప్పది. మార్క్సిజం చదివినవాడికే అది సాధ్యమవుతుంది. గురజాడ శిక్షణద్వారా, అధ్యయనం ద్వారా మార్క్సిస్టు కాకపోవచ్చు. కాని ఆయనలో అలాంటి భావాలు వ్యక్తమయినాయి....అలాగే నేను ‘‘మహాప్రస్థానం’’ రాసేనాటికి మార్క్సిజం చదవలేదు. అయితే మయకోవస్కీ లాంటి మార్క్సిస్టు రచయితల రచనలు, కవిత్వం చదివాను. వారి ప్రభావం నామీద వుంది. అలాగే చాలామంది యువరచయితల మీద అప్పుడు వీస్తున్న గాలి ప్రభావం వుంది. మార్క్సిజం ప్రేరణ వుంది.

ఇప్పుడంటే రోజుకు రెండు కవితా సంపుటాలు తేలిగ్గా విడుదలవుతున్నాయి. కాని శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాలు జనం నాల్కలపై ప్రతిధ్వనిస్తున్నా పుస్తక రూపంలో రావడానికి పదేళ్లు పట్టింది. నాన్న ఇచ్చే ధనం పుష్కలంగా వున్నప్పుడు బాల రచనలనే పుస్తకాలుగా అచ్చువేసుకున్న శ్రీశ్రీ మహాకవి స్థానం చేరాక మాత్రం పుస్తకం వేసుకోలేకపోవడం విచిత్రం! ఒక దశలో విశ్వనాథ వాటిని ప్రచురిస్తానంటూ ముందుమాట రాయాలని చలంను కోరారు.తన గీతాల సంపుటి కొంపెల్ల జనార్దనరావుకు అంకితం చేస్తూ 1937లోనే స్మృతి గీతం రాసి పెట్టుకున్నాడు. కనీసం 1940లోనే వాటిని పుస్తకంగా తీసుకురావాలనుకున్నాడు. అప్పట్లో ఆయనకు ‘అనధికార ప్రచారాధికారి’గా వున్న జరుక్‌ శాస్త్రి సూచనపై అందుకు చలంతో ముందుమాట రాయించి పెట్టుకున్నాడు. కింద చలం సంతకం దగ్గర 17.7.1940, బెజవాడ అని కూడా వుంటుంది. చలం ముందుమాటకు శ్రీశ్రీనే ‘యోగ్యతాపత్రం’ అని పేరు పెట్టారు.అయితే అది అచ్చులో రావడానికి మరో పదేళ్లు ఆగవలసి వచ్చింది.

శ్రీశ్రీ పుస్తకం అర్థం కాకపోతే పదేళ్లు ఆగి జీవితానుభవాల తర్వాత మళ్లీ ప్రయత్నించమని చలం ఇచ్చిన సలహా ఆ విధంగా నిజమైంది. ఈ ఆలస్యం కూడా బహుశా దాని ప్రాసంగికతను పెంచింది. బలమైన కమ్యూనిస్టుపార్టీ, దానికి ప్రచురణ సంస్థ వుండి కూడా ఇలా జరిగిందేమిటని సందేహాలు సహజంగానే వస్తుంటాయి. దాని ప్రచురణ పట్ల శ్రీశ్రీ కాల్పనిక వూహలు కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తుంది.ఈ లోగా సోమసుందర్‌ వజ్రాయుధం, ఆరుద్ర త్వమేవాహం వచ్చేశాయి. ఈ రెండో పుస్తకానికి పేరు కూడా శ్రీశ్రీనే పెట్డాడు.

చివరకు నళినీ కుమార్‌ అనే సహృదయ సాహితీమిత్రుడు సహాయం చేయడంతో ‘‘మహాప్రస్థానం’’ 1950లో వెలుగు చూసింది. దాన్ని , ఒక్క అచ్చుతప్పు కూడా లేకుండా లోప రహితంగా తీసుకురావాలని పరితపించాడు. కనీసం పదిసార్లు బి.యన్‌.కె. ప్రెస్‌కి వెళ్ళి ‘‘ప్రూలన్నీ సరిదిద్దాడు. ‘‘మహాప్రస్థానం’’ మొదటి ముద్రణలో ఒకేఒక్క అచ్చుతప్పు మిగిలిపోయిందని గుర్తించాడు.

‘‘మహాప్రస్థానం’’ ముందు పేజీలోని శ్రీశ్రీ బోర్డరు గ్రాఫు కాగితం మీద రాయించి బ్లాకు చేయించాడు శ్రీరంగం శ్రీనివాసరావు అనే సంతకాన్ని పసుపుపచ్చని కాగితాలమీద నీలిపెన్సిలుతో యాభయిసార్లు రాసి అందులో ఒకదాన్ని ఎంచుకున్నాడు. ’’‘మహాప్రస్థానం మొదలైన గీతాలు’’ అనే అక్షరాలను ఆర్టిస్టు తేజోమూర్తులకేశవరావు రాశాడు.‘

ప్రచురణ కర్త ‘నళినీ కుమార్‌ అసలు పేరు ఉండవల్లి సూర్యనారాయణ. మచిలీపట్నం. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, అబ్బూరి రామకృష్ణరావుతదితరులకి స్నేహితుడు.కవి కూడా. నళినీ కుమార్‌ గుంటూరులో పొగాకు ఎగుమతి వ్యాపారం చేశాడని, సోవియట్‌ యూనియన్‌కి ముఖ్య ఎగుమతి దారుడని ప్రముఖ పొగాకు వ్యాపారి బమ్మిడాల కృష్ణమూర్తి చెప్పారని చెరుకూరి సత్యనారాయణ రాశారు..నళినీ కుమార్‌ 1968 ప్రాంతంలో గుంటూరు ఓల్డ్‌క్లబ్‌ రోడ్‌లో నివశిస్తూ చనిపోయారట.

‘‘మహాప్రస్థానం’’ పునర్ముద్రణలు విశాలాంధ్ర నిరాఘాటంగా కొనసాగిస్తోంది. ముఖచిత్రంగా మా.గోఖలే వేసిన చిత్రం కొన్ని వేల మెదళ్లలో ముద్రితమై పోయింది. బహుశా తెలుగులో అత్యధికంగా అమ్ముడు పోయిన సృజనాత్మక కవిత్వం అదేనంటే అందరూ అంగీకరిస్తారు.1981లో శ్రీశ్రీ దంపతుల లండన్‌ పర్యటన సందర్భంగా గూటాల కృష్ణమూర్తి ఆ కావ్యాన్ని శ్రీశ్రీ స్వదస్తూరితో అద్భుతంగా తీసుకొచ్చారు. దాంతోపాటే ఆయన గానం చేసిన క్యాసెట్‌ను కూడా జతపర్చారు. (అప్పటి కింకా విడియో సిడిలు రాలేదు) లండన్‌ ముద్రణలో చలం యోగ్యతా పత్రం లేదు. దానిపై విమర్శలు వచ్చినా శ్రీశ్రీ ఆమోదించలేదు. సాంకేతికంగా అది సొంత రాతతో గనకచలం రాసే అవకాశం లేదు గనక ఇలా జరగడం అనివార్యమే. కానీ చలం ముందుమాటపై శ్రీశ్రీ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి కరంగా వున్నాయి. ఆయనతో ముందు మాట రాయించాలన్న ఆలోచన తనది కాదని చెప్పడమే గాక అది లేకపోవడం పెద్ద లోటుగా భావించడం లేదని పాఠకుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలలో స్పష్టం చేశారు.

చాలాకాలం తర్వాత 2021లో విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్‌ విశ్వేశ్వరరావుమహాకవి కోరిన సైజులో కాకున్నా భారీ సైజులోనే మహాప్రస్థానం ప్రత్యేకంగా ప్రచురించి అభినందనలు పొందారు.విరసం వారు సంపుటాలుగా ప్రచురించారు. మనస్విని ట్రస్టు ప్రస్థాన త్రయం తీసుకొచ్చింది.2010లో శ్రీశ్రీ శతజయంతి సందర్భంలో నేను రాసిన ‘శ్రీశ్రీ జయభేరి’ జీవితం- సాహిత్యం -రాజకీయాలు కూడా ఆరు ముద్రణలపైగా వచ్చిందంటే ఆ ప్రభావం ఎంత బలమైందో తెలుస్తుంది. ఎవరో అన్నట్టు శ్రీశ్రీ కన్నా ఆయన కవిత్వం గొప్పది, కవిత్వం కన్నా ఆయన కవితా మార్గం మరింత గొప్పది.పదండి ముందుకు అని నడిపిస్తూనే వుంటుంది. ఆ కవిత్వం గురించి,ఈ ప్రచురణలు ప్రభావాల గురించి చెప్పుకోవలసింది ఇంకా ఎంతో వుండనే వుంటుంది.చెప్పుకోవలసీ వుంటుంది.

(శ్రీశ్రీ స్వంత జ్ఞాపకాలు, ఇంటర్వ్యూలు, పలువురు మిత్రుల రచనలు, నా పుస్తకం నుంచి తీసుకున్న సమాచారంతో) 75 ఏళ్ల మహా ప్రస్థానం ప్రచురణ- ప్రభావం)

***

నేటి మేటి కవిత

డా. చెంగల్వ రామలక్ష్మి కవిత 'కొన్నిక్షణాలు మిగుల్చుకుందాం' ఇక్కడ చదవండి

Read More
Next Story